మాధవి హైదరాబాద్ ఆఫీస్ లో కొత్త ఎం.డి గా పదవి భాద్యతలు స్వీకరించి పది రోజులైనా పరిమళ సాయంత్రం నాలుగు గంటలకు పైన ఒక్క రోజు కూడా కంట బడలేదు. అది చూసి ఉండబట్టలేక తన నడి వయస్కుడైన అటెండర్ రామమూర్తిని మెల్లగా అడిగింది. దానికి అతను నవ్వుతూ “ఆవిడ పేరే పర్మిషన్ పరిమళ కదా మేడం“ అన్నాడు. “మన కంపనీ చైర్మన్ దగ్గర మూడు సంవత్సరాల ముందే నాకు ప్రమోషన్ వద్దు అని లెటర్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్నారు. ఏo పని వుంటుoదో ఏమో! ఎవరికీ తెలియదు, ఆవిడ పర్సనల్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. వారేమో కుటుంబ సమస్యలు అని చెప్పారండి” అని అన్నాడు. పైగా ఇక్కడ పశువులాగా పని చేసినా ఫలితం లేదు. నేను డిగ్రీ లో ఫస్ట్ క్లాసు, కంప్యూటర్స్ లో డిప్లోమాస్ ఉన్నాయి. ఇట్లే అటెండర్ గానే రిటైర్ అయిపోతాను మేడం.. నాకు మాత్రం ఏం, ప్రమోషనా, పాడా?...అంటూ నసిగాడు . మాధవి బదులేమీ చెప్పక ఫైల్ చూడడంలో మునిగి పోయింది.
రెండు మూడు నెలల తర్వాత కొత్త శాఖ తెరుస్తున్నారని బిల్డింగ్ చూడడానికి వెళ్ళిన మాధవి పక్కనే పరిమళ ఇల్లు వుందని తెలుసుకొని అడ్రస్ కనుక్కుని ఆమె ఆఫీసు నుండి వెళ్ళిన గంట తర్వాత కారు తీసుకొని తానే బయలు దేరింది. పరిమళ సర్వీస్ రిజిస్టర్ లో ఏ లోపం లేదు. ఆమెకు చాలా మంచి పేరుంది ఆఫీసులో. ఆమె నేర్పరితనాన్ని మెచ్చుకొని రెండుసార్లు కంపెని తరపున అవార్డు కూడా పొంది వుంది....ఆలోచిస్తూ ఆమె అడ్రెస్సును కనుక్కొని కార్ని ఆమె ఇంటినుండి కొంచెం దూరంగా పార్క్ చేసి ఆమె ఇంటిలోకి పోదామా, వద్దా? అని తటపటాయించింది మాధవి. మంచి వెలుతురుతో ఉన్న కాలనీలోని చక్కని అందమైన ఓ పెద్ద ఇల్లు . ఇంటి ముందు తులసమ్మ కోట. చుట్టూ చెట్లు రకరకాలైన పూల మొక్కలు వాటిల్లో విరగ బూసిన వివిధ రకాలైన పూలు.
తను తెచ్చిన స్వీట్స్, పండ్లు గల బ్యాగు తో మెల్లగా కాలింగ్ బెల్లును నొక్కింది. “రాధికాకృష్ణా రాధికా” అన్న ఇంపైన ఘంటసాల పాటతో కాలింగ్ బెల్ పాటవినబడ సాగింది. రెండు నిమిషాల తర్వాత తడిసిననైటీ తో పైన తువ్వాలు వేసుకొని చిరునవ్వుతో ప్రశ్నార్థకమైన కనుబొమలతో తలుపు తెరిచిన పరిమళ “మేడం! మీరా ? రండి ...లోపలికి” అంటూ లోనికి తీసుకెళ్ళింది. మాధవిని హాలులో కూర్చోబెట్టి, ఫ్యాన్ వేసి లోపలనుండి గ్లాస్ లో నీరు తెచ్చి ఇచ్చి ఒక నిమిషం అని లోపలికెళ్ళి లెమన్ కలర్ చుడీదార్ లో చేతిలో కాఫీ తో బాటు రెండు అరెసెలు పెట్టిన తట్టతో ప్రత్యక్షమైంది.
“థాంక్స్” అని చెప్పి కాఫీ తీసుకొని సిప్ చేస్తూ తను తెచ్చిన స్వీట్స్, పండ్లు ఆమె చేతిలో వుంచి ఆ హాలును పరికింప సాగింది మాధవి. తలుపు తెరచిన వెంటనే కాంతులు వెదజల్లుతూ కనిపించిన పెద్ద శ్రీ వేoకటేశ్వర స్వామివారి పటం, హాల్లో ఉన్న రాధాకృష్ణుల విగ్రహం, రెండు మూడు ప్రకృతి దృశ్యాలతో గూడిన చిత్రాలు, పుస్తకాల అల్మారాలో అమర్చిన పుస్తకాలు, చిన్న టేబుల్ పై ఆ రోజు పత్రికలు ఆమె లాగే అందంగా కనబడ్డాయి. “ఎవ్విరి థింగ్ ఈజ్ ఫైన్ పరిమళా?” ఎందుకు నాలుగు గంటలకే వచ్చేస్తావు? ఓ ఎం.డి గా కాక ఓ స్నేహితురాలిగా అడుగుతున్నాను అంతే” అంది మాధవి నవ్వుతూ.
“వై నాట్? రండి.” అంటూ డైనింగ్ హాల్ దాటి వున్న ఓ గదిలోకి దారి తీసింది పరిమళ. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది మాధవి.
ఓ ఎనభై ఏళ్ల ముసలావిడ నైటీ లో పడుకొని వుంది. ఆవిడను చూపి, ఈవిడే మా అత్తగారు మీనాక్షిగారు. ఈవిడకు ప్రతి ఐదుగంటలకోసారి యూరిన్ పాడ్ మార్చాలి. సరిగ్గా సాయంత్రం నాలున్నర గంటలకు ఇన్సులిన్ ఇచ్చి అరగంట లోపు ఏదన్నా ఆహారం ఇవ్వాలి మేడం అని చెబుతూ హాలుకు దారి తీసింది. మాధవి ఏమి మాట్లాడక ఆమెను అనుసరించి ఆమెతో బాటు హాలులో కూర్చుంది. ఆయన మధ్యలో 12 కు వస్తారు. సాయంత్రం నా డ్యూటీ అంది నవ్వుతూ. ”పని మనిషిని పెట్టుకోలేదా?” అడిగింది మాధవి.
“అంట్లకు, ఇంటి పనులకు పని మనిషి వుంది మేడం. కానీ అమ్మను మనలాగా వాళ్ళు ప్రేమతో చూసుకుంటారా? చెప్పండి” మెత్తగా దెబ్బ కొట్టినట్లు అడిగింది. “అవును నిజమే, ఈ కాలంలో అత్తగారిని అదీ ఇంత ఆప్యాయతతో చూసుకునే కోడలు .....వర్ధిల్లాలి.” అంది మాధవి.
“అమ్మ అత్త అని కాదు మేడం ఈవిడకు నేను ఋణపడి వున్నాను. మేము నలుగురు అమ్మాయిలం. మా నాన్నగారు స్కూల్ టీచర్. మా అందరిని తాహతుకు మించి చదివించిన పుణ్యాత్ముడు. మా అమ్మగారు ఆ కాలంలోనే బి .ఏ.వరకు చదివిన ఉత్తమ ఇల్లాలు. మా చదువుల కోసం తను ఉద్యోగాన్ని వదిలిన త్యాగ శీలి. నేను ఎం.ఎస్సీ చేసిన తర్వాతనే ఈయనను పెండ్లి చేసుకున్నాను. మిగతా అత్తవారిలాగా నన్ను వేధింపక మా కుటుంబాన్ని తన కుటుంబంతో కలుపుకొని సంతోషాన్ని మాత్రమె ఇచ్చిన మంచి ఆవిడ మా అత్తమ్మ. నా భర్తను ఏ చెడు అలవాట్లు లేక పెంచి, మా కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి తన నగలన్నీ నా చెల్లెలికి పెళ్లి కానుకలుగా ఇచ్చిన కుల దైవం ఆవిడ. నా చెల్లెళ్లoదరికి పెళ్లి అయిన తర్వాత మా అమ్మానాన్నలను తుది శ్వాస వరకు అపురూపంగా చూసుకున్న బంగారు అల్లుడు మా శ్రీవారు రమేష్. తనకి నాన్న చిన్నప్పుడే పోయారని మా నాన్నగారిని రమేష్, నాన్నా అని ప్రేమతో పిలిచేవారు. ఈ ఇల్లు మా నాన్న మా అత్తయ్య కలిపి కొన్నది. మా అత్తగారు హెడ్ మాస్టర్ గా వుండి రిటైర్ అయ్యారు. మా నాన్న గారిని నోటి నిండా అన్నయ్యా అని పిలిచేవారు. ఇంతవరకు మా ఆయన కానీ, మా అత్తమ్మ గాని ఒక్క సారి కూడా మనసు నొప్పించేలా మాట్లాడ లేదు. ఇంత చేశాను అంత చేశాను, నీ ఇల్లు నా ఇల్లు అని ఎప్పుడూ విడదీయలేదు. అంతకంటే ఎక్కువ నన్ను రావే పోవే అని కూడా పిలవలేదంటే నమ్మండి. అందుకే నాకు రమేష్ తో బాటు ముగ్గురు తల్లిదండ్రులు. రమేష్ అంటే నా ప్రాణం అంది గర్వం తొణికిసలాడే స్వరంతో.
