ఉగాది
కం. రావే ‘విశ్వావసు’వా!
తేవే వృద్ధియు సమిష్టితృప్తియు భాగ్యా
లీవే(1), సమృద్ధిగా నిఁక
నీవే(2) శాంతియు సుఖంబు లీ యేడాదిన్
(1) నీవే (2) ఈయవే
ఉ. ‘క్రోధి’కి స్వస్తి; నూత్నసమఁ(1) గ్రోధము వీడి చరించి మానవుల్
బాధలు వోయి నల్వురును బంచుకొనన్ దరహాసవేదికన్,
మేధను సానపట్టుచును మే లొనరించు పథంబు గూర్పఁగా
బోధకు లెల్ల, విశ్వవసుభూరినిధానము(2) భారతం(3) బగున్
(1) క్రొత్త సంవత్సరములో (2) విశ్వములో ధనానికి/బంగారానికి/కిరణాలకు
గొప్ప ఆధారము లేదా పాఁతఱ (3) హిందూదేశము
కం. తహతహ లంతము గాఁగా,
నహరహమును నిండఁ బాటవాంశుచయము(1) హృ
ద్గుహలను, యువతయుఁ బెద్దలు
సహచరులై సాగఁ బ్రగతి జగతికి వరమౌ
(1) నైపుణ్యము అనే కాంతిపుంజము