చాలాకాలం నుండి స్వర్ణలోయ (శాక్రిమెంటో) సాహితీ అభిమానులు, మన తెలుగు వారు ఎంతో భాషాభిమానంతో ఎదురు చూసిన అవధాన కార్యక్రమం జూలై 14, 2018, స్థానిక లక్ష్మీనారాయణ మందిరంలో జయప్రదంగా జరిగింది.
బే ఏరియా శానోజే నగరవాసి, ద్విభాషా అవధాని శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు సకల జనరంజకంగా, చమత్కారభరితంగా, సంస్కృతాంధ్ర ఉభయ భాషల్లోనూ ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శాక్రిమెంటో తెలుగువారితో పాటు, బే ఏరియా లోని తెలుగు భాషాభిమానులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడి సాహిత్యవేదిక "వీక్షణం", ఈ కార్యక్రమ నిర్వహణకు తన సంయుక్త సహకారాన్నందిస్తూ, జులై నెల సమావేశాన్ని ఇందులో భాగంగా ఇక్కడే నిర్వహించుకొంది.
ఈ అవధాన ప్రక్రియలో తెలుగుకు సంబంధించి ఎనిమది మంది, సంస్కృతం నుంచి నలుగురు మొత్తం 12 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. ఎనమండుగురు పృచ్ఛకులు ( ప్రశ్న వేసేవారు) ఉంటే అది అష్టావధానం. పన్నెండుగురున్నారు కనుక ఇది ఉభయ భాషా ద్వాదశావధానం.
కొత్తగా అవధానరంగం లోకి అడుగుపెట్టినా, ఇలా ఉభయభాషావధానం నిర్వహించడం శ్రీచరణ్ గారి ప్రత్యేకత! కావటానికి వారు వృత్తిరీత్యా ఇంజనీరయినా, విద్యారంగానికి చెందిన జననీజనకులు శ్రీమతి మనోరంజనం, శ్రీ జయరామానాయుడు గార్ల (తిరుపతివాస్తవ్యులు) స్ఫూర్తితో, సంస్కృతాంధ్రభాషలు రెంటిలోనూ స్వయంకృషితో క్షుణ్ణమైన పాండిత్యం సంపాదించారు. గత అయిదేళ్ల పైబడి మిల్పిటాస్ లోని సత్యనారాయణస్వామి ఆలయ ప్రధాన అర్చకులు, V E D A సంస్థ అధిపతి శ్రీ మారేమండ నాగవెంకటశాస్త్రి గారి వద్ద నిష్ఠగా వేదాధ్యయనం చేస్తున్నారు. సుప్రసిద్ధ అవధాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రేరణతో ఆరేళ్లనుంచి సంస్కృతాంధ్రభాషలు రెండింటిలోనూ సలక్షణమైన, భక్తిప్రధానమైన, చక్కటి ఛందోబద్ధమైన కవిత్వం రాస్తున్నారు. ఆత్మీయుల ప్రేరణతో గతసంవత్సరం నుంచి అవధాన రంగంలో అడుగుపెట్టి, అప్పుడే అనాయాసంగా అయిదు అవధానాలు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా, గత సంవత్సరం, అమెరికాలోనే కాదు, తెలుగునాటకూడా ఎవరూ తలపెట్టని విధంగా, "సంస్కృతాంధ్ర ఉభయ భాషా ద్విగుణీకృత అష్టావధానా"న్ని ఓం ప్రథమంగా నిర్వహించి తనకు తనే ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకొన్నారు. అలా అమెరికా తెలుగు పౌరుల ప్రతిభకు ఒక కీర్తిపతాకగా నిలిచారు.
జూలై 14 న జరిగిన అవధాన కార్యక్రమానికి వారి గురువుగారు బ్రహ్మశ్రీ మారేపల్లి వెంకటశాస్త్రి గారే అధ్యక్షత వహించి ఆశీర్వదించారు. సర్వశ్రీ తల్లాప్రగడ రామచంద్రరావు, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, పంచాంగం అప్పాజీ, వెంపటి భాస్కర్, లంకపల్లి బాబూజీ, మైలవరపు సాయికృష్ణ, మాజేటి సుమలత, కళాగీత గారలు వివిధ అంశాలలో పృచ్ఛకులు కాగా, నాగవెంకటశాస్త్రి గారు సంస్కృతంలోనూ, డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారు తెలుగులోనూ పురాణపఠనం గావించి తమ గాత్రమాధురితో సభను అలరించారు. చక్కటి హాస్యచమత్కార ప్రశ్నలతో కాశీవజ్ఝల శారదగారి అప్రస్తుత ప్రసంగం సభను మరింత రక్తి కట్టించింది.
