Menu Close
Kadambam Page Title
సరే, వెళ్లిపో!
-- సాంబమూర్తి లండ

సరే కానివ్వు!
చేసిన అప్పులు
నీ మెడ చుట్టూ బిగుసుకుంటుంటే,
చిందించిన స్వేదానికి
ఆవిరైన రుధిరానికి
గిట్టుబాటులేక కొట్టుమిట్టాడుతుంటే,
కోటలు దాటిన మాటలు
బతుక్కింత భరోసా ఇవ్వలేకుంటే,
ఉరే సరని అనిపిస్తోంది కదూ
సరే కానివ్వు!
నీ భారం దించేసుకో!

తరతరాల అన్నపూర్ణను
రుద్రభూమిని చేసి తరలిపో!
నిన్నే నమ్ముకుని ఎదురుచూస్తున్న
మూగ కళ్లముందు తలదించుకుని వెళ్లిపో!
నువ్వో యోధుడవని గర్వంగా చెప్పుకునే
నీ కొడుక్కి,'నాన్నా!నేను చేతకాని వాడినని'
చెప్పి, పయనమైపో!
అక్కడ గట్టు మీద కూర్చొని
నీకోసం ఒక సూర్యుడ్ని
వెలిగించాలని తపిస్తున్నాడే
ఆ అక్షర బ్రహ్మకు
కడసారి వీడ్కోలు చెప్పి వెళ్లిపో!

వెళ్లేముందు...
నిన్నడ్డం పెట్టుకుని గద్దెనెక్కిన నేతలకు
తలకొరివి పెట్టి, రుణం తీర్చుకుని వెళ్లిపో!
నీ చావు డప్పు
ఒక సమరభేరి అవుతుందంటే
నీ బలిదానం
ఒక కనువిప్పు అవుతుందంటే
నీ అస్త్రసన్యాసం
మరో నాగలికి జీవం పోస్తుందంటే
ఈ కన్నీటి పరంపర
నీతోనే ఆగిపోతుందంటే
సందేహించకు! వెళ్లిపో!
చచ్చిన వరి కంకుల మీద
నీ చివరి కన్నీటి చుక్కతో
మరణ వాగ్మూలం రాసి,వెళ్లిపో!

Posted in November 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!