Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

కృష్ణమూర్తి తత్త్వమార్గం

జిడ్డు కృష్ణమూర్తి గారివి కూడా స్వామి వివేకానంద వలె ప్రసంగాలు. రచనలు కావు. అయితే వివేకానంద రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించి అద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాపితం చేశారు. కృష్ణమూర్తి గారు థియసాఫికల్ సొసైటీ నుండి విడివడి స్వేచ్ఛగా తన పయనం సాగించారు.

కృష్ణమూర్తి గారి గురించి అర్థం చేసుకోవడానికి వారి ప్రసంగం నుండే కొన్ని వాక్య ఖండికలను క్రింద ఉటంకిస్తాను :-

  1. నేను ఓ తత్త్వ దర్శనాన్ని రూపొందించడం లేదు. మత ధర్మ సూత్రాల కూర్పు చేయడం లేదు. అటువంటి సిద్ధాంతాలన్నీ అర్థరహితమని నా ఉద్దేశం.
  2. జీవితానికి సంబంధించిన తత్త్వ శాస్త్రం కాదు మనకు కావాల్సింది. జీవితాన్ని యథాతధంగా - బాహ్యంగా, అంతరంగికంగా జరుగుతున్నదంతా - చూడగలగడం; ఎలా చూడవలెనో - గమనించవలెనో - నేర్చుకున్నట్లైతే - అంతా స్పష్టం అయిపోతుంది; అలా చూడడానికి తాత్త్విక ధోరణి అవసరం లేదు ; గురువుల ప్రేమేయం అవసరం లేదు; కేవలం మీరు చూడడం అవసరం ఐన పని.
  3. మీకు బోధించడం నా ఉద్దేశం కాదు. నా వద్ద కొత్త తత్త్వ దర్శనం, సత్యానికి సరికొత్త మార్గం అంటూ ఏమీ లేదు. ఏ రకమైన ఆధిపత్యం అయినా - ముఖ్యంగా ఆలోచన, అవగాహన రంగాలలో - వినాశకరం. మీకు మీరే బోధకుడు, శిష్యుడు అయివుండాలి.

He is not a philosopher. He is not a preacher. He speaks to us like a friend. Yet his speeches show a philosophical way which has a life in it. కృష్ణమూర్తి గారి ప్రసంగాల నుండి ముఖ్యమైన అంశాలను సంగ్రహపరచి సరళంగా అందించడమే ఈ వ్యాస పరంపర ఉద్దేశం.

మనసు గురించి తెలుసుకోవడం !

  1. మనల్ని మనం చదవడం ఎలా? గమనించడం ఎలా? మన అంతరంగంలో ఏం జరుగుతుందో చూడడం ఎలా? సంబంధాలు బాంధవ్యాల పరిధిలోనే మనని మనం అవగతం చేసుకోగలం. ఎందుకంటే - మన జీవితమంతా ఈ సంబంధాలననుసరించే నడుస్తుంది కదా!
  2. మనల్ని మనం ఉన్నట్లుగానే చదువుకోగలగాలి గానీ, ఉందామనుకున్నట్లుగా కాదు.
  3. మనల్ని మనం చదవటమనేది ఎపుడూ వర్తమానంలోనే ఉంటుంది.
  4. దేనినైనా అర్థం చేసుకోవడానికి మనం దానిని గమనించాలి. దానితో జీవించాలి. దాని స్వభావం, నిర్మాణం,కదలిక - అంతా స్పష్టంగా ఎరిగి ఉండాలి.
  5. మనతో మనం జీవించడమన్నది ఎపుడైనా ప్రయత్నం చేసి చూశారా? అలా కలసి జీవించడానికి మనకు సజీవమైన మనసు కావాలి. అందుకు మనకు స్వేచ్ఛ గల మనసు కావాలి.
  6. అభిప్రాయాలు, తీర్పులు, విలువలు - ఇలాంటి వాటిలో కూరుకుపోతే మనసు సజీవంగా ఉండలేదు. అంగీకరించడమో, తిరస్కరించడమో, ఒక వైపునకు ఉండడమో చేసే మనసు కాకుండా, అవగాహన చేసుకునే నిమిత్తం అంతటినీ జాగ్రత్తగా అనుసరిస్తున్న మనసు కావాలి.
  7. ప్రపంచంలో అతి కష్టమైనా పనులలో ఒకటి - దేనినైనా సరళంగా చూడడం.
  8. అంతా ఎరుగుదును అనే విశ్వాసం ఉన్న మనిషి మృతప్రాయుడైన మనిషే.
  9. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మన మనసులు ఏదో ప్రత్యేక సంస్కృతిలో, సంకుచిత పద్ధతిలో 'నేను-నాది' అనే పద్ధతిలో తయారవుతున్నపుడు మనం స్వేచ్ఛగా ఎలా ఉండగలం? ఈ నిబద్ధతకు పరిపూర్ణ సావధానత ఇచ్చినపుడు మనం గతం నుండి విముక్తి పొందిన వారమవుతాం.
  10. వాస్తవాన్ని అవగాహన చేసుకోవాలంటే దాన్ని మనం నిర్భయంగా చూడగలగాలి. వాస్తవాన్ని సందర్శించడం అనేది వర్తమానంలోనే సాధ్యం.

కాబట్టి మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే వాస్తవంలో ఉండాలి. నిబద్ధతకు లోను కాకుండా మనల్ని మనం సావధానతతో సరళంగా చూసుకోగలగాలి.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in March 2025, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!