తెలుగు జాతి ప్రాభవం, తెలుగు భాష గొప్పతనం, తెలుగు సంస్కృతి, సంప్రదాయ విలువలను ఎంతో మంది మహానుభావులు తర తరాలకు పంచిపెట్టారు. నేటికీ, తెలుగు వెలుగులను, విలువలను, అత్యంత సులభశైలిలో తమ అమూల్యమైన రచనల ద్వారా మనకు నిత్యం తెలిసేటట్లు చేస్తున్నారు. తమ రచనల ద్వారా కొంతమంది బాగా ప్రాచుర్యం పొందారు. మరికొంత మంది వారి గురించి ప్రపంచం గుర్తించినా, గుర్తించక పోయినా తెలుగు ప్రాచుర్యాన్ని మాత్రం నలుదిశలా వ్యాపింపజేస్తూ తమ వంతు కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. వారికి గుర్తింపు, పురస్కారాల రూపంలో లభించినను అంతగా ప్రజల దృష్టిలో ప్రసిద్ధులు కాలేదు. అయినను వారి రచనల ద్వారా సమాజంలో ఉన్నతమైన చైతన్యాన్ని తీసుకొని వచ్చారు. అటువంటి వారిలో సౌమ్యశీలి, నిరాడంబరుడు, గాంధేయవాది, తెలుగు రైతుబిడ్డ, ఆధునిక పద్య కవుల్లో అన్నింటా ముందుండి తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి, అభినవ తిక్కన బిరుదాంకితుడు అయిన శ్రీ తుమ్మల సీతారామమూర్తి నేటి మన ఆదర్శమూర్తి.
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో, డిసెంబర్ 25, 1901 న చెంచమాంబ, నారయ్య దంపతులకు సీతారామమూర్తి గారు జన్మించారు. బాల్యం నుండే చదువుమీద ఎంతో ఆసక్తి కలిగి ఉండటమే కాకుండా సాహిత్యం మీద మక్కువ కలిగి ఉండేవారు. ఆంద్ర విశ్వవిద్యాలయం నుండి ప్రథమశ్రేణిలో ఉభయభాషాప్రవీణ పట్టాను కూడా పొందారు. ఆ క్రమంలోనే బోధనా వృత్తిని ఎంచుకొని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే గిరికా పరిణయము, హనుమద్విజయము, పురాంతక శతకము, రామశతకము, రామలింగేశ్వర శతకము వంటి కృతులను రచించి నాటి సమకాలీన కవుల దృష్టిని ఆకర్షించారు. మన తెలుగు సాహిత్యంలో విరిసిన ఖండకావ్యాలు, సామాజిక కావ్యాలు, స్మృతికావ్యాలు, స్వీయచరిత్ర కావ్యాలు ఇలా అన్ని కావ్య పద్ధతులలోనూ రచనలు చేసి తన ముద్రను చూపారు.
కాల్పనికవాదం, మానవీయత, దేశభక్తి అనే మూడు ప్రధాన అంశాలతో సీతారామ మూర్తి గారు తన రచనలను కొనసాగించారు. కానీ, నాటి సామాజిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఆయన స్పృశించని అంశం అంటూ ఏదీ లేదు. అయితే ఆయన ఏనాడూ శృంగార రచనల జోలికి పోలేదు. సమాజాన్ని ప్రభావితం చేస్తూ మానవతావాదాన్ని ప్రతిబింబించే అంశాలను ఆయన రచనలలో చూడవచ్చు. అనేక నాటకాలు, హరికథలు కూడా రచించారు. తనకు యుక్త వయస్సు వచ్చేసరికి స్వాతంత్ర్య ఉద్యమం గాంధీగారి అధ్వర్యంలో అహింసే ఆయుధంగా ఉధృతంగా కొనసాగుతున్నది. మూర్తి గారు కూడా గాంధీజీ గారి సిద్ధాంతాలకు ప్రభావితుడై తానూ స్వాతంత్ర సమరంలో పాల్గొని తన రచనల ద్వారా దేశభక్తి తత్వాన్ని ప్రజల లోకి తీసుకెళ్ళాడు.
స్వాతంత్రం సిద్ధించిన తరువాత తన వృత్తినే కొనసాగిస్తూ, అనేక రచనలు చేశారు. ఆయన ప్రతిభను గుర్తించి నాగార్జున విశ్వవిద్యాలయము ఆయనను "డాక్టర్ ఆఫ్ లెటర్స్"(డి.లిట్) తో గౌరవించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయము "కళాప్రపూర్ణ" బిరుదుతో సత్కరించింది. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానము కూడా ఆయనను వరించింది. ఇటువంటి బిరుదులు, సన్మానాలు లెక్కలేనన్ని ఆయన రచనా జీవితంలో లభించాయి. కానీ ఎన్నడూ తన నిరాడంబర తత్వాన్ని ఆయన విడనాడలేదు.
రైతుగా పుట్టి, తెలుగు కావ్య జగత్తులో వెలుగొంది, తెలుగు సాహిత్య ప్రపంచంలో తన వంతు కృషిని అందించి, గాంధేయవాదిగా, దేశభక్తుడిగా తెలుగు ప్రజల గుండెలలో స్వాతంత్ర జ్యోతిని రగిలించిన తుమ్మల సీతారామమూర్తి గారు 1990 మార్చి 21న స్వర్గస్తులైనారు.