కూచిరాజు ఎర్రన్న
పురుషార్థాలలో మూడవది కామం. ఈ విభాగానికి సంబంధించిన వాత్సాయన కామసూత్రాలు జగత్ప్రసిద్ధమైన గ్రంథం. సంస్కృత వాఙ్మయం లో ఈ శాఖకు సంబంధించి ఈ గ్రంథం ప్రాచీనమైనది. ఇతడు (వాత్సాయనుడు) క్రీ.పూ. 150 సం||ల ప్రాంతము వాడై పతంజలికి ఇంచుమించు సమకాలీనుడు అని పండితుల అభిప్రాయం.
అయితే ఇంత ప్రాచీన ప్రాశస్త్యత కలిగిన వాత్సాయన కామసూత్రాలకు కాక కొక్కోకము అనే కామ శాస్త్ర గ్రంథానికి ఆంధ్రదేశం లో ప్రశస్తి వచ్చింది. పంచ కావ్యాలకు వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథసూరి కూడా కొక్కోకము నుండి ఉదాహరణలు ఇచ్చాడు. క్రీ.శ. 1450-1500 ప్రాంతపు వాడైన కూచిరాజు ఎర్రన్న కొక్కోకాన్ని తెనిగించాడు. తెలుగులో మనకు దొరుకుతున్న కామ శాస్త్ర గ్రంథాలలో ఇది మొదటిది అని ఆరుద్ర ఇచ్చిన కామశాస్త్ర గ్రంథ విషయాలను గూర్చి ఇచ్చిన వివరణ. కొక్కోకాన్ని ఎందుకు ఆంధ్రులు ఆదరించారు? అన్న ప్రశ్నకు ఆరుద్ర ఇలా వివరించారు.
“కొక్కోకాన్ని మన వాళ్ళు అనువదించడానికి సామాజిక పరిస్థితులే కారణం. వాత్సాయనుడు “ధర్మార్థ కామేమోభ్యో నమః” అని తన గ్రంథాన్ని మొదలుపెట్టాడు. అతనిది మడి గట్టుకున్న కామశాస్త్రం. కొక్కోక పండితుడు కామశాస్త్ర ప్రయోజనాన్ని ఎత్తుకుంటూనే తెల్పాడు” అని ఆరుద్ర కొక్కోకం నుండి ఒక శ్లోకాన్ని దానికి కూచిరాజు ఎర్రన్న గారి అనువాదాన్ని ఇచ్చాడు.
“అపాధ్యాయా స్సుంసిద్ధి...” అనే కొక్కోక శ్లోకానికి
“తన కసాధ్యమయిన తరుణి సాధించుట
దొరకనేని తన్ను మరగికొనుట ...” అంటూ అనువదించాడని తెల్పి, అసాధ్యమయిన ఆడవాళ్ళను వశపరచుకోవడానికి చిట్కాలు చెప్పిన కొక్కోకం అధిక ప్రచారం పొందడంలో ఆశ్చర్యం లేదు అన్నారు ఆరుద్ర.
కొక్కోకం పండితుడు జాత్యాధికారం మొదలైన పేర్లతో 15 ప్రకరణాలు గా రచించాడు. కానీ కూచిరాజు ఎర్రన్న మూడు ప్రకరణాలే అనువదించాడు.
ఆడ, మగ ఎవరిలోనైనా ఉన్న పద్మినీ జాతి మొదలైన బేధాలను వివరించాడు. మూడవ ఆశ్వాసం లో వశపరచుకొనే మంత్రాలు, మూలికలు మొదలైనవి చెప్పబడ్డాయి.
ఎర్రన్న ఎటువంటి ప్రణాళిక ఏర్పరుచుకోలేదనీ, ఆయన తన రచనతో ఆంధ్రదేశం లో విజయభేరి మోగించిన తరువాత దేశంలో పరిస్థితులు ఎలా మారిపోయాయో వివరిస్తూ పంచాగ్నుల వారు వివరించిన వివరణ ను ఆరుద్ర గుర్తుచేశారు.
పంచాగ్నుల వారి మాటలు క్లుప్తంగా:
“సరే ఇకనేమున్నది. క్రొత్త ఒక వింత పాత ఒక రోత.....మహా మాహాధ్యాయులందరునూ నాడు మొదలుకొని కొక్కోకుని త్రోవ తొక్కినారు. దానితో ఎవ్వరే గ్రంథము చేసిననూ జాత్యాధికారం, బంధాదికారము... మొదలగునవి అనివారితముగా ప్రారంభింప బడినవి...” ఈ విధంగా కొక్కోకము గూర్చి పంచాగ్నుల వారి వివరణ సాగింది.
