Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు
డబ్బు మహిమ

తేటగీతి:
పైకము తొడగొట్టు మనసు బాధపెట్టు
పైసలు చెడగొట్టు గుణము పాతిపెట్టు
కాసులు విడగొట్టు మనల కష్టపెట్టు
డబ్బు పడగొట్టు మంచిని దెబ్బగొట్టు
కనుక ధనము కూడ, మనిషీ ఖలుడు గాకు?

లోకరీతి

తల్లిదండ్రులిలను తల్లడిల్లుచునుండ
ముద్ద కూడ బెట్టు బుద్ది రాక
కడకు పోవ, కర్మకాండల ఘనమేల
వినుడు లోకరీతి వీనులలర

సకల దేవతలను సర్వ మతాలను
సజ్జనుండు జూడు సమము గాను
దోషములను జూచు ధూర్తుండు భువిలోన
వినుడు లోకరీతి వీనులలర

కులము కులము యనుచు కుమ్ములాటలవేల
కులము వలన రాదు కూడు మనకు
ప్రతిభ కూర్చు మనకు ప్రబల యశస్సును
వినుడు లోకరీతి వీనులలర

కోపమెక్కువైన దాపురారెవ్వరు
ఓర్మితోడ మనకు కూర్మి గలుగు
శాంతమున్న చోట సంతోషముండును
వినుడు లోకరీతి వీనులలర

ఆశలేని మనిషి అసలిల మనలేడు
ఆశ లోనె బ్రతుకు పాశముండు
ఆశ యుండవచ్చు అత్యాశ ముప్పురా
వినుడు లోకరీతి వీనులలర

Posted in March 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!