పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
వైశ్యుడు – మంగలి
అనగనగా ఒక ఊళ్ళో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు వ్యాపారంలో బాగా నష్టపోయి ధనమంతా పోగొట్టుకుని దరిద్రంలో మగ్గసాగాడు.
తినడానికి తిండిలేక నిద్రపట్టక దొర్లుతూ ‘డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. డబ్బులేనివాడిని అందరూ చులకనగా చూస్తారు. ధనవంతుడు గుణహీనుడైనా అందరూ వాడినే పొగుడుతారు. నాలాంటి డబ్బులేని వాడు బ్రతకటం అనవసరం. నేను చావడమే మంచిది’ అని ఏదేదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు వైశ్యుడు.
నిద్రలో వైశ్యుడికి ఒక కల వచ్చింది. అందులో లక్ష్మీదేవి కనపడి ‘నేను రేపు నీ ఇంటికి బిచ్చగాడిలా వస్తాను. నువ్వు నన్ను దుడ్డు కర్రతో కొట్టు. అప్పుడు నేను బంగారంలా మారిపోతాను. ఆ బంగారంతో నువ్వు సంతోషంగా బ్రతుకు’ అని చెప్పింది.
వైశ్యుడికి చటుక్కున మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే ఎవరూ కనపడలేదు. అప్పుడు ‘ఓస్ అదంతా నా కల అన్నమాట. అయినా కల ఎప్పుడైనా నిజమవుతుందా? నేను డబ్బు గురించే ఆలోచిస్తూ నిద్రపోయాను అందుకే నాకు అలాంటి కల వచ్చింది. అదేదో పిచ్చికల’ అనుకుని మళ్ళీ నిద్రపోయాడు.
తెల్లవారింది.
కలలో చూసినట్లుగానే ఒక బిచ్చగాడు ఇంటికి వచ్చాడు. వైశ్యుడు ఆశ్చర్యపోయి సందేహిస్తూనే భయంగా దుడ్డు కర్ర తీసుకుని బిచ్చగడి తల మీద కొట్టాడు. వెంటనే బిచ్చగాడు బంగారంలా మారిపోయాడు.
ఇదంతా వైశ్యుడికి క్షవరం చేస్తున్న మంగలి చూసాడు. వైశ్యుడు, మంగలికి కొంత బంగారం ఇచ్చి ‘ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’ అని బ్రతిమిలాడుకున్నాడు.
మంగలి ‘సరే’ అని వైశ్యుడికి చెప్పి ఆయన ఇచ్చిన బంగారం తీసికొని ఇంటికి వచ్చేసి, వైశ్యుడి ఇంటిలో జరిగినదాని గురించి చాలాసేపు ఆలోచించాడు.
‘అయితే ఈ రోజు ఇంటికి వచ్చిన బిచ్చగాళ్ళను కర్రతో బాదితే బంగారంలా మారతారన్న మాట’ అని తనకు తానే నిర్ణయించుకుని, ఊళ్ళోని బిచ్చగాళ్ళ వద్దకు వెళ్ళి ’ఇవాళ మా ఇంట్లో మీ అందరికీ అన్నం పెడాతాను రండి’ అని పిలిచాడు. బిచ్చగాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు.
బిచ్చగాళ్ళందరూ భోజనానికి వచ్చాక తలుపు గడియ పెట్టి వాళ్ళందరినీ దుడ్డు కర్రతో చితక బాదాడు మంగలి.
బిచ్చగాళ్ళు లబో దిబో మంటూ న్యాయాధికారి వద్దకు వెళ్ళి మంగలి పై ఫిర్యాదు చేసారు.
న్యాయాధికారి మంగలిని పిలిచి ‘ఏమిటిది? ఎందుకిలా బిచ్చగాళ్ళందరినీ చితక బాదావు?’ అని అడిగాడు కోపంగా.
అప్పుడు మంగలి, వైశ్యుడి ఇంట్లో తాను చూసినదంతా వివరించాడు.
న్యాయాధికారి వైశ్యుడిని పిలిపించాడు. వైశ్యుడు తన కల గురించి చెప్పాడు.
ముందూ వెనుకా ఆలోచించకుండా బిచ్చగాళ్ళని అకారణంగా కొట్టినందుకు మంగలిని కఠినంగా శిక్షించాడు న్యాయాధికారి.
NIce satya!