తెలుగు పురాణ పఠనము: శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి తెలుగు పురాణ పఠనము అందరినీ ఉఱ్ఱూతలూగించినది. తెనాలి రామలింగ పాండురంగ మహాత్మ్యము, నంది తిమ్మన పారిజాతాపహరణము మున్నగు పురాణములనుండి మృదుమధురముగా అక్కిరాజువారు ఆలపించిన పద్యాలకు అవధాని వారు చక్కటి వ్యాఖ్యానము నొసగినారు.
సంస్కృత పురాణ పఠనము: అవధాని గారు సంస్కృతమున పురాణాలనుండే కాక శ్రుతులనుండి కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి వారు ప్రస్తుతించిన అంశములను చక్కగా వ్యాఖ్యానించినారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
అవధానంలో వర్షించిన కవితా రసగుళికలివి:
1. ఏ అవధానంలోనైనా మొదటి పట్టు నిషిద్ధాక్షరిదే. అది రసపట్టుగా మారితే అవధానం మొత్తం సాహిత్యవినోదానికి ఆటపట్టే ! నిషిద్ధాక్షరి అంటే అక్షరం అక్షరానికి నిషేధం చెప్పటమే. ఉదాహరణకు రాముడి మీద పద్యం చెప్పమంటారు. అవధాని 'రా' అనగానే, తర్వాతి అక్షరం 'మ’ ఉండకూడదని నిషేధం చెప్పటం. సరే, అందుకు బదులుగా రాఘవ అందామనుకొని, అవధాని 'ఘ' అనగానే, ఆ తర్వాత 'వ' రాకూడదని పృచ్ఛకుడు నిషేధం చెబుతాడు... ఇలా అక్షరం అక్షరంలోనూ గొంతు పట్టేసుకోడమే నిషిద్ధాక్షరి. దాన్ని నిర్వహించే పృచ్ఛకుడు స్వయంగా కవి కూడా అవుతే, సులభంగా శబ్దాన్ని ఊహిస్తూ, పదం పాదంలో కాదు, అక్షరం అక్షరంలోనూ అవధానికి విషమ పరీక్ష పెట్టగలడు.
మొన్న నిషిద్ధాక్షరి నిర్వహించిన శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావు గారు సరసుడైన పండితుడే కాదు, తెలుగులో చక్కటి కవిత్వం కూడా రాయగలవారు. అందుకే సభ్యులందరూ మెచ్చేలా కఠిన పరీక్షలే పెట్టారు. సమర్థవంతముగా, మంచి నిషేధములు పెడుతూ అవధాని గారి చేత అద్భుతమైన రామతత్త్వాన్ని పలికించినారు.
ఆంశము: రాములవారు తనని పూజించినవారినీ దూషించినవారినీ అందరినీ చల్లగా చూచుగాక అని పద్యం చెప్పాలి. పూరణ ఇలా సాగినది. ()లో ఉన్న అక్షరాలు నిషేధించినవి. శ్రీచరణు గారు ఈ క్రింది విధముగా అందముగా పూరించినారు.
(ర)తా (ర)నే (ధ)ర(క)సం(ద)బు(-) శ్రీ(ర)మ
(త)ద్భా (-)ను(డ)కు (ల)గ్లౌ (ర) ను (-)న (ర)న(గ)తా(స)ను (-)భా(స)వ(బ)ము (క)న(న)ర్తి
(చ) త్రా(-)ణు(క)డు(-)రా(మ)ర(మ)క్ష(క)గు(ర)తన్
(-)నా(-)నా(వ)ఘ(న) వి(-)న(త)ష్ట (మ)నీ(-)వె(-)నా (ద)స్తు(త)ల (క)ని (న)ష్పా
సునాయాసంగా అవధాని, పృచ్ఛకులు కోరిన రామతత్త్వం మీద ఈ కింది పద్యం అల్లేశారు:
కం . తానేరసంబు శ్రీమ
ద్భానుకు గ్లౌనునన తానెభావమునర్థి
త్రాణుడురారక్షగుతన్
నానాఘవినష్టనీవెనాస్తుల నిష్పా||
2. రెండవ ప్రధానాంశం, సమస్య. విరుద్ధ భావమున్న ఒక పద్యపాదాన్నిచ్చి, అందులోని విపరీతార్థాన్ని తొలగించి అర్థవంతంగా పూరించమనడమే సమస్యలోని సమస్య.
