విమర్శ
అది ఒక స్కూలు ప్రాంగణం. ఉదయం పూట క్లాసులు మొదలయ్యే ముందు ప్రార్థన కోసం అందరూ స్కూలు ఆవరణలో చేరారు. ఒకమ్మాయి ముందుకి వచ్చి రోజులాగానే తన తియ్యని గొంతుతో ప్రార్థనాగీతం పాడింది. పాట అయిన వెంటనే అక్కడే వున్న ప్రిన్సిపాలుగారు, "చక్కగా పాడావు కానీ ఏదో తప్పు పని చేస్తున్నట్లు అలా తల వంచుకుని పాడావెందుకు? అయినా పేరులోనేమో రాణి అని పెట్టుకున్నావు, మరి అంత భయం ఎందుకు?" అన్నారు ఆమెతో. అసలే వయసుకి మించిన చదువుతో పెద్ద క్లాసులో వున్న ఆ చిన్నపిల్ల, స్కూలు మొత్తం అందరి ముందు ఆవిడ అలా అనేసరికి, పాపం, బిక్కచచ్చిపోయింది. మౌనంగా తన స్థానంలోకి వెళ్ళి నిలబడింది. కానీ ప్రిన్సిపాలుగారు అందరి ముందూ అలా అనేసరికి ఆ అమ్మాయికి, పాపం, చాలా సిగ్గుగా వుంది. కానీ మెల్లిగా తనను తానే సంబాళించుకుంది. ఆవిడ ఎత్తి చూపించిన తన లోపాన్ని గ్రహించింది. ఆతర్వాత దాన్ని సవరించుకోవటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసి దాని మీద ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు, సాధన చేసి, పెద్దయిన తర్వాత పెద్ద గాయనిగా పేరు తెచ్చుకుని టేలెంటుకి నిలయమైన రేడియో స్టేషనులో కూడా పాడటం మొదలుపెట్టింది. వేలమంది ముందు అనేక స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చింది. చిన్నప్పటి లోపం మళ్ళీ ఎప్పుడూ ఆమె ప్రదర్శనలలో చోటు చేసుకోలేదు. దేశ విదేశాల్లో మంచి గాయనిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆమె అంతటితో ఆగలేదు. పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది. ఇంకా వ్యవహరిస్తోంది కూడాను.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు. నేనే! నేను చిన్నప్పుడు నాకు తెలీకుండానే తల దించుకుని పాడేదాన్ని కాబోలు. అసలు ఆ ప్రిన్సిపాలుగారు చెప్పేదాకా ఆ అలవాటు వుందన్న సంగతి నాకు తెలీనే తెలీదు. తెలిసిన తర్వాత దాన్ని సవరించుకున్నాను. ఆతర్వాత ఎన్నో వేల ప్రేక్షకుల ముందు లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చినా ఎప్పుడూ ధైర్యంగా తలెత్తి పాడానే కానీ చూడటానికి బెరుకుగా అనిపించేలాగా తల వంచుకుని కాదు. దీనికి కారణం ఆ ప్రిన్సిపాలుగారు చేసిన విమర్శ అని మనందరికీ తెలుస్తోంది. అవునా? ఆవిడ నాలోని లోపాన్ని నేనే గుర్తించేలాగా చేసారు. అందుకే విమర్శ అన్నది మనిషి పెరుగుదలకి, లోపాలని వదిలించుకోవడానికి చాలా అవసరం అంటాను నేను. ఎందుకంటే మనకి ఎదుటివారిలో వున్న లోపాలు కనిపిస్తాయి కానీ మనలో వున్న లోపాలు కనిపించకపోవచ్చు. అలాంటి సమయాలలో మన లోపాలను సవరించుకోవటానికి, మనిషిగా ఎదగటానికి, ఏ రంగంలోనైనా అభివృద్ధిని సాధించటానికి ఎదుటివారి విమర్శలు మనకి చాలా సహాయం చేస్తాయి.
అయినా కూడా ఈ విమర్శకు చాలా చెడ్డపేరు వుంది. ఎందుకంటే విమర్శను అందరూ నెగటివ్ గానే చూస్తారు కానీ పాజిటివ్ గా ఎవ్వరూ చూడరు.
అయితే అసలు ఈ విమర్శ అంటే ఏమిటి? పాపం, అసలు దానికి అంత చెడ్డపేరు ఎందుకు వచ్చింది?
