Menu Close
విలువ
-- ఆర్. శర్మ దంతుర్తి

సాయంత్రం నీరెండ చురుక్కుమనిపిస్తున్నా అది పట్టించుకోనట్టూ నడుచుకుంటూ చేను దగ్గిరకొచ్చాడు లక్కిరెడ్డి. సరిగ్గా వారం క్రితం కళకళలాడుతున్న చేను ఇప్పుడూ నీళ్ళు లేక వెలవెలపోతోంది. మరో రెండు రోజుల్లో వాన కురవకపోతే తనకి మిగిలేది నోట్లో మట్టే. తాను ఈ రెండు మూడేళ్లనుంచి ఈ నాలుగెకరాల భూమి తనఖా పెట్టి ఏదో ఉద్ధరిద్దామనుకున్నాడు కానీ ఆ దేవుడి ఆలోచనలు వేరే ఉన్నట్టున్నాయి. తాను ఈ పంట వేయకముందే గుడికెళ్ళి దణ్ణం పెట్టుకున్నాడు అయినా ఆ పై వాడు కనికరించినట్టు లేదు. పొలం దున్ని విత్తనాలు జల్లేసరికి నాలుగు వర్షాలు రాగానే తాను సంబరపడిపోయేడు. మరి ఇప్పుడో? ఇక్కడో మబ్బుతునకా అక్కడో నీడా తప్ప వర్షం వచ్చే సూచన ఉందో లేదో? చేను దగ్గిరే ఓ చోట కూర్చుని ఎండిపోతున్న పంట కేసి చూస్తూంటే అంతులేని దిగులు, ఎన్నెన్నో ఆలోచనలు, పిల్లల గురించీ, తన గురించీ కలగలుపుగా.

అసలు ఈ భూమి బేంక్ కి తనఖా పెట్టవద్దని ఎవరు చెప్పినా తాను వినిపించుకోలేదు. తన వ్యవసాయం పెట్టుబడికి తనఖా ఒకటే దారి. ఓ సారి తనఖా పెట్టాక అనుకున్న సమయానికి వడ్డీ కూడా చెల్లించలేకపోతే, బేంకు వారు మూడు రోజులకోసారి ఇంటికి రావడం, భూమి జప్తు చేస్తామని బెదిరించడం, తాను వాళ్ళ కాళ్ళావేళ్ళా పడటం. ఇదంతా చాలాసార్లు చూసాక ఇంటావిడ అంది కూడా; వాళ్ళ దగ్గిర మెతకగా ఉంటే అలా బెదిరిస్తూనే ఉంటారు. అయినా పంటలు పండకపోవడం తనకొక్కడికే కాదు కదా, మిగతా వాళ్ళక్కూడా అలాగే లేదా? తననో పనికిరానివాడికింద బేంక్ వారు జమచేసినట్టుంది; అయినా తాను పనికిరానివాడే కాబోలు మూడేళ్ళలో ఒక్కసారి కూడా ఏమీ పండించలేకపోయేడు. ఇంట్లో పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు, తానూ, ఇంటావిడా కలిసి నాలుగు నోర్లున్నాయి తినడానికి.  అప్పు మీద అప్పు తీసుకుంటూ భూమ్మీద పెట్టినది అలాగే పోయింది కానీ పైసా కూడా వెనక్కొచ్చింది లేదు. తాము ఇంట్లో ఏం తింటున్నారో కూడా చూసుకోకుండా ఇంటావిడ నగల్తో సహా ఊడ్చీ, ఉన్న భూమి తనఖాపెట్టీ ఆ భూమ్మీదే పెట్టుబడి పెట్టాడు. మొత్తం అంతా ఇప్పుడు గంగలో కలిసిపోయినట్టే.

ఓ రెండు గంటల తర్వాత చీకటి పడుతుంటే మెల్లిగా లేచి ఇంటికి బయల్దేరాడు చేతికర్రతో. చేనుమీద దారిలో ఒకప్పుడు కనిపించే పాములూ, ఎలకలూ కూడా ఇప్పుడు లేవు. ఎలా ఉంటాయి, వాటికి మాత్రం తిండి కావొద్దా? ఊరిలోకొస్తూంటే కిరాణా కొట్టు దగ్గిర ఆగాడు పని ఉన్నట్టూ. షావుకారు పలకరించాడు, “ఏం కధ లక్కి రెడ్డీ?”

“ఏవుంది, చేను ఎండిపోతోంది. కాస్త వర్షం వస్తే పురుగుమందు కొట్టాలి. దానికి చేతిలో పైసా లేదు. ఏం చేయా….”

“పురుగుమందు నేనిస్తాను కానీ వడ్డీతో సహా ఇవ్వాలి మరి.” అవకాశం అందిపుచ్చుకుంటూ అడిగేడు షావుకారు.

