Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

దూబగుంట నారాయణ కవి

“ప్రపంచ కథా వాఙ్మయాన్ని సంపన్నం చేసిన భారతీయ నీతి కథల సంపుటం ఒకటి అత్యంత ప్రాచీన కాలం లోనే ప్రభవించినది.” అంటూ ఆరుద్ర దూబగుంట నారాయణ కవి అనువదించిన పంచతంత్ర కథల గూర్చి చెబుతూ ప్రారంభించారు.

తన కాలం నాటి కొన్ని నీతి కథలను, కొన్ని రంకు కథలను కూడా తీసుకొనో, కల్పించో విష్ణుశర్మ పంచతంత్రం అనే గ్రంథాన్ని రచించాడు అని ఆరుద్ర చెప్పారు. అది అతి త్వరలోనే బహుళ ప్రచారం పొందిందని చెప్పి పంచతంత్రానికి గల అనువాదాలను గూర్చి ఆరుద్ర వివరించాడు. అది క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

విష్ణుశర్మ క్రీ.శ మూడవ శతాబ్దం లో పంచతంత్రం సంస్కృతంలో రచించాడు.

క్రీ.శ. 531-597 మధ్య పారశీక దేశాన్ని పాలించిన ఖుస్రూ అనూషల్వాన్ కోరగా బర్గో అనే రాజవైద్యుడు పహ్లాలీ భాషలోకి అనువదించాడు. కానీ అది సాహిత్య లోకానికి దక్కలేదు.

కానీ దానిని ఆధారంగా చేసుకొని క్రీ.శ. ఆరవ శతాబ్దంలో సిరియన్ భాషలోకి అనువదించారు. ఆ గ్రంథం నేటికీ సురక్షితంగా ఉందని ఆరుద్ర సెలవిచ్చారు.

బెర్థో అనువాదాన్ని అనుసరించి క్రీ.శ.125 లో అబ్దుల్లా ఇబిన్ ఆర్మురప్పా అనే కవి అరేబియన్ భాషలోకి అనువదించాడు. ఆ గ్రంథం కవీలా-వా-దన్ను అన్న పేరుతో ప్రసిద్ధి పొందింది.

మిత్రభేదం అనే మొదటి తంత్రం లో ఉన్న కరటదమనకుల పేర్లే అరేబియన్ గ్రంథ నామాన్ని సగర్వంగా అలంకరిస్తున్నాయి అని అన్నారు ఆరుద్ర.

బహుమూద్ అనే రచయిత ఒక అరేబియన్ ప్రతికి ఉపోద్ఘాతము వ్రాస్తూ బీద్ఫా అనే ఋషి పంచతంత్రం రాసినట్లు తెల్పాడు. పాశ్చాత్య దేశంలో పంచతంత్రం అంటే బీద్ఫా నీతికథ అనే పేర విశేష ప్రజాదరణ పొందింది.

ముకఫ్సా వ్రాసిన గ్రంథం అచిరకాలం లోనే పర్షియన్, టర్కీ, మంగోల్, ఇథియోపియా భాషలలోకి పరివర్తన పొందిందని చెప్పారు ఆరుద్ర. 12 వ శతాబ్దం లో హిబ్రూ భాష లోకి, అటుపై లాటిన్ లోకి అనువదింపబడింది.

భారతీయ భాష లన్నింటికీ సంస్కృతం మూలభాష అయినట్లు యూరోప్ భాషలకు మూలమైన లాటిన్ నుంచి వివిధ భాషల వారు పంచతంత్రాన్ని అనువదించుకొన్నారని ఆరుద్ర వివరంగా వ్రాసారు(స.ఆం.సా. పేజీ 975).

ప్రొఫెసర్ జోహన్నేన్ తీవ్ర పరిశోధన చేసి పంచతంత్రం ఏయే భాషలలోకి అనువాదం ఎలా జరిగిందో తెల్పాడని, ఆయన లెక్క ప్రకారం 50 కన్నా ఎక్కువ ప్రపంచ భాషలలోకి 200 పైగా అనువాదాలు పంచతంత్రానికి జరిగినట్లు తేలిందన్నారు ఆరుద్ర.