ఒక విషయం గురించి కానీ, వస్తువు గురించి కానీ, లేక ఒక మనిషి గురించి కానీ మంచి, చెడు రెండిటి గురించి నిష్పక్షపాతంగా తమ అభిప్రాయాన్ని చెప్పటాన్ని విమర్శించటం అంటారు. అంటే విమర్శ అన్నది మంచి, చెడు రెండింటికి సంబంధించింది. కానీ విమర్శ అనగానే ఎందుకో, చాలామందికి నెగటివ్ గానే అనిపిస్తుంది. మానవ సహజంగా అందరూ పొగడ్తలనే ఇష్టపడతారు కాబట్టి అయిష్టమైన విమర్శలని, అవి మన మంచి కోసం అయినా సరే, ఎవ్వరూ కోరుకోరు. అందుకే వాటికి, పాపం, అంత చెడ్డపేరు.
ఈ విమర్శలలో చాలా రకాలున్నాయి. విధ్వంసకరమైన విమర్శ, అంటే destructive criticism అన్నమాట, ఎవ్వరికీ ఏ లాభమూ చేయదు. పైగా నష్టాన్ని కలిగిస్తుంది. 'నీకు ఏ పనీ సరిగ్గా చేయటం రాదు' అని అంటే ఎవరికైనా ఎలా వుంటుంది? ఇంక నిజంగానే వారికి మళ్ళీ ఏ పనీ చెయ్యాలనిపించదు. అలాగే 'ఆ పని అలా ఎందుకు చేసావు?' అంటే 'ఆ పనిని అలా చేయకూడదు' అనే అర్థం వస్తుంది. అవునా? ఎదుటివారి ఆసక్తి పూర్తిగా చచ్చిపోతుంది. విధ్వంసక విమర్శ అంటే ఇదే! అంతా ధ్వంసం, విధ్వంసమే!
దీని బదులు 'ఆ పనిని నీ పద్ధతిలో చేస్తే, ఇదుగో, ఇలా అవుతుంది, దాని బదులు అలా చేసావనుకో, అప్పుడు అలా అవుతుంది' అని విపులంగా చెప్తే అది నిర్మాణాత్మక విమర్శ, అంటే constructive criticism అవుతుంది. అంటే ఏం చేస్తే ఆ పని బాగుంటుందో అది మనం విశదీకరిస్తున్నామన్నమాట. అలాగే అదే పనిని ఇంకొంచెం విపులంగా, దశలవారీగా, క్రమక్రమంగా ఎలా చేయాలో వివరిస్తే అది బోధనాత్మక విమర్శ, అంటే instructive criticism అవుతుంది. కానీ ఎంత నిర్మాణాత్మకమైనా, ఎంత మంచి చేసేదైనా సరే, విమర్శ సరైన పద్ధతిలో చెప్పకపోతే దాని వుద్దేశం పూర్తవదు సరి కదా, దానికి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే విమర్శను వ్యక్తపరిచే పధ్ధతి దగ్గర నుండి, అప్పుడు వాడే భాష, పదాల దగ్గర నుండి, ఆ స్థలం దగ్గర నుండి, ఆ సమయం దగ్గర నుండి, అన్ని విషయాలలోనూ చాలా జాగ్రత్తగా వుండాలి. లేకపోతే విమర్శ, సద్విమర్శ అయినా సరే, సానుకూలమైన ఫలితాలను ఇవ్వదు. ఆనాడు స్కూలు మొత్తం ముందు ప్రిన్సిపాలుగారు అలా అంటే నాక్కూడా చాలా సిగ్గుగా అనిపించింది. అలా కాకుండా ఆవిడ అవే మాటలు తన ఆఫీసుకి పిలిచి చెప్తే బహుశా అంత ఇబ్బందిగా అనిపించేది కాదేమో! అదృష్టవశాత్తు నేను ఆవిడ మాటలను సరైన పద్ధతిలో తీసుకున్నాను కాబట్టి నా లోపాన్ని నేను సవరించుకోగలిగాను. కానీ అందరి ముందూ గభాల్న వ్యక్తపరిచిన ఆవిడ విమర్శకు సిగ్గుతో కుంచించుకుపోయి ఇంక మళ్ళీ పాట అన్న మాట ఎత్తకుండా ముడుచుకుపోయే ప్రమాదం కూడా వుంది సుమా! అలాగే ఇంక నేను అందరి ముందుకు వెళ్ళను అని భీష్మించుకుని సభను చూడగానే గడగడా వణికే ప్రమాదం కూడా వుంది సుమా! అందుకే విమర్శలు ప్రకటించేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. ఇంకో విషయం. అవసరాన్ని మించి ఒక్క మాట కూడా అధికంగా అనరాదు. దానివలన అనవసరమైన క్రోధం, అసహ్యం, తిరస్కార భావాలు అవతలివారిలో కలిగే ప్రమాదం వుంది. దానివలన అసలు విషయం వదిలేసి వారి మనసు పగ, ద్వేషాల వైపు పరుగులు పెట్టే అవకాశం కూడా వుంది. నేను పైన చెప్పిన వుదాహరణలో ఆ ప్రిన్సిపాలుగారు నా పేరు సంగతి తీసుకురావటం కేవలం అనవసరం అనిపిస్తోంది నాకు. దానివలన ఏదో అవమానం చెయ్యాలన్న ఛాయలు వున్నట్లుగా అన్పిస్తోంది కానీ ఆవిడ అసలు అభిమతాన్ని ఆ అనవసర మాటలు ఏమి ప్రకటించటం లేదు సరి కదా అవి ఆవిడ ఉద్దేశాన్ని మబ్బులాగా అడ్డం వచ్చి కమ్మేస్తున్నాయి. అందుకే మన విమర్శ ఎంత క్లుప్తంగా వుంటే అంత మంచిది. లోపాలను సవరించుకునే మార్గాలను విపులంగా విశదీకరించటంలో తప్పు లేదు కానీ అనవసరమైన మాటలేవీ దొర్లకుండా మాత్రం జాగ్రత్త పడటం చాలా అవసరం.
మానవ సహజంగా అందరూ మెప్పులు పొందాలనుకుంటారు. అందరిచే స్వీకరింపబడాలనుకుంటారు. అంతేకానీ విమర్శలు కాదు. ఎందుకంటే విమర్శలు ఎవరికైనా సరే, అసౌకర్యాన్ని, అశాంతిని కలిగిస్తాయి. అందుకే అవి ఇచ్చేవారు కూడా సాధారణంగా చాలా అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అయినా ఒక్కొక్కసారి విమర్శలు ఇవ్వక తప్పదు. ఆఫీసులో ఎవరైనా సరిగ్గా పని చెయ్యనప్పుడు, వారి మేనేజరు వారికి తన విమర్శలను విపులంగా చెప్పకపోతే మరి ఆ పని సజావుగా ఎలా పూర్తవుతుంది? వారు పని ఎలా నేర్చుకుంటారు? అలాగే ఉపాద్యాయుడు విద్యార్థులకు వారి తప్పులను ఎత్తి చూపించకపోతే వారు తమ తప్పులను ఎలా తెలుసుకుంటారు? సరైన విద్యను ఎలా నేర్చుకుంటారు? అలాగే తల్లితండ్రులు పిల్లలు తప్పులు చేస్తున్నా కూడా వారిని ఏమి అనకుండా మౌనంగా వుంటే మరి వాళ్ళు చెడు పనులు మానేసి, సరైన మార్గంలోకి ఎలా రాగలరు? ఇలాంటి పరిస్థితులలో విమర్శలు ఇవ్వటం తప్పు కాదు, వాటిని ఇవ్వకపోవటం తప్పు, మౌనంగా వుండటం తప్పు.