“బానే ఉందిలే సంబడం. ముందు చేను ఉంటుందా, చచ్చిపోతుందా అని నేను ఏడుస్తుంటే, శవవాహకానికి డబ్బులెన్నొస్తాయా అని నువ్వు చూస్తున్నట్టుంది.” ఏడుపుగొట్టు నవ్వుతో అన్నాడు రెడ్డి.

“రెడ్డీ అందరికీ అలాగే ఉంది గదా? సరే నువ్వు కావాల్సినప్పుడే తీసుకుందూ గానిలే, నాతో మాట్లాడకుండా మరో చోట తీసుకోక. కొత్త మందు వచ్చింది ఇసాపట్నం నుంచి. బాగా పనిచేస్తాదని చెప్పేడు అక్కడ్నుంచొచ్చిన సేల్సుమేను కుర్రాడు. కావాలిస్తే ఇదిగో చూడు, ఈ డబ్బా పట్టుకెళ్ళి నీ దగ్గరుంచు. మిగతాది తర్వాత చూద్దాం. ఈ సాంపిల్ డబ్బా ఆ కుర్రాడిచ్చిందే, దీనికి డబ్బులివ్వక్కర్లేదు.”

షావుకారు ఇచ్చిన డబ్బా పట్టుకుని ఇంటికొచ్చేడు లక్కి రెడ్డి. చేనులో పరిస్థితి ఎలా ఉందో, ఇంట్లోనూ అదే. ఉన్నదేదో ఉడకపెట్టుకోవడం, ఉంటే గుడ్డో, కారమో మరోటో కలుపుకుని తినడం. ఎన్నాళ్ళిలా? రాత్రి చాలా సేపు మెలుకువగా ఉన్న రెడ్డి పొద్దున్న బాగా ఆలస్యంగా లేచేసరికి బయట ఏదో గొడవ. రెడ్డి మామూలుగా లేచాడనడం కన్నా జరిగే గొడవ విని లేచాడనే చెప్పుకోవాలి. నిద్రకళ్లతో బయటకొచ్చిన రెడ్డికి భూమి తనఖా బేంకు తాలూకు మనుషులు రెడ్డి వాళ్ళావిడతో గొంతెత్తి దెబ్బలాడటం కనిపించింది. వాళ్ల దగ్గిరకొచ్చి చెప్పేడు, “ఇలా రోడ్డుమీద మా ఆవిడతో ఏమిటి గొడవ? లోపలకి వచ్చి నాతో మాట్లాడొచ్చుగా? ఆవిడకేం తెలుస్తయ్ ఈ విషయాలు?”

“రెడ్డీ, వడ్డీ రోజురోజుకీ పెరుగుతోంది. మూడేళ్ల నుంచీ పైసా కట్టలేదు వెనక్కి. డబ్బులు కట్టకపోతే జప్తు చేస్తం. ఉత్తనే డబ్బులియ్యడానికిక్కడెవర్కీ లాట్రీ తగలలేదు.”

“వర్షాలు లేవు; మనుషులు తాగడానికే నీళ్ళూ లేవు, నేను ఎప్పటికప్పుడు ఇద్దామనే అనుకుంటున్నా, ఏం చేయమంటరు?”

“అయన్నీ మాకనవసరం, ఇప్పుడు ఉన్న పళాన మూడువేలు కట్టు. లేకపోతే….” బేంక్ మేనేజర్ ఏదో అనబోయేడు. గొడవ పెద్దదౌతూంటే చుట్టుపక్కల వాళ్ళు ఒకరిద్దరు తమాషా చూడ్డానికన్నట్టూ చేరడం రెడ్డి గమనించాడు.

“లేపోతే ఏం జేస్తరు, డబ్బుల్లేవని చెప్పిండు కదా,” ముందుకి వస్తూ రెడ్డి వాళ్ళావిడ అడిగింది.

“నీకెందుకు, నువ్వూరుకోయే,…” రెడ్డి ఏదో చెప్పేలోపులే బేంకు మేనేజర్ ముందుకొచ్చి “ఏం జేస్తమా..” అంటూ రెడ్డి వాళ్ళావిడని చేయి పట్టుకుని లాగి, “ఇలా తీసుకెళ్ళి జైల్లో పెడతం.” అన్నాడు.

మేనేజర్ లాగిన ఆ కుదుపుకి రెడ్డి వాళ్ళావిడ నేల మీద పడింది. మోకాలి మీద, మొహం మీద చిన్న దెబ్బలు. రెడ్డి ముందుకొచ్చి లేవదీస్తుంటే చోద్యం చూసే చుట్టూ జనం ఓ అడుగు ముందుకేసి, తలో చేయి వేసి సర్ది చెప్పాక మేనేజర్ జీపులో కూర్చుని చెప్పాడు వెళ్లిపోయేముందు, “మరో నాల్రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఏవౌతుందో తెలుస్తది. ఖబడ్దార్!”

