Menu Close
పుణ్యభూమీ కళ్ళుతెరు
-- వెంపటి హేమ (కలికి)

(కలికి కథల పుస్తకం నుండి..)

మురారి, రోహన్ ఇల్లు చేరుకునే సరికి అమ్మమ్మ సుందరమ్మ గుమ్మంలో కనిపెట్టుకుని ఉంది. మురారి భార్య రోహిణి పళ్ళెంతో ఎర్రనీళ్ళు పట్టుకొచ్చి రోహన్ కి దిగదుడిచి దూరంగా పారబోసి వచ్చింది.

గుమ్మంలో కాలు పెట్టగానే, "అమ్మమ్మా! కుశలమా" అని అడుగుతూ దగ్గరగా వచ్చి, వంగి ఆమె కాళ్ళకు నమస్కరించాడు రోహన్. అతని తలపై చెయ్యుంచి దీవించింది సుందరమ్మ.  పైకి లేస్తూనే, "అమ్మా, నాన్నా కూడా నీకు తమ నమస్కారాలు చెప్పమన్నారు అమ్మమ్మా" అన్నాడు.

అరుదైపోయిన ఆ పురస్కారానికి ఆమె కళ్ళు చెమర్చాయి. "సంతోషం నాన్నా" అంది కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ.

"వెల్కం హోం" అంటూ ఎదురుగా వచ్చి ఆహ్వానించాడు ఆదిత్య. అప్రయత్నంగా రోహన్ కళ్ళు నలువైపులా వెతికాయి. రోహిణి అది కనిపెట్టింది.

"వచ్చేస్తుంది బాబూ! తేజకు ప్రైవేట్ క్లాసులు జరుగుతున్నాయి, వెళ్ళింది" అంది రోహిణి చిరునవ్వుతో.

మొహం చిట్లించి భార్య వైపు చూసాడు మురారి. "నేను, ఆదిత్య ఈ వేళ సెలవు పెట్టలేదా? దానికంత  ఇదేమిటి? పోనీ, దానికి తోచకపోతే పోయె, నీ తెలివేమయ్యింది? చెప్పొద్దా" అన్నాడు భార్యతో అన్యాపదేశంగా.

"బాగానే ఉంది వరస!" ఉరుమురిమి మంగలం మీద పడిందిట! అలా ఉంది మీవరస. మీకు నేను లోకువ! మీరు చెపితేనే విననిది, నేను చెపితే వింటుందా ఏమిటి?" రుసరుసలాడుతూ కొంచెం గట్టిగానే అంది రోహిణి.

'మమ్మీ! బావని నేను రూం లోకి తీసుకు వెడతా. ఫ్రెషప్ అవుతాడు" అంటూ రోహన్ ని , అతనికోసం ఏర్పాటుచేసిన గదిలోకి తీసుకు వెళ్ళాడు ఆదిత్య సమయ స్పూర్తితో.

** ** **** ** **** ** **

పట్టుమని రెండు రోజులు గడిచేసరికి బోరుకొట్టడం మొదలయ్యింది రోహన్ కి. పగటి పూట అమ్మమ్మ అత్తయ్య తప్ప ఇంకెవరూ ఇంట్లో ఉండరు. పొద్దెక్కి నిద్రలేచి, హడావిడిగా తయారై ఎవరి పనిమీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ రావడం చీకటి పడే వేళకే! అమ్మమ్మ, అత్తయ్య ఇంటిపనుల్లో నిమగ్నమై ఉంటారు. ఐనా వాళ్ళతో ఎంతసేపని కబుర్లు చెప్పగలడు! రోహన్ కి బయటి పెత్తనాలకి ఒంటరిగా వెళ్ళేటంత ధైర్యం లేదు. అక్కడి పొల్యూషన్, అడ్డదిడ్డంగా వెళ్ళే ట్రాఫిక్ తలచుకుంటే చాలు, అసలు అతనికి బయటికి వెళ్ళాలన్న కోరికే నశించిపోతోంది.

అతని అవస్థ చూడలేకపోయింది రోహిణి. "నాదగ్గర తెలుగు మేగజైన్లు మాత్రమే ఉన్నాయి బాబూ!, ఈ రోజు మామయ్య వచ్చాక చెపుతా - నీకోసం ఇంగ్లీషు పేపరు తెప్పించమని" అంది నొచ్చుకుంటూ.

"ఫరవాలేదు అత్తయ్యా! అవే ఇయ్యి. నాకు తెలుగు మాటాడడమేకాదు, చదవనూ, రాయనూ కూడా వచ్చు. అక్కడున్న "మన బడి" లో చేరి నేను చిన్నప్పటినుండి తెలుగు చదువుకున్నా."

పుస్తకాలు తేవడం కోసం వెళ్ళింది రోహిణి. అక్కడే ఉన్న సుందరమ్మ ముక్కుమీద వేలేసుసుకుంది.

