“మన సాహిత్య అభిరుచిని పెంచుకునేలా, రోజూ కవితలో, ఇతర సృజనాత్మక రచనలో, వివేచనలో స్పందనలో పంచుకునేలా, తెలుగుభాషా సాహిత్యాలను ప్రేమించే అన్ని ప్రాంతాల వారూ పాలుపంచుకొనేలా” — కాలిఫోర్నియా నుండి అక్టోబర్ 2, 2018, గాంధీజయంతి నాడు ప్రారంభమైన తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః).
ప్రారంభించిన వారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, పూర్వ ఉపకులపతి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, ఆం. ప్ర., ప్రస్తుతం ఫ్రీమాంట్ నగర వాసి. అదే ప్రాంతంలోని సాహిత్య ప్రియులు శ్రీ వేణు ఆసూరి, ఉభయభాషావధాని, శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గార్లు కార్యనిర్వాహకులు.
ప్రారంభమైన వేళావిశేషమేమిటో కానీ, ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు, విమర్శకులు అద్భుతమైన రచనలతో సంచికను పరిపుష్టం చేస్తున్నారు... వారంరోజుల్లోనే ఒక మంచి సాహిత్య పత్రికగా రూపొందింది..
అందులోంచి ప్రతినెలా ఏర్చి, కూర్చిన రచనలను ‘సిరిమల్లె’ పాఠకులకు అందించాలని సంకల్పించాం...మొదటగా అక్టోబర్ నెలలోని ఆణిముత్యాలు...ఆయా రచయితల అనుమతితో....మీకోసం .....
చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.
పద్యాలు
అక్షరములతో నే నిత్య మాడుకొనుచు
నుండ, నాహృదయమ్ములో నున్న అక్ష
రమ్ము నను పిల్చె లోనికి రమ్మటంచు;
ఆట లిక చాలు ర మ్మన్న అమ్మ వోలె.
కవితలు
రవికిరణం బద్దలైతే ఇంద్రచాపం,
ఏడురంగులు ఏకమైతే సితస్ఫటికం.
కవి ఏకకాలంలో ఏడున్నొక్క వర్ణం;
నింగి కెగిసే రంగు రెక్కల భ్రమరం!
నేల పూచే తెలి రిక్కల పారిజాతం!
ఓ దృశ్య కావ్యమ్!
అందాలు మధ్యాహ్న విహారం సలిపే సన్నివేల్ లో ..
వింటేజి కార్ల ప్రదర్శన వీధి అంచులో..
వంటరితనం మూపులువంచిన అతని గుండెల్లో..
చుట్టూ పరిసరాలు మరచి
తలదాచుకున్న ఆమె నడివయసు స్త్రీత్వం
స్థల-కాలాలను గడ్డకట్టించే ఆత్మీయతల నులివెచ్చందనం
మనిషి కోసం మనిషి ఆరాటపడే మనోజ్ఞ రాగం
ఎంతసేపు అలా నిర్మోహ స్పర్శలో నిశ్చలానందాకృతి దాల్చిందో తెలియదు
ఎంతసేపు గాలి కాలాన్ని స్తంభింప చేసిందో తెలియదు
అతని వీపుమీద వాలిన ఆమె వేలి గోళ్ల వర్ణకాంతులు
చుట్టూ ఏ విద్యుత్తరంగవలయాన్ని సృజించాయో తెలియదు
వారి స్పృహ పొలిమేరల్లోకి ఏ చూపూ చొరబారడం లేదు
క్షణాలు, నిమిషాల్లా మారి వీధి దీపాల్లో దాక్కున్నాయ్
ఒకటి, రెండు, మూడు, నాలుగు...
ఐదు నిమిషాలకు ఆమె కళ్ళెత్తి చూసింది
కళ్ళల్లో తడికి సూరీడి నీరెండ కరిగింది
అతని వ్రేళ్ళల్లో ప్రకంపన ఏ ఆర్తిని వినిపించిందో
'టేక్ కేర్' అంటున్నట్లు సుతారంగా కంపించే ఆమె పెదాలలో ఉద్వేగం....
