Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

మార్క్స్ ఎంగెల్స్ మార్గదర్శకత్వం - గతి తర్కం

తత్వ శాస్త్రంలో గతి తర్కానిది కీలకమైన దశ. శాస్త్రీయ పరిశోధనలు ఆధారంగా చేసుకుని తాత్విక వివరణలు ఇవ్వడమే కాకుండా సమాజ గమనాన్ని వివరించడానికి గతి తార్కిక దృక్పథం తోడ్పడింది. ప్రాచీన కాలంలో గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ సిద్ధాంతాలలో, హిందూ దేశంలో బౌద్ధ ధర్మంలో గతి తార్కిక ఆలోచనలు ఉన్నాయి. కార్ల్ మార్క్స్ గురువు గారైన హెగెల్ అనే జర్మన్ తత్వవేత్త గతి తార్కిక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు.

హెగెల్ అభిప్రాయాలు సంగ్రహంగా :-

పదార్థం ఒక దశ నుండి మరో దశకు నిరంతరం ఎడతెగకుండా నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మరో వైపు మనోభావాలు అనగా మన ఆలోచనలు, ఆశయాలు, విలువలు, సాంప్రదాయాలు మొదలైనవి కూడా ఒక దశ నుండి మరో దశకు ఎడతెగకుండా నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. మానవుడు తన మానసిక శక్తుల ద్వారా పదార్థంపై నియంత్రణ తెచ్చుకుంటున్నాడు. అలా ఈ భౌతిక ప్రపంచం మారేటప్పుడు మనసు కూడా క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా మానవుడు తన చరిత్రను నిర్మించుకుంటాడు.

హెగెల్ తత్వ శాస్త్రానికి చేసిన సహకారమేమిటంటే :- మార్పును గురించి వివరించడానికి స్థలంతో పాటు కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని హెగెల్ చెప్పారు అలానే మార్పును చరిత్ర దృష్ట్యా పరిశీలించాలన్నారు. అలానే ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే ప్రతి వస్తువు అనేక భాగాల సముదాయం మాత్రమే కాదు, పరస్పర వైరుధ్యాలతో కూడుకున్న సముదాయమని, ఈ వైరుధ్యాల వల్ల జరిగే సంఘర్షణ వల్లే వస్తువు మార్పు చెందుతూ ఉంటుందని హెగెల్ నిరూపించారు.

Time and Space are intertwined and interdependent, through a dialectical process, they pass over into each other. Time is the negativity that arises from space i.e., the process of becoming, arising and passing away.

విజ్ఞాన శాస్త్రంలో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన థియరీ అఫ్ రెలెటివిటీ హెగెల్ చెప్పిన తత్వానికి కొనసాగింపే. అయితే హెగెల్ ప్రతిపాదనలో లోపమేమిటంటే నిరంతరం మార్పు చెందే ఈ ప్రపంచానికి మూలం మనోభావం అనడం.

ఈ విషయం గురించి కార్ల్ మార్క్స్ ఏమి చెప్పారో చూద్దాం :-

"హెగెల్ అభిప్రాయంలో ఆలోచనాక్రమం మనోభావమనే పేరుతో స్వతంత్ర శక్తిగా వ్యవహరిస్తుంది. అదే వాస్తవ జగత్తుకు మూలం. మనోభావం యొక్క బాహ్య స్వరూపమే వాస్తవ జగత్తు. కానీ నా అభిప్రాయంలో వాస్తవ జగత్తు యొక్క ప్రతిబింబమే మనో భావం.అది ఆలోచన రూపంలో బహిర్గతమవుతుంది."

హెగెల్ వివరించిన గతితర్కం తలకిందులుగా ఉంది. దానిని మనం కాళ్ళ మీద నిలబెట్టవలసి ఉందని ఎంగెల్స్ అన్నారు.

మార్క్స్ ఎంగెల్స్ ల పై అవగాహనే గతి తార్కిక భౌతిక సిద్ధాంతానికి పునాది. మార్పు చెందే ఈ ప్రపంచానికి మూలం మానవ మనోభావం అంటే పొరపాటు. కానీ శాశ్వతము శుద్ధము అయిన చైతన్యమేదైనా ఈ విశ్వానికి మూలమైతే ? నిరంతరం మార్పు చెందే ఈ పదార్థం శాశ్వతము శుద్ధము అయిన చైతన్యంతో ఎల్లపుడూ కలిసి ఉండేట్లైతే? ఇది తత్వ శాస్త్రంలో భావ వాదానికి భౌతిక వాదానికి భిన్నమైన ఆలోచనా విధానం. ఈ చివరి పంక్తులు రాసింది పాఠకులలో కేవలం ఆలోచన రేకెత్తించడానికే.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in September 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *