పేరడీలకు ఆద్యుడు జలసూత్రం రుక్మిణి నాధ శాస్త్రి (జరుక్ శాస్త్రి)
తెలుగు సాహిత్యం లో మొక్కపాటి, చిలకమర్తి , పానుగంటి, భమిడి పాటి వంటి రచయితలు బాగా సున్నితమైన హాస్యం పండించిన రచయితలు. వీరికి భిన్నంగా జలసూత్రం రుక్మిణి నాధ శాస్త్రి గారు తెలుగు సాహిత్యం లో పేరడీలను తెచ్చిన హాస్య రచయిత. ఆ తరువాత సినిమా పాటలకు జొన్నవిత్తుల వంటి రచయితలూ అదే దారిలో ప్రయాణించి శ్రోతలకు లేదా పాఠకులకు మంచి హాస్యాన్ని అందిచే పేరడీలు అందించారు. జలసూత్రం రుక్మిణి నాధా శాస్త్రి గారు జరుక్ శాస్త్రి గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావించవచ్చు. తెనాలి రామకృష్ణుని తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. హాస్య ప్రక్రియలలో క్లిష్టమైనది పేరడీ. మూలంలోని అపహాస్యం చేయదగ్గ అంశాన్ని వెతికి పట్టుకుని దాన్ని ఉత్ప్రేక్షించి, పాఠకుడికి ఒరిజినల్ ను గుర్తు చేసేట్లు రాయగలగాలి. అప్పటిదాకా ఒరిజినల్ ను ఆ కోణంలో చూడని పాఠకుడి చేత అవును ఇది టూమచ్ గాఉంది దీన్ని వెక్కిరించవచ్చు అని అనిపించి ఆమోదాన్ని పొందగలగాలి. పేరేడి రచయిత కనబడ్డ ప్రతి గొప్ప రచనను చదువుతూ దానిలో తనకు కావలసిన గుణం గురించి వెతుకుతూ ఉండాలి. అందుకే పేరడీ రచయితలూ చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి పేరడీ రచయితల్లో జరుక్ శాస్త్రి అగ్రగణ్యుడు.
పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. శ్రీ శ్రీ లాంటి విప్లవ కవి సాహిత్యానికి కూడా పేరడీలు రాసిన వాడు జరుక్ శాస్త్రి.
శ్రీశ్రీ "నేను సైతం ప్రాంచాగ్నికి సమిధనవుతా" అంటూ కణ కణ లాడే నిప్పులాంటి కవితకు జరుక్ శాస్త్రి రాసిన పేరడీ;
నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను
నేను సైతం జనాభాలో సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను
ఇంకా, "ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం"అనే శ్రీ శ్రీ కవితకు పేరడీ;
ఏ కాకి చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం
ప్రపంచ మొక సర్కస్ డేరా (ప్రపంచమొక పద్మవ్యూహం)
కవిత్వమొక వర్కర్ బూరా (కవిత్వమొక తీరని దాహం)
ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడిలెన్నీ… మొదలైనవి.
ఇలా ఆయన ఏ కవి కవిత్వానికి అయినా పాఠకులు నవ్వుకునే పేరడీలు రాశాడు. సమకాలీన కవుల రచనలకు వేటినీ వదలకుండా వాటికి పేరడీలు వ్రాసి ఆ కవుల, పాఠకుల మెప్పు పొందారు.
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914, సెప్టెంబర్ 7న బందరులో జన్మించారు. వీరు చిట్టి గూడురు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉప సంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమం లో ప్రధాన పాత్ర వహించారు. ఆనంద వాణిలో 'తనలో తాను' శీర్షిక నిర్వహించారు. ఆయన రచనల్లో కొన్ని – “జరుక్ శాస్త్రి పేరడీలు” పేరుతోనూ, కథలు కొన్ని “శరత్ పూర్ణిమ” పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఈయన కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదక వర్గ సభ్యులుగా కూడా పనిచేశారు. ఈయన రాసిన పేరడీలు లెక్కకు లేవు. తన పేరడీలతో సాహితీ పరిమళాలను వెదజల్లారు. ఇంటి పేరు గురించి ఎవరైనా అడిగితే హెచ్ టు ఓ (రసాయన శాస్త్రం లో నీటికి సాంకేతికం) ను కనిపెట్టింది మా వాళ్ళే అని చమత్కారంగా చెప్పేవారు. ఆయన 1968లో హృద్రోగంతో కన్నుమూసారు.