గతి: ఖండ గతి (5-5-5-5)/ అంత్య ప్రాస
*****
మురళీమోహనుడిని మనసులో నిలిపెదను!
నందనందనుడినే దైవముగ కొలిచెదను!
అందాల శ్రీకృష్ణుడందరికి దేవుడే!
శ్రీహరి నామమునే నిత్యమూ పలికెదను!
మురారిని దర్శింప భాగ్యమేయౌనులే,
తనివార గోవిందు రూపునే కాంచెదను!
నెరనమ్మి కొలువగా ఆదుకొను భవుడేలె!
నాపూజలు గైకొని దయజూప పిలిచెదను!
సత్యముగ నీలమణి కృపయున్న చాలులే!
నిరతమూ ముకుందుని భజనలే పాడెదను!
*****
నీలమణి, మురారి =శ్రీ కృష్ణుడు
గజల్: ఖండ గతి : 5 – 5- 5- 5
*****
జగతికే ప్రభువువని నమ్మితిని ఈశ్వరా!
ఆదరణ జూపుమని వేడితిని ఈశ్వరా!
విషము గళమున నిల్పి లోకాలు కాచేవు,
నన్నాదుకొందువని పిలిచితిని ఈశ్వరా!
వరములిడి బ్రోచేటి బోళాశంకరుడివి,
నామొరాలింతువని తెలిపితిని ఈశ్వరా!
కన్నప్ప నినుగొల్చి ముక్తినే పొందేను,
శరణమిక నీవనీ కొలిచితిని ఈశ్వరా!
సత్యనాథుడవీవు సర్వజ్ఞుడవీవెలె,
నీచరణ సన్నిధిని చేరితిని ఈశ్వరా !