శ్రీవిల్లిపుత్తూర్
మదురై నించి 120 కి.మీ దూరంలో ఒక అద్భుతమైన వైష్ణవ క్షేత్రం - శ్రీవిల్లిపుత్తూర్ ఉన్నది. ఇది తిరుప్పావైలో చెప్పబడ్డ - ఇంకా సరిగ్గా చెప్పాలంటే, తిరుప్పావైని చెప్పిన "ఆండాళ్", లేక 'గోదాదేవి' పుట్టిన స్థలం. పుట్టిన దగ్గరనుంచి రంగనాథుడే తన సర్వస్వము అని అనుకున్న తల్లి క్షేత్రం. ఇక్కడకి వెళ్లే దారి 'యనమలై' కొండల పక్కనించి వెడుతుంది. అంటే ఈ కొండ ఒక ఏనుగు మోకరిల్లినట్లు ఉంటుంది; విశాఖలో డాల్ఫిన్సునోసు తిమింగళాన్ని అనుకరించినట్లు. ఇది మహావిష్ణువు 108 దివ్యదేశాలలో ఒకటి. (క్షేత్రం అనే మాట నేను వాడుతున్నాను కానీ, వైష్ణవులు దివ్యదేశమనే అంటారు.)
మొత్తానికి ఊరు చేరుకున్నాము. అక్కడ వీధులు శుభ్రంగా ఉన్నాయి. సాధారణంగా తెలుగునాట చిన్న ఊళ్లు అంత శుభ్రంగా ఉండవు. తమిళనాడు కూడా మామూలుగా అంతే అయినా, ఆ శ్రీవిల్లిపుత్తూరు చాలా బాగుంది. ఒక చిన్న వీధిలో మీకు అకస్మాత్తుగా దేవాలయం దర్శనం ఒక అత్యంత పెద్ద గోపురంతో దర్శనమిస్తుంది. అది చూడగానే, ఇంగ్లీషులో Humongous అంటామే, ఆ మాట గుర్తుకొచ్చింది. కింద ఫోటో చూడండి. మీరూ అంగీకరిస్తారు. అదేకాక, ఈ గోపురం మీనాక్షీ అమ్మవారి ఆలయ దక్షిణ గోపురం కన్నా సుందరంగా ఉంటుంది. ఆ గోపుర నిర్మాణం ఎంత అందంగా, బాగా చేశారో! అని అనుకుంటూ అడుగు ముందుకి వేసేసరికి, గోపుర ద్వారం అటూ, ఇటూ ఇనప బద్దలు పెద్దవి వేసి ఉన్నాయి. ఇంకా పునాదులని బలిష్ఠం చేసినట్లు తెలుస్తుంది. అప్పుడు అక్కడివారిని విచారిస్తే తెలిసింది - ఆ ఆలయగోపురం కూలిపోతుందని ఒకప్పుడు భయం వేస్తే, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత కోట్లకొద్దీ వ్యయం భరించి, భద్రపరిచే వ్యవస్థ చేశారట. అక్కడివాళ్లు ఆవిడమీద చాలా గౌరవంగా ఉన్నారు. ద్రావిడ పార్టీ DMK వస్తే ఇలా హైందవాలయాలని కాపాడే అవకాశం తగ్గుతుందని భయపడ్డారు. ఇది 11 అంతస్తుల గోపురం. అయితే మధుర గోపురాలకీ, ఈ గోపురానికి కొంచెం తేడా ఉన్నది. ఇది కొంచెం సన్నగా ఉంటుంది. 11కలశాలతో ఉన్నది. చాలా కుడ్యాలుంటాయి. నాసి ముఖాలు చాలా అందంగా, గోపుర పైభాగం కంటే కొంచెం వెడల్పుగా ఉంటాయి.
