మధుర మీనాక్షి ఆలయం
దక్షిణ భారత దేశంలో మదురై పేరు వినని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు. అలాగే మీలో చాలా మంది మధుర మీనాక్షి దర్శనం చేసుకునే ఉంటారు, అమ్మవారి అనుగ్రహం సంపాదించే ఉంటారు. మరి నాలాంటివాడు మధుర మీనాక్షి గుడి స్థలపురాణమంటూ మళ్ళీ పాండ్య రాజుల కథ, మీనాక్షీ సుందరేశుల కలయిక, ఆమె అవకరం తొలగిపోవడం, విష్ణువు మీనాక్షీ అమ్మవారిని సుందరేశునికిచ్చి వివాహం చెయ్యడం - ఈ కథంతా ఇప్పుడు చెప్పడమనేది అనవసరం అనుకుంటున్నాను. ఎవరైనా అడిగితే తప్పక రాస్తాను.
అయితే మదురై ప్రసక్తి ఎందుకు? అంటే ఒక్క మీనాక్షి గుడే కాక, దగ్గిరలో ఉన్న క్షేత్రవర్ణన చెయ్యాలని ఉన్నది; అదికాక ఆ దివ్యమైన మీనాక్షి గుడిలో విశేషాలు వర్ణించాలని ఉన్నది. అక్కడ ఒక అర్చకులని పట్టుకుని తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకోవాలని రాస్తున్నాను.
ఇంకొక మాట ఏమిటంటే మీనాక్షి అమ్మవారి సన్నిధానంలో ఫోటోలు తీయనివ్వరు. మన ఫోన్లను ముందే పాదరక్షలతో పాటు బయటే వారికి అప్పజెప్పేసి మనం ఉట్టి చేతులతో మాత్రం లోపలికి వెళ్ళాలి. అందుకని ఒక ఆలయ గోపురం బయటనుంచి తీసిన ఫోటో తప్ప ఇంకేవీ జతపరచలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.
మేము దక్షిణ ద్వారంలోంచి ప్రవేశించాము. మీనాక్షి గుడిలో ముందర మనకి కనిపించేది పుష్కరిణి. అతిపెద్ద ఆలయం. నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన గోపురాలు ఉన్నాయి. అన్నీ చాలా పెద్దవిగా ఉంటాయి, కానీ అన్నీ ఒకే ఎత్తులో ఉండవు. తేడాలున్నాయి. ప్రతి గోపురం మీదా చాలా కుడ్యాలు, విగ్రహాలు 2000 నించీ 3000 దాకా ఉంటాయి. దూరం నించి కూడా బాగా కనబడాలని పై గోపురాలకు రంగులు వేస్తారు. నాయనార్లలో ఒకరైన "జ్ఞాన సంబందర్" తన తండ్రి పుష్కరిణి వద్ద కూర్చోబెట్టి స్నానానికి దిగితే పసిపిల్లవాడు కనక భయపడి ఏడుస్తుంటే శివుడు అమ్మవారిని అతనికి పాలివ్వమని ఆదేశించాడట. అమ్మవారి పాలు తాగిన జ్ఞాన సంబందర్ ఆత్మజ్ఞుడై గొప్ప భక్తుడైనాడు. ఆఖరికి జీవన్ముక్తుడైనాడు. ఆ పుష్కరిణి నించి తండ్రి చూపించిన గోపురం మీద శివ పార్వతుల విగ్రహాలేవైతే జ్ఞాన సంబందర్ చూశాడో, అవి మనకి కనబడతాయి.
