Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

తాబేలు తెలివి

అనగనగా ఒక అడవి. అందులో ఒక చెరువు. ఆ చెరువులో ఒక తాబేలు నివసిస్తుండేది. ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు క్రింద ఎంతో చల్లగా ఆహ్లాదంగా ఉండేది.

ఒకనాడు తాబేలు చెరువులోంచి బయటకు వచ్చిమర్రి చెట్టు క్రింద హాయిగా తిరుగుతోంది. అప్పుడే దాహం తీర్చుకుందామని చెరువు వద్దకు వచ్చిన ఒక నక్క దానిని చూసి ‘ఆహా ఈ తాబేలు ఎంత బలంగా ఉంది? దీన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను’ అనుకుంది.

నెమ్మదిగా వెళ్ళి తాబేలు వీపు పైన కాలు పెట్టి గట్టిగా తొక్కి పెట్టింది. ప్రమాదం గ్రహించిన తాబేలు గబుక్కున తలను కాళ్ళను ముడుచుకుని కదలకుండా మెదలకుండా ఉండి పోయింది. తాబేలుని కొరికి తినాలని విశ్వ ప్రయత్నం చేసింది నక్క కానీ ఎంతకూ అది కొరుకుడు పడలేదు.

అప్పుడు తాబేలు ‘నక్క బావా నువ్వు ఇలా నన్ను తినాలని ఎంత శ్రమ పడినా లాభం లేదు. నేలపైన నన్ను తినడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుచేతనంటే ఎండవల్ల నా శరీరం గట్టిపడి పెంకులా తయారైంది. కనుక నన్ను కొంతసేపు నీళ్ళల్లో నాన వేశావంటే నా శరీరం మెత్తబడుతుంది అప్పుడు నీకు తినడానికి సుళువవుతుంది’ అని చెప్పింది.

తాబేలు సలహా నచ్చిన నక్క దానిని తీసుకెళ్ళి చెరువు నీళ్ళల్లో ఉంచి అది తప్పించుకుని పోకుండా వీపు పై కాలితో తొక్కి ఉంచింది. కొంచం సేపయ్యక మళ్ళీ తాబేలుని కొరికి తిందామని ప్రయత్నించింది కానీ దాని శరీరం ఏమాత్రం మెత్తబడక మునుపటిలాగానే కొయ్యలాగే ఉండి కొరుకుడు పడలేదు నక్కకి.

దాంతో ‘ఏయ్ తాబేలూ ఏమిటే ఇది నీళ్ళల్లో ఉంచితే నీ శరీరం మెత్తబడుతుందన్నావు ఇంకా గట్టిగానే ఉంది?’ అంటూ గదిమింది నక్క.

‘అయ్యో నక్క బావా నీకు నాపై నమ్మకం లేక, నేనెక్కడ తప్పించుకు పోతానో అని తెలివిగా నా వీపుని నీ కాలితో అదిమి ఉంచావు నేనేమో భయంతో బిగుసుకుపోయాను. అందుకే నా శరీరం ఇసుమంతైనా నానలేదు. కొంచం పట్టు సడలించు నేను త్వరగా మెత్తబడతాను’ అంది.

తాబేలు మాటలు సబబుగా అనిపించి దాని వీపు పైనుంచి కాలు తీసింది నక్క.

‘బ్రతుకుజీవుడా’ అనుకుని చెరువు నీళ్లలోకి వెళ్ళిపోయి మరి బయటకు రాలేదు తాబేలు.

‘ఓసినీ! జిత్తులమారినైన నన్నే మోసం చేసావు కదే తాబేలూ?’ నిరాశగా అనుకుని చేసేది లేక నీళ్ళు త్రాగి వెళ్ళిపోయింది నక్క.

నీతి: బుద్ధిబలం కలిగిన వారిని ఎవ్వరూ మోసం చేయలేరు.

Posted in October 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!