మంత్రాలతో మగువలను వశపరచుకోవచ్చునని కొక్కోకములో ఉన్న ఒక పద్యం ఆరుద్ర ఉదహరించాడు. ఆ పద్యం;
వెర్రి యెత్తినట్టి నేపి దక్షిణదిక్కునెముక మీద నొక్క యింతిపేరు
వ్రాసి ప్రేతభూమి వహ్నిచే గాల్చంగ – వలచివచ్చు నెట్టి వనితయైన (కొక్కోకము 3-23)
ఈ పద్యం యొక్క అర్థం – పిచ్చికుక్క ఎడమ ప్రక్కటెముకకు అనుకొన్న స్త్రీ పేరు రాసి వల్లకాటిలో ఆ కుక్కను తగలబెడితే ఆ స్రీ వశమౌతుంది.
ఇలా అర్థం లేని పద్యాలకు నాడు ఎందుకు ఆదరణ లభించిందో నాకైతే బోధపడలేదు. అదే మాటను ఆరుద్ర అంటూ ‘నాడే కాదు ఈ ఇరవయ్యో శతాబ్దంలో కూడా ఇటువంటి చిట్కాలు ఇస్తే నమ్మే వాళ్ళుంటారు. ఈ మంత్రాలు, తంత్రాలు చెప్పేవాళ్లకు దండం పెడతారు’ అని అన్నారు.
కూచిరాజు ఎర్రన్న కు మరొక పేరున్నది. అది రాచ రామన. నవఘంటా సుత్రాముడు అనే బిరుదు కూడా ఉన్నది. ఇతడు అష్ట భాషా ప్రవీణుడు. అవధాని. క్రీ.శ. 1468-97 ప్రాంతాలలో పురుషోత్తమ గజపతి పాలనలో ఆంధ్రప్రదేశ్ లోని వినుకొండ దుర్గాన్ని ఏలుతున్న కుంటముక్కల మల్లమంత్రి కూచిరాజు ఎర్రన్నను పిలిపించి ఆయన వ్రాసిన కొక్కోకాన్ని అంకితమివ్వమనగా ఎర్రన్న అతనికి తన గ్రంథం అంకితం చేశాడు.
కూచిరాజు ఎర్రన్న అనువాదాన్ని గూర్చి చెబుతూ పంచాగ్నుల వారు ఎర్రన్న ఆంధ్రీకరణము భార ప్రధానమైనదని చెప్పి ప్రతిపదార్థ పరిపాటిని పాటించాడన్నారు. ఇతని నాయికలు అందరూ వేశ్యలేనని అనిపిస్తుందన్నారు.
ఆరుద్ర దీనిని గూర్చి చెబుతూ, కూచిరాజు ఎర్రన్న పతివ్రతల లక్షణాలను కూడా తెల్పాడని చెప్పాడు. గృహిణులు ఇంట్లో పనులతో కసువు, కట్టెలు మొదలైన వాటితో మునిగి ఉన్నప్పటికీ భర్తతో ఎలా సుఖంగా ఉండాలో చెప్పే పద్యం – పూవుదోటల వృక్షవాటికలలో పూబోడి సంభావింపన్... అని ఉదహరించాడు. అలాగే ఇల్లాళ్లు ఎవరెవరితో సంభాషించకూడదో కూడా చెప్పాడు ఎర్రన్న. పడకగదిలో ఎలా ఉండాలో చెప్తూ..”పట్టె మంచము దూది పరుపు ముక్కాల్పీట యగురు ధూపము దివ్వె పూలు గంథము గంధపు పొడి పున్గుబరిణయ....”(కొక్కోకము 2-2) ఇలా చాలానే ఎర్రన్న చెప్పాడని ఆరుద్ర అన్నారు. ఇలాంటి కేళికా గృహాలు కేవలం ధనవంతులకు మాత్రమె ఉంటాయి. కొక్కోకం అంకితం పుచ్చుకున్న కుంటముక్కల మల్లమంత్రి మంచి ధనవంతుడు అని ఆరుద్ర చెప్పారు.
ఈ మల్లమంత్రి కీర్తి, కటకం, డిల్లీ, గుల్బర్గా వరకూ పాకింది. ఇతనికి కటకం గజపతులు మహాపాత్ర బిరుదుతో గౌరవించారు. గుల్బర్గా ఆశ్వపతుల దండనాధుడు జమాఖాను వినుకొండ దుర్గాధిపత్యాన్ని మల్లమంత్రికి ఇచ్చాడు. ఈ విషయాలన్నీ ‘హరిపద ధ్యానసురుడు...అన్న పద్యంలో (కొక్కోకము 1-18) కూచిరాజు ఎర్రన్న తెల్పాడని ఆరుద్ర తెల్పారు. ఈ పద్యం చివరి పాదాలలో మల్లమంత్రి వంశక్రమం వివరింపబడింది.