క్రీ.శ. 13 వ శతాబ్దానికి ప్రపంచ భాషలలోకి అనువదింపబడిన పంచతంత్రం ఇంచుమించు అదే సమయంలో తెలుగు లోకి వచ్చిందన్నారు ఆరుద్ర. క్రీ.శ.13 శతాబ్ది వాడైన మడిక సింగన నాటికి ఒక పంచతంత్రం వెలుగు చూసింది. కానీ ఆ ప్రతి ఇప్పుడు లభింపలేదు. కానీ అందులోని 189 పద్యాలు మడిక సింగన తన ‘సకలనీతి సమ్మతం’ అన్న సంకలన గ్రంథంలో చేర్చడం వల్ల తెలుగులోకి తొలి పంచతంత్ర గ్రంథం యొక్క ఉనికి తెలిసిందన్నారు ఆరుద్ర.

తెలుగులో పంచతంత్రాన్ని సంపూర్ణంగా రచించిన వాడు దూబగుంట నారాయణ కవి. ఇతడు నెల్లూరు జిల్లా ఉదయగిరి దగ్గర ఉన్న దూబగుంట గ్రామ కరణంగా ఉండేవాడు. (క్రీ.శ 1470 ప్రాంతం) నెల్లూరు జిల్లాలో మూడు దూబగుంట గ్రామాలు ఉండేవి.

ఉదయగిరి దుర్గాన్ని పాలించిన బసవరాజుకు నారాయణ కవి తన పంచతంత్రాన్ని అంకితం ఇవ్వడం వల్ల నారాయణ కవిది ఉదయగిరి వద్దనున్న దూబగుంటేనని చెప్పవచ్చు అన్న ఆరుద్ర, కావలి-ఉదయగిరి మార్గంలో ఉన్న కనిగిరి గ్రామానికి దగ్గర ఉన్న దూబగుంట నారాయణ కవి నివాసమని ఇటీవల పరిశోధకులు భావిస్తున్నారని తెల్పారు.

నారాయణ కవి పంచతంత్రాన్ని అంకితం ఇచ్చిన బసవరాజు పూసపాటి వంశీయుడు. కటకం రాజధానిగా పాలించిన గజపతులకి యితడు సామంతుడు. ఈ వంశంలో ఇంకొక బసవరాజు కూడా ఉన్నాడని ఈ వంశం వారికి సహకార బాంధవ ఇత్యాది బిరుదులున్నట్లు వాటిని నారాయణ కవి తన రచనలో పేర్కొన్నట్లు ఆరుద్ర గారు తెల్పారు.

పంచతంత్ర రచన

బసవరాజు కోర్కెపై నారాయణ కవి పంచతంత్ర అనువాదానికి పూనుకొన్నాడు. మనం ముందు చెప్పుకొన్న తొలి తెలుగు అనువాద గ్రంథం పంచతంత్రాన్ని దూబగుంట నారాయణ కవి చూడలేదా? చూచి వుంటే తను బసవరాజు కోరడం వల్లే అనువాదం చేశాడా? అన్నది ప్రశ్న.

నారాయణ కవి కవిత్రయాన్ని మాత్రమె స్తుతించాడు. తన గురించి కూడా అట్టే చెప్పుకోలేదు. బసవరాజు నిండు కొలువులో కూర్చొని తనను పిలిపించినట్టే ఇలా చెప్పాడు.

హరిహర భక్తు నార్యసుతు నంధ్రకవిత్వవిశారదు మహీ
శ్వర పరమానవీయ గులవర్థను శాంతు బ్రబంధ వాచకా
భరణము నాగమాంబకును బ్రహ్మయమంత్రికి నాత్మసంభవున్
సరసుని దూబగుంట పురశాసను నారన నామదేయునికిన్ (రూ.పంచతంత్రం, 1-14)

ఈ పద్యం వల్ల కవి హరిహరుల భక్తుడని, తెలుగు కవిత్వ విశారదుడని తెలుస్తున్నది.