తెలుగులో శ్రీ లంకిపల్లి బాబూజీ గారు ఇచ్చిన సమస్య ఇది: “మధుపానంబును సల్పగా గలుగు నాత్మానందపున్ ప్రాజ్ఞతల్”. ... మధుపానం చేసేవారికి ప్రాజ్ఞమైన ఆత్మానందం కలగడమేమిటి?
ఆ వైరుధ్యాన్ని తొలగిస్తూ అవధాని గారిలా చక్కగా పూరించారు:
మ. విధివశ్యంబునబుట్టినట్టి బుధుడే విధ్యుక్త ధర్మంబునున్
మదిలోనెంచక రాక్షసుండగుచు సన్మార్గంబునున్వీడిదు
ర్మదుడై భ్రష్టతనొంది హీనగతులందన్ముక్తుడైనట్లుగా
మధుపానంబును సల్పగా గలుగు నాత్మానందపున్ ప్రాజ్ఞతల్
సంస్కృతంలో శ్రీమతి మాజేటి సుమలత గారిచ్చిన సమస్య: “త్వమేవ మూర్ఖశ్చ కవిస్త్వమేవ”. అంటే “ నువ్వే మూర్ఖుడివి, నువ్వే కవివి” అని అర్థం. అర్థంలోని ఆ వైరుధ్యాన్ని పరిహరిస్తూ అవధాని చేసిన చతుర పూరణ ఇది:
కవిస్తు నామాపి జలస్థ కాకః
వికార కంఠస్తు విచార హీనః ।
విమర్శనమ్ కిమ్ వ్యపదేశ భావమ్
త్వమేవ మూర్ఖశ్చ కవిస్త్వమేవ ।।
కవి అనే పేరు నీటికాకికి కూడా చెల్లుతుంది కాబట్టి, దానిమీద చమత్కరిస్తూ మూర్ఖకవులకు కూడా అన్వయించేలా పైవిధంగా పూరించారు.
- అవధానంలో తర్వాతి ముఖ్యాంశం: దత్తపది. అంటే పరస్పరం సంబంధం లేని నాలుగు పదాలనిచ్చి, వాటిని నాలుగు పాదాలలో వాడుతూ, కోరిన అంశంమీద, కోరిన ఛందస్సులో పద్యం చెప్పమని అడగడం....
తెలుగులో దత్తపది పృచ్ఛకులు శ్రీ పంచాంగం అప్పాజీ గారు. “అర్ధము, ఛందస్సు, లేని, పదము” అనే నాలుగు పదాలనిచ్చి - మహర్షి సంబంధంగా పద్యం చెప్పాలని కోరారు. దానికి అవధానిగారు చేసిన రసవత్తర పూరణ ఇది:
తే.గీ. అర్ధభాగంబు శక్తికి నమరుచుండ
తాను జనకుడై ఛందస్సు స్థాపనంబు
స్వర నియమముల నియతించె పరమ శివుడు
ముక్తి పదమన బ్రహ్మర్షి మునినుతుండు
సంస్కృతంలో దత్తపదికి శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమారు గారు ‘సారూప్యమ్, సామీప్యమ్, సాలోక్యమ్, సాయుజ్యమ్ ‘ అనే నాలుగు ఆధ్యాత్మిక పదాలనిచ్చి ఫీఫా ఫుట్ బాలు క్రీడను వర్ణించమన్నారు. అవధాని వారు అవలీలగా ఈవిధంగా పూరించినారు:
పూర్ణేందు బింబ సారూప్యమ్
పద సామీప్య చాతురీమ్ (వైఖరీమ్)
ప్రేక్షక రసాలోక్యమ్ వై
క్రీడా సాయుజ్యముచ్యతే ।।
ఫుట్ బాలు పూర్ణచంద్రుడిలా ఉంటుంది కదా! పద/పాదాల సామీప్యంతో, వాటి చాతుర్యంతోనే కదా ఆట! ఇక ప్రేక్షకుల క్రీడాసాయుజ్యం తెలిసిందే కదా! అదే చెప్పబడ్డది.
