కొంతమంది మహానుభావుల పుట్టుక ఒక నిర్దిష్టమైన కార్యం కొరకు నిర్ణయించబడి అందుకు తగినవిధంగానే వారి జీవనశైలి సూత్రీకరించబడుతుంది. ‘ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈ అడవి .....’, ఇలానే, ఈ తెలుగు సాహిత్య కాననములో తన జీవితం కూడా సాగిపోయి, విలువకట్టలేని సాహిత్య మణి పూసలను, రత్నాలను మనకందించిన మహా రచయిత, లలితగేయాల సృష్టికర్త, అష్టావధాని, ఆంధ్రా షెల్లీ గా పేరుగాంచిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నేటి మన ఆదర్శమూర్తి.
నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలో వుండే చంద్రపాలెంలో నవంబరు 1, 1897న నిత్య సాహిత్యగోష్టి తో విలసిల్లె ఒక ఉన్నత కుటుంబంలో కృష్ణశాస్త్రి గారు జన్మించారు. బాల్యం నుండే తెలుగు సాహిత్య విలువల మాధుర్యాన్ని చవిచూసిన మన దేవులపల్లి గారు, చిన్నతనంలోనే పద్య రచనలమీద ఎంతో మక్కువను ఏర్పరుచుకొన్నారు. అత్యంత చిన్నవయసులోనే అష్టావధానం నిర్వహించే స్థాయికి వారి సాహిత్య పరిణతి చేరింది. చదువుకుంటూనే సాహిత్య కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరిచేవారు.
గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషావాదం, నాడు ఎంతో చైతన్యంతో నడుస్తున్న బ్రహ్మసమాజ ఉద్యమ ప్రభావం కృష్ణశాస్త్రి మీద ప్రబలంగా ఉండేవి. విద్యార్థిగా ఉంటూనే తెలుగు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తూ ఎంతో పేరును సంపాదించారు. ఆ క్రమంలోనే ‘జయము జ్ఞాన ప్రభాకరా జయము క్రాంతి సుధాకరా’ అనే ప్రార్థనా గీతాన్ని బ్రహ్మ సమాజం కోసం మరియు మనందరికీ సుపరిచితమైన ‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి, జయజయజయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి’ గీతాన్ని తను బోధిస్తున్న పాఠశాల విద్యార్థుల కోసం రాశారు. మన జాతీయగీతానికి ఏమాత్రం వాశిలో తగ్గకుండా రచించిన ఈ దేశభక్తి గీతం వింజమూరి అనసూయాదేవి గారి స్వరకల్పనతో నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొంటున్న దేశభక్తులందరిలో చైతన్యాన్ని రగిలించింది. నేటికీ మనందరికీ కూడా ఈ గీతం ఒక మధురానుభూతిని కలిగిస్తున్నది.
ప్రకృతితో మమేకమైనప్పుడే మనిషిలోని నిజమైన కవి, అతని భావుకత్వం బయటకు వస్తుంది. వాటికి అక్షరరూపం కల్పించినప్పుడు వాడే భావజాలము కృష్ణశాస్త్రి గారికి తెలిసినంతగా మరేకవికి తెలియదు కనుకనే ఆయన కలం నుండి వేలకొలది లలితగేయాలు వెలువడ్డాయి. సజీవమైన ప్రకృతి సరిగమలు, నిత్య జీవన జనస్రవంతి, అభ్యుదయ భావ వితరణలు, మన కృష్ణశాస్త్రి గారి కవితా వస్తువులు. కనుకనే ఆయన రచనలు నేటికీ ఎంతో మంది కవులకు ఆదర్శప్రాయమై నిలుస్తున్నాయి.
ఆయన రచించిన గేయసంహిత ‘అమృత వీణ’ లోని ఎన్నో మధురమైన లలితగీతాలు మన తెలుగు సాహిత్యానికి ప్రత్యేకమైన వన్నెను ఆపాదించాయి. నేటికీ ఎంతోమంది గాయకులూ, గాయనీమణులు తమ గాత్రంతో ఆ లలితగీతాలకు ప్రాణం పోస్తూ వాటి ప్రాముఖ్యతను సదా నిలుపుతున్నారు. వాటిని ఎంతో మంది ఇష్టపడుతున్నారు అంటే దానర్ధం వాటిని సృష్టించిన మహాకవి, కారణజన్ముడు కృష్ణశాస్త్రి తన ఆత్మను ఆ గేయాలలో చూపించాడు. ఆయన కవితలు పులకరింతల పలకరింపుగా వీనుల విందుగా వుంటాయి.
