
విశ్వంభర -- శ్రీనివాస్ పబ్బరాజు
పద్యజాతి: కందం
తల్లి సహన విశ్వంభర
కళ్ళ రుధిర జల కురియగఁ గడు విహ్వలయై
ఘొల్లున రోదన జేసెను
కొల్లగొనగ మనుజులు తను కొఱఁతై పోయెన్.
వృక్షములను పెకిలించగ
పక్షులు మృగములు వనముల బస కోల్పోయెన్.
భక్షకులకు, భవితవ్యపు
యక్షకులకు శిక్ష వేయ యముడిటు రాడే?
దక్షత నెరుగక దమనులు
కుక్షి కొరకు కల్మషమగు కుపథములఁ జనన్
తక్షక సదృశులు విషము వి~
చక్షణ వీడుచు కలిపిన చనుబాలివిగో!
రాముడు నడిచిన భువిపై
పామర మనుజులు చెలగగ బాహాటముగన్
కామపు వికృతములను గను
నా మది ఘోషకు సరిపడు నాదమ్మేదో?
గట్టున వివేచన వదలి
కట్టిన మేడలు చకచక గగనములంటన్
మెట్టగ మారెను భూములు
గుట్టుగ నంతర్జలములు గుసగుసలాడెన్.
రేపటి చింతన జేయక
పాపములధికముగ జేయు పాషండునిపై
కోపముగ సత్యభామయె
నాపకుడగు తన కొమరుడు నరకుని జంపెన్.
తన సంతతి పతితులవగ
కనికరమును జూపక ధర కలహించినచో
ఘన వృష్టులు, ప్రళయ జలము
లనల శిఖలు, జనుల జులుము లణగించునుగా!
నరునిగ జన్మించుటయే
వరమని భావించి జనులు వదలక ధర్మా~
చరణము జేయుచు నిరతము
ధరణిని కాపాడ వలయు తగు మార్గములన్.
జను లిట్టులు వర్తిల్లగ
వినుటకు సొంపైన గీతి విపుల పలుకుచున్
తనరదె నాలుగు దిక్కుల
వనముల జలముల నగముల వనరుల తోడన్.
అభిమానంగా సవరణల్ని సూచించి, ఓపికగా మెరుగులు దిద్దిన గురు శ్రీ నేమాని సోమయాజులు గారికి కృతజ్ఞతలతో
అమృతవాక్కులు -- శ్రీపాద సుబ్రహ్మణ్యం
1.ఆటవెలది
నీదు తప్పు నీవు నిజముగా తెలిసుకో
వాని తప్పు లెంచ పద్ద తేన
నిన్ను నీవు దెలియ నిశ్చల మెప్పుడు
ఆలకించు మయ్య అమృత వాక్కు
2. ఆటవెలది
నొసటి వ్రాత కెపుడు బాసట గుండుము
కష్ట పడుము నీవు నిష్ట పడుచు
జరుగు నట్టి దేదొ జరిగి తీరు నెపుడు
ఆలకించు మయ్య అమృత వాక్కు
3. ఆటవెలది
అంత రంగమందు నాది దేవు డుoడు
దేహమేను కదర దేవళమ్ము
అతని కొరకు నీవు నాధ్యాత్మికత పొందు
ఆలకించు మయ్య అమృత వాక్కు.
4. ఆటవెలది
పాద మందు ముల్లు బాధ పెట్టు గదర
మనసు లోన నహము మసలు చుండు
వాటి నధిగ మించ పండు వెన్నెల నీది
ఆలకించు మయ్య అమృత వాక్కు.
5. ఆటవెలది
మల్లె కాని నదియు మొల్ల కాని నదియు
పరిమళిoచ వలెను పరుల కొరకు
స్నేహ గీతి యెపుడు సేతువై నిలవాలి
ఆలకించు మయ్య అమృత వాక్కు.
*****
చాలా కాలం తరువాత ఒక షాపులో "గంగాళం" కనబడితే, దాని మీద సరదాగా వ్రాసినది:
గంగాళం! -- సముద్రాల హరికృష్ణ
గంగాళంలో ఏమేం పెడతారోయ్
పట్టినన్ని బిందెల చన్నీళ్ళా
స్నానానికి పెదవారికి వేన్నీళ్ళా?!