అలా కొంచెం ముందరికి వెళ్ళగానే ఒక పెద్ద దారి అడ్డంగా కనబడుతుంది. ఆ దారికి అటూ ఇటూ చెక్కిన రాతి స్థంభాలూ, వాటిపై పరిచిన బల్లపరుపు కప్పూ కనిపిస్తాయి. బల్లపరుపని ఎందుకన్నానో ఇంకొక క్షేత్రం వర్ణించేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఈ కప్పుమీద అద్భుతమైన చిత్ర లేఖనాలున్నాయి. ఈ దారి దాదాపు 300 వందల అడుగులుంటుంది. కుడి చేతినించి మొదట వంద అడుగులు అమ్మవారి చిత్తరువులు, రెండో భాగంలో మీనాక్షీ సుందరేశుల కథాఘట్టాలు, మూడో భాగంలో ఈశ్వరుడి చిత్రాలు లిఖించబడి ఉన్నాయి. కొద్దిగా ఎడమ చేతివైపు అమ్మవారి ఆలయ ద్వారం ఉంటుంది. ఈ 'దారి అన్నానే, దానికి చివర సుందరేశుల సన్నిధికి దారి ఉంటుంది.
ఈ ఆలయ చిత్ర, శిల్ప సౌందర్యం వర్ణణాతీతం. చూసిన వారికి చూసినన్ని రూపాలు కనబడతాయి. వాటిగురించి రాసే ముందర, ఒక ముచ్చటైన ప్రథ గురించి చెప్పితీరాలి.
దక్షిణాదిన అన్ని శివాలయాల్లాగే అమ్మవారి సన్నిధి అయ్యవారి సన్నిధి 90 డిగ్రీలలో ఉంటాయి. అంటే అమ్మవారి ఆలయం ఉత్తరంలో ఉంటే అయ్యవారి ఆలయం తూర్పునన్నమాట. రెండిటికీ మధ్య నేను చెప్పిన దారే మార్గం. మేము పొద్దున్నే 5.30 గం .కి వెళ్తే (గుడి 5 గంటలకే తెరుస్తారు; ఇంకా ముందు కూడా వెళ్ళవచ్చు.) అందరూ ఉద్విగ్నంగా, ఉల్లాసంగా దేనికో ఎదురు చూస్తున్నారు. ఏమిటంటే కొద్దీ సేపట్లో తెలిసింది - ఒక పల్లకీలో సుందరేశుడు ఊరేగుతూ తన ఆలయం వైపు వెళుతున్నాడు. ఇది ఏమి భావమని అడిగితే, ప్రతిరోజూ స్వామివారు రాత్రి అమ్మవారి ఆలయానికి పల్లకీలో వెళతారు, మళ్ళీ పొద్దున్నే తన స్వసన్నిధికి చేరుకుంటారు. అదే పల్లకిలో. ఆ తరువాత చూసాము కూడా - అర్చక స్వాములవారు స్వామివారి సన్నిధిని కాపాడే దేవత గుడిలో స్వామివారి ఆలయ తాళంచెవి పెట్టి పరాకు చెప్పడం, మళ్ళీ పొద్దున్నే ఆయనకి చెప్పి తాళం తీసుకుని స్వామి సన్నిధిని తెరవడం, భక్తుల కోరికలు తీర్చడానికి మళ్ళీ కొలువు తీరడం - ఇది ఎంత బాగుంటుందో! ఇది చూడడం ధన్యం అని చెప్పారు. మాకు ఆ భాగ్యం కలిగినందుకు సంతోషించాము.
మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మనం క్యూలో నిలుచుంటే కుడిచేతివైపు ఒక గొప్ప నటరాజ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇది ఎంత అద్భుతమైన శిల్పం అంటే, అసలు అంత పెద్ద నటరాజ విగ్రహం ఇంకెక్కడా నేను చూడలేదు. పైగా కుడికాలు కింద మోపి, ఎడమ కాలు పైకెత్తిన స్వరూపం. బహు సుందరమైన మూర్తి. ఈ మూర్తికి తత్త్వం గురించి చెప్పారు కానీ, అదంతా ఇక్కడ రాయడం వీలు కాదు.
మీనాక్షి అమ్మవారి విగ్రహం చూస్తుంటే కళ్ళు తిప్పబుద్ధి కాదు. ఈ విగ్రహం పూర్తిగా ఒకే మరకతశిల - ఆంగ్లంలో "Jade" అంటారు, దాంతో తయారు చేసింది. కుడి చేతిలో ఒక చిలుకని పట్టుకు ఉంటారు అమ్మవారు. అసలు అంత అందంగా ఎలా తయారు చేశారో ఆనాటి శిల్పులు అనుకున్నా. వారి పేర్లేవీ?
