ఒక ఆజ్ఞేయవాది అంతరంగం
నచ్చిన పుస్తకం అదీ ఒక్కటంటే ఒక్కటి చెప్పమంటే చాలా కష్టం. వివరించడమంటే ఇంకా కష్టం. విమర్శించే దృష్టి అలవడినప్పుడు చదివిన ప్రతిదాన్నీ యధావిధంగా ఆమోదించం. చదివిన దాని గురించి ఆలోచిస్తాం,విమర్శిస్తాం వీలైతే చర్చిస్తాం కూడా. అలా అని పూర్తిగా నచ్చిన పుస్తకాలేవీ అసలు ఉండవని కూడా ఘంటాపధంగా చెప్పలేం. నిత్య పాఠకుడికి,అధ్యయనశీలికి నచ్చిన పుస్తకాల జాబితా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది.ఇప్పుడు ఎంపిక చేసుకోవాల్సిన పుస్తకం తెలుగు సాహిత్యంలో కాబట్టి పని కాస్త సుళువయ్యింది. అందులోనూ రాయవలసింది నచ్చిన పుస్తకం ఏమిటి,ఎందుకు నచ్చింది,అందులో విషయాలు ఎలా ఉపయోగపడతాయి అనేవి కాబట్టి రాయడానికి దిశానిర్దేశం కూడా లభించినట్లయ్యింది.
కొన్ని పుస్తకాలు కాలక్షేపానికని చదివేవి ఉంటాయి.చదివిన ప్రతిసారి మనసును రంజింపజేస్తుంటాయి. కేవలం వినోదం అందించిందనే కారణంతో అటువంటి పుస్తకాలను నచ్చిన పుస్తకాల జాబితాలోకి తేడానికి నాకు మనసొప్పడంలేదు. మన ఆలోచనలకు దగ్గరగా ఉండేవి,మన ఆలోచనాసరళిపై ప్రభావం చూపేటివి,అటువంటి పుస్తకాలనే నచ్చిన పుస్తకాల జాబితాలోకి చేరుస్తాను.ఇప్పటి వరకు నేను చదివిన తెలుగు సాహిత్యం నుండి సి.నారాయణరెడ్డి గారి వచనకావ్యం విశ్వంభరను ఎంపిక చేసుకుంటున్నాను. నారాయణరెడ్డిగారి వచనకావ్యాల్లో విశ్వంభర, మట్టి మనిషి ఆకాశం ఎన్నదగినవి. విశ్వంభర రచనకుగాను 1988లో సి.నారాయణరెడ్డి గారు భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు పొందారు. విశ్వంభరకు 1982లో సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్ వచ్చింది. విశ్వంభర వచనకవితా ప్రక్రియలో ఒక సమగ్రకావ్యం. “కవిగా నా స్థానాన్ని మరింతగా సార్ధకం చేసిన కావ్యం విశ్వంభర” అని స్వయంగా సినారేనే చెప్పుకున్నారు.
సి.నారాయణరెడ్డి గారు ఆజ్ఞేయవాది. తన సిద్ధాంతం ప్రగతిశీల మానవతావాదమని అనేక మార్లు వారు ప్రకటించారు. విశ్వంభర కావ్యం ప్రగతిశీల మానవతావాద సిద్ధాంతానికి దర్పణం పట్టింది. విశ్వంభర మనిషి కథ. కావున కావ్య నాయకుడు మానవుడు. రంగం ఈ విశాల విశ్వం. ఆదిమదశ నుండి ఆధునిక దశవరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు. కళాత్మక,వైజ్ఞానిక,ఆధ్యాత్మిక సాధనల్లో మనిషి పురోగమనం, ఆ గమనంలో మనిషికి తగిలిన ఎదురుదెబ్బలు ఇందులో వర్ణించబడ్డాయి. అక్కడక్కడా విప్లవ శంఖారావం పూరించారు.మనిషిలోని అమానవీయతను నగ్నంగా నిలబెట్టారు. సంకుచితత్వాన్ని చీల్చిచెండాడారు.
“నేను పుట్టకముందే నెత్తిమీద నీలితెర.కాళ్ళకింద ధూళిపొర” అంటూ మొదలుపెట్టి, “మనసుకు తొడుగు మనిషి,మనిషికి ఉడుపు జగతి. ఇదే విశ్వభరాతత్త్వం. ఇదే అనంత జీవిత సత్యం” అంటూ ముగించారు ఈ కావ్యాన్ని సినారె.
“ఇప్పుడు తెలిసింది. అడుగు నేలపై ఆనని యవ్వనం అడుసులోకి దిగబడుతుందని, నిత్యదీప్తమని అనుకున్న జీవితం లిప్తలో ఆరిపోతుందని” అంటూ వైరాగ్యాన్ని ప్రదర్శించారు.
“ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి, జగతిలోని భ్రమణగుణానికి ప్రతిరూపం మనిషి. పాటలా సాగిన మనసు.ఆటలా ఊగిన మనసు.మాటలను కప్పుకుని,అర్ధాలను అల్లుకుని పలికింది అనంతముఖాలుగా, ఒలికింది విభిన్న గళాలుగా” అంటూ మానవ పరిణామాన్ని వర్ణించారు.
మూడో ప్రకరణంలో మనిషి మనసును వర్ణించారు.మనసు పొరలను తడిమి చూశారు. “మనసొక మహాసాగరం. తాను కట్టుకున్న చెలియలికట్టను తానే కబళించాలని చూస్తుంది. తన తోబుట్టువైన ధరాతలాన్ని తానే తాగేయాలని చూస్తుంది” అంటూ ప్రకృతి పట్ల మనిషి చేసే తప్పిదాలను ఎత్తి చూపారు.
“విత్తుగా ఉంటూనే వృక్షమై కూచుంటుంది. అంతరిక్షంగా ఉంటూనే అణువులా కుదించుకుంటుంది.అది అగమ్యం” అంటూ విశ్వ యొక్క ఉద్భవఉపసంహారాలను ఒక్క వాక్యంలో చెప్పేశారు.
“కాంక్ష మనసుకు వేరు.కదలిక దాని తీరు.కాంక్ష పెరిగితే ఆశ. ఆశ ముదిరితే లోభం” అంటూ బౌద్ధ ఆర్య సత్యం గురించి చెప్పి తరువాతి పుటల్లో లోభం యొక్క పర్యవసానాల గురించి మాట్లాడారు. మనిషి లోభం వల్ల చెలరేగే ఉన్మాదాలు,ఉపద్రవాల గురించి వర్ణించారు. “నరోత్తములకే అందుతాయి నమస్సులు,దురాత్ములకు కాదు.కారుణ్యానికే వంగుతాయి శిరస్సులు కాఠిన్యానికి కాదు “ అంటూ, ”లక్ష ప్రాణాలను ఆర్పేసిన కత్తి ఒక్క ఊపిరిని వెలిగిస్తుందా? ఉర్వీతలాన్ని వణికించిన శక్తి ఒక్క హృదయాన్ని జయిస్తుందా? అంటూ కరుణ,శాంతి సూత్రాలను ప్రభోధించారు. “వినాశం జరిగితే కాదు,వివేకం పెరిగితే గెలుపు.సమరం రగిలించేది భీతి,సహనం వర్షించేది ప్రీతి.అనురాగం చేసే శాసనమే అసలైన రాజనీతి” అంటూ పాలకులకు రాజధర్మం బోధించారు.
