-- డా. మధు బుడమగుంట

మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహాద్భుతాలు సృష్టించవచ్చు. దానికి త్రికరణశుద్ధి గా అంకితభావం కూడా జోడైతే ఇక ఆ మనిషి చేసే ప్రక్రియలన్నీ మానవాళికి ఎంతో మహోన్నత మేలు చేసేవే అవుతాయి. అటువంటి మేధస్సుతో, ఎన్నో వినూత్నమైన ప్రక్రియలతో సాంకేతిక రంగంలో ముఖ్యంగా జలనియంత్రణ సమస్యలకు అతి సులువుగా పరిష్కారం చూపి, ఇబ్బందులను అధికమించి ఆద్యుడై నిలిచి, నేటికీ ఎంతో మంది ఇంజనీర్లకు స్ఫూర్తిని అందిస్తున్న భారతరత్న సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మన తెలుగువాడు, నేటి మన ఆదర్శమూర్తి.
1861 సెప్టెంబర్ 15న కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనహళ్లిలో శ్రీనివాసశాస్త్రి, తల్లి వెంకటలక్ష్మమ్మ దంపతులకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. చిక్‌బళ్లాపూర్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకొని పూణేలోని సాంకేతిక విద్యాలయంలో తన ఇంజనీరింగ్ పూర్తిచేశారు. బాల్యంనుండే విశ్వేశ్వరయ్య ఎన్నో వినూత్నమైన ప్రయోగాలను చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించేవారు. ఆ తరువాత తన విధ్యార్తతకు తగిన వృత్తినే చేపట్టి ఎంతో నాణ్యమైన సాంకేతిక పద్దతులను అనుసరించేవాడు.
20 వ శతాబ్దం మొదట్లో విశ్వేశ్వరయ్య గారు సొంతగా రూపకల్పన చేసి పూణె సమీపంలోని ఖదక్‌వాస్తా రిజర్వాయర్‌కు ఆటోమెటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్‌గేట్స్ ఏర్పాటు చేశారు. దానివలన ఆనకట్ట కు ఎటువంటి హానీ జరగకుండా నీటిని నిలువచేసుకునే వీలు కలిగింది. అప్పటి నుండి ఆయన పేరు నలుదిశలా వ్యాపించి నాటి బ్రిటీష్ ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. విశ్వేశ్వరయ్య ప్రతిభ, ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1906-07లో నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ఏడెన్‌కు పంపించింది.
1912 నుండి 1918 వరకు విశ్వేశ్వరయ్య మైసూరు మహారాజు సంస్థానంలో దివానుగా పనిచేశారు. ఆ సమయంలోనే ఎన్నో చెక్ డాం లు నిర్మించేందుకు ప్రణాలికలు రచించారు. కర్నాటక రాష్ట్రంలో నేటికీ ఎంతో ప్రఖ్యాతి గాంచిన కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మాణానికి విశ్వేశ్వరయ్య ముఖ్య సూత్రధారి.
ఒకసారి ఆయన రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో ప్రకంపనల మార్పును గుర్తించి అత్యవసర చైన్ లాగి ట్రైన్ ను నిలిపివేశారు. ఆ తరువాత చూస్తే కొంచెం ముందు నిజంగానే రైలు పట్టాలు విరిగిపోయి ఉన్నాయి. ఆ విధంగా తన సమయస్ఫూర్తితో ఎన్నో వందల ప్రాణాలను ఆయన కాపాడారు.
చక్కటి ప్రణాళికను రూపొందించి హైదరాబాదు లోని మూసీనది వరదలను అరికట్టడానికి ముఖ్య కారకుడు అయ్యాడు. మూసీనది ఉపనదులకు ఆనకట్టలు నిర్మించి ఆ నీటి ప్రవాహ దారిని మళ్ళించి తదనుగుణంగా జలాశయాలను నిర్మించి మూసీనది వరదలను నియంత్రించాడు. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల రూపకల్పన ఆయన మేధస్సులోని ఒక మొక్క మాత్రమే. ఆ జలాశయాలు నేటికీ జంటనగరాలకు తాగునీటిని అందిస్తున్నాయి. ఆయన మేధాతపసి ని చూసి నాటి నిజాం నవాబు కూడా ఆశ్చర్యపోయాడు.
ఆయన చేసిన మరో అద్భుతం విశాఖ తీరంలో ఇసుక మేటలను నియంత్రించిన విధానం. ఎందుకూ పనికిరాని రెండు పాత నౌకలను కొండకు ఒకవైపుగా సరైన కోణంలో ముంచివేసి తద్వారా ఇసుకమేటను నియంత్రించారు. మరి అప్పుడు నేటి ఆధునిక రేవు పట్టణాలు, మరియు మానవనిర్మిత రేవులు లేవు కదా. సహజమైన రేవులో లోతు ఎక్కువగా ఉన్నప్పుడే పెద్ద నౌకలు కూడా తీరానికి వస్తాయి. అది ఆయన సాంకేతిక నైపుణ్య ప్రతిభకు తార్కాణం. ఇలా చెప్పుకుంటూ పొతే మన దేశంలోని చాలా నీటి ఆనకట్టలు, చెక్ డాం లు, జలాశయాల ప్రణాలికలు ఆయన మెదడులో జన్మించిన అద్భుత ఆలోచనలే.
మరి ఇన్ని విధాలుగా సేవలు అందించి మానవాళికి ఎంతో మంచి చేసిన ఆ మహానుభావుడి కృషికి తగిన గుర్తింపు లభించిందనే చెప్పవచ్చు. 1955లో భారత దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ బిరుదు ఆయనను వరించింది. ప్రజా జీవన అభివృద్ధికి ఆయన చేసిన నిరంతర కృషిని గుర్తించి నాటి బ్రిటిష్-భారత్ ప్రభుత్వానికి చెందిన కింగ్ జార్జ్ 5 'నైట్ కమాండర్' బిరుదుతో సత్కరించారు. ఇలా ఎన్నో అవార్డులు, పురస్కారాలు ఆయనకు లభించాయి.
ఆయన చేసిన మంచి పనులను గుర్తించి ప్రజలు ఆయనను ‘నిండు నూరేళ్ళు జీవించు’ అని ఆశీర్వదించినట్లుగా ఆయన వంద ఏళ్ళు జీవించి 1962 ఏప్రిల్ 14న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా మన మధ్యన లేకున్ననూ ఆయన రూపకల్పన చేసిన సాంకేతిక అద్భుతాలు నేడు మన ముందు ఉండి ఆ గొప్ప మనిషిని మనకు సదా గుర్తుచేస్తున్నాయి. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 15, ‘సాంకేతిక నిపుణుల దినోత్సవం’ గా జరుపుకొనడం మనం ఆయనకు అందించే ఘనమైన నివాళి.
మీరు చాలా గొప్ప గురించి వివరించారు present generation ఎవరికి తెలీదు ఎలా upload చేసిననడుకు నా తరుపున thank you
కృతజ్ఞతలు మధు గారు.విశ్వేశ్వరయ్య గారు చేసిన ఎన్నో గొప్ప సాంకేతిక అద్భుతాలను గురించి మా అందరికీ వివరించారు.
ధన్యవాదములండీ!