ఇక్కడే ఒక కథ చెప్పారు అక్కడి అర్చకులు. అందరికీ తెలియక పోవచ్చునని రాస్తున్నాను. ఇది చాలా పురాతనమైన గుడి. అమ్మవారి గర్భాలయం చిన్నగా ఉండేదిటగానీ, మూర్తిమాత్రం పురాతనంట. ఎప్పుడు ప్రతిష్ట అయిందో తెలియలేదు. ఒకాయన స్వయంభూ అన్నారు కానీ, నాకు నిర్దిష్టంగా తెలియలేదు. అయితే ప్రస్తుతం ఉన్న విస్తృత ఆలయం మాత్రం 10వ శతాబ్దంచివరలో పాండ్యరాజుల తరం అయిపోయిన తరువాత తిరుమల నాయకుడు - తెలుగు రాజు - నిర్మించాడు. (ఆయన మ్యూజియం కూడా మదురైలో ఉన్నది ). మీకు గుర్తుండే ఉంటుంది - పాండ్య రాజుల పాలన 3 తరాలు మాత్రమే సాగింది. ఆ తిరుమలనాయకుని విశాల దృక్పథం అడుగడుగునా ద్యోతకమవుతుంటుంది. ఆ తరువాత మొగలాయిలు మధుర మీద దాడి చెయ్యడం జరిగింది. చాలా విధ్వంసం చేశారు, అన్నిటికన్నా అమ్మవారి విగ్రహం గురించి విని, దానిని ధ్వంసం చెయ్యడమో, లేక ఎత్తుకుపోవడమో ధ్యేయంగా పెట్టుకుని మొహమ్మద్ కాబుద్దీన్ అనే సేనానాయకుడి కింద పెద్ద సైన్యం గుడిమీద పడింది. అప్పటి అర్చకుల గుండెల్లో చిచ్చు పుట్టింది. మారణ హోమం చేస్తున్నారు; కానీ వాళ్లకి గర్భగృహంలో అమ్మవారు కనపడలేదు. అప్పటికప్పుడు, రాత్రికి రాత్రి చాలా ధైర్యంగా ఆ అర్చకులు అమ్మవారి విగ్రహం ముందు ఒక గోడ కట్టి, రంగులు వేసి ఒక వేరే విగ్రహం ముందర పెట్టి, దానికే పూజలు చేస్తున్న ఊహ కల్పించారు. ముస్లిము దుండగులు వచ్చి 'ఇదేనా మీనాక్షి అమ్మవారి విగ్రహం?' అని అడిగితే భయం నటిస్తూ, 'ఇదే' అని చెప్పారు. అది ధ్వంసం చేశారు మహమ్మదీయులు. ఈ లోపల తిరుమల నాయకుడి తండ్రి మళ్ళీ నిలదొక్కుకుని, వాళ్ళని పారద్రోలాడు. ఈ విధంగా అర్చకుల ధర్మ చింతన, సమయస్ఫూర్తి, తెలివి ఈ మహాద్భుతమైన మూర్తి పాడవకుండా మిగిలింది. ఈ తరాల వారంతా ఎంతో ఋణపడి ఉన్నారు వారికి. కానీ ఈ కథ అసలు అక్కడ చాలామందికి తెలిసినట్లు లేదు. చాలా మందిని - తమిళులనే - అడిగాను. ఒక్కరే అలాంటిదేదో జరిగింది అన్నారు. అక్కడ అర్చకులు మాత్రం వంశపారంపర్యం గా ఉంటారు కాబట్టి ఈ చరిత్రని కాపాడుతున్నారు. ఇది అందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. అక్కడ ముస్లిములు విరగకొట్టిన కొన్ని విగ్రహాలని చూసాను. ప్రమాణం ఏమిటంటే, అన్నిచోట్లా ముస్లిములు విగ్రహాల ముక్కులు విరక్కొడతారు. మీరూ చూడవచ్చు.