అయితే విమర్శలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. కోపంగా తిడుతూ అమృతాన్ని కూడా తాగించలేము, కానీ నవ్వుతూ ప్రేమగా విషాన్ని కూడా తేలికగా తాగించగలం అన్న విషయం మనందరికీ తెలుసు కదా! అందుకే సుతిమెత్తని గొంతుతో, అతి సున్నితమైన పదాలను ఏరి, కూర్చి, చెప్పదలచుకున్నదాన్ని మెల్లగా చెప్తే దాని వలన మంచి ప్రభావం వుండటానికి ఎక్కువ అవకాశం వుంటుంది. ముందు అనుకూలమైన విషయాలతో మొదలుపెట్టి ఆతర్వాత మెరుగుపరుచుకోవాల్సిన విషయాలను విశదీకరిస్తే ఇంకా బాగుంటుంది కూడాను. నేను మొదట్లో చెప్పినట్లు విధ్వంసకరమైన విమర్శ (destructive criticism) కాకుండా నిర్మాణాత్మకమైన విమర్శ (constructive criticism) అయితే బాగుంటుంది. నేను పాటల పోటీలు, పద్యాల పోటీలకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నపుడు వారు ఎక్కడ తప్పులు పాడారో చెపుతూ, అక్కడ ఎలా పాడితే బాగుంటుందో కూడా పాడి చూపిస్తాను. అలాగే భాష స్పష్టంగా పలకడంలో కూడా వారి ఉచ్చారణ దోషాలని సవరించి సరిగ్గా ఎలా పలకాలో నేను పలికి చూపిస్తాను. దాని వలన వారికి వారి తప్పులు బాగా అర్ధం అయే అవకాశం ఎక్కువ వుంటుంది. అంతేకాకుండా తప్పులు లేకుండా చక్కగా పాడి వారు అందరి మన్ననలు పొందడం మాత్రమే నా అభిమతమని, అంతకు మించి వేరే ఇంకేమి కారణం లేదు అన్న నా నిజాయితీ కూడా నా విమర్శలలో దాగివుందన్న నిజం స్పష్టంగా వారికి తెలిసే అవకాశం ఎక్కువ వుంటుంది.
ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. నిర్మాణాత్మక విమర్శ తియ్యగా వుండకపోవచ్చు, వినడానికి వెంటనే సకారాత్మకంగా కూడా అనిపించకపోవచ్చు, కానీ అది నకారాత్మకమైన విమర్శ మాత్రం కాదు. ఈ విషయాన్ని, ముఖ్యంగా విమర్శించబడ్డవారు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే విమర్శించేవారు వారి శత్రువులు కాదు. వారి మంచి కోరేవారు. వారి లోపాలను సవరించి వారి అభివృద్ధిని చూడాలనుకునేవారు. చేదు మందులతో మీ రోగాలను కుదిర్చి మీకు ఉపశమనం కలిగించటం కోసం అలా బహుశా మీకు నచ్చని మాటలు మాట్లాడుతున్నారు. అయినా వారు మీ పని గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి కాదు, వారి విమర్శలను మీరు వ్యక్తిగతంగా, అంటే, personal గా తీసుకోకండి. అసలు ముందు మీరు వారు ఏం చెప్తున్నారో శాంతంగా వినండి, తొందరపడి వెంటనే ప్రతిస్పందించకండి. వారి విమర్శలను మీరు నిదానంగా ఆలోచించి, సరిగ్గా అర్ధం చేసుకుని, ఆచరణలో పెడితే చివరకు మీ లోపాలను వదిలించేసుకుని విజయాలతో ముందుకు దూసుకు వెళ్ళేది మీరే!
అందుకే విమర్శలు ఇచ్చేవారితో పాటు విమర్శలు తీసుకునేవారు కూడా అందుకు సిద్ధంగా వుండాలి. విమర్శించేవారు మీ హితాభిలాషులు, మీ శత్రువులు కారు అన్నది మొట్టమొదటగా మీరు గ్రహించాలి. వారు చెప్పినదాన్ని శ్రద్ధగా వినండి. అది మీ మెదడులో జీర్ణం అవటానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపలే తొందరపడి స్పందించకండి. కాస్త ఆలోచించండి. ఎవరి గురించి వారికే పట్టని ఈ వేగం రోజుల్లో కూడా మీ కోసం, మీ వున్నతి కోసం తమ వ్యక్తిగత సమయాన్ని కేటాయిస్తున్న వారి పెద్ద మనసుని గుర్తించండి. దానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే వారు మీకంటే కూడా ఎక్కువగా మీ గురించి, మీ మంచి గురించి ఆలోచిస్తున్నారు. అంతేకాదు, చేదు విమర్శలు వినటం మీకు ఎలా కష్టంగా వుందో, చెప్పటానికి వారికి కూడా ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా వుంది అన్న నిజాన్ని మీరు గుర్తించండి. ఎందుకంటే మీకు మంచి కలగటం కోసమే అయినా మీకు నచ్చని మాటలు చెప్తున్నామని వారికి తెలుసు. అయినా వారు కర్తవ్య బంధితులు. అంతేకాని ఏదో తప్పు చేస్తున్నామని మాత్రం వారు అనుకోరు. ఈ విషయం విమర్శింపబడ్డవారు గుర్తుంచుకుంటే అసలు ఏ గొడవా వుండనే వుండదు.