ఆ జీపు అలా వెళ్ళగానే లోకం తలో సలహా పారేసింది రెడ్డిమీద. “ఇలా భూమి తనఖా తీస్కోకూడదు,” “అసలీ వ్యవసాయం అనేదే మనకి ఇంక అచ్చిరాదు,” “ఇంటావిడ మీద చేయి జేస్కుంటంటే ఊరుకుంటవా, చేతకాని దద్దమ్మ,” “అలా గమ్ముగుంటే ఇంకా రెచ్చిపోతారు,” వగైరా.

రెడ్డీ, వాళ్ళావిడా ఇంట్లోకెళ్ళి తలుపులేసుకున్నాక ఇంటావిడ మాటా మంతీ లేకుండా ఏడుపు మొదలుపెట్టింది. ఒకటే ఏడుపు, ఎంతకీ తగ్గని, వరద ప్రవాహంలాగా. ఆ ఏడుపులో తాను ఇన్నాళ్ళూ ఎవరిచేతా మాటపడలేదనీ, రోడ్డుమీద మరో మొగాడు తనని చేయి పట్టుకులాగితే రెడ్డి చేతకానితనం, భూమి తనఖా వద్దని తాను చెప్పినా రెడ్డి వినకపోవడం, వర్షాలు కురవకపోవడం, అలా మొదలుపెట్టి మరో మూడు నాలుగ్గంటలు ఆవిడ రెడ్డిని అన్నమాట మరోసారి అనకుండా అలా బేంకునీ, ఆ పై దేవుణ్ణీ, ఈ జీవితాన్నీ అన్నీ కలిపి తిడుతూనే, ఏడుస్తూనే ఉంది.

ఇదంతా చూసిన రెడ్డి ఏం జేయాలో తెలియక చేతికర్ర తీసుకుని లేచాడు బయటకి పోవడానికి. ఈ సాథింపూ, అరుపులూ, ఏడుపులూ తప్పించుకోవడానికి రెడ్డికి ఉన్న సాధనం ఒకటే – చేను దగ్గిరకి పోవడం. ఇంట్లోంచి బయటకి వస్తూ ఉంటే గుమ్మం దగ్గిరే కిటికీలో పెట్టిన షావుకారిచ్చిన పురుగుల మందు డబ్బా కనిపించింది. అది పట్టుకుని బయల్దేరాడు. క్రితం రోజైతే ఏదో కాస్త మబ్బుతునకా అవీ కనిపించాయి గానీ ఈ రోజు అవీ లేవు. శ్రావణంలో కురిసే వర్షాలు ఈ పాటికి రావాలి గదా?

చేను దగ్గిర పరిస్థితి నిన్నకన్న దారుణంగా ఉన్నట్టుంది. పూర్తిగా ఎండిపోవడానికి మరో రెండురోజులు చాలు. మనసులో తన్నుకొస్తున్న ఉద్రేకం, ఎవరినో ఏదో చేయాలని. ఏమీ చేయలేని తన చేతకానితనం. తన ఎదురుగా తన ఇంటావిడని బేంక్ మేనేజర్ చేయి పట్టుకు లాగాడు. అయినా తాను వాళ్ళకి డబ్బులు బాకీ ఉండడం వల్ల నోరు కాదు కదా చేతి వేలు కూడా ఎత్తలేకపోయేడు. నిజమే, ఇంటావిడ అన్నట్టూ తానో అర్భకుడు, చేతకాని వాడు, శుద్ధ దద్దమ్మ, పనికిమాలిన విలువలేని మనిషి. ఈ ఎండలు చూస్తుంటే నిజంగా ఈ ఏడు కూడా ఏమీ గింజలు చేతికి రావు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంటావిడని చేయిపట్టుకు లాగిన ఈ బేంక్ మేనేజర్ మరో ఏటికి ఏం చేస్తాడో? ఛీ, ఛీ తనదీ ఒక బతుకేనా? తలవిదిల్చి పక్కకి చూసేసరికి కొత్త పురుగులమందు డబ్బా కనిపించింది. దానిమీద రాసిన అక్షరాలు కూడబలుక్కుని చదివాడు, “ఇది పురుగులకి మాత్రమే, మనుషులు తాగితే ప్రాణాంతకం కావొచ్చు. వెంఠనే డాక్టర్ ని సంప్రదించాలి.”