"ఏమిటీ! నీకు తెలుగు వచ్చా! ఇక్కడ తేజకీ, ఆదికీ తెలుగు రాదు. ఏదో కొంచెం మాటాడతారు, అంతే! వాళ్ళ చదువంతా ఇంగ్లీషులోనే. నాకోసమని తెలుగు మాటాడుతారుగాని, చాలామాటలు తెలియవు వాళ్ళకి. ఏదైనా కాస్త గట్టిమాట వస్తే చాలు, ఆ మాటకు అర్థమేమిటి బామ్మా - అంటూ అడుగుతారు. మా చిన్నప్పుడు మేమైతే ఇంగ్లీషుకి తెలుగు అర్థాలు రాసుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి తెలుగు మాటని ఇంగ్లీషులో ఏమంటారో చెప్పాల్సివస్తోంది. ఇప్పుడు ఇక్కడ మాతృభాష పరిస్థితి అలాగుంది, చెప్పుకుంటే సిగ్గు." అంతలో పత్రికలతో వచ్చింది రోహిణి.

** ** **** ** **** ** **

రోహిణి చెప్పడంతో మర్నాటినుండి, ఈనాడుతోపాటు హిందూ పేపర్ కూడా ఇంటికి రావడం మొదలయింది. కాలక్షేపంగా వార్తల్ని విడవకుండా చదవడం మొదలుపెట్టాడు రోహన్. ఒక్కొక్కరోజు గడుస్తున్నకొద్దీ అతనికి భ్రమలు తొలగసాగాయి. వార్తాపత్రికలు సంస్కృతికి అద్దాల్లాంటివి. వాటిలో అతనికి ఇండియా తాలూకు నిజ స్వరూపం కనిపించసాగింది. తన ఊహల్లోని భారతదేశం తనకు ఈ పత్రికల్లో దర్శనమిస్తుందనుకున్న అతని ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఇన్నాళ్ళూ తన తల్లితండ్రుల నోట తాను విన్న మాటలన్నీ ఉత్తి నీటి మూటలుగా కనిపించసాగాయి.

మరి మూడురోజులు గడిచేసరికి ఆదివారం వచ్చింది. ఆరోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు. రోహిణి ఆరోజు ప్రత్యేకమైన పెసరట్ ఉప్మా చేసింది "బ్రేక్ ఫాస్టు"గా. అందరూ డైనింగ్  టేబుల్చు చుట్టూ కూర్చుని ఉండగా వచ్చింది స్వంత ఇంటిని గురించిన సంభాషణ. మురారే లేవదీశాదు దాన్ని...

"రోహిణీ! ఈ ఊళ్ళో మనకు స్వంత ఇల్లు ఉంటే ఎలా ఉంటుందంటావు?"

"బాగానే ఉంది ప్రస్తావన! సిరి వస్తానంటే ఒద్దనే వాళ్ళుంటారా ఎక్కడైనా? మా చెల్లాయి ఎప్పుడో చేసుకుంది గృహప్రవేశం, నేనే ఇంకా ఇలా అద్దెకొంపల్లో దేవులాడుతున్నా" అంది రోహిణి.

"ఇల్లు కొనుక్కోమని బ్యాంకులు పిలిచి మరీ లోన్లు ఇస్తున్నాయి. నీకేం లోటే పిచ్చిమొహమా! చూస్తూ ఉండు, త్వరలోనే మనం ఒక ఇల్లు కొనబోతున్నాము" అన్నాడు మురారి ఉషారుగా.

ఆ మాట వినగానే సుందరమ్మ టిఫిన్ తినడం ఆపేసింది. "ఒరేయ్! మురారీ? ఆలోచించే మాటాడుతున్నావా? "ఇల్లు కట్టి చూడు (లేదా) పెళ్ళిచేసి చూడు" అన్నారు! రెండూ ఒకేసారి చెయ్యడమంటే మాటలు కాదురా! ఎదురుగా కూతురు పెళ్లి పెట్టుకుని ఇలా ఎలా మాటాడుతున్నావు? అలాగని రెండూ కలిపి చెయ్యగల స్తోమత మనకెక్కడిది" అంది.

అత్తగారివైపు చురుక్కున ఒక్క చూపు చూసింది రోహిణి. మురారి తల్లి వయిపు చూసి, చిన్నగా నవ్వి అన్నాడు, "అక్కతోటే  కదమ్మా మనం వియ్యమందేది! పెద్ద ఖర్చేం ఉండదులే. పిల్లకి చీరా సారీ అంటూ, ఏమెమో  పెట్టాల్సినపని కూడా లేదు, వెళ్ళేది అమెరికాకి కదా!"

"మరీ అంతలా అనకురా, వాళ్ళకీ ఒక్కగా నొక్క కొడుకాయే! ఓ ముద్దనీ, ముచ్చటనీ దానికీ ఏవేవో ఆశలు ఉండకపోవు. అది అడగాలా? మనమే గమనించి అన్నీ జరిపించాలి."

"సర్లే అమ్మా! ఇది విను - నా ఫ్రెండ్ రాజు నీకు తెలుసుకదా! వాళ్లింటి గృహప్రవేశానికి మనం వెళ్ళాము, గుర్తుందా? ఇప్పుడు వాడు ఆ ఇల్లు చవగ్గా అమ్మేస్తున్నాడు. కొడుకు చదువుకి డొనేషన్ కట్టడం కోసం! తీసుకుంటావా - అని అడిగాడు. రెడీకాష్ కావాలిట. మనదగ్గర ఉన్నడబ్బు చాలదు, ఉన్న బంగారమంతా బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకోవాల్సి రావచ్చు. అఫ్కోర్సు, బ్యాంకులోనుకి అప్లై చేసాను, కాని అది చేతికి రావడానికి టైం పడుతుంది. ఉన్నడబ్బు ఇంటిమీద పెట్టి, లోన్ డబ్బు పెళ్ళికి వాడాలనుకుంటున్నాను. ఏమంటావు నువ్వు" భార్యవైపు తిరిగి అడిగాడు మురారి.

రోహిణి ముఖం పువ్వులా వికసించింది, "ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఇల్లూ దొడ్డీ _ రెండు విశాలమే! నా నగలన్నీ సంతోషంగా ఇచ్చేస్తా. వాటిని అమ్మేసినా ఫరవాలేదు, ఇల్లు మనదైతే చాలు. ఇప్పుడే వెళ్లి ధరవరలు కనుక్కురండి. ఆలస్యం చేస్తే మరెవరైనా వచ్చి ‘మాట’ పుచ్చేసుకోగలరు."

టిఫిన్ తినడం పూర్తవ్వడంతో "సరే" నంటూ లేచాడు మురారి.

మురారి బట్టలు మార్చుకుని వచ్చి బైక్ ఎక్కబోతుంటే, "నీతో నేనూ వస్తా మామయ్యా" అంటూ వచ్చాడు రోహన్.

** ** **** ** **** ** **

ముందే ఫోన్ చేసి, వస్తున్నట్లు చెప్పివుంచడంతో, మురారి రోహన్ వెళ్లేసరికి వీళ్ళకోసమే ఎదురుచూస్తూన్న రాజారావు గుమ్మంలోనే ఎదురొచ్చి, ఆప్యాయంగా పలుకరించి లోనికి తీసుకువెళ్ళాడు. పరిచయాలు కుశలప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోకి వచ్చింది సంభాషణ.

"ఇంతకీ ఇల్లు కావలసింది ఎవరికీ? నీకేనా, ఇంకెవరికైనానా?" అడిగాడు రాజు.

"నాకేరా? ఎన్నాళ్ళనుండో ఇల్లు కొనాలనుకుంటున్నాను. ఎప్పటి కప్పుడే అశ్రద్ధ. దేనికైనా ఆ టైమ్ రావాలిగా..."

"ఔనురా! దేనికైనా ప్రాప్తమూ ఉండాలి! ఈ ఇల్లుంది చూడు - దీన్నినేను, ముఖ్యంగా మా ఆవిడ – పగలూ రాత్రి దగ్గరుండి పకడ్బందీగా కట్టించుకున్నాం. కాని పట్టుమని పదేళ్ళైనా ఇందులో ఉండడానికి మాకు ప్రాప్తం లేకపోయింది. పోనీలే, నువ్విందులో ఉంటే నీకోసం వచ్చినప్పుడైనా దీన్ని కళ్ళజూసుకోవచ్చు, పరాయి వాళ్ళైతే ఆ ఆశా ఉండదు" అంటూ నిట్టుర్చాడు రాజు.

"అంత బాధ పడుతూ అమ్మడం ఎందుకు, తాకట్టుపెట్టి అవసరం గడుపుకోవచ్చుకదా?"

"అవసరం అంత చిన్నదేం కాదు, కోటి రూపాయలు కావాలి! చదువుకునే రోజుల్లో మావాడు, హాయిగా డిస్కోథెక్కులనీ, పబ్బులనీ స్నేహితులతో కలిసి జులాయిగా తిరిగి, సరిగా చదవక  మార్కులు తక్కువ తెచ్చుకున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో ఆ మార్కులకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడేమో MBBS తప్ప మరోటి చదవనని భీష్మించుకు కూర్చున్నాడు. భారీ డొనేషన్ కడితేగాని వీడికి దాంట్లో సీటు రాదు. ఏంచెయ్యను చెప్పు? పోయినవాళ్ళు పోగా మిగిలున్నది వీడొక్కడే కదా - అంటుంది మీ వదిన. సరే! రేపిది ఎలాగా వీడికిచ్చేదేగా, అదేదో ఇప్పుడే ,వీడికోసం ఖర్చు పెట్టేస్తే, రేపు డాక్టరైతే ఇలాంటివి మరి నాలుగు భవనాలు తనే సంపాదించుకోగలడు - అని, మనసు సరిపెట్టుకుని అమ్మేస్తున్నా."