అనురాగం విరహార్ణవమైతే,
ఆలింగనం ఆలంబనమౌతోంది...
రెండుగుండెల శ్రీశ్రీ లు ఒక్కటై కొత్త సంయుక్త గీతిక పాడుతున్నట్లు
ప్రేమనిర్వచనాలు అనిర్వాచ్యపు రూపు రేఖలు దాల్చినట్లు......
ఇవ్వాళ ప్రేమంటే నాకర్థమైంది:
ఎదపై అదృశ్యంగా తలమోపే సుతిమెత్తని భారం!
ప్రక్కటెముకల్లో సైతం ప్రతిధ్వనించే శ్రుతి పక్వ వేదనాస్వరం!!
చిరకాలపుచిరుకోరిక!
కమ్మనైన కవనమొకటి,
తీయనైన కవిత యొకటి,
కంచికి పోని కథనొక్కటి,
వినాలని చిరకాల కోరిక!
హృద్యమైన పద్యమొకటి,
అనవద్యమైన గద్యమొకటి,
అందమైన కందమొకటి,
చదవాలని చిరకాల వాంఛ!
మత్తుగొలిపె మత్తకోకిలొకటి,
రసములూరు సీసమొకటి,
తేనెలూరు తేటగీతినొకటి,
వీనులార విందామని చిన్ని ఆశ!
అచ్చ తెనుగు పాటలను,
అచ్చెరువుల మాటలను,
స్వచ్ఛమైన ఉచ్చారణలు,
ఒక్కసారి విందామని ఆకాంక్ష !
వెన్న ముద్దలు తిన్నట్టు,
జున్నుపాలు తాగినట్టు,
పున్నమి వెన్నెల గాచినట్టు,
కన్నవారు వెన్ను నిమిరినట్టు,
పోతన పద్యాల జలపాతములో,
నన్నయ, పెద్దన పద జలధి లోతులో,
తిక్కన, వేమన పద కైతల స్రోతసుల,
జలకాలాడాలని చిర కోరిక - చిరు కోరిక!
కృష్ణ శాస్త్రి పాటల పసిడి మేడలను,
విశ్వనాథ కల్పతరువు లేనీడలను,
శ్రీరంగం ప్రస్థానపు మెరుపుదాడులను,
సినారె విశ్వంభర దివ్యవీథి జాడలను,
కనులారా చూడాలని ఆరాటం!
తెలుగు పలుకులు -
తెలుగు జిలుగులు,
తెలుగు వెలుగులు -
తెలుగు తళుకులు,
తెలుగు మెరుపులు,
తెలుగు తలపులు,
తెలుగు సౌరభం,
తెలుగు వైభవం!
మధురానుభవం!
దేశ భాషలందు తెలుగు లెస్స -
కవులందు తెలుగు కవులు హైలెస్స!
నిరాశ..
నిన్ను చంపుతుంది!
దురాశ..,
నిన్ను నమ్మినవాళ్ళని చంపుతుంది!!
కానీ ఆశ..,
అందరినీ బతికిస్తుంది!!!
ఆశకి మరో పేరే...
అక్షరం
దాని విస్తృతే..,సాహిత్యం!!!
రండి బతుకుదాం
యథాలాపంగానే అయినా
కథాలాపంగానే అయినా
నేను! ( దీర్ఘ ధ్యాన కవిత)-1
కాల చైతన్యాన్ని తొలుచుకుంటూ నేను..
కొందరికి పెద్ద ప్రశ్న.. చిరు సమాధానం..
ఇంకొందరికి చిన్న ప్రశ్న.. పెను సమాధానం....
మరి కొందరికి ప్రశ్నా కాదు, సమాధానమూ కాదు
... పరిశోధన, నిరంతర శోధన....
బహిర్గతంగా, అంతర్గతంగా సాగే అనంత శోధన...
కనిపించేదంతా వేదిక.. కనిపించనిది పీఠిక...
కనిపించే విశ్వమంతా ఓ ప్రయోగశాల.. విశ్వమూలాలు యోగభూమికలు..
ప్రయోగ ఫలితం ఆధారాలతో చరిత్రలో నిలిచిపోతుంటుంది.
యోగ ఫలితం అనుభవాలతో మానవ పరిణామంలో కదలిపోతుంటుంది.
అవును,
‘నేను’లో నేను ఉండేది
మేధ వికసిస్తున్నంత వరకే...
మేధ చైతన్యంగా మారి
వాహిక అవుతుంటే
నేను కాలప్రవాహమే.
మేను, మేధ సంయోగిస్తే ‘నేను’
- ఒక ప్రయోగశాల!
మేధ మేనును మైమరపింపచేస్తే ‘నేను’
- ఒక యోగశీల!!
* * *
అరూప జగతిలో రూపజగతి
ఓ ప్రయోగ 'ప్రయాగ'!
రూపం పైతొడుగు...
అరూపం సౌందర్యం లో 'అడుగు' !!
రూపారూప సంయోగంలో
‘మాయ’ పురుడు పోసుకుంది...
మాయతో
నవద్వారపురమై
‘నేను' మురిసిపోతోంది...
మాయ
జీవితం గుప్తనిధికి
హోస్ట్ అండ్ గెస్ట్ గా మిగిలిపోతోంది.
వాల్మీకి జయంతిని పురస్కరించుకొని శరత్ పూర్ణిమ
చారు కిరణ చంద్రుడు
అలలపై వలలను పరచి
తేట నీటి సంభ్రమాన
తేలియాడే సమయం
నేల దారుల వంకలలో
నెలత పున్నమి
శ్వేత వసన శృంగారపు
కులుకుల దివ్యాగమనం
హరిత తృణాంచల సురభిళ
హిమబిందు తతితో
అర్ఘ్య మిచ్చిన హృదయాలకు పరిఢవిల్లెను సుకుమార నయనాంచల భావ సంచారం
అటు తరువుల
సునినాద శాఖా నిస్వన స్వాగతాలకు
దరికి చేరెను తమి దీరగ సమీరం
ఇటు రత్నాకరుడవతరించెను
రామాయణ మహా మాలా రత్నములను
అనంతముగ
వెండి వెన్నెలల సూత్రాలకు
గుది గుచ్చెను
నిండు యుగముల
సంస్కారము పంచెను
ప్రకృతివర్ణన
(వర్ష ఋతువు శరదృతువు గా మారుతోన్న ఈ సమయంలో)
జడివానలాగేను కరిమబ్బుదాగేను
మిన్నంత చుక్కల్ల మిణుకులాయె
నెలబాలుడాడేను నెఱనవ్వులీనేను
వలిపంపు వన్నెతో వసుధ మెరసె
వెలిబువ్వ రుచి కోరి చలచంచువదె వేచె
విందారగింపంగ వెన్నముద్ద
చలిగాలి తిరిగేను తలిరాకు వణకేను
మొగసాల వెలసేను మొదటి నెగడు
నల్లనమ్మకు దసరాల నజరులిచ్చి
వల్వబూదెల దొరకింత వసతిజేసి
నలుపు తెలుపుల కార్తీకమిలను గలిపె
నర్థనారీశ్వరత్వమ్ము నమలుజేసె !!
(నెల బాలుడు = చందమామ, వలిపము = తెల్లనిది, వెలి బువ్వ = తెల్లని ఆహారము (చంద్రుని కిరణములు), చలచంచువు = చకోరము, తలిరాకు = చిగురాకు, మొగసాల = ఇంటి ముందు, నెగడు = చిన్ని మంట, నజరులు = బహుమతులు, వందనములు, వల్వబూదెల దొర = వంటినిండా తెల్లని బూడిద పూసుకున్న శివయ్య).