Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

ఆంధ్ర రాష్ట్ర తొలి క్యాబినెట్ ఏర్పాటు

కర్నూల్ లో అక్టోబర్ 1వ తేదీన శ్రీ చందూలాల్ మాధవలాల్ త్రివేది గారు ఉదయం 8 గంటలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ గవర్నర్ గా మద్రాస్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి శ్రీ వెంకట రాజమన్నారు గారిచే  ప్రమాణం చేయించబడ్డారు. పిదప ఉదయం 9 గంటలకు రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మంత్రులు కడప కోటిరెడ్డి, తెన్నేటి విశ్వనాధం, డి.సంజీవయ్య గార్ల చేత అధికార ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రకాశం, సంజీవ రెడ్డి గార్ల మధ్య హోమ్ శాఖ విభజన జరిగింది. ముఖ్యమంత్రి పబ్లిక్ సర్వీసెస్, పొలిటికల్, సమాచార, ప్రచార శాఖలు చూచే విధంగా, ఉపముఖ్యమంత్రి పోలీసు, ప్రజల శాంతి భద్రతలు, శాసన సభ, ఎన్నికలు, అభివృద్ధి శాఖలు చూచే విధంగా విభజన జరిగింది.

ప్రకాశం, సంజీవరెడ్డి గార్ల ప్రభుత్వం పదమూడు నెలలే ఉన్నా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేసింది.

పలు నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించారు, శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు, ఆంధ్ర హై కోర్ట్ నెలకొల్పారు, తిరుమల దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులు శాసన రూపంలో చేశారు. నూలు వడికేవారికీ, నేసే వారికీ కూలీ పెంచడమైంది. ఖద్దరు విస్తృత పరచడం కోసమని, రాట్నాలు, దూది చవక ధరలకు ఇవ్వడం జరిగింది. నేత మగ్గాలపై, రెండెడ్ల బండ్లపై వేసిన పన్ను రద్దు చేశారు.

ఆంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే విజయవాడ దగ్గర కృష్ణా నది ఆనకట్ట కొంత భాగం జారిపోయింది. అప్పటికే ఆ ఆనకట్ట కట్టి వందేళ్లు అయ్యింది. దాని కింద పదకొండు లక్షల ఎకరాల వరి పంట ఉంది. పాత ఆనకట్ట పనికిరాదని దాని స్థానంలో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం కావాలని ఢిల్లీ నిపుణులు సూచించినా మద్రాస్ ప్రభుత్వం శాంక్షను చేయలేదని, ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే కృష్ణా ఆనకట్ట నికరంగా 12 కోట్ల రాబడిని చేకూర్చిందని, రాష్ట్ర విభజన జరిగినపుడు అనకట్టకైన రెండు కోట్ల ఇరవై లక్షల అప్పును ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చివేసి, వచ్చిన ఆదాయాన్ని మాత్రం జమ చేయలేదని తెన్నేటి విశ్వనాథంగారు ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రలో ఆవేదన వెలిబుచ్చారు.

స్వత్రంత్రం వచ్చాక ప్లానింగ్ కమిషన్ కు కృష్ణమాచారిని ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరు ఆంధ్ర రాష్ట్రం పట్ల తూష్ణీం భావంతో అభివృద్ధి పనులకు సహకరించలేదట. అయినా కేంద్రంలో చింతామన్ ద్వారకానాథ్ దేశముఖ్ గారు ఆర్ధిక మంత్రిగా ఉండటం వల్ల, వారు ఆంధ్ర రాష్ట్రం పట్ల ఆదరణ భావంతో వ్యవహరించడం వల్ల ప్రకాశం సంజీవరెడ్డి గార్ల ప్రభుత్వం ఆర్ధికంగా సర్దుకుని వచ్చేదని విశ్వనాథంగారు రాశారు.

కృష్ణమాచారిగారు అంతగా సహకరించనప్పటికీ, కృష్ణా ఆనకట్ట నిర్మాణం ఆలస్యం చేయడానికి వీలులేదని, కేంద్ర ప్రభుత్వం వారు అప్పు ఇవ్వకపోతే, రాష్ట్రానికి గల ఇతర ఖర్చులైన మానుకుని, పని వెంటనే మొదలుపెట్టమని ఇరిగేషన్ శాఖ చూస్తున్న సంజీవరెడ్డి గారికి ఆదేశం ఇచ్చారు. అలా 1953లో మొదలైన నిర్మాణం 1957నాటికి పూర్తయింది. ఇపుడు కృష్ణా, పశ్చిమ గోదావరి,గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 13,08,000 ఎకరాలకు నీరందిస్తుంది.

అలానే నందికొండ ప్రాజెక్ట్ విషయంలో కూడా కృష్ణమాచారి గారు సహకరించలేదట. ప్రకాశం గారి హయాంలో ఈతి బాధలను ఎదుర్కొన్న నందికొండ ప్రాజెక్ట్ కు సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నెహ్రూ గారే 525 అడుగుల ఎత్తుతో ప్రాజెక్ట్ ను శాంక్షన్ చేసి నాగార్జున సాగర్ పేరిట పునాది వేశారు.

NSReddy-Kalyanadurgam-Bridge

నవంబర్ 11, 1953లో కళ్యాణదుర్గం అనంతపురం రోడ్డు మీద పెన్నా నది పైన కాల్వపల్లి దగ్గర కట్టిన వంతెనను ప్రారంభోత్సవం చేస్తూ, "అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఆలోచించేటప్పుడు, యావత్ రాష్ట్రాన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కృషిని గమనించండి, అంతేగానీ ఏ ఊరి వారు ఆ ఊళ్ళో ఎంత జరిగిందో మాత్రమే లెక్క వేసుకోవడం భావ్యం కాదు" అని ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో సంజీవరెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

***సశేషం***

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in May 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!