రోహన్ సోఫాలో కూర్చుని, టీపాయ్ మీదున్న మేగజైన్ తీసుకుని చదువుతూ వాళ్ళు మాటాడుకుంటున్న మాటలు వింటూ కాలక్షేపం చేస్తున్నాడు. అంతలో కాఫీలు రావడంతో కాసేపు సంభాషణలు ఆపి ఆ పనిలో పడ్డారు వాళ్ళు . కాఫీ తాగడం అయ్యాక మళ్ళీ కబుర్లు మొదలయ్యాయి..

"ఒకసారి ఇల్లు చూస్తావా ఏమిటి" అని స్నేహితుణ్ణి అడిగాడు రాజు.

"గృహప్రవేశమప్పుడు చూపించావుగా, చాలు. అంతగా చూడాలనిపిస్తే మా అమ్మా, మీ వదినా వచ్చి చూస్తారు. ఇంతకీ తూగగలనో లేదో - అది చూసుకోవద్దా? అసలు విషయానికి రా...'

"చాలా తక్కువకే ఇచ్చేస్తున్నారా! నాకు రెడీ కాష్ కావాలి. ఇల్లు డూప్లెక్సు స్టైల్లో ఫోర్ బెడ్రూమ్సు తో కట్టినది. దొడ్డి చాలా పెద్దది. అంతా నీకు తెలుసు కదా. ఎనభై లక్షలు వెల కట్టారు. నీతో హెచ్చు ధర చెప్పి, ఆపై బేరాలాడడం బాగుండదు. ఉన్నది ఉన్నట్లే చెప్పా. ఆ ధరకే ఇచ్చేస్తా, నీకు కనక!  బ్లాకు కొంత, వైటు కొంత. రెడీ కాష్ ఇవ్వడమన్నది చాలా ముఖ్యం. ఒకటి రెండు మెడికల్కాలేజిలకి అప్లికేషన్సు పెట్టాము. దేనికైనా సరే, డొనేషన్ కోటి! త్వరలోనే కాలేజిలు ఓపెన్ కానున్నాయి, మనం త్వరపడాలి."

"సరేరా రాజూ! తొందరగానే తేల్చేస్తాలే. ఎదురుగా పిల్ల పెళ్ళొకటుంది. నేనూ డబ్బు మొత్తం ఎంతుంటుందో ఒక్కసారి లెక్కజూసి, వెంటనే నీకు ఏమాటా చెపుతానులే. నాకు చెప్పకుండా మాత్రం నువ్వు ఎవరికీ మాట ఇవ్వకు. సరేనా? మేము ఇక వెడతాము" అంటూ లేచాడు మురారి.

బైక్ కొంతదూరం వెళ్ళీదాకా మురారిగాని, రోహన్ గాని నోరు విప్పలేదు. ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. ముందుగా రోహనే మాటాడాడు," కాలేజి చదువే సరిగా చదవని ఆ కుర్రాడిని నమ్మి అంత డబ్బు డొనేషనుగా ఆ తండ్రి ఖర్చు చేస్తున్నాడు కదా, రేపు ఆ అబ్బాయి MBBS కోర్సు సరిగా, శ్రద్ధగా  చదవగలడంటావా మామయ్యా! అన్ని కోర్సుల్లోకీ క్లిష్టమైనది ఈ కోర్సు అంటారు కదా?"

"ఔను! కాని, పరీక్షలో నెగ్గాలంటే దానికీ ఇలాంటి పక్కదారులేవో ఉండే ఉంటాయి. ఫరవాలేదులే.."

"అదెల్లా కుదురుతుంది మామయ్యా! అన్యాయం కదా! అడ్డదారిన ఇంజనీర్లైనవారు కట్టిన పెద్దపెద్ద కనష్ట్రక్షన్లు యిట్టే కూలిపోతున్నాయి. ధననష్టం, ప్రాణనష్టం విపరీతం! ఎబిలిటీ లేని డాక్టర్లు చేసిన వైద్యం వల్ల ఇంకా కొన్నాళ్ళు బ్రతకవలసిన వాళ్ళు నిష్కారణం ఇప్పుడే చచ్చిపోతారు. రోగి ప్రాణాన్ని కాపాడవలసిన పూచీ డాక్టర్దే కదా! ఇదేం పధ్ధతి మామయ్యా? ఇదంతా దేశద్రోహం కాదా! దీన్ని మీరంతా ఎలా ఒప్పుకుంటున్నారు?"

