ఏ దివిలో విరిసిన పారిజాతమో
సంగీతమే జీవితంగా భావిస్తూ సినీ సంగీతానికి వివిధ భాషలలో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకులలో శ్రీ చెళ్ళపిళ్ళ సత్యం గారు ఒకరు. ఆయన తెలుగు, కన్నడ భాషలలో దాదాపు అరవై వరకు చిత్రాలకు సంగీత దర్శక బాధ్యతలను నిర్వహించారు. తెలుగు చిత్రరంగంలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన మొదటి చిత్రం 1973 లో వచ్చిన ‘కన్నె వయసు’. అందులోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...’ పాట ఆయన స్వరపరచిన పాటల్లో ఆయనకు ఇష్టమైనదిగా చెప్పవచ్చు. ఆపైన ఆయన ఎన్నో మధురమైన పాటలకు స్వరకల్పన అందించారు. అలాగే, దాశరథి గారంటే చిత్రరంగంలో ఒక ఉన్నతమైన అంచనాలతో కూడిన గుర్తింపు ఉంది. ఆయన వ్రాసిన ఏ ప్రణయ రాగమైనా అది వినూత్నమై ఇట్టే మనసును ఆకట్టుకుంటుంది. కారణం దాశరథి గారి కలం నుండి జాలువారే భావ ప్రకటన అంత మధురంగా ఉంటుంది. దానికి చెళ్ళపిళ్ళ సత్యం వంటి స్వరకర్తలు జోడైతే, గాన గంధర్వుని గాత్రంలో పలికించిన ఆ పాట మాధుర్య మకరందం కాక మరేమిటి? ఆ పాటను చిరంజీవి విశృత్ ఆలపించి మనకు అందిస్తున్నారు. విందామా మరి.
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నీ రూపమె దివ్య దీపమై నీ నవ్వులె నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నామదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలురేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలురేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో