-- డా. మధు బుడమగుంట
శివ-విష్ణు ఆలయం, మహాబలిపురం
ఈ అక్టోబర్ సంచికలో ఆలయసిరి ఏ ఆలయం మీద వ్రాస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే తమిళనాడు రాష్ట్రం లోని శివ-విష్ణు ఆలయ ప్రాంగణం, మహాబలిపురం (మామల్లపురం) ఎందుకో స్ఫురించింది. ఎనిమిదో శతాబ్దంలో నాటి పల్లవరాజు నరసింహ వర్మ ఈ ఆలయాన్ని బంగాళాఖాతం సముద్రపుటొడ్డున అత్యంత రమణీయంగా నిర్మించారు. పల్లవుల కాలంలో ఈ మహాబలిపురం ప్రముఖ ఓడరేవుగా కూడా ప్రసిద్ధి చెందింది. తరువాతి కాలంలో చోళరాజులు ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు.
సముద్ర తీరంలో ఒక పెద్ద రాతి కట్టడం నిర్మించడం అంటే అంత సులువైన పని కాదు ఎందుకంటే అంతా ఇసుకనేల అయినా వెరవక ఎనిమిదవ శతాబ్దంలోనే ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం భుజ బలం, బుద్ధి బలం ఉపయోగించి కట్టిన ఈ రాతి ఆలయ సమూహం నేటికీ చూపరులను ఆకట్టుకుంటూ విరాజిల్లుతున్నది.
భారతీయ కళాజగతికి, వాస్తుకళకు ఆనాడే సువర్ణ కీరీటం పెట్టిన ఈ శిల్ప కళా నైపుణ్యం ఎంతో అపురూపం. పెద్ద పెద్ద గ్రానైట్ ఫలకాలను, రాతిబండలను శిల్పాలుగా మలిచి అతి సుందరంగా తీర్చిదిద్దిన ఆ శిల్పుల పనితనం ముందు నేడు యంత్ర పనిముట్లతో కంప్యూటర్ సహాయంతో డిజైన్ చేసి చెక్కుతున్న శిల్పుల పనితనం ఏపాటి? ఏ చిన్న పొరపాటు జరిగినా ఆకృతి సరిగా రాకపోయినా మరల మొదటినుండి పని ప్రారంభించాలి. ఎంతో మంది స్థపతులు సంవత్సరాల తరబడి నిరంతరం శ్రమిస్తే ఈ మనోహరమైన దృశ్య మాలికలు (శిల్పాలు) ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని భౌగోళిక వాతావరణ మరియు సముద్రపు ఉప్పెనలను తట్టుకొని నేటికీ మనకు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి.
తాము సాటిలేని వాటిమంటూ నేటికీ కనపడుతున్న ఆ శిల్పాలను చూడటానికైనా అక్కడికి వెళ్లాలని అనిపిస్తుంది. అనేక పురాణ ఘట్టాలను ఇక్కడ శిల్పాల రూపంలో పొందుపరిచారు. ఇక్కడి కట్టడాలను పల్లవుల సంప్రదాయ ద్రావిడ రీతిలో నిర్మించారు. ఈ ప్రాంగణం లోనే నిర్మించిన పాండవ రథాలు చూపరులను ఇట్టే ఆకట్టుకొంటాయి. ఏకశిల గజరాజు ఎంత హుందాగా నేటికీ నిలబడి ఉండటం నిజంగా విశేషం.
ఏడో శతాబ్దంలోనే నిర్మించిన పుష్కరిణి లోనికి నీటిని విడుదల చేసే విధానం ఒక్కసారి పరికిస్తే ఆ నాడే శాస్త్రీయ విధానాలను ఎటువంటి సైన్సు మరియు ఇంజనీరింగ్ చదువులు, సర్టిఫికేట్ లు లేకుండానే అనుసరించారు. ఆనాడే అత్యంత గొప్ప సాంకేతిక ఆలోచనలను సంప్రదాయ పద్దతులలో అమలుచేశారని అనిపిస్తుంది. నేడు అన్నీ ఆధునిక వసతులు ఉన్ననూ మనం ఏదో కోల్పోయినట్లు నిరాశతో మన కట్టడాలను ఎటువంటి ఆకర్షణీయ అందాలను జతచేసి నిర్మించడం లేదు. కారణం మన ఆలోచనలు అన్నీ మనం నిర్మించే కట్టడానికి పేరు ప్రఖ్యాతులు రావాలి అనే ఆతృత మీద ఉండడం జరుగుతున్నది.
ఇక ప్రధాన ఆలయ కట్టడాన్ని పరిశీలిస్తే సముద్రపు అలలను తట్టుకోవడానికి ముందుగా 50 అడుగుల ఎత్తుతో ఒక చతురస్రాకారపు అరుగును నిర్మించి దానిమీద 60 అడుగుల గోపురాన్ని మరియు గర్భగుడిని చక్కటి శిల్ప సంపదతో నిర్మించారు. ఈ ప్రాంగణంలో ఒకటి శివునికి, మరొకటి విష్ణువుకు రెండు కోవెలలను నిర్మించారు.
ఇన్ని వందల సంవత్సారాల చరిత్ర ఉన్న ఈ అద్భుత ప్రాంగణం కాలగర్భంలో సముద్రపు ఒడిలో కలిసిపోయిననూ, ప్రధాన ఆలయాలు ఇంకా నేటికి స్థిరంగానే ఉన్నాయి. యునెస్కో 1984 సంవత్సరంలోనే ఈ ఆలయ ప్రాంగణాన్ని ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించి కాపాడటం మొదలుపెట్టింది.
ఇంతటి మహోన్నత కళా చరిత్ర ఉన్న ఈ మహాబలిపురం గురించిన విషయాలను సినిమా పాటల రూపంలో వివరిస్తే ఎవరికి ఆ ప్రదేశం మీద ఆసక్తి కలగదు? 1970 సంవత్సరంలో విడుదలయిన ‘బాలరాజు’ సినిమాలో ఈ మహాబలిపురం గురించి ఎంతో వివరంగా ఒక పాటను ఇక్కడే చిత్రించారు. ఈ పాటకు ఆరుద్ర ప్రాణం పోయగా కె.వి మహదేవన్ స్వరకల్పనలో సుశీల గారు ఎంతో మధురంగా పాడారు.