ఏం జవాబివ్వడానికీ తోచలేదు మురారికి. అంతలో రాంగ్ సైడున వచ్చిన ఆటో ఎదురుగా రావడంతో దానినుండి తప్పుకునే హడావిడిలో మురారి జవాబేమీ చెప్పకుండా తప్పించుకున్నాడు.

మౌనంగా మరికొంతదూరం వెళ్ళాక రోహన్ కి ఒక విషయం మనసులోకి రావడంతో మేనమామని అడిగాడు, "ఇందాకా మీ మాటల్లో బ్లాక్ కొంత, వైట్ కొంత " అనడం విన్నా. అవేమిటి మామయ్యా?"

మురారి గలగలా నవ్వాడు. అది ఒక కోడ్! ఇక్కడందరికీ అదేమిటో తెలుసు. బ్లాక్ అంటె బ్లాక్మనీ - గవర్నమెంటు లెక్కల్లోకి ఎక్కకుండా దాచే దొంగ డబ్బు. దీనిపైన టాక్సు వెయ్యడం కుదరదు. వైట్ మనీ అంటే బాహాటంగా లెక్కచెప్పి, దానిపై టాక్సు కట్టేటి డబ్బన్న మాట. మనకు ఇంటి ధర 80 లక్షలని చెప్పాడుగా, కాని రేపు రిజిష్టరాఫీసులో చెప్పే ధర  మాత్రం ఏ ఇరవై లక్షలో ఉంటుంది. ఆ ఇరవై వైటు, ఇక మిగిలిందంతా బ్లాకు! దానివల్ల రెండు పార్టీలకీ లాభం ఉంటుంది, రిజిష్ట్రేషన్ ఫీజు మనకి, ఇన్కం టాక్సు వాళ్ళకీ కలిసొస్తుంది."

"అది గవర్నమెంటుకి నష్టం కదా మామయ్యా? మరి రిజిష్ట్రార్ కి తెలిస్తే ఊరుకుంటాడా? "ఫ్రాడ్" అని కేసు పెడితే!"

"ఫ్రాడా, పాడా! అతనికి ముట్టీది అతనికీ ముడుతుంది కదా, ఇంక అతనికి బాధేమిటి? ఇది జగమెరిగిన రహస్యం!"

ఆశ్చర్యపోయాడు రోహన్. ఒక పెడనవ్వు నవ్వి అన్నాడు, "ఇదంతా చూస్తూంటే పుస్తకంలో చదివిన సామెత ఒకటి గుర్తొస్తోంది నాకు," దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారుట!"

మనసుకి ఆ మాట చురుక్కున తగలడంతో వెంటనే అన్నాడు మురారి, " నాకూ ఒక సామెత గుర్తొస్తోంది విను, "కందకి లేని దురద కత్తిపీటకెందుకు?"

కంగు తిన్న రోహన్ మరి మాటాడలేదు.

             ** ** **** ** **** ** **

చూస్తూండగా రోహన్ తిరుగు ప్రయాణం దగ్గరకి వచ్చేసింది. ఇంక రెండే రోజుల వ్యవధి ఉంది. టికెట్ కన్ఫర్ము చేయించుకోడం, తల్లి ఇండియాలో కొని తెమ్మన్న సరుకుల్ని కొనిపెట్టుకోడం లాంటివన్నీ అయ్యాయి. సుందరమ్మ కూతురుకోసమని ఏవేవో మూటలు కట్టింది. సామాను పెట్టెల్లో సద్దడం కూడా అయ్యింది. రోహిణి ఆడపడుచుకి పంపడం కోసం పసుపు, కుంకం, కొత్త చీర రవికెలగుడ్డ, మిఠాయి ప్యాక్ చేసింది.

ఆరోజు ఆదివారం కావడంతో అంతా ఇంట్లో ఉన్నారు. అంతవరకు బావను తప్పించుకు తిరిగిన తేజస్విని ఆరోజు వచ్చి అతని పక్కనున్న కుర్చీలో కూర్చుంది . వాళ్ళిద్దరినీ అలా పక్కపక్కల చూడగానే సుందరమ్మ మనసు వికసించింది. గాలిలో చేతులాడించి, ఆనందంగా చెంపలపై మెటికలు విరుచుకుంది సుందరమ్మ.

"డాడీ! నేను బావ పార్కుకి వెడతాము. సరేనా?" తలవంచుకుని తండ్రిని అడిగింది తేజ.

"ఇంతవరకు నన్ను తప్పించుకు తిరిగిన అమ్మాయేనా ఈ వేళ ఇంత చొరవగా మాటాడుతోంది, ఆ సిగ్గంతా ఏమయ్యిందో" అనుకున్నాడు రోహన్ మనసులో. మురారి కూతురివైపు, భార్యవైపు మార్చిమార్చి చూశాడు.

"కాబోయే మొగుడూ పెళ్ళాలేగా! ఫరవా లేదు, హాయిగా వెళ్ళి తోట చూసి రమ్మనండి" అంది రోహిణి మురిపెంగా.

** ** **** ** **** ** **

పార్కు ఇంటికి దగ్గరే కావడంతో నడిచి వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు వాళ్ళు. కొంతదూరం వెళ్ళాక హఠాత్తుగా రోహన్ చెయ్యి పట్టుకుని, "నువ్వు నాకు నచ్చావు బావా! మరి నీకు నేను నచ్చానా?" అని అడిగింది తేజస్విని.

గతుక్కుమన్నాడు రోహన్. నిన్నటిదాకా సిగ్గుపరదా చాటున దాగుందనుకున్న పిల్ల ఈ రోజు ఇంత చొరవ చూపించడం అన్నది అతనికి వింతగా తోచింది. జవాబేం చెప్పకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. తేజస్విని మరేమీ మాట్లాడకుండా పార్కులోకి నడిచింది. ఆమె రోహన్ని ఒక గుబురుగా పెరిగిన  చెట్ల వెనుక నున్న సిమ్మెంటు బెంచీ దగ్గరకు నడిపించింది. ఇద్దరూ అక్కడున్న బెంచీమీద కూర్చున్నారు. తేజస్విని ఆత్రంగా నలువైపులకీ చూస్తూండడం చూసి, ఆమె ఎవరికోసమో ఎదురుచూస్తూంది కాబోలు - అనుకున్నాడు రోహన్. చేతులు ఒళ్ళో ఉంచుకుని అక్కడున్న మొక్కల్ని చూస్తూ మాటాడకుండా కూర్చున్నాడు. అంతలో పంక్ స్టైల్లో ఉన్న యువకుడొకడు హఠాత్తుగా అక్కడకు వచ్చాడు. అతన్ని చూసి రోహన్ అదాటుగా లేచి నిలబడ్డాడు.

తేజ నవ్వింది. "ఫరవాలేదు బావా! యితడు మనవాడే, నా బోయ్ ఫ్రెండ్. నువ్వొచ్చావు కనక సరిపోయిందిగాని, లేకపోతే అమ్మా నాన్నల పోరు పడలేక చచ్చినట్లు ఇతన్నే పెళ్ళాడాల్సి వచ్చేది! గాడ్ గ్రేషస్! బావా! మీట్ మై ఎక్సు బాయ్ ఫ్రెండ్ కార్తిక్. నిన్నటితో ఇతనికి "బై" చెప్పేశా" అని, అతనివైపు తిరిగి, "కార్తిక్! మీట్ మై కజిన్ అండ్ వుడ్బి రోహన్!" అంది.

తప్పని సరిగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.

"బావా! నీదగ్గర నేనేమీ దాచదల్చుకోలేదు. నీకు చూపించడానికే కార్తిక్ ని ఇక్కడికి రమ్మన్నా. ఇతడు నాకు ఇదివరకు క్లాస్మేట్, ఇప్పుడు కొలీగ్. ఈ తగులాటం వదిలేవరకు నీతో ఏం మాట్లాడాలో తోఛక నిన్ను తప్పించుకుని తిరిగా. నిన్నటితో వీడికీ నాకూ తెగతెంపులైపోయాయి. ఎవరిచ్చిన గిఫ్టులు వాళ్ళం వెనక్కి తీసేసుకున్నాం. ప్రేమనీ, త్యాగమనీ పేర్లుపెట్టి బంగారు భవిష్యత్తుని పాడుచేసుకునేటంత వెర్రిదాన్ని కాను నేను."లౌ దై సెల్ఫ్" అన్నదే నా మాటో!" తేజ గొప్పగా చూసింది ఇద్దరివైపు.

కార్తిక్ రోహన్ వైపు తిరిగి మాట్లాడాడు. "ఒప్పుకుంటున్నా బ్రదర్! నువ్వు నాకంటే అన్నివిధాలా గొప్పవాడివే! నువ్వెలా ఉంటావో చూడాలని వచ్చా. కాని ఒక్క సలహా, జాగ్రత్త బ్రదర్, రేపు నీకంటే ఎక్కువగా ఎవరైనా కనిపిస్తే నీ పనీ ఇంతే!"

"షటప్! జలసీయా? వన్ మాన్ ఉమన్గా బ్రతకడానికి నాదంత నేరో మైండ్ కాదు" అంది తేజ ప్రగల్భంగా. "మా బావ అమెరికన్ సిటిజన్! మేముండేది అమెరికాలో, తెలుసా?"

ఇంక ఆ విషయం మీద చర్చ పెంచడమన్నది నచ్చక మాటమార్చి ఏవేవో ఇతర విషయాలు మాటాడాడు రోహన్. ఆ తరవాత రోహన్ కి అక్కడున్న కాసేపు ముళ్ళమీద ఉన్నట్లే అనిపించింది. ఎలాగో పొద్దుపుచ్చి చీకటి పడకముందే ఇంటికి వచ్చేశారు ఇద్దరూ.

