(కలికి కథల పుస్తకం నుండి..)
విమానం శంషాబాద్ విమానాశ్రయాన్ని సమీపిస్తోందన్న అనౌన్సుమెంట్ వినగానే రోహన్ మనసు ఉత్తేజంతో నిండిపోయింది. విమానం కిటికీ లోంచి అంతకంతకూ దగ్గరగా కనిపిస్తున్న భారతావనిని చూస్తూ తన్మయత్వంతో, "జన్మభూమి నా దేశం నమో నమామీ, ధన్య భూమి నాదేశం సదా స్మరామి" అని ఉత్సాహంగా మనసులోనే "హం" చేసుకోసాగాడు. అతడు "మన బడి" లో మాతృభాష తెలుగు నేర్చుకుంటున్నరోజుల్లో వాళ్ళకి అక్కడ ఈ పాటను నేర్పించారు. అప్పటి నుండీ అది అతని అస్తిని పట్టిపోయింది. అతని తల్లితండ్రులుకూడా, పరాయిదేశంలో పెరిగిన తమబిడ్డ తన మూలాలు మర్చిపోకుండా ఉండాలని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు రోహన్ ని. అమెరికన్ సిటిజన్‌షిప్ ఉన్నా వాళ్ళు తాము భారతీయులమనే భావిస్తారు. సాధ్యమైనంతవరకు తమ జాతీయతను విడవకూడదన్న పట్టుదలతో ఉన్నారు. కొడుకును కూడా అదే ఒరవడిలో పెంచారు వాళ్ళు.
రోహన్ ఇండియా వచ్చివెళ్లి చాలా రోజులయ్యింది. తల్లి కొంగుచాటు పిల్లాడిగా ఉన్నప్పుడు వచ్చేవాడు, తల్లి పద్మినితో కలిసి. కొంచెం పెద్దవాడయ్యాక చదువు పాడవుతుందనీ, వేసవిలో అయితే స్పెషల్ క్లాసులు మిస్సవుతాడని - ఇలా, ఏదో ఒక వంకని తల్లివెంట ఇండియా రావడం కుదిరేది కాదు. ముసలి తల్లిని చూడాలనిపించినప్పుడల్లా పద్మిని, ఇండియా ఒంటరిగానే వచ్చి వెళ్ళేది. ఇప్పుడు రోహన్ ని పనిగట్టుకుని ఇప్పుడు పంపించడానికి ఒక ది.కారణం ఉం
రోహన్ కి 24 ఏళ్ళు వచ్చాయి. అమెరికా లోనే MS బయో టెక్నాలజీతో పూర్తిచేశాడు. ఇక త్వరలోనే ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాడు. ఉద్యోగంలో చేరితే కొన్నాళ్ళవరకు లాంగ్ టెరం లీవు దొరకడం కష్టమౌతుంది కనక, ఈ లోగానే కొడుకు పెళ్లి చేసెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అమెరికాలో ఉన్న చాలామంది ఇండియన్సులాగే వాళ్ళు కూడా కోడల్ని ఇండియానుండే తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. పెళ్ళికూతురుకోసం పెద్దగా గాలించాల్సిన పని కూడా లేదు, మేనరికం ఉండనే ఉంది. తమ్ముడు మురారి కూతురు తేజస్విని MBA చదివి, ఉద్యోగం చేస్తోంది. రోహన్ కి సరిజోడీ ఔతుందని పద్మిని ఊహ. చిన్నప్పుడెప్పుడో వాళ్ళిద్దరూ కలిసి ఆడుకున్నారన్నది నిజం. కాని వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక మళ్ళీ కలుసుకున్నది లేదు. రోహన్ ని ఒకసారి ఇండియా పంపించి వాళ్ళు ఇద్దరూ కలుసుకునీలా చేస్తే, ఆపై వాళ్ళ ఇష్టాన్నిబట్టి పెళ్ళి జరిపించవచ్చునన్న అలోచన వాళ్ళది. వధూవరులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చాకే వాళ్ళ పెళ్ళి జరగాలన్న ఉద్దేశంతో, చెప్పవలసినవన్నీ చెప్పి, కొడుకుని ఇండియా ఒంటరిగానే పంపించారు.
* * * * *
సామాను ఉంచిన ట్రాలీ తోసుకుంటూ బయటికి వచ్చిన రోహన్ కి ఎదురుగా మేనమామ మురారి కనిపించి "హల్లో" అంటూ పలకరించే సరికి ప్రాణం లేచివచ్చింది. "హాయ్ ! మామయ్యా" అంటూ దగ్గరగా వచ్చాడు. ఇద్దరూ కరచాలనంతో ఆత్మీయతను పంచుకున్నారు. మురారి తన పక్కనే ఉన్న కొడుకు ఆదిత్యని రోహన్ కి, రోహన్ ని ఆదిత్యకి, పరస్పరం పరిచయం చేశాడు.
"అమ్మ మీ ఫొటో చూపించడం వల్ల మిమ్మల్ని ఆనుమాలు పట్టానుగాని, ఆదిత్యను గుర్తుపట్ట లేకపోయా, సారీ ఆదిత్యా" అన్నాడు రోహన్ చనవుగా ఆదిత్య చెయ్యి పట్టుకుని.
మురారి నవ్వాడు, "నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చివెళ్ళీసరికి వీడింకా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాడు. ఇప్పుడు వీడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మధ్యలో ఎన్నేళ్ళు గడిచి పోయాయో చూడు, ఎలా గుర్తుపట్టగలవు!"
ముగ్గురూ కలిసి బయటికి వచ్చారు. ఎయిర్పోర్టంతా కళ్ళు తిప్పి కలయజూసాడు రోహన్. ఈలోగా ఆదిత్య సామానంతా టాక్సీ లో పెట్టి ఎక్కి కూర్చున్నాడు.
"మీరిద్దరూ కేబ్ లో రండి నేను బైక్ మీద వస్తా" అన్నాడు మురారి మేనల్లుడికోసం కేబ్ తలుపు తీసి పట్టుకుని.
"కాదు మామయ్యా! నేనుకూడా బైక్ మీదే వస్తా. ఊరు చూడాలని ఉంది" అన్నాడు రోహన్.
మేనల్లుడి కోరిక కాదనలేకపోయాడు మురారి. కేబ్ తలుపు మూసి, "ఆదిత్యా! నువ్వు సామాను తీసుకుని ఇంటికి వెళ్ళు. మేం వెనక వస్తాం" అంటూ టాక్సీని పంపేశాడు.
టాక్సీ వెళ్ళిపోయింది. ఆ వెనకాలే బైక్ కూడా బయలుదేరింది. విప్పారిన కళ్ళతో పరిసరాలను చూస్తున్న రోహన్ అన్నాడు, "హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయ్యింది కదు మామయ్యా! అమెరికాలో ఎయిర్ పోర్టుకి వెళ్ళీదారి ఇంత అందంగా ఉండదు" అన్నాడు ఉత్సాహంగా. సరిగా అప్పుడే ఒక కారుని ఓవర్టేక్ చేసీ హడావిడిలో ఉన్న మురారి ఏమీ మాటాడలేదు. రింగ్ రోడ్ మీదుకు వచ్చింది బైకు.
అమెరికానుండి వచ్చిన రోహన్ కి ఇండియాలోని అభివృద్ధి చూడగానే మనసు పులకరించింది. "ఎంత దూరానవున్నా, ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నా, మనిషి తన మూలాలను మర్చిపోలేడు కదా" అనుకున్నాడు మురారి రోహన్ సంతోషాన్ని చూసి.
ఆఫీసులకెళ్ళీ వేళ దగ్గర పడడంతో రోడ్లమీది జనం రద్దీ క్రమంగా ఎక్కువౌతోంది. ఊరు సమీపించింది. బైక్ రింగ్‌రోడ్డు దిగి సాదారోడ్ మీదికి వచ్చింది. చూస్తూండగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కార్లు, బైక్ లు, బస్సులు, ఆటోలు,వాటి మధ్యలో అటూ - ఇటూ అడ్డదిడ్డంగా తిరిగే సామాన్య జనం! రోడ్డువారన చెత్తా - చెదారం, నిలువెత్తున లేచే దుమ్ము, బస్సుల నుండి, ఆటోలనుండి వచ్చే డీసెల్ ఫ్యూమ్సు ... రోహన్ కి ఊపిరాడటల్లేదనిపించింది. జేబులోంచి ఋమాలు తీసి ముక్కుకి అడ్డుపెట్టుకోక తప్పలేదు. ఒక్కసారిగా రోహాన్కి భ్రమలు తొలగిపోయినట్లయ్యింది. ఊరు చూడాలన్న కోర్కెను పక్కన పెట్టి, తొందరగా ఇల్లుచేరాలన్న తహతహ పుట్టింది. "మరీ ఇంత పొల్యూషనా" అనుకున్నాదు బాధగా.
మురారి రోహన్‌తో ఆ కబురు ఈ కబురూ చెపుతూ బండి నడుపుతున్నాడు. అమెరికా గురించి ఎప్పటినుండో తన మనసులో శలవేసి ఉన్న ఎన్నెన్నో సందేహాలకు సమాధానాలు రాబట్టే ఉద్దేశంలో ఉన్నాడు. ఉక్కిరిబిక్కిరి ఔతూనే రోహన్ అతడు అడిగినవాటికి టూకీగా జవాబులు చెపుతున్నాడు తప్పనిసరిగా.
ఒకప్పుడు మురారికి అమెరికా వెళ్ళాలని ఎంతగానో ఉబలాటం ఉండేది. కాని అతడు చదివిన చదువు అందుకు అంతగా ఉపకరించేది కాదు. ప్రపంచమంతా అమెరికాలో పుట్టిన "ఎలక్ట్రానిక్సు బూం" మత్తులో ఉన్న సమయంలో, అయాచితంగా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా, గబగబా ఒకటిరెండు కంప్యుటర్ కోర్సులు చేసేసి, ఒక ఏజెంట్ సాయంతో అడ్డదారిన అమెరికాకి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా, అకస్మాత్తుగా తండ్రికి వచ్చిన పక్షవాతం మూలంగా అతని ప్రయాణం ఆగిపోయింది. తండ్రి మరణం, పుత్ర ధర్మంగా తండ్రికి కర్మకాండలు జరిపించడం, ఆపై - ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ చక్కదిద్దడం వగైరాలన్నీ పూర్తయ్యీసరికి, ఉప్పెనలా విరుచుకుపడ్డ ఆ "బూం" ఏదో చప్పగా సమసిపోడంతో, అమెరికాలో తేరగా దొరికే ఉద్యోగాలు అరుదైపోయాయి. ఇక మురారి ఇండియాలోనే స్థిరపడక తప్పలేదు.
అంతలో "మామయ్యా! రెడ్ లైట్ "అంటూ రోహన్ పెట్టిన కేకకు ఉలికిపడ్డాడు మురారి. అప్పటికే బైక్ ఒక గజం పైగా హద్దు దాటి ముందుకి వెళ్ళడం, పోలీసు చెయ్యడ్డుపెట్టి అడ్డంగా నిలబడడం జరిగిపోయింది.
"తియ్యి ఐదు వందలు ఫైన్" అన్నాడు పోలీసు ధాష్టీకంగా, జేబులోంచి చలానా బుక్కు తీస్తున్న వాడిలా జేబులోకి చెయ్యిపోనిచ్చి.
మురారి చాలా సంతోషించాడు, తన పర్సును టాక్సీకి పేచెయ్యడం కోసం కొడుక్కిచ్చి పంపించడం మంచిదయ్యిందన్న ఆలోచన వచ్చింది అతనికి. పైకి మాత్రం, "నాదగ్గర అంతలేదు" అన్నాడు నిజాయతీగా.
"ఐతే మూడొందలు తియ్యి" అన్నాడు పోలీసు ఖండితంగా.
మురారి జేబులు తడుముకుని ఒక వంద పైకి తీశాడు. "ఇదిగో, ఇదిమాత్రమే ఉంది నాదగ్గర" అన్నాడు వందనోటు ఉన్న చెయ్యి ముందుకు చాపి.
రోహన్ ఆశ్చర్యంగా వాళ్ళ సంభాషణ వింటున్నాడు. మేనమామ వందే ఉందనడంతో తక్కిన నాల్గువందలూ తన దగ్గరున్నవి ఇచ్చే ఉద్దేశంతో రోహన్ జేబులోంచి తన వేలెట్ పైకి తీశాడు. అంతలోనే, పోలీసు ఆ వందా తీసుకొని పక్కకి తప్పుకోడంతో, బైక్ ముందుకు కదిలి వెళ్ళిపోయింది.
"మామయ్యా! నువ్వు చలాన్ తీసుకోలేదు" అన్నాడు రోహన్ కంగారుపడుతూ.
"ఫరవాలేదులే. వంద రూపాయిలకి మనకెవరూ చలాన్ ఇవ్వరు. చలాన్ కావాలంటే మనం 500 కట్టాలి. అప్పుడు కూడా ఆ చలాన్లు నిజమైనవనీ, ఆ డబ్బు ఖచ్చితంగా గవర్నమెంటుకి చేరుతుందనీ ఎంతమాత్రం నమ్మకం లేదు. అందుకే నేనెప్పుడూ చలాన్ల జోలికి పోను" అంటూ ఓ నవ్వు నవ్వాడు మురారి.
బైక్ హైటెక్ సిటీ ప్రాంతానికి వచ్చేసరికి, అది ఆఫీసులు తెరిచీ సమయం కావడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉండి, అడుగడుగునా ట్రాఫిక్ జామ్సు కావడం వలన వాహనాలు నత్తనడక నడవవలసి వస్తోంది. ఒకచోట జనం రోడ్డుమధ్య గుమిగూడి ఉన్నారు ఏదో చోద్యం చూస్తున్నట్లుగా. అక్కడ ట్రాఫిక్ ఆగిపోయివుంది. మురారి కూడా ఆగవలసి వచ్చింది. కుతూహలం పురిగొల్పగా పక్కవాడిని అడిగాడు మురారి, "ఏం జరిగింది" అని.
అతడు ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నవాడిలా వెంటనే జవాబు చెప్పాడు, "ఏం చెప్పాలి సార్ ! ఒక BMW కారుకి ఒకచిన్న మోటార్ బైక్ అడ్డం వచ్చిందిట ! ఆ స్కూటర్ వాలా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కారు హారన్ వినిపిoచుకోలేదుట. దాంతో ఆ కారులో ఉన్న సెలిబ్రిటీకి కోపం వచ్చింది.
"అంత ధిక్కారమా? నేనెవరో తెలియదా!? చూడు ఏంచేస్తానో" అంటూ కారు సీటులోనే కూర్చుని మండి పడ్డాడుట ఆ మహానుభావుడు.
ఫోన్లో మాట్లాడుతూ తన్మయత్వంలో మునిగి ఉన్న స్కూటర్వాలాకి అదేమీ తెలియకపోయినా తనకి అడ్డంగా ఒక కారువచ్చి నిలబడేసరికి ఫోన్ ఆఫ్ చేసి, స్కూటర్ ఆపాడుట. వెంటనే ఆ సెలిబ్రిటీకి బాడీ గార్డులు కారు దిగివచ్చి, అతన్ని బైక్ మీదనుండి కిందికిలాగి బుద్ధొచ్చీలా చెడామడా ఉతుకుతున్నారు. అదీ సంగతి." చెప్పడం పూర్తిచేసి మళ్ళీ అతడు తత్క్షణం వింత చూడ్డంలో నిమగ్నుడైపోయాడు.
ఆఫీస్ టైం గుర్తురావదంతో కొందరు ఎలాగో కష్టం మీద వీలు చేసుకుని, నెమ్మదిగా జనాన్ని తప్పించుకుని దారిచూసుకుని వెళ్లిపోడంతో అక్కడ కాస్త తెరిపి ఏర్పడింది. రోహన్ దృష్టి అటువైపు తిరిగింది. ఆక్కడ కనిపించిన దృశ్యం అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.
"మామయ్యా! ఎవరైనా తప్పుచేస్తే మనం "కాప్సు" కి రిపోర్టు ఇవ్వాలిగాని ఇలా, సివిలియన్సు వాళ్ళని తామై శిక్షించకూడదు కదా! ఎవరూ ఆ విషయం పట్టించుకోరేమిటి? ఇక్కడ ఎవరికీ మానవత్వం లేదా? రా, మామయ్యా మనం వెళ్లి ఆపుదాం ఆ మనిషి కాసేపట్లో చచ్చిపోయీలా ఉన్నాడు" అంటూ బైక్ దిగి రెండడుగులు అటుగా వేశాడు రోహన్.
గమ్మున మేనల్లుడిని చెయ్యి పట్టుకుని ఆపేశాడు మురారి. "ఆగు రోహన్! ఆ కారు ఎవరిదో నాకు తెలుసు. అది సంఘంలో పెద్దమనిషిగా చెలామణీ ఔతున్న రాజకీయ నాయకునికి బాగా కావలసిన వాళ్ళది. వాళ్ళకి ఎంత భాగ్యం ఉందో, వాళ్ళకే తెలియదు. ఎక్కడినుండో వచ్చినవాడివి నీకెందుకు చెప్పు ఇదంతా? వాళ్ళకి కోపం తెప్పిస్తే, కారణం ఎంత చిన్నదైనా ఏంజరుగుతుందన్నది చూశావు కదా! రేపువాళ్ళు నీపై పగబట్టి నీ మీద ఏదో ఒక అబద్ధపు కేసు బనాయించి - అదిక్కడ పెద్ద కష్టమేం కాదు - ముందుగా నీ పాస్‌పోర్టు లాగేసుకుంటారు. మళ్ళీ అది తిరిగి మన చేతికి రావాలంటే భూమిని తలక్రిందులు చెయ్యాలి! నేను నిన్ను తిరిగి మీ అమ్మకు క్షేమంగా అప్పగించాలంటే , ఇలాంటివాటిలో నువ్వు తల దూర్చకూడదు. నువ్విక్కడ ఇంకా 15 రోజులు ఉండాలి, గుర్తెట్టుకో."
తెల్లబోయాడు రోహన్. "పోనీ కాఫ్సుకి ఫోన్ చేద్దాం" అంటూ మేనమామ ఫోన్ కోసం చెయ్యిజాపాడు.
మేనల్లుడికి ఫోన్ ఇవ్వలేదు మురారి. "అటు చూడు రోహన్. అక్కడ నిలబడి చూస్తున్నవారిలో ఒక డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుకూడా ఉన్నాడు. అవసరమనిపిస్తే అతడు ఈ సరికే ఫోన్ చేసి ఉండేవాడు. మనం ఇక్కడనుండి శీఘ్రం వెళ్ళిపోడం మంచిదనిపిస్తోంది, రా బండెక్కు."
దెబ్బ దెబ్బకీ పెద్దగా అరుస్తూ చేతులు అడ్డం పెట్టుకుని దెబ్బలు కాసుకునీ ప్రయత్నం చేస్తూ ఏడుస్తున్నాడు ఆ స్కూటర్ వాలా. అతని పక్కన నేలమీద అస్తవ్యస్తంగా పడి ఉంది అతని బైక్. అంత హైరాణ పడుతూ కూడా అతడు ఎడమచేత్తో సెల్‌ఫోన్ గట్టిగా పట్టుకునే ఉన్నాడు. కొట్టికొట్టి అలిసిపోయారు కాబోలు వాళ్ళు అతన్ని వదిలి వెళ్ళిపోయారు.
BMW స్టార్టయ్యింది. జనం పక్కకు తప్పుకుని దానికి దారి ఇచ్చారు. అది సర్రున వెళ్ళిపోయింది అక్కడనుండి.
"మామయ్యా! మీరు "కాప్సు"ని రక్షకభటులు అంటారు కదూ" అడిగాడు రోహన్ బైక్ ఎక్కుతూ!