ఉత్పలమాలామాలిక
కన్నులు రెండు జాలవుగ కాంచగ నీ ఫలపుష్పసేవ నో
అన్నులమిన్న! వెంకటనగాధిపుభామిని! విశ్వమాత! నీ
కన్న శుభంకరాకృతిని గాన దరంబె? తరించి మేని పై
క్రన్నన జాఱు తేనియకు రమ్యత నా మధుబీజబీజముల్(1)
చెన్నుగ గూర్ప గెంపులయి క్షీరఘృతామృతశ్రీఘనంబు (2)లే
మన్నన నొందు నీ 'స్నపన మంజన' దృశ్యము మాటిమాటికిన్
కన్నులముందు నిల్చునదె కాంచనప్రస్తర(3)మౌక్తికద్యుతుల్
వన్నియవెట్ట నన్ని దిశలన్ గనుపట్టు దినేశ చంద్రులన్
పన్నగతల్పునేత్రయుగభావన జేసి ప్రహృష్ట(4)చిత్తయై
సన్నగ జూచు తల్లికనుసన్నల లోకము లేలుగా యనన్
సన్నిధి నిల్చి చూచు జనసాగరమున్ దన పుట్టినింటిగా
నెన్ను సుధామయాక్షి జగదేకమనోహరమూర్తియైన యా
పెన్నిధి సామజార్చిత ద్రివిష్టపనాథకృతస్తవన్ సదా
వెన్నుని వీడ కుండు సతి విశ్వజనీనముఖాంబుజాత నా
పన్నుల వెన్నుదట్టి భయవారణ సేసి తరింప జేయు మా
త న్నిగమాంతవేద్యగుణ దామరసాంచితపాణి నేలకుల్
పొన్నరి(5)మాలగా వెలయ ముద్దగు 'నంజురు'(6)వేణి తోడ నా
అన్నమయాంతరంగమున నన్నివిధంబుల గోచరెంచి ప్రే
మ న్నయగారముల్ గను సమగ్రమహాద్భుతభాగ్య మిచ్చితా
నెన్నికృతుల్ రచించినను దృప్తిని జెందక వేనవేలు చే
కొన్న సనాతనిన్ దివిజకోటులు గొల్చి తరించు సంబరం
బన్న నిదే భువిన్ విధి స్వయంబుగ బాల్గొను నుత్సవంబు దీ
ని న్నయనోద్ఘ(7)భాగ్యముగ నిత్యము జూచు వరంబు నీయగా
సన్నుతిసేసి వేడెద బ్రసన్నముఖిన్ సరసీరుహాలయన్
(1) దానిమ్మపండు గింజలు (2) పెరుఁగు (3) రత్నము (4) సంతోషించిన
(5) మనోజ్ఞము (6) ఒకరకమైన ఎండుపండు (7) శ్రేష్ఠము