ఓ మిత్రమా…!
నీతి అనే దీపాన్ని
దురాశ అనే ధూళితో కప్పేస్తే…
నిజాయితీ అనే వజ్రాన్ని
అరటితొక్కలా చెత్తకుండీలో పారేస్తే..!
నిర్లజ్జగా నీవు
చీకటి దుప్పటి ముసుగేస్తే…
నీతిమంతులపై
నిందల బాణాలు విసిరేస్తే…
నిర్దోషులను
తుపాకీ తూటాలకు బలిచేస్తే..!
నీ అంతరంగం ఒక
నిరాశా నిస్పృహల గాఢాంధకారపు
గబ్బిలాల గృహంగా మారితే...
నీవు నిర్లక్ష్యపు నీడలో మ్రగ్గిపోతే…
నీ బంగారు భవిష్యత్తు
సాగర మధనమై అల్లకల్లోలమౌతుంటే ..!
అప్పుడు, ఓ మిత్రమా…!
నీ గుండెల్లో కురిసేది...నిప్పుల వానే...
కడకు నీకు మిగిలేది
ఆశల సమాధి...ఓటమే, ఒంటరితనమే..!
ఇది కేవలం హెచ్చరిక కాదు…
నీ అంతరాత్మకు అగ్నిపరీక్ష…
ప్రతిక్షణం సత్యమే నిత్యసారధిగా...
సాహసమే ఊపిరిగా సాగిపో ముందుకు..!
ఓ మిత్రమా…! గుర్తుంచుకో...
ఓటమికెప్పుడు ఓటు వెయ్యకు..
గెలుపు తలుపు తియ్యడం మరువకు…
జీవితానికి ఒక సార్థకతను చేకూర్చు
దాని సాఫల్యతకై
నిత్య సంతోషాలతో శ్రమించు
నీతోనే సమాజమని గుర్తించు.