Menu Close
Theerpu Katha page title

కోర్టులో కేసు విచారణకు వచ్చింది. నాకు చికిత్స జరుగుతున్న కారణంగా నేను కోర్టులో హాజరు కానవసరంలేదనే వెసులుబాటు కలిగించబడింది.

కోర్టులో ఏం జరిగిందనే దాని గురించి చందన అక్క చెప్పిన కథనం ఇది.........

కేసు విచారణకు వచ్చిన రోజున కోర్టు హాలంతా ఈ కేసులో ఏం జరుగుతుందో అని  చూడటానికి వచ్చిన జనంతో  క్రిక్కిరిసి పోయింది.

బాధితురాలినైన నా తరఫున న్యాయవాది సౌదామిని, ముద్దాయి అయిన కరణ్ తరఫున న్యాయవాది పరాంకుశం గారు తమ తమ కథనాలను జడ్జిగారికి వివరించారు.

ముద్దాయి కరణ్ ను కోర్టులో ప్రవేశబెట్టారు. వాద ప్రతివాదాలు జరిగాయి.

మాధవయ్యగారిని, చందన, రమేష్ లను సాక్షులుగా ప్రవేశపెట్టి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకోవడం జరిగింది. ఇలా కేసు కొంతకాలం నడిచింది.......

ఇరుపక్షాల న్యాయవాదులూ ఇటు సౌదామినిగారు, అటు  పరాంకుశంగారు కూడా తమ తమ క్లయింట్లను సమర్థిస్తూ బలమైన వాదనలు వినిపించారు. అనంతరం కేసు తీర్పుకి వచ్చింది..........

కోర్టులో ఈ కేసు నడుస్తున్న తరుణంలోనే ఎన్నో సాంఘిక సేవా సంస్థలు , మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నాకు తమ మద్దతు తెలిపాయి. సమాచార మాధ్యమంలో కేసు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

జడ్జిగారి తీర్పు ఎలా ఉంటుందోననే విషయంలో ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాలు చేయసాగారు.

ఈ కేసులో పేరుమోసిన జడ్జి రామబ్రహ్మంగారు  తీర్పు వెలువరించనున్నారని తెలిసి అందరికీ ఉత్కంఠ మరియు ఆసక్తి మరింత పెరిగాయి. అందుకు కారణం ఆయన ఎటువంటి ప్రలోభానికి లోనుగాకుండా నిష్పక్షపాతంగా ఎన్నో సంచలనాత్మకమైన తీర్పులు వెలువరించి  ఉండటమే.......

!+!+!+! !+!+!+! !+!+!+! !+!+!+!

ఆ రోజు తీర్పు వెలువడే రోజూ కావడంతో ఎన్నడూ చూడని రీతిలో  కోర్టు లోపల బయటా కూడా జనంతో కిట కిటలాడసాగింది. జడ్జిగారు రావడంతో అందరూ లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్నాక అందరూ తమ తమ స్థానాలలో ఆసీనులయ్యారు.

అప్పటికే కొంత కోలుకుని ఉండటంవల్లనూ, ఆ రోజు కేసు తీర్పుకి రావడంవల్లనూ నేను కూడా కోర్టుకు హాజరయ్యాను.

కోర్టులో అడుగుపెట్టగానే ‘నాకు ఇవాళ ఇక్కడ తప్పక న్యాయం లభిస్తుంది’ అనిపించింది.

కోర్టు హాలంతా ఒకసారి పరికించి చూశాను.

నా ముఖంపై ముసుగు ఉండటంతో జడ్జిగారితో సహా అందరి దృష్టి సానుభూతిగా నావైపు మళ్ళింది క్షణంపాటు.

లాయర్ పరాంకుశంగారు, కేసు సమర్థవంతంగా వాదించానన్న తృప్తితో తన క్లయింటు కరణ్ ఏదో సాధారణ శిక్షతో బయటపడతాడు అన్న ధీమాతో, చిరునవ్వు నవ్వుకుంటున్నారు.

