Menu Close
Kadambam Page Title
వర్షంలో కన్నీటి చుక్కలు
-- చందలూరి నారాయణరావు --

ఈ వాన
ఎంత ఎండ తాగిందో ?
ఊర్ల మీద పడి జల బలం చూపుతుంది.

వాగు తోక కొరికి
చెరువు గట్టునెక్కి
పల్లె గడపను చూస్తుంది.

మెట్ట పల్లాల
భుజాలపై చేతులు వేస్తూ
నదిలా పెద్దగా అరుస్తు పిలుస్తుంది.

పొలంలో గాలి అడుగులతో
మొలకెత్తిన మొక్క మెడ విరిగి
మూలుగుతున్నది.

గుడిసె ముందు
వింత అనుభవంతో
అవ్వ గాజు కళ్ళు మబ్బులు పట్టాయి.

బడి, గుడి ముద్దగా తడిసి
సెలవు ప్రకటనతో సోమరిగా
కాగితపు పడవల్లో షికారు చేస్తున్నాయి.

మనుషులు చిత్తడి చిత్తడిగా
బతుకులు నాని
ఊర్లు జారుతున్నాయి.

మనిషి భయం లేని
చినుకు పిల్ల సృష్టించిన అల్లరికి
సముద్రం చిరునవ్వు పొంగుతుంది.

ముసుగు మగత వీడి
వర్షంలో కన్నీటి చుక్కల్ని ఏరడానికి
భానుడు పరిగెత్తుకొస్తున్నాడు.

Posted in November 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *