Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
కపిలేశ్వరుడు – గజపతుల యుగం (క్రీ.శ. 1434-68)

కపిలేశ్వరుడు గోదావరి దాకా రాజ్యవిస్తరణ చేసిన తర్వాత అటు కృష్ణానది దాకా విస్తరింపజేసి అద్దంకి, వినుకొండ, కొండవీడు, గజపతుల ఏలుబడిలోకి తెచ్చాడు.

గుణ దేవుడు అనే సర్దారును అక్కడ రాజప్రతినిధిగా, పరీక్షగా నియమించాడు. గజపతులు తమ గవర్నరులను ‘పరిక్ష’ అనేవారు.

గొప్ప సైన్యాధిపతులు

కపిలేశ్వరుని సైన్యంలో గొప్ప సైన్యాధిపతులున్నారు. పూసపాటి తిమ్మభూపతి గజపతుల కొరకు బెల్లంకొండ, వాడపల్లి, రంగరాజు కొండ లను సాధించాడు. క్రీ.శ.1468 నాటికి తిమ్మ భూపతి ఉదయగిరిని గెలిచి గజపతులకిచ్చాడు. కపిలేశ్వరుడు తిమ్మభూపతి ని ఉదయగిరికి అధిపతిగా నియమించాడు. పూసపాటి వారే ఉదయగిరిని పాలించి చక్కటి సాహిత్య పోషణ కూడా చేశారు.

కపిలేశ్వరుడు తన రాజ్యవిస్తరణ కోసం తెలంగాణా వైపు చూపు సారించాడు. బహుమనీ సుల్తానులను జయించి దేవరకొండను గెల్చాడు. గజపతుల రాజ్యంలో తెలంగాణా ఒక భాగమైనది.

అటు తర్వాత గజపతుల సైన్యం విజయనగరం నరపతుల రాజ్యాన్ని కూడా జయించింది. క్రీ.శ. 1458 నాటికి హంపి, ధారా, కలుబరుగ, డిల్లీ లను గజపతులు గజగజ లాడించినట్లు ‘కపిలేశ్వర ప్రసస్తి’ లోని శ్లోకాలు చెప్తున్నాయి. (స.ఆం.సా. -పేజీ 800).

దీనితో కపిలేశ్వరునికి ఉన్న బిరుదులలో ‘నవకోటి కర్ణాటేశ్వరా’ బిరుదు కూడా చేరింది. గజపతుల సేనలు తిరువానూరు తిరుచునాపల్లి దాకా దక్షినాపధాన్నంతా జయించాయి.

కపిలేశ్వరుడు తన మనుమడైన దక్షిణా కపిలేశ్వరుని ఈ ప్రాంతాల ‘పరిక్ష’ (గవర్నర్) గా నియమించాడు. దక్షిణాదేశపు కవితలలో శాసనాలలో ఈ గజపతుల తుళ్లును ‘ఒడ్డియన్ గలబై’ అని పేర్కొన్నారని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. -పేజీ 800-01).

గజపతుల దండయాత్రల వల్ల దేశం అల్లాడి పోయిందని దేవాలయాలలో అర్చనలు కూడా స్థభించి పోయాయని అయినా రాజ్యవిస్తరణ ఆగలేదని తెల్పారు ఆరుద్ర. తత్పలితంగా కొండపల్లి, అద్దంకి, తెలంగాణా, ఉదయగిరి, చంద్రగిరి, తిరువాయూరు, తిరుచునాపల్లి మొదలైన రాజ్యాలను గెలిచి కపిలేశ్వరుడు “గజపతి గాడేశ్వ నవకోటి కర్ణాట కలుబరంగేశ్వర” అనే బిరుదు ధరించి ఉత్తరాన గంగానది మొదలు దక్షిణాన కావేరీ వరకు తన సామ్రాజ్యాన్ని స్థాపించి కపిలేశ్వరుడు సార్వభౌముడయ్యాడు.

కపిలేశ్వరునికి పదునెనిమిది (18) మంది కుమారులు. కానీ వీరందరిలో చిన్న కొడుకైన పురుషోత్తముడిని ఒక్కడినే తన వారసునిగా కపిలేశ్వరుడు ప్రకటించడంతో హంవీరుడు అతని కొడుకు దక్షిణ కపిలేశ్వరుడు తిరగబడ్డారు. కృష్ణానది తీర అధికారం చేజిక్కుంచుకోగా కపిలేశ్వరుడు వచ్చి తిరుగుబాటును అణిచి, పుసుషోత్తమ గజపతికి పట్టం కట్టి కపిలేశ్వరుడు కృష్ణా తీరంలోనే కాలం చేశాడు.

పురుషోత్తముడు విద్యావంతుడు. కవి. ఇతని కాలంలో రాజ్యం తరుగుతూ పెరుగుతూ వచ్చింది. ఇతని తర్వాత ఇతని కుమారుడు ప్రతాపరుద్రుడు (క్రీ.శ.1497-1538) రాజయినాడు. ఇతని కాలంలోనే కృష్ణరాయలు దండెత్తి గజపతులను జయించాడు. అందాకా సుమారు వంద సంవత్సరాలు యావదాంధ్ర పై గజపతుల ప్రభావం గట్టిగా ఉంది అని ఆరుద్ర వివరించారు.

తెలుగు దేశ చరిత్రలో గజపతులే గాక ఆశ్వపతులు, వరపతులు కూడా ప్రసిద్ధులే అన్నారు ఆరుద్ర. ఆశ్వపతులు అనగా బహుమనీ రాజ్యాన్ని పాలించిన తురుష్క పాలకులు. వరపతులంటే విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మహారాజులు.

క్రీ.శ. 15, 16 శతాబ్దాల చరిత్రలో ఈ మూడు వంశాల రాజకీయ గాథలు ముప్పేటలుగా అల్లుకొని ఉంటాయని ఆరుద్ర ఆ అల్లిక వివరించారు.

గజపతులలో చివరివాడైన ప్రతాపరుద్ర గజపతి కుమార్తెను కృష్ణదేవరాయలు వివాహం చేసుకొన్నారు. అంతేగాక కృష్ణదేవరాయలు గజపతుల ఆస్థానంలో ఉన్న ప్రముఖ పండితులను ఆదరించి తనతో తీసుకొని పోయాడు. అందులో ముఖ్యులు లక్ష్మీధరుడు, దివాకరుడు. లక్ష్మీధరుడు మహా మహోపాధ్యాయ బిరుదాంకితుడు. యితడు ఆది శంకరుల సౌందర్యలహరికి వ్యాఖ్యానం మరియు సరస్వతీ విలాసం అనే ధర్మ శాస్త్ర గ్రంథం రచించి గజపతి పేర ప్రకటించాడు. ఈ లక్ష్మీధరుని పూర్వులు ఏడు పురుషాంతరాలు (వంశాలు) మహా పండితులు అని తెల్పిన ఆరుద్ర ఆ ఏడుగురి పాండిత్యాదులను వరుసగా వివరించారు. ఈ విధంగా వివరణలనివ్వడం ఆరుద్రకే చెల్లుతుంది.

పురుషోత్తమ గజపతి, ఆయన కుమారుడు ప్రతాపరుద్ర గజపతి గొప్ప విద్వాంసులు, బహు గ్రంథ కర్తలు. రెడ్డి రాజులు మొదలైన వారివలె గజపతులు సంస్కృత భాషను పోషించి అందులోనే గ్రంథాలు వ్రాసి వన్నెకెక్కారు.

గజపతుల కాలంలో ఒరియా భాషలో సాహిత్యం ప్రారంభమై భారతాదుల అనువాదం ఒరియా భాషలో జరిగింది. ఒరియా భాషలో భాగవతాన్ని అనువాదం చేసినవాడు జగన్నాధదాసు. ఇతడు చైతన్య ప్రభువునకు మంచి మిత్రుడు. ‘అతి బడా’ అనే బిరుదును చైతన్యుడు తన మిత్రునకు ఇచ్చాడు.

గజపతులు సంస్కృత ఓడ్ర భాషలను పోషించారు. తెలుగును వారు పోషించలేదు. కానీ వారి సామంతులు మాత్రం తెలుగు కవులను ఆదరించారు.

తెలుగులో పోతన భాగవతం వలె జగన్నాధ దాసు గారి భాగవతాన్ని గ్రామీణ ప్రజలు ‘భాగవత ఘర్’ అనే ప్రార్ధనా మందిరం లో గానం చేసేవారట అంటూ ఆరుద్ర తెలిపారు.

ఒరిస్సా ప్రాంత ప్రజల నైతిక విలువలను పెంచడానికి ఈ కావ్యమే కారణం అని తెల్పారు ఆరుద్ర. భాగవత పఠనం వల్ల ఒరిస్సా ప్రాంత ప్రజలలో అక్షరాస్యత కూడా అభివృద్ధి చెందింది.

తమ 120 సంవత్సరాల పాలనలో గజపతులు తెలుగు దేశానికి ఇచ్చిన సాంస్కృతిక వారసత్వం గూర్చి తెలుసుకోవడం ముఖ్యం.

పోతన భాగవతంలో కృష్ణుని ప్రియురాలిగా రాధ ప్రసక్తి లేదు. కటక గజపతుల వల్ల తెలుగుదేశంలో రాధా మాధవ శృంగారం అడుగుపెట్టింది. అంతకు ముందు లేదు. పోతన రాధను గూర్చి వ్రాయక పోయినా ఆయన సమకాలికుడైన శ్రీనాథుడు తన భీమఖండం లో (భీమ 1-31) రాధా మాధవ శృంగారాన్ని ఆంధ్ర సాహిత్యంలో తొలిసారిగా కీర్తించాడని ఆరుద్ర గుర్తు చేశారు.(స.ఆం.సా. పేజీ 804).

**** సశేషం ****

Posted in May 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!