లాయర్ సౌదామిని మాత్రం, తన క్లయింటు సురభికి, అంటే నాకు, న్యాయం జరుగుతుందన్న ధీమాతో, గంభీరవదనంతో కూర్చుని ఉన్నారు.

జడ్జి రామబ్రహ్మంగారు చిన్నగా గొంతు సవరించుకుని,

“కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించిన మీదట కోర్టు ముద్దాయి కరణ్ ను దోషిగా నిర్థారించడమైనది.

ముద్దాయి కరణ్ బాధితురాలు సురభిని వెంబడించి వేధించి, వలదని వారించిన ఆమె హెచ్చరికలు పెడ చెవిన పెట్టి, అకారణంగా ఆమెపై  కక్షబూని ఆమెపై యాసిడ్ చిమ్మడంవంటి  ఘాతుకానికి పాల్పడడం ఘోరమైన నేరంగా కోర్టు పరిగణిస్తున్నది.

కరణ్ చర్యతో బాధితురాలు సురభికి తీరని అన్యాయం జరిగింది కనుక ఆమెకు న్యాయం చేయవలసిన బాధ్యత ముద్దాయి కరణ్, అతడి తల్లిదండ్రులు తీసుకోవాలని నిర్ణయించడమైనది.

ప్రస్తుతం ముద్దాయి తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నందున అతడు చదువు పూర్తిచేసి స్వార్జితుడు కావడానికి 2 సంవత్సరములు మాత్రమే గడువు ఇవ్వబడుతున్నది.

ముద్దాయి కరణ్ స్వార్జితుడైన తదుపరి అతడికి తల్లిదండ్రులు ఎటువంటి సహాయం చేయరాదు. స్వార్జితుడైన తదుపరినుండి బాధితురాలు సురభి జీవితకాలం పోషణ భారం ముద్దాయి కరణ్ వహించవలెనని నిర్ణయించడమైనది.

అప్పటివరకు అనాథ అయిన సురభికి కనీస వసతులతో ఒక నివాసం ఏర్పాటు చేసి, ఆమె తన చదువు కొనసాగించడానికి తగిన ఏర్పాట్లు చేసి, ఆమె తన కాళ్ళపై తాను నిలబడేవరకు..... సంరక్షణా బాధ్యత అంతా ముద్దాయి తల్లిదండ్రులు వహించవలసి ఉంటుంది.

ఈలోగా ఈ దేశం వదిలి వెళ్లకుండా కరణ్, అతడి తల్లిదండ్రుల పాస్ పోర్టులు రద్దుచేయడమైనది.

ఈ ప్రక్రియలో బాధితురాలు సురభి జీవితం ఒక దరికి చేరిన తదుపరి కూడా ముద్దాయి కరణ్ అతడి భవిష్యత్తుకి సంబంధించిన ఎటువంటి నిర్ణయంలోనైనా సురభి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ఆదేశించడమైనది.

ముద్దాయి కరణ్ ప్రతి నెల కోర్టులో తప్పనిసరిగా హాజరు వేయించుకోవాలని, కోర్టుకి ప్రతివిషయం వ్రాతపూర్వక వివరణ ఇవ్వవలెనని ఆదేశించడమైనది.

ఈ ఆదేశాలలో ఏ ఒక్కటి అతిక్రమించినప్పటికి దానిని మరింత తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందని తెలుపడమైనది.

ఈ నేపధ్యంలో ముద్దాయి నుండి బాధితురాలికి ఎటువంటి హాని కలుగకుండా ఆమెకు 24 గంటలు  రక్షణ కల్పించవలసినదిగా పోలీసుశాఖను ఆదేశించడమైనది” అని జడ్జిగారు తిరిగి .................