ముందు మనం ప్రవేశించవలసింది బాగా ఎడమచేతిపక్కన ఉన్న ఆవరణలోనించి. షెడ్డులాగా వేశారు. అక్కడ లోపాలకి వెళ్లాలంటే ఒక పెద్ద 'దారి' ద్వారా వెళ్ళాలి. ఇది పై కప్పు ఉన్న దారి. కానీ మీనాక్షీ ఆలయంలోలాగా కాకుండా, అంత వెడల్పుగా లేకుండా, కట్టి ఉంటుంది. మీకు అర్థమయ్యేలాగా ఒక ఫోటో తీశాను, ఒకరిని నిలుచోబెట్టి. బహుశ: మీకు అర్థం అయి ఉంటుంది. ఈ దారికిరువైపులా రకరకాల సామగ్రి అమ్మే కొట్లు ఉన్నాయి, మనం విజయవాడలో కనకదుర్గమ్మని దర్శించేముందు చూసే కొట్లలాగా. ఈ దారి ఒక పెద్ద స్తంభాల ఆవరణలోకి దారితీస్తుంది. అదుగో - సరిగ్గా అక్కడే ఒక పాలకోవా అమ్మే దుకాణం ఉన్నది. ఆ పాలకోవా తమిళనాడంతా ప్రాచుర్యం పొందిందట . అది తినక పొతే మీ జీవితం వృధా - అని ఎవరో అంటే ప్రసాదంగా అదికూడా కొనుక్కుని లోపలికి వెళ్ళాము. టిక్కెట్టు కొనుక్కుని ముందర అమ్మవారి దర్శనం చేసుకుని, ఆ తరువాత మిగతా విశేషాలు చూద్దామని నిశ్చయించాము. ఫోనులు కట్టేసి క్యూలో నిలబడితే (ఇది ప్రధానమైన గుడి, చాలామంది భక్తులు వస్తారు, రద్దీగా ఉన్నది) అటూ ఇటూ ఉన్న శిల్ప సంపద చూసే అవకాశం కలిగింది. గర్భాలయం చుట్టూతా మంచి చెక్కడాలున్న స్తంభాలు, గోడలమీద నరసింహ స్వామీ, కృష్ణుడు, రాముడు, వగయిరాచిత్రాలు కనబడతాయి. ముఖ్యంగా శయనించి ఉన్న రంగనాథుడు ఒక పల్లకీలో ఉన్నట్లు, ఆ పల్లకీకి పైన కలశాలు ఉన్నట్లు చిత్రించారు. చాలా అందమైన చిత్రం. ఆ గుడిని సూచిస్తున్నట్లుగా ఉన్నది. దారి పైనంతా రంగవల్లులు చిత్రీకరించారు. ఆలయం ఎడమ వైపు మధ్యలో ఉన్న ద్వారంగుండా మమ్మల్ని ప్రవేశ పెట్టారు. లోపల సరాసరి అమ్మవారి దర్శనం దగ్గిరకి వెళ్ళాము.
ప్రతి ద్రవిడనాటి గుడిలోలాగా ఇక్కడకూడా మూల విరాట్టులు లోపల వెనకపక్కగా ఉండడం, ముందర ఉత్సవ విగ్రహాలు ఉండి, మన పూజలు ఉత్సవ విగ్రహానికి చేసుకోవడం కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ రంగనాథుడు, గోదాదేవి కలిసి దర్శనమిస్తారు. అక్కడ పూజ చేయించుకుని బయటకి రాగానే రెండు ముఖ్యమైన సంగతులు గమనించాను. గర్భాలయం పైన బంగారు తాపడం చేసి ఉన్నది. మామూలుగా వైష్ణవాలయాల మీద సుదర్శన కలశం ఉంటుంది. కాకపొతే ఒక కలశం ఉంటుంది. ఇక్కడ 4 కలశాలున్నాయి. గోపురం అతి సుందరంగా, తిరుపతి గోపురంలాగా ఉంటుంది; ఇంకా అందంగా ఉన్నదనిపించింది. ఆ గోపురానికి బంగారు తొడుగు పాము పొలుసులతో ఆదిశేషుడు చుట్టూతా చుట్టుకుని ఉన్నాడా అని అనిపిస్తుంది.
గర్భగుడి బయటకి రాగానే ఒక అద్భుతమైన బంగారు చిన్న మందిరం కనిపిస్తుంది. అక్కడే ఉత్సవ విగ్రహాలకు కల్యాణాలు వగయిరా చేస్తారు. ఇక్కడ ఫోటోలు తియ్యలేక పోయాను; ఎవరో వద్దన్నారని కాదు; అలా గుళ్ళలో తియ్యకూడదన్న నా నమ్మకం వల్ల. కానీ ఈ మందిరం - 8 x 8 సైజులో - చాలా అందంగా ఉన్నది.
అక్కడనించి బయటకి వచ్చి ఎడమచేతివైపు చూస్తే ఒక చిన్న ఉద్యానవనం కనిపిస్తుంది. ఇదొక తులసి వనం. ఇక్కడే ఆండాళ్ అమ్మవారు అయోనిజగా ప్రకటమయ్యారు. ఆ కథ అంతా రాయాలని ఉన్నది కానీ, వ్యాసం చాలా పెద్దదవుతుందేమో నన్న భయం ఉన్నది. విష్ణుచిత్తుడనే ఒక పూలు కట్టే అతను రంగనాథుడి అపరిమిత భక్తుడు. పిల్లలు లేరు. స్వామిని అర్చించుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒకనాడు ఒక తులసి వనంలో ఆయనకీ ఒక పసిపాప కనబడింది. ఆమెని ఇంటికి తీసుకు వచ్చి తన బిడ్డలాగానే పెంచాడు. తండ్రిలాగే ఆమె గొప్ప విష్ణు భక్తురాలయింది. తండ్రి తయారు చేసే పూల దండలు తానూ వేసుకుని స్వామికి ప్రీతి చేకూర్చుతున్నట్లు ఊహించుకునేది. ఒకనాడు రంగనాథస్వామికి సమర్పించిన దండలో పొడుగాటి వెంట్రుకని గమనించిన ఆలయ పూజారులు విష్ణుచిత్తుడిని నిలదీశారు. ఆయన హతాశుడై ఎలా ఈ ఘోరాపరాధం జరిగిందని ఆలోచిస్తూ ఇంటికి వెళితే గోదా (ఇది ఆ బిడ్డ పేరు) రోజూ ఈ దండలు ఆలయానికి చేర్చే ముందర తను వేసుకునేదని తెలిసింది. అప్పుడు ఆమెని దండించదలుచుకున్నవారిని రంగనాథుడు వారించి ఆమెని వివాహం చేసుకుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆమె రంగనాథుడినే అర్చిస్తూ, ఆఖరికి ఆయనలోనే ఐక్యం అయిపోవడం, - చాలా మంచి కథ. ఆమె 8 సంవత్సరాల వయసులో తిరుప్పావై కావ్యాన్ని చెప్పిందని ప్రతీతి.
అలా కొంచెం ముందుకి వచ్చి కొన్ని మెట్లెక్కి పైకి వెడితే ఆశ్చర్యం కలిగించేటంత పెద్ద నరసింహ స్వామీ మందిరం ఉన్నది. ఆయన లక్ష్మీసమేతుడై వెలిసి ఉన్నాడు. అసలు ఒక అంతస్తు పైన అలాంటి గుడి ఉంటుందన్న ఆలోచనే మనకి రాదు, ఎందుకంటే మన గుళ్లన్నీ నేలపైనే ఉంటాయి. అక్కడ పూజలర్పించి బయటకి రాబోతుంటే ఇంకొక ఆశ్చర్యకరమైన గది కనిపిస్తుంది.
మీరు కేరళలో చాలా గుడులు చూసే ఉంటారు. చెక్కతో అందంగా కడతారు. అసలు ఆ గుళ్ల కప్పుకేసి చూసారా? ఎంతో అందంగా చేసి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ 'గది' పూర్తిగా చెక్కతో చేసి ఉన్నది. పైన కప్పు చాలా చెక్క 'trusses' మీద ఆధార పడింది. ఇవి నేరుగా కాక అందంగా మలచబడ్డాయి. అసలు చూడవలసిన ప్రదేశం. ఇక్కడ చుట్టూతా గోడకి చెక్క మందిరాలుగా తయారు చేసి ఉన్నాయి; వాటిలో 64 ఆళ్వార్ల విగ్రహాలు ఉన్నాయి.
మళ్ళీ కిందకి వచ్చి, కింద ఉన్న స్తంభాల మందిరంలోకి వెళ్లాను. అలా ఆ గొప్ప శిల్ప కళని ఆస్వాదిస్తూ చూస్తూ ఉంటే మీనాక్షీ మందిరంలో ఎంత గొప్ప శిల్ప స్తంభాలు ఉన్నాయో అంత గొప్ప శిల్పకళ కనబడింది నాకు. అక్కడ రెండు పక్క పక్క స్థంభాలమీద రతీ మన్మథుల విగ్రహాలున్నాయి. ఈ స్తంభాలు ఎంతలేదన్నా 15 అడుగుల పొడుగుంటాయి. పెద్ద పెద్ద విగ్రహాలు. ఎంతో వివరంగా చెక్కారు. మన్మథుడు చెరుకు విల్లు ధరించి ఉన్నాడు. ఆ విల్లు పైన కప్పుదగ్గిర్నుంచీ కింద పీఠం దాకా ఉన్నది. అక్కడ ఉన్న గుడి అధికారులని ఆ విగ్రహాలని గురించి ప్రశ్నిస్తే అవి రతీ మన్మథులవని చెప్పారు. నా కుతూహలం చూసి, ఆ విల్లుని మీటమన్నారు. గోటితో మీటితే అది లోపల వెదురులాగా డొల్లగా ఉన్నది. ఆశ్చర్యపోయి, ఆ విగ్రహాన్ని చాలా సేపు పరిశీలించాను; ఇది ఎలా సాధ్యం? అని. ఒక్క సారి ఊహించి చూడండి - విల్లు వంకరగా అన్ని విల్లుల్లాగానే ఉన్నది. పై భాగం నించీ కింద భాగందాకా ఒకే రాతితో మలచ బడిన స్థంభం. విల్లు పైన మొదలై, కింద పీఠం దాకా డొల్లగా ఉండాలంటే ఎలా సాధ్యం? విల్లు కింద మొదలు నా ఛాతీ దగ్గిర మొదలయింది. కాబట్టి వెనక నించి రంధ్రం తొలిచారేమో అని వెతికాను. ఒకే రాయి. ఎక్కడా అతుకులు లేవు. అలాగే పక్కన ఉన్న చిన్న అంచుని పట్టుకుని పైకెక్కి విల్లు పైభాగం మీటాను. అక్కడా డొల్లగానే ఉన్నది. ఆ రోజునించీ ఈరోజు దాకా నా ఆలోచన తెగలేదంటే నమ్మండి. ఈ విగ్రహం ఎలా తయారు చేశారు? అలా డొల్లగా ఉన్న విల్లుని రాతిలో ఎలా చెక్కారు? ఆ శిల్పుల పదార్థ శాస్త్రం ఎంత గొప్పది?
పక్కనే ఉన్న రతీదేవి విగ్రహం చూస్తే ఇంకొక అద్భుతం. కాలి బొటనవేలుని మీరు వేలితో కిందనుంచి పైకి రాస్తే గోరు కొద్దిగా ముందుకు వచ్చి నిజంగానే గోరు ఉన్నట్లు తెలుస్తుంది. ఎంత నైపుణ్యం! ఎంత వివరమంటే గట్టిగా నొక్కితే మన వేలే తెగేటట్లు ఉన్నది. రతీ దేవి సౌందర్యం అనుపమానం. నిజంగా ఇక్కడ శిల్పులు మీనాక్షీ ఆలయం శిల్పులతో పోటీ పడ్డారు. ఇలాంటివెన్నని రాయను?
బయటకి వచ్చి ఆ ప్రపంచ ప్రఖ్యాత పాలకోవా తిని మళ్ళీ ఆ గోపురం దర్శనం చేసుకుని బయటకి వచ్చాము. అక్కడ నించి తిరుపుండ్రంలో త్వరగా దర్శనం చేసుకుని మధురకి ఉత్తరాన ఉన్న ఇంకొక వైష్ణవ క్షేత్రానికి వచ్చాము.