మల్లమంత్రి అన్న కొడుకు చిన భైరవ మంత్రి. యితడు కూడా గజపతుల కొలువులో ఉండి కొండపల్లి దుర్గానికి ఏలిక అయినాడు. ఇతడు కూచిరాజు ఎర్రన్న రాసిన పురాణసారం అనే గ్రంథాన్ని అంకితం పుచ్చుకొన్నాడు.
ఇతడు ఎర్రన్నను ఒక కోరిక కోరాడు. తనకు కలియుగ భూపాలుర కథలన్నీ వినాలని ఉంది. ఆ కథలు వ్రాసి ఆంధ్రకావ్యం అనే పేరు పెట్టి దానిని తన ఇష్టదైవం కలియుగ దైవమైన తిరుపతి వేంకటేశ్వరునికి అంకితమియ్యమని ఎర్రన్నను కోరాడు. ఎర్రన్న అందుకు అంగీకరించి ‘సకలనీతి కథా విధానము’ అనే పేరున ఒక గ్రంథం అయిదు ఆశ్వాసలలో వ్రాశాడు. ఇందులో 1662 గద్యపద్యాలున్నాయి.
ఈ సకలనీతి కథా విధానంలో ఎర్రన్న ఒక పుక్కిటి పురాణం కల్పించి నారదుడు బలిచక్రవర్తికి ఈ కథలు చెప్పినట్లు వ్రాసాడని ఆరుద్ర తెల్పారు.
విక్రమార్క చరిత్ర, భేతాళ పంచవింశతి, పంచతంత్రం మొదలైన వాడుకలో ఉన్న తెలుగు కథలనే తిరిగి చెప్పాడన్నారు ఆరుద్ర.
ఎర్రన్న ఈ కథలన్నీ ఒక్కొక్కటి ఎన్ని గద్యపద్యాలలో వివరించింది ఆరుద్ర లెక్కగట్టి చెప్పారు. కేయూర బాహు చరిత్రలో మంచెన ఒక కథను 12 గద్యపద్యాలలో వివరించగా అదే కథను కూచిరాజు ఎర్రన్న ఒక్క పద్యంలో ముగించాడని తెల్పారు ఆరుద్ర (స.ఆం.సా. పేజీ 964).
దీనిని గూర్చి చెబుతూ ఆరుద్ర, ఇలా వ్రాస్తే రసము, పాత్రపోషణ, సంభాషణలు ఏవీ సంతృప్తిగా ఉండవని చెప్పి ఇలా అభిప్రాయపడ్డారు. “ఈ సకలనీతి కథా విధానము వాస్తవానికి బోలెడు కథల అస్పష్ట రేఖా చిత్రాలని చెప్పవచ్చు. కొక్కోకం వంటి బూతు శాస్త్రమే కాకుండా ఇలాంటి నీతుల గ్రంథం కూడా వ్రాయగలనని ఎర్రన్న చెప్పుకోడానికే ఇది వ్రాసాడేమో” అని అన్నారు ఆరుద్ర. ఎర్రన్న భాష కూడా మృదువుగా లేదని భోజరాజు భార్యలను గూర్చి ‘ముండలు, రండలు’ అనే పదాల ప్రయోగం అనుచితంగా ఉందన్నారు ఆరుద్ర.
పంచతంత్రాన్ని ఎర్రన్న మార్చేశాడని, ఇతరులను అనుకరించిన విషయం గుర్తు చేశారు అరుద్ర. “తేలునకు తోక విషమగు...” అన్న పద్యం “తలనుండు విషము ఫణికిని...”అన్న సుమతి పద్యానికి అనుకరణ అన్నారు ఆరుద్ర.
మొత్తం మీద ఆరుద్ర కూచిరాజు ఎర్రన్న రచనలను కాచి వడబోసి ఓపికగా సమీక్షించారు. ఎర్రన్న వ్రాసిన ‘సకల కథా విధానము’ దొరకలేదు కానీ కొక్కోకము మాత్రం ఆంధ్రదేశం అంతటా వందలకొద్దీ ఉన్నాయన్న పంచాగ్నుల వారి మాట చెప్పి “ఇంత ప్రచారం అన్ని గ్రంథాలకు రాదు. అది ఒక వరమే.” అని అన్నారు ఆరుద్ర.