అన్నిటికంటే అద్భుతం ఈ ఆలయ శిల్ప సౌందర్యం. ఎక్కడ మొదలు పెట్టను? ఎలా వర్ణించను? అమ్మవారి ఆలయ ద్వారం ముందు ధ్వజ స్థంభం చుట్టూతా నాలుగు మహా స్థంబాలు ఉన్నాయి. ఇవి కప్పుకి ఆధారాలు. వీటి మధ్యలో ఊరేగింపు రథం ఉంటుంది. ఈ స్థంబాలు, వాటిమీద చెక్కడాలు చూస్తూ ఎన్ని గంటలు గడపచ్చో! ఒక స్థంభం మీద ఒక దృశ్యం - మీనాక్షీ అమ్మవారి చేతిని విష్ణుమూర్తి సుందరేశుడి చేతిలో పెడుతున్న అతి భవ్యమైన సన్నివేశం. అప్పుడు అమ్మవారు కొద్దిగా సిగ్గుపడుతున్నట్లు, అయినా తనకు కావలసిన వాడి వద్దకి చేరిన గర్వం - ఒకించుక ఒద్దిక, రాచరికపు ఠీవి - ఓహ్! రాతిలో రాగాలు పాడించటమంటే ఆ నాటి శిల్పులకు తెలిసినట్లు ఎవరికి తెలుసు? ఒక్కొక్క స్థంభం అత్యంత సుందరంగా డజన్లకొద్దీ శిల్పాలతో పైనుంచి కిందదాకా మలచ బడి ఉంటుంది. ఏనుగుమీద కూర్చున్న శివుడు, అసలు కాళ్ళు, పిక్కలు, పాదాలు ఎంత సునిశితంగా ఉంటాయో చూడవలసినదే! ఏ శిల్పమైనా, కనుముక్కు తీరు అమిత సుందరంగా ఉంటుంది. ఆ ప్రాంతం రెండు గంటలు చూసినా తీరలేదు నాకు. పక్కనే వీరభద్రస్వామి భద్ర విగ్రహం ఉన్నది. దేశంలో ఇంకెక్కడా లేని విధంగా 14 చేతులతో భీకరంగా దక్ష యజ్ఞ ధ్వంసానికి వెడుతున్నాడు. చేతుల్లో రక రకాలైన ఆయుధాలు ఉన్నాయి. నేను చిన్నప్పట్నుంచీ ఊహించుకున్న రూపం కన్నా భిన్నంగా సన్నగా, యుద్ధానికి తయారుగా ఉన్నారు. (నేను ఇంకొంచెం లావుగా ఊహించుకునేవాణ్ణి.) దాదాపు ఎనిమిది అడుగుల విగ్రహం.
ఇటు పక్క చూడండి! రెండు స్థంబాల పైన శివ పార్వతులున్నారు! తాండవ నృత్యంలో శివుడు నాట్యం మొదలు పెట్టాడు. అమ్మవారు వయ్యారంగా వచ్చి లాస్యం చేస్తున్నారు. (మగ వాళ్ళు నృత్యం చేస్తే నాట్యం అంటారు; అమ్మవారు చేస్తే లాస్యం). శివుడు పోటీగా నృత్య కష్టం పెంచాడు; అమ్మవారు అంతకంటే గొప్పగా లాస్యం చేస్తున్నది. చాలా సేపు పోటీ సాగింది. శివుడెంత ప్రయత్నించినా అమ్మవారు తీసిపోకుండా నృత్యం చేస్తున్నది. ఆఖరికి లాభం లేదని, తన కుడి పాద బొటనవేలుని కుంకుమలో ముంచి, కాలెత్తి అమ్మవారి నుదుటిమీద బొట్టు పెట్టాడు శివుడు. ఆడవారు నృత్యంలో ఆ భంగిమ వహించకూడదు కాబట్టి అమ్మవారు సిగ్గుపడి నృత్యం ఆపేసింది. అదిగో! ఆ సన్నివేశం అంత పెద్ద విగ్రహాలతో ఇంకెక్కడైనా చూసారా? అమ్మవారి నుదుట రూపాయి కాసంత బొట్టు చూస్తే తరించి పోమూ? పోటీ గెలిచిన గర్వంతో శివుడు చూస్తుంటే అమ్మవారికి మద్దతివ్వాలని అనిపించదూ? ఎంత ముచ్చట!