ఇంట్లో విందైతే,
నలుగురు విచ్చేసే సందడి అయితే
నోరూరించే నువ్వుల అరిసెలా
ఏలకి సురభుల లడ్డూలా
అబ్బో అనిపించే అప్పాలా,
కావివేవీ,కమ్మని కజ్జికాయలా,
పొట్టని నింపమనే పూర్ణబ్బూరెలా?
**
ఎప్పటికీ తీపేనా
మీ గంగాళం కారం వద్దంటుందా?!
**
కళ్ళ కింపుగ కరకరల కారబ్బూంది
నిండుగ వాంపూసా,జంతికలూ
పదిరోజులు టపటపలాడే తప్పేల చెక్కలు
ఇంకేవైన మనిషికి చురుకిచ్చే,రుచి మెచ్చే
కారక్కారపు ఊరింతలు పెడితే పాపం!
మీ గంగాళం వద్దంటుందా ఏం?!
**
అమ్మోరికి పొంగలి పాయస నైవేద్యాల
అయ్యోరికి పులిహోరలు దధ్ధ్యోదనాల
సంతర్పణకై కమ్మటి కూరలు పులుసుల
బహు దొడ్డది పాత్ర, ఈ ప్రాచీన ప్పాత్రది!
**
ద్రవమైతే ఓ అంటుంది,ఘనమైనా సరే
ఏ వ్యత్యాసం చూపని ఘన పరి మాణపు
గతకాలపు గుర్తుల తెచ్చే ప్రృథు పిత్తళం,
గంగమ్మతో ఏమో బంధం,పేరేమో గంగాళం!
స్వాప్నికుడు -- డి.నాగజ్యోతిశేఖర్
పాడుతూ పాడుతూ మాయమైపోతాడు అతను!
ఏ కొండ శిఖరం పైనో నక్షత్రమై వాలి
లోయల్లోకి వెలుగు బంతుల్ని విసిరేస్తుంటాడు!
ఏ చెట్టుకో తేనెపట్టయి వేళ్ళాడుతూ
భ్రమర గీతం రచిస్తుంటాడు!
ఏ ధృవాల అంచుల్లోనో మంచు శిల్పమై
మానస సరోవరాన్ని వెతుకుతుంటాడు!
ఏ మట్టి పొరల్లోనో చీమై దూరి సైకత కుటీరాల్ని నిర్మిస్తుంటాడు!
అతని కోసం ఎవరూ వెతక్కండి!
వెళుతూ వెళుతూ అతడు వదిలేసిన వెన్నెలపాటల్ని ఆస్వాదించండి!
వీలైతే పూడుకుపోయిన మనోస్వరాల్ని శృతి చేసుకోండి!
అతని ఏకాంతాలనెవరూ భగ్నం చేయకండి!
వస్తూ వస్తూ...
పచ్చని కలల్ని వెంటేసుకు రావడం అతనికి అలవాటు!
మీ తోటలో కాసింత స్థలాన్ని చదును చేసి పెట్టండి!
భూ కక్ష్య చుట్టూ అతడు నాటిన వనాలు...
అవని గుండెల్లో అతను సృజించిన సెలయేళ్ళూ ....
మీకు ఎదురైతే చిన్ని చిరునవ్వుని వాటికి అద్దండి!
మరల మరల అతడు చిగురులు వేసి
విశ్వానికి ఒలీవ కొమ్మయి ఎగబాకుతాడు!
చంద్రునిలో కోరుకున్న నదై ప్రవహిస్తాడు!
మనిషితనం కరచాలనం చేయని చోట నిమిషమైనా నిలబడని అతన్ని
ఆలింగనం చేసుకోవడానికి
చేతులకు కొంచెం ఆకుపచ్చదనం పూసుకోండి!
భూగోళాన్ని భుజానికెత్తుకు తిరిగే అతని స్వాప్నిక జగత్తులో
శాశ్వత చందాదారులు అయ్యేందుకు
కళ్ళకు కాస్త వేకువకాటుక దిద్దుకోండి!
కిటికీ కీవల కూర్చుని ...
మీ కోసం రాయబడ్డ పేజీలను రోజుకు కాసిన్ని తిరగేసి చూడండి చాలు!
రాత్రి గడిచేలోగా
వెలుతురు పిట్టల్ని చేసి అతని వెంట
దిగంతాల ఆవలికి ఎగరేసుకుపోతాడు!
పోరాడితే పోయేదేంలేదు! -- శివకుమార్ పేరిశెట్ల
ఏ శాపమో పాపమో తెలీదు
ఎందుకు బతకతున్నాడో అర్ధంకాదు
అసలు.....దైనందిన పనులు
ఎట్ట చేసుకుంటాడో ఏమో?