- వర్ణన: శాన్ ఫ్రాన్సిస్కో అఖాత ప్రాంతంలో పెరుగుతున్న భారతీయ సంతతి ఔద్ధత్యం గురించి తనకిష్టమైన ఆటవెలదిలో వర్ణించమని పృచ్ఛకులు శ్రీ మైలవరపు సాయికృష్ణ గారు అడిగిన దానికి బదులుగా అవధాని ఈ క్రింది పద్యం చెప్పారు:
ఆ. వె. ఇంటి గుట్టు మామ యెఱుగడే ధరలోన
తెల్లవాడె తాను తెల్లబోవ
దేశకాలమెఱిగి తిరుగకయున్నచో
నగులపాలు గాడె నరుడునకట
5. పైవన్నీ ఒక్కో ఆవృత్తం (రౌండు) లో ఒక్కో పాదం చొప్పున చెప్పేవి. నాలుగో రౌండుకు కానీ పద్యం పూర్తి కాదు. అలాకాక ప్రతి ఆవృత్తానికి ఒక్కో పద్యం చొప్పున పూర్తిగా చెప్పేది ఆశువు! దీన్ని వీక్షణం ముఖ్య నిర్వాహకులు శ్రీమతి కళా గీతామాధవి గారు నిర్వహించారు. దాదాపు నాలుగు ఆవృత్తాల్లోనూ వారు అమెరికా అధ్యక్షులు డొనాల్డు ట్రంపు గారి చుట్టే ప్రశ్నలడిగినా, అవధాని గారెంతో చమత్కారంగా, వైవిధ్యభరితంగా ఆశు వర్ణనలు చేశారు.
మొదటగా డొనాల్డు ట్రంపు గారు వీక్షణానికి వస్తే ఎలా ఉంటుందో వర్ణించండంటే చెప్పిన పద్యం సభను నవ్వుల్లో ముంచెత్తింది. అది:
తే.గీ. ఉష్ట్రమును వాహనంబుగ రాష్ట్ర పతియె
వీక్షణాంగణంబునకును వేగ రాగ
పృష్ఠతాడనంబొందగ దృష్టి మారి
యాంధ్ర సంస్కృతంబుల్ గొప్పవనియె తాను
తర్వాత శ్వేత సౌధంలో వీక్షణంనిర్వహిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటే—
చంద్రకాంతులీను ఇంద్ర సభనుబోలు
శ్వేతసౌధమందు కైతజెప్ప
భాషలందు భరతభాషలే గొప్పరా
యనుచు విశ్వమెల్ల వినుతి సేయు
(నిజమే, ఇలాటి సాహిత్య క్రీడ, ప్రౌఢిమ మరే భాషల్లో ఉంటాయి?)
వీక్షణంలో శతావధానం చేస్తానని మాటిస్తూ ....
కవన సీమ కవికుల భువనంబు
వీక్షణంబు గగన వీక్షణంబు
వేదిగాగ వలయు వివిధావధానముల
కమెరికాన శారదాకరంబు
చివర ఆవృత్తంలో ట్రంపు గారిచే అవధానము చేయిస్తే ఎలా ఉంటుందో చెప్పండంటే—
రాష్ట్రపతికైన నిత్యంబు రచ్చరచ్చ
పృచ్ఛకుల్ వేలు లక్షలు పిచ్చిగొల్ప
దినదినంబును గండాన మనుచునుండు
వేరు యవధానమేలొకో విదిత మతికి
పై పద్యంలో విదిత అనే చోట వెఱ్ఱి అనే మాట మొదట వినపడ్డంతో సభంతా నవ్వుల్తో హోరెత్తింది....