“ఏంటి! నా నామజపం జరుగుచున్నది” అంటూ గుండ్రటి ముఖంతో ఎర్రగా పొడుగ్గా నవ్వుతూ లోపలికి వచ్చాడు ఓ వ్యక్తి. “మేడం! ఈయన, ఆమె చెప్పేలోపే మాధవి “తెలుసు తెలుసు. నీ హీమ్యాన్, స్పైడర్ మ్యాన్ రమేష్ కదూ?” అంది కళ్ళెగరేసి నవ్వుతూ. అవునంటూ నవ్వి తల ఊపుతూ వారిరివురికి పరిచయం చేపించి కాఫీ తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది పరిమళ.
మాధవి రమేష్ తో మాట్లాడుతూ వుండిపోయింది. మాటల మధ్యలో వాళ్లకి ఒక పాప, ఒక బాబు అని వారిరువురు హాస్టల్స్ లో బయట కాలేజీలలో చదువు కుంటున్నారని తెలిసింది. రమేష్ కు శని ఆది వారాలు సెలవని తెలుసుకుంది.
“ఏం మేడం? ఈ వైపు?” అని పరిమళ అందించిన కాఫీ తాగుతూ అడిగాడు రమేష్. “ఏం లేదు రమేష్ ఊరికనే వచ్చా, అంటూ ఒక ప్రశ్న రమేష్, ఎలా రమేష్ ఇలా భార్యను వలలో వేసుకున్నారు? తప్పుగా అనుకోవద్దు జవాబు చెప్పండి.” అనడిగింది మాధవి కుతూహలంగా. దానికి రమేష్ “అదంతా ఏమి లేదు మేడం! ప్రేమనే అన్నిటికి మూల ధనం, ఆధారం. నేను మగవాణ్ణి, నా భార్య నాకు బానిస ఆమె ఎప్పుడూ నాకు అణగి మణగి వుండాలని, ఆడవాళ్ళను కించపరిచేవిధంగా మాట్లాడుతూ అహంతో పెరిగిన మగవాళ్ళ వల్లే మనదేశం లోని సగం కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లల బాల్యాలు తండ్రి ప్రేమకు నోచుకోక బలి అవుతున్నాయి. ఇప్పటి యువతులు ఆ కుటుంబంలోని మానసిక వత్తిడికి తట్టుకోలేక విడాకులు తీసుకుంటున్నారు. మహిళ దగ్గర ప్రేమను పంచి ఇస్తే ఎన్నో రెట్లతో దాన్ని ఆమె తిరిగి ఇస్తుంది..భార్య అంటే తనలో సగం అని ప్రతి మగవాడు అనుకోవాలి. అప్పుడు నీ కుటుంబం నా కుటుంబం అన్న ఆలోచనే రాదు. పెళ్లి చేసుకొని ఆడది వస్తే ఆమె తన ఇంట్లో మనుష్యులపై వున్న ప్రేమను తెగ తెంపులు చేసుకోవాలా? మన దేశపు సంప్రదాయం కట్టుబాట్లు అన్నీ మగవారి పక్షమే. కొడుకు ఇంట్లో మాత్రమే వృద్ధాప్యం లో తల్లిదండ్రులు ఉండాలంట, కూతురి ఇంట్లో వుండకూడదట. ఎవరు చేసిన చట్టాలు ఇవి? సాటి మనిషిని ప్రేమగా చూసే సభ్యత వున్న ప్రతి మగవాడు తన ఇల్లాలి అమ్మ నాన్నలను నిజంగా ప్రేమిస్తే ఆ స్త్రీ అత్తా మామలను అనురాగంతో చూస్తుంది. అప్పుడు వృద్ధాశ్రమాలు అసలు వుండవు. మనుధర్మం లో గూడా “కరణేషు మంత్రి” అన్నాడు. అంటే రాజు మంత్రి సలహా లేకుండా ఏ పని చేయడు. మగవాళ్ళందరూ మిగిలిన ఐదు ధర్మాలను ఆడవాళ్ళకు అంట గట్టేశారు మేడం. మా అమ్మ ఒక టీచర్. నాన్నగారు నా ఏడవ ఏటే పోయారు. అమ్మ ఒంటరిగా నిలబడి కష్టపడి పెంచింది. నా పెళ్లి రోజే అమ్మ చెప్పేసింది. ‘రమేష్! పరిమళ అమ్మ నాన్నలు నీ అమ్మ నాన్న’లని. బంధుత్వాలను విడదీసి భార్యతో బతికేవాళ్ళు మనశ్శాంతి తో బ్రతుక లేరు..” అని ముగించాడు రమేష్.