“క్షణికమైన ఆవేశంలో హేయమైన నేరాలు చేసి ఎదుటివారి జీవితాలను నరకప్రాయం చేసి, స్వల్పమైన శిక్షని అనుభవించి తప్పించుకుందామనుకునే నేరస్తులకి విధించబడే శిక్ష, వారికి, అటువంటి నేరాలు చేయబూనే వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి.

అటువంటి ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో ముద్దాయి అకృత్యానికి బలైన బాధితురాలి సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ బాధితురాలికి న్యాయం జరగేలా ముద్దాయి కరణ్ కు శిక్ష ఖరారు చేయడమైనది” అంటూ తన కొసమెరుపు సందేశాన్ని జోడించి తన సుదీర్ఘమైన తీర్పును వెళ్ళడించారు.

జడ్జి రామబ్రహ్మంగారిచ్చిన తీర్పు విని కోర్టు ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

‘ఆహా ఎంత చక్కగా వివరించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చారు జడ్జిగారు’ అంటూ  ప్రశంసించిన పలు స్వరాలతో పాటు,

“ఇదెక్కడి తీర్పు? కుర్రవాడు ఏదో ఆవేశంలో చేసాడే అనుకుందాము అందుకు శిక్ష మరీ ఇంతలా ఉండాలా? వాడి భవిష్యత్తును తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతులలో పెట్టేస్తే పాపం ఆ అబ్బాయి గతి ఏమవ్వాలి?”

అంటూ నిరసించిన  కొన్ని స్వరాలూ వినిపించాయి నాకు.

ఏదో తేలికపాటు జైలు శిక్ష అనుభవించిన తరువాత విడుదలై వచ్చి ఆనందంగా పెళ్లిచేసుకుని పిల్లా పాపలతో కొడుకు సుఖమైన జీవితం అనుభవించగలడని ఎదురుచూస్తున్న కరణ్ తల్లిదండ్రులు ఈ తీర్పు విని శరాఘాతం తగిలిన  పక్షులలాగా విలవిలలాడిపోయారు.

అదే పంథాలో ఆలోచిస్తున్న లాయర్ పరాంకుశంగారిని కూడా ఈ అనూహ్యమైన తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసింది.

నాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్న లాయర్ సౌదామినికి ఈ అమోఘమైన తీర్పు ఎంతో ఆనందం కలిగించింది.

ఈ తీర్పు గురించి అభిప్రాయం చెప్పమని నన్ను పత్రికలవారు ప్రశ్నించినప్పుడు

“ముందుగా ఈ కేసులో నాకు తమ సహకారం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఒకవైపు నాలాగా ఎంతోమంది ఇటువంటి ఘాతుకాలకు బలై చేయని తప్పుకు జీవితాంతం శిక్ష అనుభవించవలసి వస్తుంటే ఇంకోవైపు ఆ తప్పుచేసినవాళ్లు మాత్రం కొద్దిపాటి శిక్షతో బయటపడి హాయిగా సుఖమైన జీవితాలని గడుపుదామనుకుంటున్నారు.

అటువంటి కుత్సిత మనస్కులకి గౌరవనీయులైన జడ్జి శ్రీ రామబ్రహ్మంగారి తీర్పు ఒక మంచి గుణపాఠం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ తీర్పు మన న్యాయవయస్థపై నాకున్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. నమస్కారం” అని చెప్పి లాయర్ సౌదామినితో  వెళ్లిపోయాను.

పట్టువదలని విక్రమార్కుల లాగా కరణ్ తల్లిదండ్రులు తిరిగి పై కోర్టులో అర్జీ చేసుకున్నప్పటికి అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. పై కోర్టు కూడా క్రింది కోర్టు తీర్పుని బలపరచడమే కాకుండా జడ్జి రామబ్రహ్మంగారి  తీర్పును న్యాయమైనదిగా అమోఘమైనదిగా అభివర్ణించి ప్రశంసించింది.

 

!+!+!+! ...(సమాప్తం) !+!+!+!

Posted in November 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!