కనీసం ఓముద్ద అడుక్కునేందుకైనా
ఒకచోటి నుంచి మరోచోటికి పోలేడు
ధడేల్న వానొచ్చినా
దావానలంగా యండకాసినా
తలదాచుకోవటం కూడా కష్టమే
అయినా..... బతుకీడస్తుంటాడు!
సొంతూరుకానీ
అయినోళ్ళు కానీ సున్నా
పండగలూ పబ్బాలు వుండవు
లక్ష్యాలు గమ్యాలు అసలు కనపడవు
రేపు ఎట్టుంటదో ఎరుకుండదు
చేతిలో చిల్లిగవ్వుండక పోయినా
కళ్ళల్లో కొండంత ఆశుంటది
దేవుణ్ణెతుక్కుంటా కొందరు
దేశాలు తిరగతుంటే
కనపడ్డ ప్రతిమనిషిలో దేవుణ్ణే చూసుకుంటా
చేతులు జోడిస్తాడు
అయినా బతుకీడస్తుంటాడు!
దోమల్తో దోస్తీకట్టి
దుప్పట్లేకుండానే కునుకు తీస్తుంటాడు
కుక్కల్తో కుశాలకొద్దీ
ఒకే ఇస్తట్లో తింటుంటాడు
చిక్కుజుట్టు చింపిరిగెడ్డం
చిరునామా చేస్కొని
చెవి సందులో బీడీముక్క.....
మరిగిన్ని డబ్బులు కుదిర్తే చీపుసుక్క.....
టైం బాలేకపోతే ఖాళీడొక్క.....
అయినా బతుకీడస్తుంటాడు!
గబక్కని యేవన్నా
రోగమో రొష్టో వచ్చిందనుకో
వచ్చిందారినే జబ్బు పోవాల
ఒకేళ సుస్తీ తగ్గలేదనుకో.....
తనే పైకిపోవాల!
అంతలావు కరోనాకే జడవనోడు
కడుపుకి బయపడి
దార్నిపొయ్యే ప్రతి డబ్బుకాళ్ళకి మొక్కతుంటాడు
అయినా బతుకీడస్తుంటాడు!
అన్నీవుండి వడ్డించిన విస్తళ్ళు కొన్ని
అమ్మ తిట్టిందనో
అయ్య డబ్బులీలేదనో
అమ్మాయి ప్రేమించలేదనో
చదువు ౘతికిల పడ్డదనో
ఊపిరికట్ట తెంచేసుకోవటమేనా?
దివ్యాంగుడు చేసే
బతుకుపోరుని చూసైనా బతుకుని బతికించు
పోరాడితే పోయేదేం లేదు!!!
పిట్ట పాట -- పద్మావతి రాంభక్త
పక్కింటి చెట్టుపై
పిట్ట కుటుంబం
గృహప్రవేశం చేయడం చూసాను
ఉదయాలను పిట్ట పాట
అందంగా పలకరించింది
రెక్కల తపతపల సంగీతం
ఎక్కడికో తీసుకెళ్ళింది
గూటికి కొత్త కళ తొడిగిన
పిట్ట ఆనందాన్ని
స్వరంలోంచి జాలువారిన
తీయదనం వివరించింది
పసికూనల నోటికి
పిట్ట అందించే అమ్మతనం
గమనించినపుడు
చిన్నప్పటి గోరుముద్ద
జ్ఞాపకమొచ్చింది
రోజులు ముందుకు నడుస్తుంటే
పిల్లలు ఎగరడంలోని
మెళకువలకు
సాన పెడుతున్నాయి
తల్లితో కువకువల కోరస్
ఎత్తుకుంటున్నాయి
కొమ్మలు
చిగురులేస్తూ పూలు పూస్తూ
సంబరంలో
పాలు పంచుకున్నాయి
నిండుదనానికి వేదికై
చెట్టు మురిసింది
నిన్నో మొన్నో
పిల్లలు నింగిని పలవరిస్తూ
ఎటో వెళ్ళిపోయాయి
ఎదురింటి ముసలమ్మలా
పిట్ట ఒంటరితనాన్ని కప్పుకుని
స్తబ్ధుగా ఉన్నట్టనిపించింది
కాలం ముసిముసిగా నవ్వుతూ
జీవితాన్ని ఓపికగా
మరొకసారి విడమర్చి
బోధపరచింది