Menu Close
పరిగపంట
- వెంపటి హేమ (కలికి)

రత్తమ్మ చూపించిన ఇళ్ళలో శ్యామల పనికి కుదిరింది. ఒక్కొక్క ఇంట్లో నెలకి వెయ్యి రూపాయల జీతం! ఆపై, రెండిళ్ళలో ఉదయం టీ, టిఫిన్ ఇస్తారు, మరి రెండు ఇళ్ళళ్ళో, గిన్నెల్లో అడుగున మిగిలిన అన్నం, కూరా, పులుసూ లాంటివి దొరికేవి. దాంతో భోజనం ఖర్చు చాలా వరకూ తగ్గిపోయింది. కొడుకు కోసం మాత్రమే వంట చేసేది శ్యామల. వాళ్ళిచ్చిన జీతం, ఇంటద్దె, ఇతర ఖర్చులు పోగా కొద్దిగా మిగిలేది మొదట్లో. ప్రశాంత్, క్లాసుల్లో టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ, ప్రతియేడూ మంచి మార్కులతో పాసై పైతరగతికి వెడుతున్నాడు.

రోజులెప్పుడూ ఒకేలా గడవవు. ప్రశాంత్, చదువులో ఏటేటా పెరుగుతున్న క్లాసులతోపాటు, వయసులో తానూ పెరుగుతున్నాడు. పిల్లలు పెరుగుతోంటే వాళ్ళ ఖర్చులు కూడా పెరగడం సహజం కదా! క్రమంగా శ్యామలకి, రాబడికీ ఖర్చులకీ పొంతన కుదర్చడం అన్నది కష్టమౌతోంది. అక్కడకీ శ్యామల ప్రతిరోజూ చీకటితోనే లేచి, వంద పాలప్యాకెట్లు తీసుకుని, ఇళ్ళల్లో వేసి వస్తోంది. తను పనిచేస్తున్న ఇళ్ళలో పై పనులేమైనా ఉంటే వాటిని కూడా చేసి అదనంగా డబ్బు సంపాదిస్తోంది. ప్రశాంత్ టెన్త్ క్లాసులో ఉన్నాడు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, రేపు వాడిని కాలేజిలో చేర్పించి చదివించడం ఎలాగ - అని బెంగపడసాగింది శ్యామల.

ఒకరోజు పక్కింటి ప్రమీల పలకరించి, "అలా ఉన్నావేమిటి శ్యామలా? ఒంట్లో బాగోలేదా" అని అడిగింది. ఇక ఉండబట్టలేక, తన మనసులోని బాధను ఆమెకు చెప్పింది శ్యామల. ప్రమీల శ్యామలను ఎగాదిగా చూసి, అంది....

"నీ సంగతి నీకు తెలియదేమోగాని, శ్యామలా! నువ్వు చాలా బాగుంటావు. నీ బతుకంతా ఇలా అడవికాసిన వెన్నెలగా చేసుకుంటావెందుకు? నువ్వు "సై" అంటే చాలు, ఎంతమందో మగవాళ్ళు వచ్చి నీకు పాదాక్రాంతులైపోతారు. ఆ తరవాత నీకిక ఈ డబ్బు ఇబ్బంది ఉండదు. వెనకటికొకడు నీలాంటివాడే, బంగారు గుడ్లుపెట్టే బాతుని చంకలో ఉంచుకుని, అప్పుకోసం ఊరంతా తిరిగాడుట" అంది.

ప్రమీల మాటలు వినగానే శ్యామలకు ఒళ్ళు జలదరించింది. ఆమె సలహా రుచించలేదు శ్యామలకు. "చూడు అక్కా! నా బావ జ్ఞాపకాలు నా మనసంతా నిండి ఉన్నాయి నాకవి చాలు. నా కిప్పుడు డబ్బు కావాలి, నిజమే! అలాగని కాని పనులు చెయ్యలేను. నేనలాంటి కక్కుర్తిపనులు చేసి డబ్బు సంపాదించి, నా బాబుని చదివించి గొప్పవాడిని చేసినా, అది వాడికి సుఖాన్ని ఇవ్వలేదు. రేపెవరైనా వాడిని వేలెత్తి చూపించి, "ఇదిగో విన్నారా! వీడి తల్లి పడుపువృత్తి చేసి, ఆ డబ్బుతో వీడిని చదివించి ఇంతవాడిని చేసింది" అని అన్నారే అనుకో - అప్పుడు వాడేమై పోవాలి! అంతకంటే పల్లెటూరు వెళ్లి అక్కడ మట్టి పిసుక్కుని బతకడమే మేలు" అంది శ్యామల.

కంగుతింది ప్రమీల. అంతలోనే సద్దుకుని, "ఏదో కష్టం సుఖం చెప్పుకున్నావు కదాని, నాకు తోచినమాట చెప్పా. నీకది నచ్చకపోతే హాయిగా మరో మనువు చేసుకోవచ్చుగా! అప్పుడు ఆయబ్బి నీ బరువంతా తన తలకెత్తుకుని మోస్తాడు. నీ కొడుక్కి పై చదువులూ చెప్పిస్తాడు. ఇక నీకే కష్టం ఉండదు" అంది.

శ్యామల దీర్ఘంగా నిట్టూర్చి అంది, "అమ్మతనానికి ఆదిరూపమైన ఆడదే సవితి పిల్లల్ని భరించలేదు కదా, అలాంటప్పుడు ఒక మొగాడికి అంత సద్బుద్ధి ఎక్కడుంటుంది? వేరొక మనిషి కన్న బిడ్డకి తన డబ్బు పెట్టి పెద్ద చదువులు చెప్పిస్తాడంటావా? నేను కోరేది కాయకష్టం చెయ్యడానికి ఏదైనా పని కావాలని! పని దొరికితే చాలు, నిద్రాహారాలు మానైనా చేస్తాను. ప్రశాంత్ చదువు ఇక్కడితో ఆగిపోకూడదు."

విసుక్కుంది ప్రమీల. "నువ్వు అన్నింటికీ అన్నీ చెపుతావు! మనం, అనుకున్నది దొరకనప్పుడు దొరికిన దానితో సరిపెట్టుకోవాలి. ఇప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. కాయకష్టం చేసుకుంటే ఏమొస్తుందిట! పరిగ పంటవుతుందా ఏమిటి? నీ ఇష్టం. నాకవతల బోలెడు పనుంది, వస్తా" అంటూ వెళ్ళిపోయింది ప్రమీల.

శ్యామల ఆలోచనలో పడింది. తాను పగలూ రాత్రీ పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా, తనకు పని ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా! ఈ విషయంలో తనకు ఎవరు సాయపడతారు - అనుకోగానే ఆమెకు రత్తమ్మ గుర్తుకువచ్చింది. వెంటనే రత్తమ్మ దగ్గరకు బయలుదేరింది శ్యామల.

రత్తమ్మకు ఎందుకనో శ్యామల మీద పుత్రికా వాత్సల్యం ఉంది. శ్యామల ఇబ్బంది విని ఆమె వెంటనే స్పందించింది. శ్యామల కష్టాన్ని తన కష్టంగా భావించి పరిష్కారమార్గం వెతికింది.....

"నే నీమధ్యనే ఒక బొమ్మలు గీసే బడిలో పనికి కుదిరాను. అక్కడ కొందరు అబ్బాయిలూ, అమ్మాయిలూ బొమ్మలు గియ్యడం నేర్చుకుంటుంటారు. మరికొందరు వచ్చి వాళ్ళు గీస్తున్నబొమ్మలకు నమూనాలుగా ఉంటారు. అలా నమూనాలుగా నిలబడిన వాళ్ళకి చాలా డబ్బు ఇస్తారు. అక్కడ నీకు అలాంటి పని దొరుకుతుందేమో కనుక్కుందాం. అదే కనక దొరికితే ఆ పై నువ్వు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పనుండదు. నీ బిడ్డ తప్పక గొప్ప ఇంజనీర్ ఔతాడు. పదిగంటలకు అక్కడికి రా. అయ్యవారితో మాటాడొచ్చు" అంటూ ఓదార్పుగా మాట్లాడింది రత్తమ్మ.

* * * * * * * * * * * *

"శుభోదయా ఆర్టు స్కూల్"కి సిటీలో మంచి పేరుంది. అక్కడ సుమారుగా వందమంది విద్యార్థులు చిత్రలేఖనం నేర్చుకుంటున్నారు. శ్యామల వెళ్ళే సరికి ఒక గదిలో ఒక అందమైన అమ్మాయి, నర్తకి భంగిమలో కదలకుండా స్థిరంగా నిలబడి ఉంది. కొంతమంది విద్యార్థులు ఆమెవైపు చూస్తూ, అచ్చం అలాంటి రూపంతో ఉన్న బొమ్మనే గీయడానికి ప్రయత్నిస్తున్నారు. రత్తమ్మ చెప్పిన ఆనవాళ్లను బట్టి శ్యామల అక్కడకు వెళ్ళిoది.

