
రాతిరి ఉదయించే సూర్యుడు
ఎన్నాళ్ళని భరిస్తావ్
ప్రశ్నల సుడిగుండమై
లేఖలు గుప్పిస్తావ్.
అడవంత మనసు పెట్టుకుని
సింహం లా పంజా విసురుతూ
ఎర్రెర్రని ఏరులా ప్రవహిస్తావ్.
మాటల తూటాలు పేలుతుంటాయ్
తూటాలు అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటాయ్.
మత చిచ్చు తో
మంటలు రేగుతున్నప్పుడు
కులం రగడలో కూరుకు పోయినప్పుడు
రాతిరి సూరీడు ఉదయించాలి.
ఆకతాయిల అఘాయిత్యాలకు
అబలలు ఆహుతౌతున్నపుడు
రాతిరి సూరీడు ప్రజ్వలించాలి.
కన్నీటి తెరలు దింపి
మరో ఉషోదయానికి
ఆత్మ రక్షణ కత్తులు మెరవాలి.
జనారణ్యంలో
ఆక్రోశాన్ని అందిపుచ్చుకోవాలి.
పొద్దున ఉదయించే సూర్యుడు
న్యాయ రక్షణకు వేయి కళ్ళతో
రాతిరీ ఉదయించాలి.
ధర్మం అణచి వేయబడ్డప్పుడు
రాతిరి సూరీడు ఉదయిస్తాడు.
బానిస కళ్ళల్లో
సంతోషమై ప్రకాశిస్తాడు.