“ఇప్పుడంతా పెళ్ళయి రెండు మూడు సంవత్సరాలకే విడాకులు పుచ్చుకుంటున్నారుగా రమేష్? బాధగా అడిగింది మాధవి. “అదే మేడం. మన సమాజం. మగవాడు ఎప్పుడూ తన తప్పును ఒప్పుకొని ఓ సారీ గూడా చెప్పడు. ఇద్దరికీ ఈగో ప్రాబ్లం. భార్యను ప్రేమతో శాసించకుండా మానసికంగా బాధ పెట్టి చేదు అనుభవాలను మిగిల్చి తానూ సుఖపడక కుటుంబాన్ని కూల్చే మూర్ఖుల వల్ల దేశంలో సిగరెట్లు, తాగుడు లాంటి వ్యాపారాలు చురుకుగా సాగుతున్నాయి మేడం. వాడు తాగి ఆమె తాగి ఈనాడు కుటుంబాలు రోడ్డున పడి నాశనమవుతున్నాయి” అన్నాడు బాధతో గూడిన నిర్లిప్తతో. “నిజమే రమేష్! మీలాగే మీ ఇంటి లాగే అందరి ఇండ్లు వుంటే ఈ దేశంలో సంతోషం తాండవ మాడుతుంది” అని చెప్పి ఆ పెద్దవిడను చూడడానికి లోపలకి వెళ్ళింది మాధవి. లోపల పరిమళ పక్కన కూర్చొని బామ్మగారు గంజి త్రాగుతూ కనిపించారు. ఆవిడకు నమస్కరించి వారి ఇంటినుండి సెలవు తీసుకొంది మాధవి.
ఒక సంవత్సరము తర్వాత ....పరిమళను పిలుచుకొని రమ్మని రామమూర్తి ని పంపింది. లోపలకు వచ్చిన పరిమళ ను కూర్చుండ జేసి “అభినందనలు, పరిమళా” అంటూ ఓ ఆర్డర్‌ను చేతిలో పెట్టింది. “ఏంటి మేడం?” ప్రశ్నార్థకంగా ఆమెను చూస్తూ అడిగింది పరిమళ. మాధవి “నీకు మీ ఇంటి దగ్గరున్న మన కంపెనీ కొత్త శాఖలో పనిచేసేందుకు ప్రమోట్ చేస్తున్నాను. రాము గారు నీతో బాటు ఎల్.డి.సి.గా పని చేస్తారు. శని, ఆది వారాలలో రెండు గంటల వరకు ఆఫీసు వుంటుంది. ఓకేనా! రామూ! మీరు అటెండరుగా రిటైర్ కానక్కరలేదు ....తీసుకోండి” అంటూ అతని చేతికి ఇంకో పేపరు ఇచ్చింది మాధవి. మీతో బాటు కొంత మంది స్టాఫ్ కూడా అక్కడకు వస్తారు” అంది. రామూ సంతోషంగా “నాకు డబుల్ ఓకే మేడం, పర్మిషన్ పరిమళ ను ప్రమోషన్ పరిమళ గారిగా మార్చిన మీరు దైవం అండి” అన్నాడు ఉద్వేగంతో.
“మనుష్యులను దైవంతో పోలిస్తే దైవం విలువ తగ్గి పోతుంది, ప్లీజ్ అలా అనకండి. మీ మీ అర్హతలను బట్టి ప్రమోషన్ వచ్చింది అంతే” అంది మాధవి చిరునవ్వుతో. “ధన్యవాదాలు మేడం!” అంటూ ఆర్డర్‌ను తీసుకుంది పరిమళ.
ప్రపంచము ఇలావుంటే బావుండును..
అశ్విని కుమార్