Menu Close
SirikonaKavithalu_pagetitle

ఎన్నాళ్ళైనా
ఉదయాలింకా
ఉక్కపోతగానే ఉన్నాయి

అరచేతితో
అక్షరాల వెన్ను నిమురుతూ
నెమ్మదిగా తేనీరును
ఆస్వాదించాలనే అనుభూతి
ఇంకా అందని ద్రాక్షే నాకు
కిటికీ ముఖంలోంచి
అందమైన సూర్యోదయాలను
కనులలోకి ఒంపుకోవాలనేది
అత్యాశే నాకు

నువ్వేమో
ప్రతిపక్ష నాయకుడి
వెనక పడి
పాలకుడిపై పళ్ళు నూరుతూ
తీరికగా
తెరపై
చూపులతో
పరుగులు తీస్తావు

అవతల
మోగిన బెల్లు
నిన్ను కదిలించదు
ఇవతల
కాలువ మింగుతున్న నీరు
నీ కంటికి ఆనదు

వీధి గుమ్మానికి
మోటరు స్విచ్చుకూ మధ్య
ఇరుక్కుంటూ
నా పాదాలు అలసి
సొమ్మసిల్లుతునే ఉన్నాయి

గడియారంలోని ముళ్ళు
నా గుండెల్లో గుచ్చుకుని
వేధిస్తూ
ఎంత నెట్టినా
పనిచక్రం ముందుకు కదలక
నన్ను విసిగిస్తూ

పొయ్యి పొగలతో
సావాసం చేస్తూ నేను
ముఖపుస్తకపు ముద్దుమోముతో
సహచర్యం చేస్తూ నువ్వు

ఇలా ఎన్నో కాలెండర్లు
రెక్కలు తెగి రాలిపడుతూనే ఉన్నాయి
జీవితం అరిగి కుదించుకుపోతూనే ఉంది
నా  ఉదయాలలోకి
వెలుగు చొరబడేదెప్పుడు
అతిసూక్ష్మమైన
నా కోరికల మొగ్గలు
పూలై విరిసేదెపుడు
హృదయం
రంగుల నదై
ప్రవహించేదెపుడు

మనసుకి రూపం ఏమిటో?!మనిషికి అస్తిత్వం ఏదో?!
వచ్చీ పోయే ఆలోచనలా? నిలిచి పోయే జ్ఞాపకాలా!

జ్ఞాపకాల మంజూషంలో దొంతరల పలు అంతరాలు
మల్లెలు, జాజులు, వన్నె గులాబీలు, గుచ్చే కంటకాలు!

మిగలని వాటి కోసం, శాశ్వత మనుకొని ప్రయత్నం!
అసలు నీవే మిగలవు, మరి పరుగు లెక్కడికో?!

వెతుకుతుంటే తెలియదు, దొరికేది మిగలదని!
తీరం దాటాక తెలిసే అందం పేరు, ఈ జీవితమని!

ఏదో తెలిసిందనే లోపు, కరిగే కాలం! సాయం సంధ్య!
ఇదే జీవితం! పరీక్ష తరువాత అర్థమయ్యే పాఠం!

ఎప్పటికీ ఉండిపోయే నిజమని భ్రమింప చేస్తుంది!
మంచులా కరిగి, కంటి ముందరే నీరై జారి పోతుంది!

ఇది గట్టిదేమిటి? ఓటి పడవకు కోటి చిల్లులు!
కోటలా కనిపిస్తుంది! పిచ్చుక గూడై కూలిపోతుంది!

పల్లవి అయిందో లేదో ముక్తాయింపుకై
ఆ తొందరలు
చరణాలు-తోరణా ల్తెగిన గుమ్మాల్లా బిక్క మొహాలు!

చెప్పా పెట్టకుండా,ఒక్కడినే ఇల్లు ఖాళీ చేయిస్తుంది!
రాసేవాక్యం, గీసేబొమ్మ, మధ్యలోనే, ముగింపు అందక!

పాత్రే తాననుకొని ఆడే వింత నాటకం ఈ జీవితం!
నిడివీ, నిష్క్రమణా, అదృశ్య ప్రయోక్త హస్త కౌశలం!

అయినా ----

ఊపిరిలున్నంత వరకు కృషి నీదే, కర్తవ్యం నీదే
తేలికైన మనసుతో వాలిపోతే సార్ధ కత,అదే!

***

అదే గమ్యం, అదే సాధన
అదే ధన్యత, అదే మోక్షం!!

ఎప్పుడు ఎలా? తెలియదు
ఉట్టిమీద వుంది ఎలా జారిందో
క్రింద వున్నది గోపాలుడే
ఏ రాయి విసిరాడో మరి
పాలు దారలై  క్షీర సముద్రాన కలిసాయి...

