శ్రీ నీలం సంజీవరెడ్డి గారి యాభైయవ జన్మదినం సందర్భంగా మే 19,1963న శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతిలోని తన సంపాదకీయంలో సంజీవరెడ్డి గారి గుణగణాలలో ప్రత్యేకంగా ఎన్నదగినట్టిది నిర్భీతి అని ప్రశంసిస్తూ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా లేకపోయినా, ఆయన ఆంధ్రప్రదేదేశం లోనే కాదు, దక్షిణాపథంలోనే కాదు, యావద్భారతంలోనే ముఖ్యనాయకులు అని కొనియాడుతూ - తనదైన శైలిలో ప్రజాస్వామ్యంలోని రాజకీయ నాయకులకు కరదీపికలు అనదగ్గ మాటలు రాశారు.
“కత్తి మీద సాము వంటిది ప్రజాస్వామ్యంలో నాయకత్వం. ప్రజలు వెంట వస్తున్నారో, లేదో చూసుకొనకుండా తాను ముందుకు సాగిపోరాదు. అంతమాత్రాన నడకలో తాను ప్రజలకు వెనుకబడరాదు కూడా. వారితో అడుగు కలుపుతూ, ఎప్పటికప్పుడు ఒకటి, రెండు అడుగులు మాత్రం ముందుకు ఉండాలి.
ప్రజల మన్నన కోసం పార్టీని బలహీన పడనివ్వరాదు, పార్టీకోసం ప్రజల యోగక్షేమాలకు విరుద్ధంగా కూడా వెళ్లరాదు.
పార్టీలో సర్వసాధారణంగా ఉండే వర్గాలను నిర్లక్ష్యం చేయరాదు, వాటికి అత్యధిక ప్రాధాన్యం కూడా ఇవ్వరాదు.
ప్రభుత్వోద్యోగులను, వారి సలహాలను తృణీకరించరాదు. ఇదే సమయంలో వారినే విస్సన్నలుగాను, వారి వాక్కునే వేదంగా పరిగణించరాదు కూడా.
ఇతర విధాల కూడా ప్రజాస్వామ్యంలో నాయకత్వం అసిధారావ్రతమే. ఆ నాయకత్వ నిర్వహణలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఒక్కొక్కప్పుడు కొన్ని నిర్ణయాలను చేయవలసి వస్తుంది. ఆప్తులైన వారికి కూడా అప్రియ సత్యాలను చెప్పవలసి వస్తుంది. అనుయాయులైన వారికే ఆశాభంగాలను కలిగించవలసి వస్తుంది. ప్రతికక్షులైన వారిని కూడగట్టుకుని పోవలసి వస్తుంది.
ఇంత క్లిష్టమైన ఈ నాయకత్వ బాధ్యతల నిర్వహణలో శీఘ్ర నిర్ణయ శక్తి ముఖ్యావసరం. అయితే, ఎంత శీఘ్ర నిర్ణయమైనా అనాలోచిత నిర్ణయం కారాదు, అనుచిత నిర్ణయం సయితం కారాదు. ఒకసారి నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని అమలు పరచడంలో సంకోచాలు, సందేహాలు ఎంతమాత్రం తగవు. నిర్ణయం చేసి, అమలు జరుపుతున్న ఘట్టంలో అది సముచిత నిర్ణయంకాదని తనకు తోస్తే, ప్రతిష్టకై పెనుగులాడక, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.”
పుట్టుకతోనే ఈ శక్తి సామర్ధ్యాలు, ఈ ప్రజ్ఞాప్రాభవాలు చాలావరకు అబ్బినందునే శ్రీ సంజీవరెడ్డి గారు చిన్నతనంలోనే నాయకత్వానికి రాగలిగారని, దేశ నాయకులలో ఒకరుగా చెల్లుతున్నారని ప్రశంసించారు. వర్ధమాన రాజకీయ నాయకులు ముందటి తరం ప్రజానాయకుల జీవితాలను, వారి మంచి చెడ్డలను చక్కగా అధ్యయనం చేసి, తమ రాజకీయ జీవితాన్ని మలచుకోవాలి. కానీ, ఇటువంటి దృక్పథం భారత రాజకీయాలలో ఉండేటువంటి అవకాశం నేడు లేదు. భవిష్యత్తులో అసలే లేదు.
ఎందుకంటే - భవిష్యత్తులో భారతదేశానికి రాబోయే సంక్షోభం ఆర్ధిక పరమైనదో, సామాజిక పరమైనదో, పర్యావరణ పరమైనదో కాదు - సరియైన రాజకీయ నాయకత్వం లేకపోవడం అన్నది. మన దేశంలో నేడు మధ్యతరగతి యువతకు రాజకీయాలలోకి వచ్చి పనిచేసేందుకు ఎటువంటి అవకాశాలు లేవు. రాజకీయ వారసత్వంతో కూడిన ధనబలం ఉన్నవారికీ, వ్యాపారవేత్తలకు, గూండాయిజం చేయగలవారికి మాత్రమే రాజకీయాలలో పనిచేసే అవకాశం ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో నిస్వార్ధ నాయకత్వం దేశ ప్రజలకు లభ్యమవ్వడం మృగ్యం. దేశ ప్రజలకు సైతం అవినీతిపరులు, రౌడీలు,చట్టాన్ని, రాజ్యాంగాన్ని లెక్కచేయని వారు, నిరంకుశ స్వభావం కలవారు, మాటలతో మభ్యపెట్టే వారు మటుకే కంటికి ఇంపుగా, తాము వేసే వోటు అందుకునేందుకు అర్హులుగా కనిపిస్తున్నారు.
****సశేషం****
అవతరణి – రచయిత మనో నేత్రం
నేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.
నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.
నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.
ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.
అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు