పరిమళాల పారిజాతం
పారిజాతం అనగానే మనకు గుర్తు వచ్చేవి రెండు కథలు. మొదటిది పారిజాతాపహరణం శ్రీ కృష్ణ, సత్యభామ, రుక్మిణి, కధ. అహంకారాన్ని అణచి, భక్తుల ప్రభావాన్ని తెలిపేది. గర్వం విడనాడి, వినయంగా స్నేహంగా ఉంటే లభించే గౌరవమూ ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇహ రెండవది 'అతిబలవంతా హనుమంతా', హనుమంతునికి పారిజాతాల పట్ల ఉన్న ప్రీతి, ఆయన బలం మరియు ఆయనకు రాముని మీద ఉన్న భక్తీ.
ఏమైనా, అతిసున్నితమూ, తెల్లని సుతిమెత్తని రెక్కలతో పట్టుకుంటేనే నల్లబడేంత సున్నితత్వం, అంతే గొప్ప సువాసనా ఉన్న పుష్పమే ఈ పారిజాతం. కాడ మాత్రం చక్కని ఎరుపుతో ఉండి ఎంతో అందంగా ఉంటుంది. ఎవ్వరూ చూడని రాత్రుల్లో వికసించి కమ్మని వాసన వెదజల్లే పారిజాత పుష్పాల తీరే వేరు.
మంచి సువాసనగల తెల్లని పువ్వు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎక్కువగా పూస్తుంది. ఆకులూ ఎంతో అందంగా ఉంటాయి. ఈ పువ్వులు రాత్రులు పూసి తెల్లారేసరికి రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు అనిపి స్తుంటూంది. వీటి జీవితం కొద్ది గంటలే ఐనా అందరూ ఎల్లకాలం గుర్తుంచుకునే విరులు ఈ పారిజాతాలు. ఈ పారిజాత పుష్పానికి పారిభద్రము, కల్పవృక్షము, పగడమల్లి అనే పేర్లూ ఉన్నాయి.
ఈ పువ్వునుండి మనం నేర్చుకోవలసింది ‘కొద్దికాలం జీవించినా మంచి గా బతకమని, పరోపకారం చేసి అంతా గుర్తుంచుకునేలా జీవించమని.’ ఈ పూలతో దైవాన్ని అర్చించేవారు చెట్టుక్రింద ఒక చాప గానీ, బట్టగానీ పరుస్తారు. పూలన్నీ దానిమీద రాలుతాయి. ఈ పారిజాత పుష్పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ పూలనుంచి సుగంధ తైలం తయారు చేస్తారు. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు ఆయుర్వేద విధానంలో విరోచనం కాకపోతే మందుగా వాడుతారు.
ఇహ పురాణాలలో ఈ పారిజాత పుష్ప కథనాన్ని కొద్దిగాచెప్పుకుంటే, శ్రీకృష్ణుడు తన ప్రియ భార్యయైన సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని స్వర్గలోకము నుండి తెచ్చి , ఆమె తోటలో నాటడం, ఆ పూలు గాలి వలననో లేక కృష్ణమాయో గానీ పక్కనే ఉన్న రుక్మిణీ దేవి తోటలో పడటం, సత్యభామ ఆమెను నిందించడం, భర్త తనకొక్కదానికే దక్కాలని నారదుని సలహాతో వ్రతం చేసి భర్తను నారదునికి దానమిచ్చి, తూచి (తనవద్ద ఉన్న శమంతక మణి ప్రభావంతో తూచగలననే నమ్మకంతో) తిరిగి పొందాలని ప్రయత్నించి అవమానం పాలై , తాను నిందించిన రుక్మిణీ దేవినే బ్రతిమాలి రుక్మిణిదేవి ఇచ్చిన తులసి పత్రంతో తూచి మరల కృష్ణుని పొందడం ‘ఎంతవారైనా సరే కామక్రోధాదులు కూడవని మానవులకు హితవు చెప్పడం’ ఇవన్నీ ఈ కథ ద్వారా మనకు తెలుస్తాయి. ముఖ్యంగా పారిజాత పుష్పాల ఉనికి ఆ నాటినుండే ఉందని మనకు అర్థమౌతుంది.
శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామ వనంలో నాటిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లా లోని కింటూర్గా గ్రామంలో ఇప్పటికీ ఉందంటారు. అవి ఆ వృక్షపు శాఖలు కావచ్చు. ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని వర్ణించారు. ఈ మొక్కల నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి కావు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, మన చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలు గా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసి ఒక వింత రంగులో ఉంటాయి. పుష్పాలకు ఐదు రేకులు ఉంటాయి. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ చెట్టు జీవించేకాలం కూడా ఎక్కువే! ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం, దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు. దీనికి పట్టే బొచ్చుపురుగుల ఇబ్బంది కారణంగా దీన్ని ఇళ్ళలో పెంచుకోవడం కొంత తగ్గినా తోటల్లో పూలకోసం ఈ పారిజాత వృక్షాలను పెంచుతున్నారు.