Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

సఖీ! -- గంగిశెట్టి ల.నా.

గిరిపోతున్న మేఘం
ఏడుకొండల గోపురం మీద కాసేపు కూర్చొంటుంది
కురవడానికీ కాదు, మెరవడానికీ కాదు
కాస్సేపు సేద దీరడానికి, తన గమ్యం తాను తెలుసుకోడానికి
అలాటిదే నువ్వూ - నేనూ- మన జ్ఞాపకం
ఏడు కొండల కంటే ఎత్తైనది
గోపురం కంటే పవిత్రమైనది
జీవితానికే అర్థం చెప్పే గొప్పది కదా మన జ్ఞాపకం...
అక్కడ ఆగిన క్షణమే తెలుస్తుంది కరిగి ఆవిరవుతున్న అనుభూతి
అక్కడ వాలిన క్షణమే తెలుస్తుంది
నన్ను నేను కోల్పోయి ప్రవాహమయ్యే మధురానుభూతి
నన్ను నేను కోల్పోయాక ఎంత మాధుర్యమైతేనేం
ఎన్ని సస్య శ్యామలాలకు ఆదరువు నైతేనేం
నేనంటూ లేనిది ఏదైతేనేం
అందుకే తేలిపోతుంటాను
బరువెక్కిన గుండెలతో
నల్లబారిన పరివేదనతో;
శూన్యం కొలువుతీరిన ఆకాశం
ఎలాగో కసిగా గుర్తుపట్టేస్తుంది
కసికసిగా మెరుపు కొరడా ఝళిపించేస్తుంది
నీజ్ఞాపకాలతో ద్రవించిన గుండెల్ని నిలువునా చీల్చేస్తుంది
రక్తాశ్రుధారల్ని అగాధాల పాలు చేస్తుంది
సఖీ! ఇందులో ఓ చుక్కయినా నీ పాదాలపై పడితే చాలు
నీహృదయగోపురాన్ని అభిషేకించలేని
ఈ గుండె వేడిని నీకు స్పృహణీయం చేస్తే చాలు...

ఓ కన్నె మనసు -- అత్తలూరి విజయలక్ష్మి

అప్పుడెప్పుడో ఓ ప్రేమలేఖ అందించావు
పరువం పరదా తీసిన వేళేమో
అంతులేని బిడియము, ఒకింత ఉక్రోషము
మూకుమ్మడిగా దాడి చేస్తే
అరచేతులు మూసుకుని
అటూ, ఇటూ చూస్తూ
నీ గుండె తలుపు తెరిచాను
గుప్పుమంది ప్రేమ పరిమళం
హృదయం పురి విప్పిన నెమలి అయింది...
మనసు మల్లె పందిరైంది ...
తారలు దోసిళ్ళలో జారిపడ్డాయి
పెదవులు విచ్చుకున్నాయి..
పారవశ్యం పక ,పక నవ్వింది..
అలలు,అలలుగా, హోయలుపోతూ
వందల పక్షులు సందడి చేసినట్టు
జలపాతాలు జారిపోతున్నట్టు
జాజిపూలు జల,జల రాలినట్టు
విరులన్నీ వీణ తీగలై మోహనరాగం
ఆలపించాయి
గుండె దడ, దడ లాడింది
మనసు తుళ్ళిపడింది
ఎందుకీ అలజడి...ఎక్కడ సందడి..
ఏమిటీ సంకేతాలు,
ఎగురుతున్న ప్రేమ పతాకాలు
నీకివే నా అంగీకార సంతకాలు

“నేను” 36 - విశ్వర్షి వాసిలి - శివారవిందాన్ని

నేను
శివాన్ని
స్థితి తంత్రాన్ని.

నేను
శైశవాన్ని
మూల ఆధారాన్ని.

నేను
నాదాన్ని
మౌన కేంద్రాన్ని.

నేను
శ్రీచక్రాన్ని
హృదయ గుండాన్ని.

నేను
గళాన్ని
కాలకూట గరళాన్ని.

నేను
సర్పాన్ని
అమృత కుబుసాన్ని.

నేను
చీకటిని
కనుపాపల రహస్యాన్ని.

నేను
వెలుగును
ముడివీడిన నెలవంకను.

నేను
ఫాలనేత్రను
కుడిఎడమల నెలవును.

నేను
శవాన్ని
శివారవిందాన్ని.

నేను
సమాధిని
నిర్వాణ పతకాన్ని.

ఎదురీత -- అరుణ నారదభట్ల

ఆకాశంలో ఎగరడానికి భయమెందుకనీ
కాసిన్ని మబ్బులు అడ్డుపడతాయంతే!

భూమిపైనడవడం కష్టం
ఏలోయ ఏక్కడుంటుందో తెలిదుగదా!

ప్రవహించేనది కూడా నయమే
మనలను చుక్కచుక్కగా శుభ్రంచేస్తుంది

ఆ పర్వతశిఖరాలు
ఈ కళ్ళలో ఒదిగి పోతుంటాయి
వాటికసలు గర్వమే లేదు!

సముద్రపు ‌అంచులవెంట
ఎన్నైనా
కలలతరగలు మోయొచ్చు
ఎదురీతకు దిగబడినవాడి
ఉఛ్చ్వాసనిశ్వాసాలు వినపడవు గనుక!

ఎటొచ్చీ ఈ ఆవిరి కమ్ముకున్న ఊష్ణతాపమే
ఊపిరితిత్తులను దాటి దేహమంతా ఆవహించింది

ఇప్పుడా మేఘాలు కూడా తేలికే!
నీ అందమైన చేతులతో స్పృషించు
అవే నిశ్శబ్దంగా పక్కకు తొలగిపోతాయి ప్రేమగా

Posted in November 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!