౯౦౧. అనిత్యాని శరీరాణి, అందరి ఆస్తీ మనకే రానీ ...
౯౦౨. అన్నం అరఘడియలో అరిగిపోతుందిగాని, ఆదరణ మాత్రం కలకాలం గుర్తుండిపోతుంది.
౯౦౩. అన్నవారూ, పడ్డవారూ బాగానే ఉన్నారుగాని నడిమినున్న వారు మాత్రం నలిగిపోయారు.
౯౦౪. అమర్చిన దానిలో అత్తగారు వేలుపెట్టిందిట!
౯౦౫. అన్నీ తెలిసినవాడు అమావాస్యనాడు పోతే, ఏమీ ఎరుగనివాడు ఏకాదశి రోజున పోతాడు!.
౯౦౬. అందరి ఆకలీ తీర్చే రైతుల ఇళ్ళలో ఎప్పుడూ అన్నానికి కరువే!
౯౦౭. అన్యాయపు ఊరిలో ఆలు మగలకే అక్రమ సంబంధం అంటగడతారు.
౯౦౮. అప్పలాచారి ఉన్నచోట అపశబ్దాల భయం లేదు.
౯౦౯. అప్పు ఇచ్చినవాడు మేలు కోరుతాడు, అప్పు తీసుకున్నవాడు కీడు కోరుతాడు.
౯౧౦. అప్పు చేసి కొప్పు తీర్చిందిట!
౯౧౧. అప్పుకోసం చెయ్యిచాపినా, చెట్టెక్కి చెయ్యి వదిలినా ప్రమాదమే...
౯౧౨. అప్పు లేకపోతే చాలు, ఐశ్వర్యం ఉన్నట్లే ...
౯౧౩. తలనిండా పేలున్నా, ఊరినిండా అప్పులున్నా బాధ తెలియదు.
౯౧౪. అప్పులున్న వాడికి, చెప్పులున్నవాడికి వెనకాల నడవకూడదు.
౯౧౫. అబద్ధాల పంచాంగంలో అరవై ఘడియలు త్యాజ్యం!
౯౧౬. అరుంధతీ లేదు, అర్ధాన్నమూ లేదు, అరవైవేల అప్పుమాత్రం కనిపిస్తోంది - అన్నాట్ట పెళ్ళికొడుకు...
౯౧౭. అలవిమీరిన అదృష్టం కూడా వెగటే ఔతుంది.
౯౧౮. అనడం పడడం అత్తా నీ స్వభావమా?
౯౧౯. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే సరిపోతుంది.
౯౨౦. అల్పుడికి ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట!
౯౨౧. అల్లమంటేనే తెలియదా, బెల్లంలా తియ్యగా ఉంటుంది - అన్నాడుట!
౯౨౩. పంచ పాండవులు - అంటే, మంచంకోళ్ళలా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించి, పలకమీద ఒకటి వెయ్యాలనుకుని సున్నా చుట్టాడుట ఒక తడబాటుల తమ్మయ్య!
౯౨౪. అల్లుడి కోసం వండిన పప్పు అతిధికి కూడా పనికివచ్చింది.
౯౨౫. అవ్వా కావాలి, బువ్వా కావాలి - అంటే ఎలా ...
౯౨౬. అశ్వద్ధ ప్రదక్షిణాలు చేసి, అప్పుడే పొట్ట తడిమి చూసుకుందిట ఒక ఇల్లాలు!
౯౨౭. అసలే కోతి, ఆపై కల్లు తాగింది, అదిచాలక దానిని తేలు కూడా కుట్టింది ...
౯౨౮. అస్తమానూ అరిచే పిల్లి ఎలకల్ని పట్టలేదు.
౯౨౯. అభ్యాసం కూసువిద్య.
౯౩౦. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరూ అంతే దూరం.