ప్రముఖ సినీ నిర్మాత బి.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహంతో 1951లో విడుదలైన ‘వందే మాతరం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు తన గేయాలను, తన భావకవిత్వాన్ని దేవులపల్లి వారు పరిచయం చేశారు. ఈ సినిమాలో మాటలతోబాటు, ఆయన రాసిన పాటలు, పద్యాలు విశేషంగా జనాదరణ పొందాయి. భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో ఒక సముచిత స్థానాన్ని కల్పించడంలో కృష్ణశాస్త్రి గారి కృషి అమోఘం. ఆయన పాటలన్నీ అమృతం కురిపించిన రసగుళికలు.
మనందిరికీ సుపరిచితమైన ఆయన పాటలు కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను:
‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి’, ‘కొలువైతివా రంగశాయి’ ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’, ‘ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా’, ‘సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో’ ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా’, ‘గోరింట పూచింది కొమ్మ లేకుండా’, ‘ఇది మల్లెల వేళయని’, అదిగదిగో గగనసీమ’, ‘మనసున మల్లెల మాలలూగెనే’ ‘వస్తే ఇస్తా నా మూగమనసు, ఇస్తే వస్తా నీ దోర వయసు’...ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఎన్నో మధుర భాషా పరిమళాలు.
ప్రముఖ అభ్యుదయ కవి శ్రీశ్రీ గారు రచించిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటికి చలం గారు ముందుమాట వ్రాస్తూ ‘కృష్ణశాస్త్రి తన బాధని అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’ అని రాశాడు. ఆ మాటలకు అర్థం స్ఫురించేలా శ్రీశ్రీ గారు ‘తను కృష్ణశాస్త్రి కవితా శైలినే అనుకరించేవాడిని’ అని గర్వంగా చెప్పుకున్నాడు. పై మాటలు మనదరికీ కూడా ఒక సందేశాత్మక విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. రచయితలందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకరి కృషిని, పరిజ్ఞానాన్ని అందరూ మనస్ఫూర్తిగా మెచ్చుకుని అందుకు తగిన ప్రోత్సాహాన్ని కూడా అందించాలి. అపుడే నిజమైన కవులకు సరైన గుర్తింపు లభిస్తుంది.
కృష్ణశాస్త్రి గారు ఎన్నో ఖండకావ్యాలను, నాటి సామాజిక స్థితిగతులను వివరించే వ్యాసాలను, నాటికలను కూడా రచించారు. సినిమాలకు పాటలు రాస్తూనే, ఆకాశావాణికి రేడియో రూపకాలు రాసేవారు. కొంతకాలం హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ‘ప్రయోక్త’గా కూడా పనిచేశారు. ఆకాశవాణిలో వుండగా ‘విప్రనారాయణ’, ‘క్షీరసాగర మథనం’ వంటి యక్షగానాలు స్వయంగా వ్రాసి వాటిని అద్భుతంగా ప్రదర్శింపజేశారు.
దేవులపల్లి వారి ప్రతిభను, సాహిత్యసేవను మెచ్చి ఆయనకు ఎన్నో సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1976లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డునిచ్చి గౌరవించింది. 1978లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను అత్యత్భుతంగా నిర్మించుకొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1980 ఫిబ్రవరి 24న తనువు చాలించారు. లలిత గేయాలు మన సమాజంలో తమ ఉనికిని చాటుకున్నంత కాలం కృష్ణశాస్త్రి గారు మనతోనే ఉంటారు.
https://muralikrishna22.wordpress.com/2015/12/ – దేవులపల్లి వారి రచనలు , జీవిత విశేషాలపై నా బ్లాగ్ లోని వ్యాసాన్ని కూడా చదవగలరు.
కృష్ణశాస్త్రి అంటే ప్రకృతి.ప్రకృతి ఆయన ఆకృతిలో మనముందు నిలిచి తన సంపదను ఆయన కలంనుండీ మనకు అందించింది.మీ వ్యాసంలో కవులంతా ఒక కుటుంభంవారమనే …..విషయాన్ని చెప్పడం చక్కటి నిజం, సందేశం.అందుకు ధన్యవాదాలు.అనసూయాదేవి కృష్ఖ శాస్త్రి గారి మేనకొడలు.
Very good article. Nicely compiled. Enjoyed reading about the great poet.
కృష్ణ శాస్త్రి గారి గురించి చక్కని వ్యాసం రాసారు. మల్లీశ్వరి సినిమా గురించి చెప్పడం
మరచినట్టు వున్నా రు.(పాట ఒకటి ఉదాహరించారు)
మంచి వ్యాసం అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు