Menu Close
prabharavi

రెండు రెళ్ళు
నాలు గనుకోవటం నీతి,
ఇరవై రెండని
అనుకోవటం అవినీతి.

లెక్కను
సరిగా చేస్తే నీతి,
లెక్కను లెక్క చెయ్యకపోతే
అవినీతి.

భయపెడుతున్నా నని
నిప్పు కణికె అహం,
కావాలని అంటుకొని
కాల్చుకుంటారా జనం.

మంత్రి నిమ్మకాయ,
పులుపైనా ఇష్టం,
గింజ చేదు గదా
కొడుకును భరించటం కష్టం.

అమెరికా కొడు కొచ్చి
కొనిపెట్టాడు కారు,
నెల వాయిదాలు కట్టలేక
తండ్రి బేజారు.

కొడుకు మాట్లాడితే
హద్దులు గుర్తు చేస్తూ,
మనవడు పోట్లాడినా
ముద్దులు కురిపిస్తూ.

పడిపోతావు, జాగ్రత్త
అంటారు మిత్రులు,
ఎండ – పడితేనే గదా
లోకం లేచేది.

ఉదయమే కలం తీసుకున్నా
కానీ మూసేసా,
ఎండను మించిన
కవిత్వం రాయగలనా!

ఎండలో జాగ్రత్త
పిల్లలతో తల్లి,
ఎండకు జాగ్రత్త
చేప్పేవా రున్నారా!

దేశంలో
ప్రశాంతి “విద్యుత్తు” పోయింది,
కొందరి కిబ్బంది లేదు
“ఇన్వర్ట” రుంది.

వినాయకుడి నైవేద్యం
పెట్టి తింటావు,
నాయకుడికి పెట్టక్కరలేదు,
వాడే తింటాడు.

పక్షిది
సొంత గూడు,
రాజకీయ పక్షిది
జనం గూడు.

వండేవాడు
ఓటరు,
మెక్కేవాడు
లీడరు.

కానుకలు
హుండీలో వద్దు,
ధర్మ కర్త కాదు,
పూజారి ముఖ్యం

నక్షత్రాలలో
రోహిణి అతి సౌందర్యం,
అందుకే వేసవి
మహతాపం.

గుడి మెట్ల మీద
దేవుళ్ళు అడుక్కుంటూ...
భక్తులు గుళ్ళోకి వెళ్లి
రాతి బొమ్మల్ని అడుక్కుంటూ...

కిరణాలు
హోమియో మాత్రలు,
ఆరోగ్యానికి
అమృత పాత్రలు.

చెట్ల అందం చూసి
ఇరుక్కుపోకు,
ఓ గాలిపటమా,
సూత్రం వదలకు.

స్త్రీ కన్నీటి బొట్టు
ఒక్కటి పడినా చాలు
సప్త సముద్రా లైనా
ఎండిపోవలసిందే.

మంటలు పెడుతుంటే
బతికున్నా చచ్చినట్లే,
వెలుతురు పంచుతుంటే
చచ్చినా బతికున్నట్లే.

Posted in October 2019, కవితలు

1 Comment

  1. Anupama

    రంగారావు గారు,కృతజ్ఞతలు.చాలా చాలా బాగా చెప్పారూ.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!