****** ****** ****** ******

సాయంత్రమైనా ఇంటికిరాని రెడ్డి మీద కోపం ఇంకా తగ్గకపోయే సరికి పిల్లలిద్దర్నీ పడుకోబెట్టి తాను నడుం వాల్చింది రెడ్డి వాళ్ళావిడ. అలా ఒక్కోసారి ఒకరి మీద ఒకరు అరుచుకున్నాక లక్కి రెడ్డి ఇలా రాత్రి ఎక్కడో పడుకుని రెండు మూడు రోజుల తర్వాత రావడం మామూలే కనక ఆవిడకిదేం పట్టలేదు; అసలే ఎవడో మొగాడు తనచేయి పట్టుకుని లాగాడనీ, తన మొగుడు లక్కిరెడ్డి అది చూసి కూడా ఊరుకున్నాడనీ ఆవిడకి మంటగా ఉంది కూడా.

రెండో రోజు కూడా రెడ్డి ఇంటికి రాకపోయేసరికి ఆవిడ ఎవర్నో పట్టుకుని వెతకడానికి పంపించింది. వెళ్లినాయన ఊరి ఎమ్మెల్యే గారికి దగ్గిరవాడే, ఆయనకి చుట్టమో ఏదో అవుతాడు. లక్కిరెడ్డిని చూసి వచ్చి ముందు ఎమ్మెల్యే ఆఫీసులో దూరాడు. అదృష్టం కొద్దీ ఆ రోజు ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు. ఆ చూసినాయన చూసినది చెప్పాడు – పురుగుల మందు తాగి చచ్చిపోయిన రెడ్డి గురించీ, ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు త్వరలో వచ్చే ఎన్నికల్లో ఎలా వాడుకోవచ్చో అవీ చెప్పి, తాను రెడ్డి ఇంటికి వెళ్తున్నాననీ, ఆయన మరో గంటలో శవాన్ని తెప్పించి రెడ్డి ఇంటి దగ్గిరే పంచాయితీ పెట్టించి ఏం చేయచ్చో, దీంతో ఎలా లాభం రాబట్టుకోవచ్చో.

ఎమ్మెల్యే ఆ కుర్రాణ్ణి మెచ్చుకుని తానో గంటలో వస్తానని చెప్పి పంపించాడు.

ఓ గంట పోయాక కుళ్ళిపోతున్న రెడ్డి శవం ఇంటికి చేర్చబడింది. దాదాపు ఊర్లో సగం రైతులు చూడ్దానికొచ్చారు. రెడ్డి వాళ్ళావిడ నిలువు గుడ్లేసుకుని పూనకం పట్టినదానిలా ఓ సారి అరవడం, మరోసారి ఉలుకూ పలుకూ లేకుండా కూర్చోవడం చేస్తోంది. ఎవరికీ ఏం మాట్లాడ్డానికీ, ఏం చేయడానిక్కూడా, నోరూ, కాలూ, చేయీ ఆడడం లేదు. ఇంటి ముందు ఎదురుగా కుళ్ళుతున్న శవం చూస్తూ ఏవిటి మాట్లాడ్డం?

మొదట్లో రెడ్డి బతికున్నప్పుడు రెడ్డి ఎంత చేతకానివాడో చెప్తూ తలో సలహా పారేసిన గొర్రెలు ఈ సారి మరో తలో సలహా పారేసాయి, “అంత కంగారు పనికిరాదు,” “చచ్చి సాధించేదేమీ లేదు,” “రెడ్ది ఎంత మంచివాడో, పాపం కంగారు పడిపోయాడు,” “మాతో చెప్తే అందరం కలిసి ఏదో చేసి ఉండేవాళ్ళం,” “రెడ్డి అంత చేతకాని వాడేం కాదు,” “చావుతో రెడ్డి తన పనికిరానితనం మరో సారి నిరూపించుకున్నాడు,” “ఈ చావుతో  ఏం ఒరిగింది?” వగైరా వగైరా.

మరి కాసేపట్లో ఎమ్మెల్యే కారు దిగి వచ్చి రెడ్డి వాళ్ళావిడని పరామర్శించాడు. అప్పటికే అక్కడకి చేరిన పోలీసులని కళ్లతోనే పలకరించి, అక్కడున్నవాళ్లతో ఏదో చెప్పడం, వినడం అయ్యాక ఆయన గ్రహించినది – ఇదంతా వర్షాభారం వల్లే అయినా బేంక్ వారు చేసినది తప్పు. ఆ మేనేజర్ రెడ్డి ఇంటికొచ్చి అలా చేయకూడదు. రెడ్డి ఏమీ చేయలేకపోవడం కూడా తప్పే అయినా ఆత్మహత్య చేసుకునేంత కష్టం కాదు ఇది. రెడ్డి జీవితం పనికిమాలినది అయిపోయినది రెడ్డి వల్ల కాదు, మిగతావాళ్ల వల్లే. ముఖ్యంగా బేంక్ వారి వల్లే.