ఇదో ఇక్కడ ఒక స్థంభం మీద వినాయకుడు - అతి సుందరంగా ఉన్నాడు. ఇంకో స్థంభం మీద వరాహం - ఇక్కడెందుకుంది? ఇంత సుందరంగా నాట్యం చేస్తున్న దేవతలో, వారి చెలికత్తెలో - కళ్ళెలా తిప్పేది? ఒకొక్క స్థంభం 15 అడుగుల ఎత్తు ఉన్నది. ఒకే శిలలో కప్పు బరువు మోస్తూ ఇంత సున్నితమైన శిల్పాలు ఎలా చెక్కారో? ఏ ఒక్క స్థంభం కూడా ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ లేకుండా అంత పెద్ద ప్రదేశంలో ప్రతీదీ అక్కడే పూజలు జరిపించుకునే దేవాలయం లాగా ఉన్నదే! ఇక్కడ లక్ష్మీ గణపతి ఇరు దేవేరులతో ఉన్నాడు. పక్కనే "బుర్ర లేని వాడి విగ్రహం - ఒక చెవిలోంచి చూస్తే రెండో చెవి బయట కనిపిస్తుంది. కానీ మధ్యలో ఒక రాతి బంతి ఉంటుంది!
పుష్కరిణి పక్కనే కుడిచేతివైపు ప్రసాదాలు తయారు చేసే ఒక వంటిల్లు ఉన్నది. చాలామంది పాచకులు అక్కడ 24 గంటలూ ప్రసాదాలు తయారు చేస్తూంటారు. అక్కడ మాకు తెలిసిన ఒకరు అమ్మవారి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఏమి రుచి! దాని ముందు ఒక డప్పు లాంటి శిల ఉన్నది. అక్కడ విభూతి తయారు చేస్తారట. అక్కడ స్థంబాలమీద చిత్రమైన జంతువులున్నాయి. అశ్వము, సింహమూ, మొదలైన జంతువులన్నీ కలిస్తే ఉండే పోలికలున్నాయి. ఏమి శిల్ప కళా చాతుర్యం!
అమ్మవారి గర్భాలయం ఎనిమిది భద్రగజాల మీద ఆధార పడి ఉంటుంది. ఈ దిగ్గజాల పేర్లు రాసి కనబడతాయి. అన్నీ బయటకి, అంటే మనవైపు తిరిగి ఉంటాయి. ఒకొక్కటి 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ గర్భాలయం చుట్టూ ఒక జలాశయం ఉంటుంది. ఆంగ్లంలో "Moat" అంటారే, అల్లా ఉంటుంది. ఇలా ఇంకెక్కడా నేను చూడలేదు. దీని అవసరమేమిటో అర్థం కాలేదు. వెనక చాలా శివలింగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. అలా తిరిగి వస్తే జ్ఞానసంబందర్ ఆలయం, సిద్ధర్ ఆలయం ఉన్నాయి.
మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని బయట పడితే కుడి చేతి ఆవరణ చివర ఉత్సవ నటరాజ మూర్తి ఉన్నారు. ఇది ఎడమ కాలు కింద ఉండి కుడి కాలు పైకి ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. అర్చకులెవరూ ఉండరు.
ఇంత భవ్యమైన మీనాక్షీ దేవాలయం ఇవాళ దర్శించాము కనక, ఇక్కడాపి, వచ్చేనెల అదే ఆవరణలో ఉన్న సుందరేశ్వరుడి ఆలయంవైపెళ్లి, మిగతా విశేషాలు చూద్దాము.
ఎంత ఓపికగా చూచారో అంత మనోహరంగా వివరించి, మాకన్నుల ముందు అమ్మవారి వైభవాన్ని నిలిపారు.చూడడం వేరు. వ్రాయడం వేరు.మీకు మీనాక్షి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకొంతున్నాను