“ఆకృతిలోని వికారాలు ఆత్మకెందుకంటవు? అగుపించనిది నిత్యమా? అగుపించేది మర్త్యమా? ఆకులు రాలక తప్పదంటే అంకురదశ ఎందుకో? మరణం రాక తప్పదంటే శరీరధారణ మెందుకో? ఏ కత్తితో చీల్చలేనిది, ఏ నిప్పుతో కాల్చలేనిది, ఊదితే ఎగిరే బూదికుప్పలో ఒదిగి ఒదిగి ఉండడమెందుకు? జననం లేనిదే స్థితి ఉంటుందా?గమనం లేనిదే గతి ఉంటుందా? పంచభూతాల ప్రస్తారాలకు మించిన ప్రకృతి ఉంటుందా?ఏ రూపమూ లేనిదానికి ఇన్ని విడి తొడుగులెందుకు? అంతటా నిండి ఉన్న దానికి అరలు అరలుగా విడుదలెందుకు? అగ్ని లాంటిది లోన ఉంటే అంటుతుందా ఒంటికి చెదలు, అమృతత్వం పైన ఉంటే అవనికుంటుందా చావు దిగులు?” అంటూ నాలుగో ప్రకరణంలో అద్వైతాన్ని,ఆత్మవాదాన్ని ఖండించారు. నారాయణరెడ్డి గారు ఆజ్ఞేయవాది, మానవవాది కావటం మూలంగా పై విమర్శలు చేసి ఉండొచ్చు. నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవించనప్పటికీ సమాధానం ఇక్కడ ఇవ్వబోవడం లేదు.అధ్యాత్మిక వాసనలున్న ఎవ్వరికైనా అజ్ఞానమే జన్మదుఃఖ దౌర్మనశ్యాలకు కారణమని,శుద్ధ చైతన్యమే బ్రహ్మమని,అదే ఆత్మగా మనిషిలోకి ప్రవేశిస్తుందని అవగాహన ఉంటుంది.
అద్వైత వేదాంతాన్ని విమర్శించినా మనిషి అజ్ఞానానికి కారణమైన అరిషడ్వర్గాల గురించి మాత్రం ”తనకు తెలుసు తాను పెంచుకున్న మువ్వన్నెల చిలుకను తన్నుకుపోవడానికి అహరహం ముక్కులు నూరుతున్న ఆరు గద్దలున్నాయి.తనకు తెలుసు తాను ఆఘ్రాణిస్తున్నఐదు రేకుల పువ్వును ఎగర కొట్టడానికి అనుక్షణం కాలప్రభంజనం అంగలారుస్తున్నదని” అంటూ వ్యాఖ్యానించారు.
మనిషి నాటి రాతి యుగం నుండి నేటి రాకెట్ల యుగం దాకా పురోగమించడానికి కారణం ఏమిటో ఈ విధంగా అక్షరీకరించారు సినారె :- “గుహ నుండి మహలు దాకా,నడక నుండి రోదసీ నౌక దాకా,దివిటీల నుంచి విద్యుద్దీపాల దాకా,అమ్ములనుంచి అణ్వస్త్రాల దాకా,ప్రవహించిన సంస్కృతికి మూలహేతువు మనిషిలో వికసించిన విజ్ఞాన ధాతువు”.
చివరి పుటలో “ఋషిత్వానికి పశుత్వానికి సంస్కృతికి దుష్కృతికి స్వచ్ఛందతకకూ నిర్భందతకూ సమార్ద్రతకూ రౌద్రతకూ తొలి బీజం మనసు తులారూపం మనసు” అంటూ పరమోత్కృష్టమైన తాత్విక సత్యాన్ని పునరుద్ఘాటించారు.
ఇలా ప్రతి పుటలోనూ మనిషి గురించి,మనిషి మనసు గురించి,అతని ప్రస్థానం గురించి ఎన్నో అర్ధవంతమైన,అద్బుతమైన కవితలున్నాయి. అలాంటి ముత్యాలవంటి అనేక కవితల ముత్యాలహారమే విశ్వంభర. విశ్వంభర సినారె అంతరంగం అంటే అతిశయోక్తి కాదేమో.