అక్కడే అందర్నీ పిల్చి చెప్పేడు తన సలహా. ఆ సలహా ప్రకారం బేంక్ మేనేజర్ మీద కేసు వేస్తారు పోలీసులు. ఎమ్మెల్యే వెళ్ళి బేంక్ తో మాట్లాడతాడు ఈ ఋణం మాఫీ చేయమని. మొత్తం ఋణం మూడు, నాలుగు లక్షల దాకా ఉంది. ఉదారంగా తాను ఓ డబ్భైవేలు ఇస్తాడు పార్టీ ఫండులోంచి. మిగతావి అందరూ తలో చేయి వేస్తే ఎంతవుతుందో? వెంఠనే ఊర్లో గుప్పుమని తెల్సిందీ విషయం – అందరూ ఏదో ఒక చేయి అందించాలంటూ. మామూలు జనాలకి తెలియని విషయం ఏమిటంటే ఈ పార్టీ ఫండు జనం మీద సంపాదించినదే. ఎమ్మెల్యే గారి జేబులోవి కాదు డబ్బులు. మన అజ్ఞానం గానీ ఏ రాజకీయనాయకుడు తన జేబులో డబ్బులు జనాలకిస్తాడు ఉచితంగా?

మొదటగా కొంచెం బెదిరినది షావుకారు. లక్కి రెడ్డి తాగిన మందు తానిచ్చిన పురుగుల మందు డబ్బా లోదే. అది తాను ఉచితంగా ఇచ్చాడంటే పీకలమీదకి రావొచ్చేమో? అయినా తాను ఆ డబ్బా ఇచ్చినట్టు సాక్ష్యమూ, రసీదూ ఏవీ లేదు. ఏమో ఏది ఎటుతిరిగి ఎటొస్తుందో? వెంటనే రెడ్డి ఇంటికి వెళ్ళి ఓ రెండువేలు తాను లక్కిరెడ్డి వాళ్ళావిడకి ఇస్తున్నట్టూ చదివించాడు, పోలీసులు, ఎమ్మెల్యే వింటూండగా.

ఊరిలో లక్కిరెడ్డి పండించిన థాన్యం ఆడే రైసు మిల్లు ఓనరు మరో రెండు వేలిచ్చాడు. రెడ్డి దగ్గిర శనక్కాయలు కొని అది ఆడించి నూనె తీసి రేట్లు బాగా పెరిగాక అమ్ముకునే మరొకాయన మరో రెండువేలిచ్చాడు. తోటి రైతులు తలో పాతికా పరకా విదిల్చారు ఎక్కడ వీలైతే అంత మటుక్కి. మొత్తానికి సాయంత్రం లోపు ఎమ్మెల్యే లక్షా యాభైవేలు కుదిర్చేడు. ఓ పాతికవేలకి శవదహనం, సంస్కారం అన్నీ అవగొట్టి మరో పాతిక రెడ్డి వాళ్ళావిడ చేతిలో పెట్టి అందరూ వింటూండగా చెప్పాడు ఎమ్మెల్యే - ఈ లక్షా పట్టుకెళ్ళి బేంక్ లో జమకడతాననీ, మిగతా రెండు లక్షలూ బేంక్ వారు తన మాట విని సర్దుకుంటారనీను. అప్పు తీరిపోతుంది కనక భూమి, రెడ్డి వాళ్ళావిడ ఉంచుకోవచ్చు. ఏమీ కంగారు లేదు. ఏదైనా తేడా వస్తే తాను చూస్తాడు. వెళ్ళేటపుడు మరో సారి జనాలనందర్నీ హెచ్చరించి వెళ్ళాడు ఎమ్మెల్యే, “చూడండి నేను ఎంత కష్టపడుతున్నానో మీకోసం, మీరు నాకు ఓటు వేసినందుకు నేనెప్పుడూ మీవాడినే. మిగతావాళ్ళని ఎప్పుడూ ఎన్నుకోకండి.”  గొర్రెలన్నీ అది నిజమేనని తల ఊపాయి. ఎమ్మెల్యే కార్లో దర్జాగా ఇంటికెళ్ళిపోయాడు.

అన్ని న్యూసు పేపర్లలో మర్నాడు ఇలా ఎమ్మెల్యే గారి ఉదారత ప్రముఖంగా ప్రచురించబడింది. రెడ్డి ఫోటో, వాళ్ళావిడ చిన్న పిల్లల్తో కలిసి రెడ్డి శవం మీద పడి ఏడుస్తున్న ఫోటో మరో సీరియస్ వార్త. ఓ పేపర్ సంపాదకుడు కాస్త ముందుకెళ్ళి సంపాదకీయం కూడా రాసేడు – ఈ ఎమ్మెల్యే వంటి ఉదార రాజకీయనాయకుల గురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ, ప్రపంచం తోటిమానవుడి మీద కనికరం లేకుండా ఎలా తయారవుతోందనీను.

రెండురోజుల తర్వాత పోలీసులు బేంక్ మేనేజర్ మీద కేసు బనాయించారు. కారణం ఏవిటంటే బేంక్ మేనేజర్ రెడ్డి వాళ్ళావిడని పబ్లిగ్గా బలాత్కారం చేయబోయినందువల్ల రెడ్డి ఎంతో కలత పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. అందువల్ల ప్రస్తుతానికి జైలు; ఆయన చెప్పుకునేది ఏదైనా ఉంటే, తర్వాత కోర్టులో చెప్పుకోవచ్చు. అయితే జైల్లో కెళ్లబోయిన బేంక్ మేనేజర్ని ఆయన హెడ్డాఫీసు ఆదుకుంది జామీనిచ్చి విడుదల చేస్తూ. ఓ రెండు నెలలు ఆయన లీవు మీద, బేంక్ వారి పూచీకత్తుతో, వారి అధీనంలోనే ఉంటారుట ఎంక్వయిరీ అయ్యేదాకా.

చచ్చిపోయిన రెడ్డి ఆత్మ ఇదంతా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టుకుని చూస్తూనే ఉంది. బతికున్నప్పుడు ఏమీ చేతకాని లక్కిరెడ్డి చచ్చాక మాత్రం ఏం చేస్తాడు ఇదంతా చూస్తే మాత్రం?

నెమ్మదిగా రోజులు తిరిగి రెండు నెలలు గడిచాక గొడవ సర్దుమణుగుతుంటే బేంక్ వారు తీర్మానం చేసుకున్నారిలా.

రెడ్డి చచ్చిపోవడానిక్కారణం బేంక్ వారి అప్పు దానిమీద వడ్డీ అలా ఉంచితే బేంక్ మేనేజర్ రోజూ వచ్చి రెడ్డిని మానసికంగా చంపడం, వెళ్ళి వాళ్ళావిడ చేయి లాగడమూను. దీనికి సాక్షులున్నారు. తేడా వస్తే వచ్చేయేటికి ఎలక్షన్ లలో నుంచోబోయే సిట్టింగ్ ఎమ్మెల్యేగారు రెడ్డి వేపే ఉన్నట్టు వినికిడి. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బేంక్ వారికి ఉన్న ఒకే ఒక దారి – రెడ్డికి ఇచ్చిన అప్పు లో ఎమ్మెల్యే గారిచ్చే డబ్బులు తీసుకుని మిగతాది పారుబాకీ కింద రాసుకుని ఆ పోయిన డబ్బులకి తిలోదకాలిచ్చుకోవడమే. అలా తీర్మానించుకున్నాక హెడ్ ఆఫీసు బేంక్ మేనేజర్, మరో సీనియర్ తో కలిసి ఎమ్మెల్యే ఆఫీసుకొచ్చి చెప్పాడు తాము ఏం చేయాలనుకుంటున్నారో.

కాళ్ళబేరానికి వచ్చిన బేంక్ వారిని ఆహ్వానిస్తూ ఎమ్మేల్యే వాళ్లని లోపలకి తీసుకెళ్ళి ఏసి రూములో టీ బిస్కట్లతో సంతోషపరిచాక అడిగాడు, వాళ్ళేం పనిమీద వచ్చారో.

సీనియర్ మేనేజర్ గారు చెప్పారు, మిగతావాళ్ళు వింటూండగా, “మీరిస్తామన్న లక్షా తీసుకుని లక్కిరెడ్డికి ఇచ్చిన మిగతా బాకీ పారు బాకీ కింద రాసుకుంటాం, మా మేనేజర్ రెడ్డి వాళ్ళావిడ చేయి పట్టుకుని చేసినది తప్పే, ఆయన్ని రెండు నెలలు లీవు మీద ఉంచాం కదా, ఆయన బాగా పనిచేసే మేనేజర్ కనక ఈ ఊర్లోంచి మరోచోటకి ట్రాన్స్ ఫర్ చేస్తాం.  మీరిచ్చే లక్షా మా మొహాన పారేసి పోలీసులకో మాట చెప్పి ఆ మేనేజర్ మీద కేసు తీయించేస్తే సర్వే జనా సుఖినోభవంతు. ఏమంటారు?”

“నేను లక్ష ఇవ్వడం ఏమిటి?” ఎమ్మెల్యే ఏమీ తెలియనట్టూ అడిగేడు మొహంలో ఏ భావం లేకుండా.

“అదేనండి, మీరు అందరి ముందూ రెడ్డికి లక్ష ఇస్తాం అని చెప్పారుట కదా, అలాగని అందరూ అన్నారు.”

“పేపరోళ్ళూ, అలగా జనం ఏదో ఒకటంటారు. అవి బట్టుకుని నన్ను ఆ డబ్బులు కట్టమనడవేవిటి, సరదాకేనా సమయం సందర్భం ఉండాలయ్యా మేనేజరూ,” ఎమ్మెల్యే ప్రయోగించాడు రాజకీయాస్త్రం.