నారాయణ కవి నేర్పును గూర్చి చెబుతూ ఆరుద్ర ‘ఈ కవి నేర్పు అంతంత మాత్రమే’ అని అన్నారు. అలాగే టేకుమళ్ళ అచ్యుతరావు గారు కూడా ‘నారాయణ కవి సామాన్యుడే. భావ సంపుటి యందును, భావనావిసృతి యందును...గొప్ప పండితుడు అని చెప్పుటకు అవకాశము లేదు’ అన్నారని ఆరుద్ర తెల్పారు.

నారాయణ కవి మూల విధేయత ఎక్కువగా పాటించడం వల్ల ఆయన రచనా విధానం ముక్తసరిగా కనపడుతుందన్నారు ఆరుద్ర. పంచాతంత్రానువాదం చేసిన ఒక 15 మంది తెలుగు కవుల అనువాదాలను పట్టికగా ఇచ్చారు ఆరుద్ర. అందులో కొందరిని ప్రస్తావించి, నారాయణ కవి చక్కగానే అనువదించినా మడిక సింగన తన ‘సకలనీతి సమ్మతమ’నే సంకలన గ్రంథంలోని తొలి పంచతంత్ర అనువాద కర్తతో పోల్చి చూస్తే తొలి కవి రచనే ఇంపుగా ఉన్నట్లు అనిపిస్తుంది అని అన్నారు ఆరుద్ర. ఆరుద్ర అలా చెప్పి పోల్చి చూపించారు.

రాజులు భ్రుత్యులను వారి వారి యోగ్యతను బట్టి ఎక్కడ నిలపాలో చెప్పే సందర్భంలో ఇరువురి రచనలను ఆరుద్ర పోల్చి చూపించాడు.

నరపతి భ్రుత్యుల దొడవుల నొరసి తగిన నెలవులందు నునుపక యున్నన్
జరణంబున చూడామణి శిరమున నందియము బెట్టు చెలువముగాదే!
కుందనము కూర్ప నర్హమై యందపడిన పృధులరత్నంబు వెండిలో బెట్టెనేని
రత్నమున కేమి కొరయగు రాజు బంటు దగిన పని బెట్టకుండిన తగవుకాదె? (దూబగుంట 1-132-33)

ఇవే పద్యాలను ప్రథమ కవి ఎలా అనువదించాడో చూడండి.

అధికుడైన వాని నతినీచతరమైన – యట్టిపదవి దెచ్చి పెట్టుటెల్ల
వర్ణనీయమైన నరశిరోరత్నంబు – కాలగట్టినట్లు కాదె తలప
తగిన పదంబునం దిడెడు దక్షత రాజున కుండుగాక యీ
జగమున - నీతిమంతుడన జాలిన సేవకు డుండకుండునే
తగరముమీద దెచ్చి నిరతంబగ రత్నము గీలుకొల్పగా
వగుచునే రత్న మట్టిపనివానిది దోషముగాక యూరయన్? (సకలనీతి సమ్మతం, 210-211)

నారాయణ కవి రచనను గూర్చి చెబుతూ ఆరుద్ర “కథ నడపడంలో కుంటుతాడు. నీతులు మాత్రం చక్కగా పద్యరూపంలో పడతాడు” అన్నాడు. భానుకవి అనే కవి నారాయణ కవి పద్యాలు కొన్ని కొంత మార్పు చేసి తన పంచతంత్రం లో వాడుకొన్నట్లు ఆరుద్ర తెల్పారు. నారాయణ కవి రచనలు బాల వ్యాకరణం లోని సూత్రాలకు కొంత విరుద్ధంగా ఉన్నట్లు ఆరుద్ర తెల్పారు.

చివరగా దూబగుంట నారాయణ కవి గురించి ఆరుద్ర గారి అభిప్రాయం;

ప్రపంచ సాహిత్యాన్ని శ్రీమంతం చేసిన పంచతంత్రాన్ని తర్జుమా చేసి యధాశక్తి మన సాహిత్యాన్ని పెంపొందించిన అనువాదకులలో సంపూర్ణ గ్రంథం దొరికిన మొదటి వాడుగా నారాయణ కవి తెలుగు వాళ్లకు చిరస్మరణీయుడు.

**** సశేషం ****

Posted in November 2025, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *