
వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి (వీటూరి)

సినీ గేయరచయిత గా ప్రసిద్ధి చెందిన వీటూరి పూర్తి పేరు వీటూరి వెంకట సత్య సూర్య నారాయణ మూర్తి. 1960 దశకం నాటి సినీ గేయ రచయిత. ఈయన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామంలో1934, జనవరి 3వ తేదీన జన్మించారు. 12వ ఏట నుండే కవితలు రాయడం మొదలు పెట్టాడు. స్వయంకృషితో తెలుగు భాషపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాడు. ఈ ఉత్సాహమే అతని చేత నాటకాలు రాయించింది. పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక మొదలైన నాటకాలు రాశాడు వీటూరి. ఆయనే సొంతంగా నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశాడు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన సన్మాన సభలో వీటూరిని ‘తరుణ కవి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. వీటూరి పేరుతోనే కాకుండా జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతో ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికల్లో కథలు రాశాడు.
మొదట్లో ఈయన కల్పన అనే నాటకం ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యారు. ఆ తరువాత ఇంటి పేరు వీటూరి తో నాటక రచయితగా పద్య రచయితగా, సినీ పాటల రచయితగా ప్రసిద్ధి చెందాడు. తాత, తండ్రుల నుండి వారసత్వముగా వచ్చిన భాషా పరిజ్ఞానంతో ఛందస్సు వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి తాను వ్రాసిన పద్యాలను పత్రికలకు పంపడం, కవిసమ్మేళనాలలో పాల్గొనడం చేసేవాడు. సాంఘిక నాటకాలు కూడా వ్రాసేవాడు. తాను రాసిన పౌరాణిక నాటకాలకు తానే హార్మోనియం వాయించేవాడు. వీటూరి, భీమిలిలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి కొంతకాలం ఉపాధ్యాయుడిగా చేరి స్కూల్లో తెలుగు బోధించేవాడు.
సినిమాలపై గల ఆసక్తి ఆయన్ని 1958లో మద్రాసు చేర్చింది. వీటూరి, సదాశివబ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజు గార్ల దగ్గర లవకుశ, ఇంటిగుట్టు, కృష్ణలీలలు, భక్తశబరి వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసి సినిమా స్క్రిప్టు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాడు. ‘భక్తశబరి’లో కొన్ని పాటలు, పద్యాలు రాశాడు. హెచ్.ఎమ్. రెడ్డిగారితో పరిచయం కలగడంతో ‘గజదొంగ’ చిత్రానికి వీటూరి మాటలు రాశాడు. 1962 లో ‘స్వర్ణగౌరి (1962)’ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాశాడు. అలా ఆయనకు తొలిసారిగా పూర్తిస్థాయి అవకాశం వచ్చింది. తర్వాత వీటూరి 1965 లో రాసిన తొలి సాంఘిక చిత్రం హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన ‘దేవత’. ఇందులో ఆయన రాసిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. జానపద బ్రహ్మ బి.విఠలాచార్య ప్రొత్సాహంతో దాదాపు 42 చిత్రాలకు రచన చేశాడు. వందకు పైగా పాటలు రాశాడు.1967 లో పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం లో వీటూరి రాసిన పాటతోనే ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గాయకునిగా సినిమా రంగ ప్రవేశం చేశాడు. 1972 లో విజయలలిత పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి అదృష్ట దేవత అనే సినిమాను నిర్మించాడు. ఆ తరువాత భారతి అనే స్వీయ రచనను స్వీయ దర్శకత్వంలో 1975 లో తెరకెక్కించాడు. ఆ సినిమాకు మాటలు, పాటలు కూడా ఆయనవే.
చాలా మంచి పాటలు రాసినా, ఆయన పేరు మరో ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర రామ మూర్తి పేరుకు దగ్గరగా ఉండటం వల్ల చాలా మంచి పాటలు వేటూరి ఖాతా లోకి వెళ్ళినాయి. వీటూరి గారు, వేటూరి సుందరరామ్మూర్తి గారు కలిసి, 'యమగోల' 'మల్లెపూవు', 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' వంటి చాలా చిత్రాలకు గీతాలు రాయడంతో, వీటూరి గారి పాటలని కూడా వేటూరి గారే రాశారన్న గందరగోళం, ఆధునిక తరంలో ఏర్పడింది. వీటూరి గారి పాటల్లో ప్రసిద్ధికెక్కిన పాటలు NTR సావిత్రి నటించిన దేవత చిత్రంలోని "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి"-(ఇల్లాలి గొప్పతనాన్ని వివరించే పాట)- "కన్నుల్లో మిసమిసలు కనిపించనీ" వంటివి, నేటికీ శ్రోతలకు ఆనందాన్ని పంచి పెడుతున్నాయి. వీటూరి 1984 లో మద్రాసులో కన్నుమూశారు.