ఎందుకు? ఎలా...తెలియదు?
పక్కనే చేరాడు పసివాడై
పాలుతాగి పవళించేవాడు
పట్టపోతే పదునాలుగు
భువనంబులు నోటనే చూపాడు

ఎందుకు-ఎలా?..తెలియదు
చిత్రమే చిత్తమున నిలచి
చిరు లేఖకే చెంత చేరి
చేయిపట్టి నుదుట తిలకం దిద్దాడు !...

నా అక్షర శిల్ప వైభవాలను
కనురెప్పల క్రింద స్వప్నాల జాతరగా చూస్తున్నా
తడియారని పెదవులపై
నా భావమకరంద మాధుర్యాన్ని
నాలుకతో తడుముకుంటున్నా
జగద్ధితంగా ఎగరేసిన వెలుగు నుడి గాలిపటాన్ని
కంటికానని దూరాన మినుకు మినుకు తారగా వీక్షిస్తున్నా

కొన్ని తరాల తెరలు శిశిరాలై జారిపడి
పునర్నవ విశ్వాసంతం వికసించి
ఏ స్వప్న శిల్పజ్ఞుడో, ఏ ప్రాచీన మధులాలసుడో, ఏ విశ్వహితైషియో
నా శిథిల గృహంలోని సందర్శించి,
అటకమీంచి నా ధూళిదూసరితమైన
కలలసంచీ భుజాన వేసుకుంటాడు
గతవైభవ ప్రదర్శనశాలలో మరో కొత్త శీర్ణకృతి జమ
నాణ్యతానది పాయలుపాయలుగా పాకి
నకళ్లుగా ప్రపంచం నిండా ప్రవహిస్తాయి
ఇప్పుడు దేహధారిగా  వినాలనుకున్న పది పొగడ్తలు
తురీయావరణంనుంచి వేలతుంపురల మర్మరధ్వనిలో వింటాను
ఉండబట్టలేక కలంతో మళ్లీ ఏ ఆత్మలోకో దూరుతాను
అప్పుడు నా ఉనికిని
నాతోనే పోల్చడం చూసి నవ్వుకుంటాను
ఇప్పుడు అసంపూర్తిగా వదలి వేసిన
భావశిల్పాలను పూర్తి చేయాలనే ధ్యాసలో పడిపోతాను
జన్మ జన్మకూ కవినై కలల శిల్పాలను పోగేస్తుంటాను.

చిత్రమైన గాలిపటం ఏ దారిన పోవునో
ఎన్ని రంగులు పులుము కొని తిరుగునో
ఏ క్షణాన ఎక్కడ నిలిచిపోవునో
చిక్కులెన్నో తెలియని విహంగ జీవితం..!!

దూరము తెలియని గగన ప్రయాణం
మనోహరమైన గాలిలో వళ్ళు పులకరించే
సుగంధ మన్మధుడు ఎటు తిరుగునో
ఆశల చిరుగులెన్ని మొలిచాయో కదా..!!

చేతిలో పట్టిన దారం నింగిని కొలుస్తుంటే
ఆకాశములో పక్షులతో ముచ్చట్లు పెట్టేందుకు
దారి తెలియని గగనములో పల్టీలు కొడుతూ
అలుపెరగని పరుగుల వేగంతో కదులుతుంది..!!

నింగి సముద్రంలో చేప పిల్లలా ఈదుతూ
చుక్కలనే ముత్యాలను పోగు చేసేందుకు
అంతులేని ఆనందముతో సాగుతుంది
పొంగులెన్నొ దాటుకుంటూ వెళ్తుంది..!!

గాలి శబ్దానికి వాయిద్యాల వినిపించే
నింగి రంగస్థలంపై నాట్యాన్ని ప్రదర్శించే
దారపు పోగు ప్రేమ బంధంతో నిలబడగలిగి
గగనములో సీతాకోక చిలుక విస్తరించింది ..!!

నింగిలో ఆదిశేషున్ని తలపిస్తూ
సూర్యచంద్రులకు రాహు కేతువులా తోస్తూ
నీలాకాశములో సప్తవర్ణాలు ప్రదర్శిస్తూ
తోక ఆధారముతో నింగినే చుట్టి వేసింది..!!

నేలపైన చేతి పిడికిలి బిగించి నడుస్తూ
తానేదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ
ఆశల దారం ఉన్నంతవరకు విహరిస్తూ
అర్థం కాని అయోమయంలో తనువు చాలించింది..!!

Posted in January 2025, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!