Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

అవును తను చదువుకున్నాడు‬ -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

ఒంటరి రాత్రులలో
గుండె వంగసాగరమై
ఉప్పెనలూ, అల్పపీడనాలు
ద్రోణులూ, క్యుములోనింబస్ లు
ఎన్ని కల్లోలపరచినా
పైకి మాత్రం అందరినీ ఆహ్లాదపరిచే
సెలయేరు తన జీవితం అంటూ
ముందుకు సాగడమే.

అవును
తను చదువుకున్నాడు మరి

చదువుకునేటప్పుడు
ఆశాంతవ్యాప్త వ్యోమసౌధాలు
బారులు తీరి చేతులు చాచి
నీకోసమే మేమున్నదన్నవి.
చేత పట్టా పట్టుకుని మరోచేత్తో పొట్ట పట్టుకుని
బయటకు అడుగు పెట్టగానే అంతటా ఎడారి బీడులే.
అలసి వెనుదిరిగి చూస్తే తాను పెరిగిన నాన్న గూడు.
అందులో రెండు మినుకు మినుకు మనే దివ్వెలు. అమ్మా, నాన్న. అమ్మ ఎప్పుడూ అన్నపూర్ణే. నాన్న ఒక మౌన భారతం. తాను కేవలం ఒక ద్రష్ట.

అవును
తను చదువుకున్నాడు మరి

సాహిత్యం ఎన్ని వీరగాథలను
అందించినా ఎన్ని ప్రణయ కావ్యాలను వినిపించినా
అటువైపు దృష్టి పోనివ్వకుండా
జీవితం అంటే (a+b) whole square తప్ప ఇంకేమీ కాదని
నూరి నూరి చదివించిన బాలనేరస్థుల *నిశ్చైతన్య* గృహాలు మా *పలుకు* బడులు. మధ్యలో ఒక మెరుపు తీగ తనశశివదనం చూపి తళుక్కుమని పలుకరించినా
తానొక కారు మొయిలు గా మిగిలిపోయాడు తప్ప స్పందించలేదు.

అవును
తను చదువుకున్నాడు మరి

తండ్రి తన తరిగే ఆయువునూ,
కరిగే ఆరోగ్యాన్ని
లెక్క పెట్టకుండా తన వికాసం కోసమే రాత్రి,పగలే కాక
మనిషి ప్రతిభ లోంచి పుట్టిన మరో షిఫ్ట్ లో కూడా పనిచేసి
దగ్గితే ఎంతఖర్చోనని ఊపిరి ఉగ్గబెట్టుకుని కూడబెట్టిన నాలుగు రూకలు దాచి దాచి కాలాన్ని జయించలేక కలవరపడుతుంటే
తాను చూసీ చూడలేని వాడై,
తెలిసీ తెలియని వాడై
రెక్కలుండీ ఎగరలేని పక్షిలా
మౌన వీక్షలో  నిష్ప్రగల్భయౌవనాన్ని
ప్రతిఫలింపచేస్తున్నా

అవును
తను చదువుకున్నాడు మరి

అన్వేషణ -- అత్తలూరి విజయలక్ష్మి

కొన్ని క్షణాల చూపుల కలయికతో నన్ను కట్టేసిన నీకోసం
కళ్ళను దీపాల్లా చేసుకుని దారి వెతుక్కుంటూ బయలుదేరాను
అంబరాన్నంటే ఆనందం ... గుండెలపై ఎగురుతూ
సవ్వడి చేస్తుంటే దారినిండా చూపుల నక్షత్రాలు చల్లుకుంటూ
ఆశల పుప్పొడి వెదజల్లుకుంటూ,  కాంతి పరిమళాలలో నీ అనురాగం కోసం
అన్వేషిస్తూ బయలుదేరాను
దూరంగా ఎక్కడో చిన్న వెలుగు
నావైపే చూస్తూ  తన చిన్ని కాంతితో నన్ను ఆహ్వానిస్తూ ...
హృదయం గుండెనుంచి వేరై పరుగులు తీసింది
దరిచేరిన కొద్ది దూరమౌతున్న తీరం … అందని దిగంతం
అయినా అలుపెరుగని పోరాటం… పరిగెత్తే పాదాల కోలాటం,
నిన్ను చేరాలన్న ఆరాటం…..
హటాత్తుగా వినిపించిందో వికటాట్ట హాసం
అణువణువునా ఏదో విస్ఫోటం
ముక్కలు, ముక్కలుగా భగ్నమైన జ్ఞాపకాలు
పగిలిన నమ్మకాల శకలాలు
గాయపడ్డ హృదయపు వేదనలు
గుండెలపైన ఉక్కుపాదాల శబ్దాలు
కోటి గొంతుల హా,హా కారాలు
యుగయుగాల వంచితల ఆర్తనాదాలు
ఆకాశంలో సగాన్నావరించిన కాలుష్య మేఘాలు,
పొగచూరిన సంఘంలో మసిబారిన జీవితాలు
నేనెన్నటికీ చేరలేని అనురాగ హర్మ్యాలు

నేను -- విశ్వర్షి వాసిలి

•1•

నేను
కోరికను
అయినా కోరిక
నాదికానివాడను.
కోరికకు వీలునామా
నేనుకానివాడను.

•2•

నేను
నువ్వనుకుంటున్న

మోహనను కాను
వ్యామోహ వారసుడను కాను
సమ్మోహన వంశజుడనూ కాను.

ఇంతకీ
నువ్వు వెతుకుతున్న
నా కోరికను
నాలో ఎక్కడని వెతకను!
నాలోని ఏ నరమూ
నీకోరికకు సహచరికాదు కదా!

•3•

అవునవును, నేను
నాడుల శక్తిపాతాన్నే కానీ
మోహం మాటున దాగిన
నరవ్యామోహాన్ని కాను.
అన్నట్టు
నా మోహం ప్రణవ ప్రవాహం.

•4•

నేను
తొలి శ్వాసలో

ప్రణయ ప్రణవాన్ని

తుది శ్వాసలో

ప్రణవ ప్రణయాన్ని.

ప్రసవంలో నాప్రణవం ఒక ప్రాణం
ప్రాణంలో నాప్రణయం ఒక జీవం.
అవును,
నువ్వు వెతుకుతున్నది నా ఇంద్రియభోగాన్ని
నేను నెమరుతున్నది అతీంద్రియయోగాగ్నిని.

•5•

నాది మహాప్రస్థానం

సదా సృజనశీలం
విశ్వకేళికి శ్రీకారం.

•6•

ఇంతకీ
నా కోరిక చిరంజీవత్వం

త్రి కాలాలది
పంచ భూతాలది
సప్త ప్రాంగణాలది
నవ గ్రహాలది
ద్వాదశ రాసులది

అతీతంగా నేను అయినది.

కనలేదేమో -- అభిరామ్

నాలుగు
రోడ్లపై
చిల్లరకోసం
చీదరింపుల పర్వంలో
తడిసిముద్దవుతున్నాడు అతడు
బహుశా అతను కొడుకులను
కనలేదేమో

నాలుగు
గోడల్లో
మడతల ముడతలతో
మీదపడిన
ఒంటరితనాన్ని
మోయలేక
మూల్గుతున్నది ఆమె
బహుశా
ఆమె బిడ్డల్ని కనలేదేమో

నిజమే
వారు బిడ్డల్ని కనలేదు
అడ్డ గాడిదల్ని కన్నారు
కనుకే
అమ్మ నాన్నలమని చెప్పుకోలేక
తలోదిక్కు తలదాచుకుంటున్నారు
దక్షిణ దిక్కుకెళ్ళే
దారిని వెతుక్కుంటూ

పాలపొరక‬ -- అరుణ నారదభట్ల

ఆ తప్పెలతోనే అమ్మమ్మ నీళ్ళు ముంచేది
ఆ కొప్పెరలోనే తాత నీళ్ళు కాచేది

అదిగో ఆ ఇనుప గంటె
చారులో చుయ్యిన పోణీ వేసేది
ఆ లోతు ఇనుపపెనం, కంచు మూకుడు
ఉప్పిడిపిండి గోలించిన అమ్మమ్మ చేతిలోని అదే సర్వతం!

అదిగో అదే అదే
తాత చీకట్లోనే లేచి
కడిగిన ఇత్తడి చాయ్ గంజు...
అది...అల్లం దంచిన గుండు!

ఆ రోకలిబండ
నడింట్లో దిగబడ్డ రోలుకే కాదు
చిట్టుపొయ్యికి కూడా నేస్తమే!

అదిగో ఆ ఇత్తడి బిందె
వానలకు దానికి బాగా చుట్టరికం
పొలం గట్లకూ, చెరువు కట్టకూ లెక్కల కుంచం!

అది ఒంటి చెవి రాక్షసి
దాహానికి రక్కసి
ఉగ్గముంత మిద్దెబారంగీ దోస్తీ!

అదిగో గంధపు సాన
అందరికీ చదువుల ఖజానా

అది చౌరంగీపీట
దానికెంత దిద్దులాటో
ఒంటినిండా పువ్వులను చెక్కుకుంది

ఆ చెక్కపీట
అరుగంచున
ఎర్రపంచెతో. సంధ్యవందనంచేసే తాత, రాంపాత్రతో ఉదకం విడిచినట్టే ఉన్నది

పాలగంప,కంకనిచ్చెన, లడ్డూల పళ్ళెం, రంకాయితాలు కట్టిన దూలాలు
పందిట్లో పాలపొరక
ఆ ఇల్లంతా పెళ్లి వాసన!

మండే ఎండను చల్లారుస్తూ
గడపకు,  దర్వాజాకు నీళ్ళు చల్లుతూ అమ్మమ్మ ఇంకా అక్కడే  ఉన్నట్టుంది

Posted in October 2019, సాహిత్యం

2 Comments

  1. Anupama

    అందరికి కృతజ్ఞతలు.కవితలు, పద్యాలు మనస్సుకు హత్తుకున్నాయి.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!