“రెడ్డి శవం ఇంటికొచ్చాక, మీరు మాట్లాడుతూ ఓ లక్ష ఇస్తాను అంటూంటే, అక్కడే ఉన్న పోలీసులూ, ప్రజలూ సాక్ష్యం ఉన్నారు సార్, ఇప్పుడిలా మాట మారిస్తే …” నసిగేడు బేంక్ మేనేజరు.

“అవునా, ఇప్పుడే పిలుద్దాం వాళ్లని నేను చెప్పే ప్రతీదానికి సాక్ష్యం కావాలంటే వాళ్లనే అడుగుదం ఏం చెప్తరో,” అంటూ తన ప్యూన్ ని పిలిచి ఎమ్మెల్యే అరిచేడు, “ఒరే అప్పన్నా, ఎస్సై గార్ని నేను ఉన్న ఫళాన రమ్మన్నానని చెప్పు.”

పావుగంటకి ఎస్సై వచ్చాక కథంతా విని ఆయన చెప్పాడు, “భలేవారే, మేము రెడ్డి చచ్చిపోయినప్పుడు వెళ్ళినది బేంక్ మేనేజర్ మీద కేసు బుక్ చేసుకోవడానికి. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో చెప్పలేదో అవన్నీ విని రాసుకోవడానిక్కాదు. ఆయన ప్రజల మనిషి, మేము లా అండ్ ఆర్డర్. మూణ్ణెల్ల క్రితం ఆయనేం మాట్లాడారో, పేపర్ వాళ్ళు ఏం రాసారో చూస్తూ కూర్చుంటే ఇంక మేము మా పని  చేసినట్టే. మీ మేనేజర్ మీద కేసు ఇప్పటికి కొలిక్కి వచ్చింది. మాకు సాక్షులు చాలామందున్నారు బేంక్ మేనేజర్, రెడ్డి వాళ్ళావిడని చేయిపట్టుకు లాగినట్టూ ఆవిడ కిందపడడం చూసినట్టూ చెప్పడానికి. అసలు వాళ్ళడ్డుకోకపోతే మీ మేనేజర్ రెడ్డి వాళ్ళావిణ్ణి ఏం చేసేవాడో మరి. మా కేసులు మాకున్నాయి. ఇలా ఎవరేం మాట్లాడారు, ఎమ్మెల్యేగారు ఏం చేస్తామన్నారు అనేవి అడిగి మా డిపార్ట్ మెంట్ మీదకి రాకండి. ఇది మా పనీ కాదూ, మా పరిథిలోకీ రాదు.” ఎస్సై స్థిరంగా చెప్పేడు; ఎంతైనా గవర్నమెంటు మనిషి కదా?

అక్కడే ఉండి కథంతా చూస్తున్న లక్కి రెడ్డి ఆత్మ మరో సారి ఆశ్చర్యపోయింది, జరిగే నాటకం చూసి.

బేంక్ మేనేజర్ కి కాళ్ళు వణకడం మొదలైంది. ఏంచేయాలో తెలియక దిక్కులు చూస్తున్నప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుంటే, పక్కనే ఉన్న మరో సీనియర్ మేనేజర్ అందుకుని చెప్పాడు, “పోనీయండి ఎమ్మెల్యేగారూ, మీరు అన్నదానికి మేము ఏదో అనుకున్నాం. మొత్తం బాకీ మాఫీ చేస్తాం, ఈ పోలీసు కేసు ఎత్తేయండి చాలు.”

“కేసు నాది కాదు కదా, పోలీసులు ఇంత కష్టపడ్డారు. వాళ్లకేం ఇవ్వకుండా ఎలా మాఫీ చేయాలి ఇవన్నీను? రాత్రనకా పగలనకా సాక్ష్యులని పట్టుకుని కేసు తయారు చేసారు. మరో పదీ పదిహేనురోజుల్లో అది కోర్టుకెళ్లబోతోంది. ఇవన్నీ అంత సులభంగా అయిపోతే ఇంకేం?” తనని సపోర్ట్ చేసిన ఎస్సై కేసి నర్మగర్భంగా చూస్తూ చెప్పేడు ఎమ్మెల్యే.

ఈ సారి మరో వెలక్కాయ గొంతులో అడ్డం పడేసరికి ఒడ్డుమీద పడిన బేంక్ చేప గిల గిల తన్నుకోవడం ఎమ్మెల్యేకీ ఎస్సై కీ తెలుస్తోంది. ఇదే అవకాశం అన్నట్టూ ఎస్సై చెప్పేడు “మేము పడిన కష్టానికి కేసు మాఫీ చేయడం కుదిరే పనికాదు, నేను ఒప్పుకున్నా మా పైనున్న వారూ, కిందనున్న స్టాఫ్ ఒప్పుకోరు. కనీసం వాళ్ళ అవసరాలు తీరేదాకా.”