              ** ** **** ** **** ** **

రాత్రి భోజనాలు దగ్గర సుందరమ్మ మనుమణ్ణి అడిగింది, "రోహన్ బాబూ! ఏమిటి నీ అభిప్రాయం?"

అది పెళ్లి విషయమేననీ, మేనమామ తరఫున ఆమె అడుగుతోందని అర్ధం చేసుకున్నాడు రోహన్. జవాబివ్వడానికి  ఇబ్బందనిపించింది. కాని గుండెలను  చిక్కబట్టుకుని ధైర్యంగా జవాబు చెప్పాడు.

"అమ్మా నాన్న ఉన్నారు కదా! వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అమ్మమ్మా! వాళ్ళు నన్ను ఇండియా వెళ్లి అందర్నీ చూసి రమ్మన్నారు. నేను వచ్చాను. అమ్మ మీకు ఫోన్ చేసినప్పుడు మీరు మీ సందేహాలు అడగండి" అన్నాడు ఎటూ తేల్చి చెప్పకుండా.

అందరి మనసుల్లోనూ ఏదో తెలియని అలజడి! ఆ మరుసటి రోజు చాలా భారంగా గడిచింది రోహన్ కి. ఆ రోజు సాయంకాలం అతడు హైదరాబాదులో విమానం ఎక్కి, ముంబాయ్ సహారా ఎయిర్పోర్టుకి వెళ్ళి, అక్కడనుండి ముంబాయ్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్టుకి చేరుకుని, అక్కడనుండి, ఆ రోజు అర్ధరాత్రి డేట్ మారిన కొన్ని నిముషాల తరవాత బయలుదేరే ఇంటర్ నేషనల్ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళవలసి ఉంది.

సాయంకాలం 5గం॥ అయ్యేసరికి టాక్సీ వచ్చింది. అందరిదగ్గర సెలవు తీసుకుని టాక్సీ ఎక్కాడు రోహన్, సామానుతో సహా. ఆదిత్య కూడా కారెక్కాడు. పనుందంటూ మురారి ఎక్కడికో వెళ్ళాడు. ఎయిర్పోర్టులో సామాను చెకిన్ అయ్యి, రోహన్ లోపలకు వెళ్ళేవరకు ఉండి, ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఆదిత్య. రన్ వే మీద పరుగెత్తిన విమానం టేకాఫ్ చేసి గాలిలోకి లేచేసరికి, ఏదో తెలియని రిలీఫ్ కలిగింది రోహన్ కి.

** ** **** ** **** ** **

ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే రోహన్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్టులో వెయిట్ చెయ్యక తప్పదు. సామాను ఉంచిన ట్రాలీని తోసుకుంటూ కొంతసేపు అటూ ఇటూ తిరిగి చివరకు, చెక్కిన్ కౌంటర్ కి దగ్గరలో ఒకచోట కుర్చుని, కౌంటర్ ఎప్పుడు తెరుస్తారా - అని ఎదురు చూస్తున్నాడు రోహన్.

క్రమంగా అతని మనసు అదుపుతప్పి, గడచిన 15 రోజుల్లో అతడు చూసినవీ, చదివినవీ, విన్నవీ - అన్నీ చర్విత చర్వణం చేసుకోడం మొదలుపెట్టింది. అతని మనసులో అది ఏమిటో తెలియరాని బాధ ఒకటి బయలుదేరింది ..

"ఒకప్పుడు ఎందరో మహానుభావులు పుట్టిన పుణ్యభూమి ఇది. ధర్మనిరతులు, త్యాగమూర్తులు, మానధనులు, పవిత్రులు నివాసమున్న పుణ్యభూమి ఈ భారతావని! ఇప్పుడు స్వార్ధానికి బానిసలై చెయ్యరాని అకార్యాలు చెయ్యడానికి వెనుకాడని మనుష్యులకు తావయ్యింది. కొన్నాళ్ళ క్రితం "లోకః సమస్తాం సుఖినో భవంతు" అన్నది భారతీయుల అభిమాన వాక్యంగా ఉండేది! ఇప్పుడైతే అది, "లౌ దై సెల్ఫు" గా కుంచించుకుపోయింది."

ఎప్పుడో చదివిన కవిత ఒకటి గుర్తుకి వచ్చింది రోహన్ కి.

"ఎటుచూసినా స్వార్థపరత్వం

ఎనలేని మాయాజాలం

కుడి ఎడమల దగా దగా, సోదరా!

కలియుగ ధర్మం కడు అగమ్యం!'

                                  (v.h.)

