
జానపద కవి రత్న, జానపద సిరి, "కొసరాజు రాఘవయ్య"

తెలుగంటే పెద్ద మోజు అని స్వయంగా ప్రకటించుకున్న వ్యక్తి కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. తెలుగు సినిమా పాటల (జానపద) రచయితగా పేరు పొందిన కొసరాజు గారు తెలుగు భాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి "సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగు కొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె...” అని తన భాషాభిమానాన్ని చాటుకున్న వ్యక్తి. రాఘవయ్య గా తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజు గారిది ప్రత్యేక స్థానం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మేళవించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య గారు రాయాలి - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది.
రాఘవయ్య గారు బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెం అనే గ్రామములో సుబ్బయ్య, లక్ష్మమ్మ దంపతులకు జూన్ 23, 1905లో జన్మించారు. అప్పికట్ల లో ఉన్న వీధి బడిలో నాలుగో తరగతి వరకు చదివి ఇంకా పై క్లాసులు లేకపోవటం వల్ల మళ్ళీ నాలుగో తరగతి చదివాను అని హాస్యంగా చెప్పేవారు. సహజంగా తప్పితే ఆ క్లాసు మళ్ళా చదువుతారు కానీ రాఘవయ్య గారు డబుల్ ఎమ్ ఎ లాగ డబుల్ 4 వ క్లాసు చదివినట్లు సరదాగా చెప్పేవారు. తన తల్లి, మేనమామ గొప్ప పండితులు అవటం వల్ల ఆ వంశంలో వున్న ఆ సాహితీరక్తం - రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు. అదే ఊర్లో కొండముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడు వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో రాముడి పాత్రధారి రాఘవయ్య గారి కంఠం లౌడ్ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు.
ఆ విధంగా పన్నెండో ఏటికే రాఘవయ్య గారు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించారు. బాలకవి అని బిరుదు పొందాడు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాపులర్ అయ్యారో, బాల్యదశలో ‘బాలకవి’ గా కూడా అంత పేరు పొందారు. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.
కొంత కాలము 'రైతు పత్రిక' కు జర్నలిస్ట్ గా ఉన్నాడు. ఆ సమయములోనే ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు, నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గార్లతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అయన సినిమా రంగ ప్రవేశానికి తోడ్పడింది. రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతుబిడ్డ (1939) అనే చిత్రములో నటించారు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి. ఎ. సుబ్బారావు, కె. వి. రెడ్డి, వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు.
జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చి పెట్టింది కొసరాజు రాఘవయ్య గారే. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా..’ అంటూ సేద్య గాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా, ‘రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని పండినాయి రామయ తండ్రీ…’ అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయా పాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని కూడా పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య గారే. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు. 1954లో విడుదలైన 'పెద్ద మనుషులు' చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి 'రాజు పేద' చిత్రంలో 'జేబులో బొమ్మ జేజేల బొమ్మ' బహుళ ప్రాచుర్యం చెందింది. 'ఇల్లరికంలో ఉన్న మజా' , 'అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే జేబులు ఖాళీ ఆయనే’ 'ముద్దబంతి పూలు బెట్టి' మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. అచ్చతెలుగు లోని అందాలు, జానపదుల భాష లోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి. జేబులో బొమ్మ, కళ్ళు తెరచి కనరా, ఏరువాక సాగారో, జయమ్ము నిశ్చయమ్మురా, వినరా వినరా నరుడా..., సరిగంచు చీరగట్టి... శివ గోవింద గోవింద, డబ్బులోనే ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడు చాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కలం నుండి జాలువారాయి.
‘సరదా సరదా సిగిరెట్టు’ పాటలో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్ద పెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వడం, సినిమాల్లో సిగరెట్ తాగడానికి గ్లామరైజ్ చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటం నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన జోక్ వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగులను తెచ్చిపెట్టింది. అలాగే పేకాట గురించిన పాట “అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెలవవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్. ఇలాంటిదే మరో పాట ‘ఇల్లరికం’ లో అల్లుడి మీద పాట “భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తి కోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాంటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచే వాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కని ప్రయోగం.
మరో పాట “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించడం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది. మొత్తం మీద ఇలాంటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచి చూపిస్తూ మరో వంక దురాచారాలను, దురలవాట్లను చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.
రాఘవయ్య గారు ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని రాఘవయ్య గారు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట. ఆ పుస్తకం చదివి, అందరూ 'మనకెందుకులే' అని వెనుకంజ వేశారుట - భయపడి. ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు మాత్రం 'నేను రాస్తాను' అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే 'ఆహా' అనే వారందరూ. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు. ‘రైతుబిడ్డ’ తర్వాత ఆయన స్వస్థలం వెళ్లిపోయి వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవారు. మళ్లీ పదమూడేళ్ల తర్వాత డి.వి. నరసరాజు గారి సూచనతో కె.వి. రెడ్డిగారు ‘పెద్దమనుషులు’ సినిమాకి పిలిచారు. అప్పట్నుంచి ‘సినిమాకవి’నే అయిపోయాను’ అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారాయన.
కొసరాజు రాఘవయ్య గారు ఫెళ్లుమని నవ్వితే, ఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి ఉండేది. నిత్యం రైతు వేషమే. తెల్లటి ఖద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్య భాషణతో కనిపించేవారు కొసరాజు గారు. ఆయనకు జానపద వరసలు తెలుసు కనుక, అలాంటి వరసల్లోనే పాటలు రాసి, తన వరసలోనే పాడితే, కొందరు సంగీతదర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దడం కూడా వుండేది. ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు వ్రాశాడు. కవిగా రాఘవయ్య 'గండికోట యుద్ధం' అనే ద్విపద కావ్యము, 'కడగండ్లు' అను పద్య సంకలనం వ్రాశాడు. 'కొసరాజు విసుర్లు', 'కొండవీటి చూపు', 'నవభారతం', 'భాను గీత' ఇతని ఇతర రచనలు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాఘవయ్య గారికి రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది. తెలుగు ప్రజానీకం 'కవి రత్న' 'జానపద కవి సార్వభౌమ' మున్నగు బిరుదులు ఇచ్చింది. కొసరాజు రాఘవయ్య చౌదరి గారు 1986 అక్టోబరు 27 రాత్రి పది గంటలకు మరణించారు కానీ ఆయన రాసిన పాటలు నేటికీ తెలుగు ప్రజానీకానికి వీనుల విందు చేస్తున్నాయి.