ఇంక నాన్చడం అనవసరం కనక బేంక్ అడిగింది, “ఎంత అవుతుందంటారు దీనికి?”

బేరసారాలు పూర్తయ్యాక బేంక్ కాస్త ఏడుపు మొహం పెట్టుకునే అయినా విజయగర్వంతో బయటకొచ్చింది. డబ్బులు పోయినా పేరు నిలబెట్టుకున్నట్టే. డబ్బుల్దేవుంది ఏ రెడ్డిని కొట్టినా రాల్తాయి కదా. ఎమ్మెల్యే ఆడిన నాటకం అద్భుతంగా నడిచినట్టే. ఎస్సై అప్పటిదాకా నడిపినట్టు చెప్పుకున్న కేసు ఏదో వంక పెట్టి మూల పెట్టేడు. ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకోవచ్చు. సంభావన పుచ్చుకున్నాక ఇంక మాటలు, చేతలు పనికిరావు.

రెడ్డి వాళ్ళావిడ చేయి పట్టుకున్న బేంక్ మేనేజర్ రెణ్ణెల్ల తర్వాత మరో చోటకి బదిలీ చేయబడ్డాడు. రెడ్డి చచ్చిపోయాక ఊరు ఆయనని మర్చిపోవడానికి సరిగ్గా పదిహేను రోజులు పట్టింది. అసలు వారంలో మర్చిపోయేదే కానీ రెడ్డి పెద్ద కర్మకి ఎమ్మెల్యే వచ్చి భోజనం చేసి మరోసారి చెప్పాడు బేంక్ ఋణం తాను తప్పకుండా దగ్గిరుండి మాఫీ చేయిస్తానని. అందువల్లే మరో వారం పట్టింది.

ఆ పై ఏడు ఎన్నికల్లో ఎమ్మెల్యే అఖండ విజయం సాధించాడు. ఈయన చేసిన మంచి పని రాష్ట్రం అంతా తెలిసి వచ్చింది. ఇంతటి మంచి పనులు చేసేవారు మంత్రి వర్గంలో ఉండాలని ముఖ్యమంత్రిగారు అనుకోవడంతో ఆయన హైద్రాబాద్ వెళ్ళారు సకుటుంబంగా. వెళ్తూ రెడ్డి చావు గురించి మొదట్లో తనకి ఉప్పందించిన కుర్రాణ్ణి తన కూడా తీసుకెళ్ళారనుకోండి. ఆ మాత్రం సహాయం చేసే కుర్రాడు ఎప్పుడూ కూడా ఉండడం మంచిదే కదా?

బతికున్నప్పుడు తనకి ఏ విలువా లేదనీ, తానో పనికిమాలినవాడిననీ అనుకుని పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్న రెడ్డి చచ్చిపోయాక తన విలువ తెలుసుకున్నాడు. తనకి విలువలేకపోవడమే? మూడు లక్షల అప్పు తీరింది; తనఖా పెట్టిన భూమి పూర్తిగా రెడ్డి వాళ్ళావిడ చేతిలోకొచ్చింది. ఎమ్మెల్యే రెడ్డి వాళ్ళవిడకో పాతికివేలు ఇచ్చేడు కదా అందరిముందూ? పిల్లలదేవుంది వాళ్ళు సులభంగా అన్నీ మర్చిపోయి నెట్టుకురాగలరు.

తన మూలాన ఎమ్మెల్యే మంత్రి పదవి వచ్చి బాగుపడ్డాడు. పోలీసోళ్ళు బాగుపడ్డారు. పేపర్లూ బాగుపడ్డాయ్. బేంక్ కి కొంచెం నష్టం వచ్చినా అది పెద్ద లెక్కలోకి రాదు. గొర్రెల్ని దోచుకోవడానికి వాళ్లకి సవాలక్ష దారులున్నై. ఎవడయ్యా చచ్చి సాథించేదేమీ లేదని చెప్పిన దద్దమ్మ? రెడ్డి ఆత్మ ఈ నాటకం, రాజకీయ తతంగం అంతా చూసి, బతికున్నప్పుడు - తాను చేయలేని పని చిన్న పురుగుల మందు డబ్బాతో చేయగలిగినందుకూ, తననో పనికిరానివాడిగా అనుకున్నందుకూ, లోకులు తను చావకముందూ, చచ్చిపోయాకా అన్న మాటలన్నీ ఓ సారి గుర్తు తెచ్చుకుని, ఆశ్చర్యంతో, తన విలువ ప్రపంచం గుర్తించినందుకు తృప్తిగా నవ్వుకుంది.

Posted in October 2019, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!