Menu Close
Kadambam Page Title
రాలిన పరిమళాలు
గవిడి శ్రీనివాస్

రాలే కన్నీటి చుక్కలని
సమాధాన పర్చలేక పోతున్నాం.

కొన్ని చేతులు పరిమళాలు పూస్తూ
సువాసనలు వెదజల్లుతూ
కొంత కాలం తరువాత కాలం చేసే గాయానికి
కనుమరుగవుతుంటాయి.

ఇంటిలో పిల్లలు ఎగిరినట్లు
కన్నీటి నదులు కుదిపినట్లు
నవ్వుల తూనీగలు చెదిరినట్లు
ఆలోచనల పిచ్చుకలు మూగబోయినట్లు

ఏం ఉందో ఏంలేదో తెలీక
సతమత మౌతున్నప్పుడు
ఏమీ తోచనప్పుడు ఎవరు లేనప్పుడు
కష్టం గుండె మీద మరుగుతున్నప్పుడు

ఆ ఆప్యాయత
కాసింత ఉపశమనంగా ఉండేది.
జీవితం ఇలానే జాలువారుతుంది.
కొన్ని పరిచయాలు కొన్ని పలకరింపులు
కొన్ని సంతోషాలు కొన్ని కన్నీటి బొట్లు
అనుభూతి సంతకాలు మిగులుతాయ్.

కాలం నుదిటి మీద
పరిచయాలు అనుభవాలుగా
అనుభవాలు జ్ఞాపకాలుగా

మారినపుడు
రాలిన పరిమళాలతో
కూలబడుతుంటాం.
మిగిలిన బతుకు చిత్రాలతో
తడబడుతూ అడుగులేస్తుంటాం.

Posted in March 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!