అలా కాకుండా కేవలం మీ మనసుని నొప్పించటం కోసమే, అకారణంగా, ఏదో నోటికొచ్చినట్లు విమర్శ పేరుతో మిమ్మల్ని తూలనాడేవారిని మీరు అసలు పట్టించుకోనక్కరలేదు. వారిని మీరు దూరంగా నెట్టేయండి. ఎందుకంటే అలాంటివారి మాట, తీరు, వారి మనోగతం మీకు తేలికగానే అర్ధం అయిపోతుంది. ఎందుకంటే వారి ధ్యాస అంతా వారి సొంత అపజయాలని, వాటి వల్ల సంక్రమించిన న్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీమీద తమ ఆధిపత్యాన్ని నిరూపించటానికి, అందరి మీద అర్ధం, పర్ధం లేని పగను వ్యక్తపరచడం పైనే వుంటుంది. వారి మాటల్లో వారి అహంకారం కనిపిస్తూవుంటుంది, వినిపిస్తూ వుంటుంది. అంతేకానీ ఎటువంటి నిజాయితీ కాదు. దాని వలన అలాంటివారి విమర్శలను ఈ చెవితో విని, ఆ చెవితో విడిచిపెట్టేయాలి అని మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిగత విమర్శల వెనక వారి వ్యక్తిగత అపజయాలు, నైరాశ్యం తొంగి చూస్తూవుంటాయి, కానీ మీ అభివృద్ధిని కాంక్షించే నిజమైన తపన కాదు. అందుకే సద్విమర్శకు, కువిమర్శకు మధ్య వున్న తేడాని జాగ్రత్తగా గమనించండి.
ఇప్పుడు ఆమధ్య చూసిన ఒక టివి పాటల పోటీల కార్యక్రమం ఒకటి నాకు గుర్తు వస్తోంది. దానిలో ఆరోజు వచ్చిన ప్రత్యేక అతిథి చాలా ఏళ్ళక్రితం అదే పాటల పోటీ కార్యక్రమంలో ఒక పోటీదారుడిగా వచ్చాడట. అప్పుడు ఆయన పాడిన పాట విన్న తర్వాత ఆనాటి న్యాయనిర్ణేత, ఆయన ఉచ్చారణలో లోపాలను చూపిస్తూ విమర్శించారట. ఆతర్వాత ఆ గాయకుడు తన ఉచ్చారణ లోపాలను సవరించుకుని ఒక పేరు పొందిన గాయకుడిగా, అంతకంటే ఎక్కువగా పేరుప్రతిష్ఠలను పొందిన పెద్ద సంగీత దర్శకుడిగా ఈనాడు అందరి మెప్పులను పొందుతున్నాడు. దీనికి ఆయన ఆనాడు తనను విమర్శించిన న్యాయనిర్ణేతను కారణంగా చెప్పారు. ఆయన వల్లనే తన లోపాలు తనకి తెలిసాయని చెప్పారు. సద్విమర్శ వలన ఎంత లాభం కలుగుతుందో చెప్పటానికి ఇంతకంటే మంచి ఋజువు ఇంకా ఏం కావాలి? విమర్శలు ఇచ్చేవారు, పుచ్చుకునేవారు కూడా వాటిలోని నిజాన్ని, నిజాయితీని గుర్తిస్తే దాని ఫలితం ఇంత మధురంగా వుంటుంది.