- వ్యస్తాక్షరి : ఈ ఆవృత్తాలన్నీ జరుగుతూండగానే, మధ్యమధ్య తనకు తోచిన సమయంలో, ముఖ్యంగా అవధాని తీవ్రంగా ఏదైనా శబ్దంకోసం ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు, మరో పృచ్ఛకుడు 'ఫలానా పాదంలో ఫలానా సంఖ్య వద్ద ఫలానా అక్షరం' అంటూ విడివిడిగా కొన్ని అక్షరాలను ఇస్తాడు. అవి అవధాని అవధానతను - అంటే,అటెన్షన్ ను - మరల్చడానికి! అంటే అలా విడి విడిగా -అంటే వ్యస్తంగా- ఇచ్చిన అక్షరాలనన్నిటినీ జ్ఞాపకం పెట్టుకొని చివర్లో సరిగ్గా అప్పచెప్పాలి. శ్రీ వెంపటి భాస్కరు గారు చాలా సమయస్ఫూర్తితో ఇచ్చిన 13 అక్షరముల వ్యస్తాక్షరిని అవధాని గారు చివర్లో వరుస తప్పకుండా అర్థవంతంగా చెప్పి ప్రేక్షకుల కరతాళ ధ్వనుల్ని స్వంతం చేసుకొన్నారు.
ఆ వ్యస్త అక్షర క్రమం ఇది: 1 ప, 2 లు, 3 కు, 4 ల,5 వి, 6 శ్వ, 7 సిం,8 పు, 9. ము, 10 వి, 11 ప, 12 న్ను, 13 ల.
7 వ అంశంగా పురాణ పఠనం రసభావవివరణ సహితంగా సాగగా, 8 అంశంతో నవ్వుల విరిజల్లు కురిపించే అప్రస్తుత ప్రసంగం.
ఈ అవధానమునకు ప్రత్యేక ఆకర్షణగా శ్రీమతి కాశీవఝల శారద గార్ల అప్రస్తుత ప్రసంగము నిలచినది. ఎంతో అసందర్భముగా వీరు అడిగిన ప్రశ్నలకు అవధాని వారు సమయస్ఫూర్తితో సమాధానములనొసగినారు. మచ్చుకు కొన్ని:
పృచ్ఛకులు: సీతాపహరణము సమయములో సెల్ ఫోను సదుపాయం ఉంటే ఎట్లా ఉండేది?
అవధాని వారు: సిగ్నలు ఉండేది కాదు! రావణుడు లేకుండా చేయగల నియంత.
పృచ్ఛకులు: చేసిన పాపము చెబితే పోవును, మరి చేసిన పుణ్యము ఎట్లు పోవును?
అవధాని వారు: చేసిన పుణ్యము చేయగా పోవును!!
పృచ్ఛకులు: అర టీ + అర టీ =? (ఒకటి అని చెబుతారని ఆశిస్తూ ..)
అవధాని వారు: పర టీ! (అర టీ లు మనకు తాగ యోగ్యము కాదని, కనుక పరుల పాలని సూచిస్తూ ..)
నాలుగు ఆవృత్తాలైన తర్వాత, అంతదాకా ప్రతి ఆవృత్తంలో చెప్పిన పాదాన్ని అక్షరం పొల్లుపోకుండా సభకు అప్పచెప్పాలి. దీన్నే -ధారణ -అంటారు. ఇందులో అవధాని కృతకృత్యులైతేనే అవధానం జయప్రదమైనట్లు!!
దాన్ని సునాయాసంగా నెరవేర్చి అవధాని సభా నిర్వాహకుల సత్కారమందుకొన్నారు. వారితోపాటు పృచ్ఛకులకు కూడా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక అన్నపూర్ణ సంస్థ వారు స్వచ్ఛందంగా విందు ఏర్పాట్లు అందించారు. శ్రీ వెంపటి భాస్కరు, శ్రీ మైలవరపు సాయికృష్ణ, ఘోరకవి ఈశ్వరు, శ్రీ చండ్ర నగేశు దంపతులు, శ్రీ మద్ది అవినాశు దంపతులు, ఇతర మిత్రులు అవధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, శ్రీ దురిసేటి రావు ధ్వని సహకారాన్ని, శ్రీ కాండూరి రాజీవలోచను దృశ్య చిత్రీకరణ సహాయాన్ని అందించారు.