పుణ్యభూమీ ఇకనైనా కళ్ళుతెరు. కళ్ళు తెరిచి నీ బిడ్డలని సరిదిద్దుకో! కలియుగంలో విలువలు తారుమారౌతాయని జ్ఞానులు ఎప్పుడో చెప్పారు! కాని, మరీ ఇంత కక్కుర్తా ఈ జనానికి? హేభగవాన్! నేనింకా కొంతసేపు ఇక్కడే ఉంటే, మా అమ్మా నాన్నా నాలో పెంచిన సంస్కారమంతా మాయమై పోయి, నేనూ వీళ్ళలో ఒకడినైపోక తప్పని పరిస్థితి వస్తుందేమో! తొందరగా ఇక్కడినుండి వెళ్ళిపోవాలి" అనుకున్నాడు రోహన్.

అకస్మాత్తుగా మీద చెయ్యి పడేసరికి ఉలికిపడి భావజాలం లోంచి బయటపడ్డాడు రోహన్. పక్క కుర్చీలో కూర్చున్న పెద్దావిడ రోహన్ ని తట్టి, "బాబూ! టైం ఎంతయ్యింది? మావాడు ఇప్పుడే వస్తానని వెళ్లి ఇంకా రాలేదు" అని హిందీలో అడిగింది.

రోహన్ వాచీ వైపుకి చూసి ఆమెకు టైం చెప్పాడు. వెంటనే అతని తలలో జేగంటలు మోగాయి, తను ఎక్కాల్సిన ఫ్లైట్ బయలుదేరడానికి ఇంక ఇరవై నిమిషాలే టైం ఉంది! తలెత్తి కౌంటర్ వైపు చూశాడు. అక్కడ పాసింజర్లు ఎవరూ లేరు. కాని, ఇంకా అది తెరిచి ఉంది, నయమే!

ఒక్క ఉదుటున కౌంటర్ దగ్గరకు వెళ్లి తన అమెరికన్ పాస్పోర్టుని కౌంటర్ మీద ఉంచి, సామాను చెకిన్ కి ఇచ్చాడు రోహన్.

సామాను తూచడం, వాటికి విమానం తాలుకు స్లిప్పులు అతికించడం ఆపై వాటిని కన్వేయర్ బెల్టుమీదకు చేర్చడం పూర్తయ్యాక రోహన్ పాస్ పోర్టు కోసం చూశాడు. అది తను పెట్టినచోట పెట్టినట్లుగానే ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు....

"సార్ ! పాస్పోర్టు ...? టైం ఆట్టే లేదు, తొందరగా స్టాంపు వెయ్యండి, ప్లీజ్" అన్నాడు.

ఆఫీసర్ ఎటో చూస్తూ, "50 డాలర్లౌతుంది" అన్నాడు.

"అదేమిటి సార్!? అది పధ్ధతి కాదే! లంచం పుచ్చుకోడం, ఇవ్వడం - రెండూ తప్పే కదా, నేనివ్వను" అన్నాడు. టైం గడచిపోడం చూస్తూ రోహన్ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.

"పోనీ ఇవ్వకు. నాకేం పోయింది, నష్టం నీదే. నీ పాస్పోర్టుని అటూ - ఇటూ తిరగేస్తూ జాప్యం చేస్తా. ఈలోగా ఫ్లైట్ నీ సామాను తీసుకుని ఎగిరిచక్కాపోతుంది. నువ్వు ఇక్కడే ఉండిపోతావు. నా మీద రిపోర్టిస్తావా? వాళ్ళకెలా నచ్చచెప్పాలో నాకు తెలుసు. వాళ్ళెవరూ నీ గోడు వినరు. అలోచించుకో!"

వాళ్ళిద్దరి మధ్య సంభాషణంతా ఇంగ్లీషులోనే సాగింది. రోహన్ నిలువునా నీరుకారిపోయాడు. తన చిన్నప్పుడు ఎప్పుడో తల్లి చెప్పిన కథ గుర్తొచ్చింది.. ధర్మరాజు రాజుగా ఉండడం వల్ల "అశ్వద్ధామ హతః - కుంజరః" అంటూ అబద్దం చెప్పాల్సి వచ్చిందిట. అది ఆయనకి ఇష్టం లేకపోయినా, పరిస్థితినిబట్టి చెప్పకతప్పలేదుట! ఇంక ఇప్పుడు తను! ఇండియాలో 15 రోజులు ఉన్నందుకు, ఇష్టం లేకపోయినా తనకు లంచం ఇవ్వక తప్పదు కాబోలు - అనుకుని మనసు సరిపెట్టుకుని, ఫెళఫెళ లాడుతున్న 50 డాలర్ల నోటు తీసి కౌంటర్ మీద ఉంచాడు రోహన్.

పాస్పోర్టు మీద స్టాంప్ పడగానే దాన్ని తీసుకుని హాండ్ లగేజీ ఈడ్చుకుంటూ సమయం మించి పోకముందే బోర్డింగ్ పాస్ తీసుకోడo కోసం పరుగెత్తాడు రోహన్.

* * * సశేషం * * *

Posted in October 2019, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!