ఒక గాయనిగా, న్యాయనిర్ణేతగా నేను రెండు పాత్రలూ వహించాను కాబట్టి నేను ఎంతో నిజాయితీగా చెప్తున్నాను, విమర్శని తీసుకోవటం ఎంత కష్టమో, దాన్ని ఇవ్వటం కూడా అంతే కష్టం. ఈ రెండు కూడా రెండు వైపుల పదును వున్న కత్తిలాంటివి. జాగ్రత్తగా వాడుకోకపోతే మనసుకి గాట్లు పడే ప్రమాదం వుంది సుమా! మన కర్తవ్యాన్ని మనం మరువకూడదు. అలా అని ఇతరుల మనసును నొప్పించకూడదు కూడా. అలా వారి లోపాలను వారు గుర్తించేలా మన విమర్శలకు తియ్యటి పూతను జోడించి చెప్పాలి. అయినా కూడా విమర్శ అంటే చాలామందికి ఇష్టం వుండదు. అందరూ తమల్ని మెచ్చుకోవాలనే ప్రతివారు కోరుకుంటారు కానీ తమ లోపాలని ఎత్తి చూపించాలని, అవి తమ మంచికే అయినా సరే, ఎవ్వరూ కోరుకోరు కదా! అలాంటప్పుడే కేవలం ఇచ్చకాల కోసం ఉత్తుత్తి పొగడ్తలు ఎవరు చేస్తున్నారో, మన తప్పులను సవరించి మనల్ని లోపరహితంగా చెయ్యటానికి ఎవరు తాపత్రయపడుతున్నారో సరిగ్గా అర్థం చేసుకోగల విచక్షణని మనం చూపించాలి.
కువిమర్శలు ఎంత అపాయకరమైనవో అనవసర లేక అతి పొగడ్తలు కూడా అంతే అపాయకరమైనవి. ఎందుకంటే కువిమర్శలు మనిషి ఉత్సాహాన్ని చంపేస్తే అనవసర లేక అతి పొగడ్తలు మనలో లోపాలేవీ లేవు, మనం పరిపూర్ణంగా, అంటే perfect గా వున్నాము అన్న అపోహను మనిషిలో కల్పిస్తాయి. దానితో వారు చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ, పాపం, అసలు తాము ఏం తప్పులు చేస్తున్నామో కూడా గ్రహించలేని అయోమయ పరిస్థితిలో వుంటారు. ఇలాంటప్పుడే సద్విమర్శలు మనకు అక్కరకు వస్తాయి
సద్విమర్శ ఎప్పుడూ ఎదుటివారి అభివృద్ధినే కోరుతుంది. అందుకే మనం మనల్ని సకారణంగా విమర్శించేవారి పట్ల ఎప్పుడూ ఎటువంటి అయిష్టతని పెంచుకోకూడదు. ఎందుకంటే వారే మన అభివృద్ధిని నిజంగా కాంక్షించేవారు. మన తల్లితండ్రులు, గురువులు, పెద్దలు చిన్నప్పుడు మన లోపాలని సవరించి, మనకి సద్విమర్శలను ఇవ్వకపోతే ఈనాడు మనం ఇంత ఎత్తుకు ఎదగగలిగేవారమా? కొంచెం ఆలోచించండి.
మనల్ని మనం సవరించుకోవటానికి ఒక వయసు అని, ఒక స్థాయి అని ఏమీ లేదు. తప్పులు లేని, చెయ్యని మనిషి అంటూ ఎవ్వరూ వుండరు కాబట్టి ఎవరికైనా, ఎప్పుడైనా విమర్శలని అందుకునే అవకాశం వుంది. అందుకే సద్విమర్శలకి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. అంతేకాదు, అనవసరంగా కానీ, లేక అవసరానికి మించి కానీ అతిగా పొగిడేవారి దగ్గర కూడా నేను చాలా జాగ్రత్తగా వుంటాను. ఎందుకంటే కువిమర్శలలాగానే అనవసర, అతి పొగడ్తలు కూడా చాలా అపాయకరమైనవి, మన అభివృద్ధికి అవరోధాలను కల్పించేవి అని ముందే చెప్పుకున్నాం కదా!
మరి మీరు కూడా అంతేనా? నిజాయితీగా ఆలోచించుకోండి. ఈలోపల నేను మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటూ, మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయం గురించి మీతో ముచ్చటించడానికి మళ్ళీ వస్తాను. అంతదాకా సెలవు.
very Nice Akkaa.. ఎదుగుదలకి విమర్శ ఎంత ముఖ్యమో చాలా చక్కగా చెప్పావ్..
public గా అందరిలో కాకుండా one on one చెప్తే ఇంకొంచెం better అని నా అభిప్రాయం… “మంచి మైక్ లో, చెడు చెవిలో చెప్పాలి” అంటారు… అయినా ఇది ఇలాగే చేయాలి అని thumb rule ఏమీ లేనప్పుడు పరిస్థితిని అవసరాన్ని అవకాశాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు.. “మొత్తానికి విమర్శ మంచిదే”
అద్భుతమైన విశ్లేషణ! 🙏