మన తేనెలొలుకు శీర్షికలో తెలుగు గొప్పదనం గురించి సదా వివరిస్తూనే వస్తున్నాను. అయితే ఇప్పటికీ ఆంగ్ల భాషలోనే చదువులు చదివితే మాత్రమే మంచి ఉద్యోగాలు వచ్చి గుర్తింపు వస్తుంది అనే వారితో నేనూ ఏకీభవిస్తున్నాను అట్లాగే వ్యతిరేకిస్తున్నాను కూడా. ఎందుకంటే ప్రతిభ అనేది వ్యక్తి యొక్క మానసిక వికాసానికి తార్కాణం, అందుకు భాష అనేది ఒక మాధ్యమం మాత్రమే. ఈ మధ్య కాలంలో తెలుగు మాధ్యమంలో చదివి ఎంతో మంచి స్థాయికి ఎదికిన రోణంకి గోపాలకృష్ణ వంటి వ్యక్తులే ఇందుకు నిదర్శనం. సివిల్స్ లో దేశం మొత్తం మీద మూడో రాంక్ ను సాధించిన ఈయన తల్లీ తండ్రీ ఇద్దరూ వ్యవసాయ కూలీలు మరియు నిరక్షరాస్యులు. చదివింది తెలుగు మీడియం. అయినా కూడా తన ప్రతిభ, కృషి, పట్టుదలతో తన సంకల్పాన్ని సిద్ధించేందుకు శ్రమించాడు. మరి ఆంగ్ల మాధ్యమంలో చదవలేదని సివిల్స్ రాకుండా పోలేదు కదా! ముఖ్యంగా ప్రభుత్వ బడులు ఎందుకూ పనికిరావు అని ఉచిత విద్యను వదిలి కాన్వెంట్ చదువులకు మొగ్గు చూపుతున్న నేటి తల్లిదండ్రులకు వారి ఆలోచన సరిగా లేదు అని చెప్పి వాస్తవాలను వివరించే అధ్యాపకులు మన ప్రభుత్వ బడులలో ఉండాలి. ఇప్పడు లేరని కాదు కానీ వారి శాతం చాలా తక్కువగా ఉంది.
ఇక ఆంగ్ల మాధ్యమంలో చదువులను ఒప్పుకొంటున్నాను అంటే అందుకు కారణం నేటి సామాజిక పరిస్థితులే. ప్రభుత్వ బడికి వెళ్ళే వాళ్ళను చూసి హేళన చేసే వారు కోకొల్లలుగా ఉన్న సమాజంలో ఉన్న నేటి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపకుండా ఉండడంలొ తప్పు లేదు.
ఇప్పుడు రాఘవ మాస్టారు గారు పంపిన “డబ్బు మహిమ” తేటగీతి ని తియ్యనైన తెలుగు పదాల సాక్షిగా పరికించండి.
పైకము తొడగొట్టు మనసు బాధపెట్టు
పైసలు చెడగొట్టు గుణము పాతి పెట్టు
కాసులు విడగొట్టు మనల కష్ట పెట్టు
డబ్బు పడగొట్టు మంచిని దెబ్బ గొట్టు
కనుక ధనము కూడా మనిషి ఖలుడు గాకు!?