రత్తమ్మ శ్యామల కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉందేమో, శ్యామల రాగానే పలకరించింది. ముందే చెప్పి ఉండడం వల్ల ఆమెను చూడగానే, అక్కడ  విద్యనేర్పే ఆచార్యుడు బయటికి వచ్చాడు. రత్తమ్మ శ్యామలను ఆయనకు పరిచయం చేసింది. ఆమె అవసరం చెప్పి, ఆమెకు మోడల్గా ఉద్యోగం ఇవ్వమని కోరింది. ఆచార్యుడు, శ్యామల పరిస్థితికి నొచ్చుకున్నాడు, ఆమె ఆశయాన్ని విని మెచ్చుకున్నాడు. ఆమెను నఖ శిఖ పర్యంతం పరిశీలనగా చూసి, చివరకు గుండెలవిసిపోయే మాట ఒకటి చెప్పాడు...

"చూడమ్మా! మా కిప్పుడు కావలసింది సామాన్య మోడల్సు కాదు. వాళ్ళు ఇప్పటికే చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒకరిని తీసేసి, నీకు పని ఇవ్వడం న్యాయం కాదు కదా! ఇకపోతే, మేము మళ్ళీ నెలలో ఒక కొత్త ప్రాజక్టు మొదలుపెట్టాలనుకుంటున్నాము. దానికి ఒక మోడల్ కావాలి. ఆమె కోసం మేము వెతుకుతున్నాము. దానికి నగ్నంగా పోజు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు మామూలు మోడల్కి ఇచ్చినకంటే ఎక్కువ ఇస్తాము. ఈమె ఒప్పుకుంటే ఆ పని ఈమెకు ఇస్తాను. తొందరలేదు, బాగా ఆలోచించుకుని, రేపు సాయంత్రం లోగా నాకు ఏమాటా చెపితే చాలు" అని చెప్పి, వాళ్ళకి సెలవిచ్చి పంపేశాడు ఆయన.

శ్యామలకు నోట మాట రాలేదు. అవాక్కై బేలగా చూసింది రత్తమ్మ వైపు. రేపు సాయంకాలానికి ఏ కబురూ చెపుతామని చెప్పి సెలవు తీసుకుని రత్తమ్మ శ్యామలతో కలిసి ఇంటిముఖం పట్టింది. కాని దారిలో ఆ విషయమై రత్తమ్మ, శ్యామలతో ఏమీ మాటాడలేదు. పూర్తి నిర్ణయం శ్యామలకే వదిలేసింది. ఇద్దరూ ఇళ్ళకు వెళ్లిపోయారు.

ఆ క్షణం మొదలు శ్యామల మనసంతా ఊహాపోహలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ రాత్రి ఆమెకు కంటిమీదకు  కునుకు రాలేదు. పరిపరివిధాలైన ఆలోచనలు ఆమెను చుట్టుముట్టుతున్నాయి. మరునాడు పనికి వెళ్ళిందన్నమాటేగాని, మనసంతా వేరే ధ్యాసలో ఉండగానే యాంత్రికంగా చేసింది ఆ పనంతా. ఎట్టకేలకు ఆమె ఒక నిర్ణయానికి రాగలిగింది.....

"నిన్న ఆచార్యులవారు నావైపు చూసిన చూపుల్లో, వాళ్ళకు కావలసిన మోడల్గా నే నెంతవరకూ తగినదాన్నో తెలుసుకోవాలన్న పరిశీలనేగాని, ఆ దృష్టిలో మరే వెకిలితనం కనిపించలేదు. నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్న విద్యార్థులు ఒక నర్తకి బొమ్మ గీస్తున్నారు. వాళ్ళు ఆమెవైపు చూస్తున్న చూపులలో, ఉన్నది ఉన్నట్లుగా ఆమె వంపు సొంపులను కాగితం మీదకు దింపడం ఎలాగ అన్న తపనే ఉందిగాని, మరే చిలిపితనం కనిపించలేదు. వాళ్ళకు ఉన్న కోరికల్లా గొప్ప చిత్రకారులుగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది మాత్రమే! రేపు నేను మోడల్గా వాళ్ళ ఎదుట నగ్నంగా నిలబడినా, వాళ్ళు నా వైపు చూసే చూపులు పవిత్రంగా ఉంటాయి. వాళ్ళు శ్రద్ధా భక్తులతో, ఏకాగ్రతతో బొమ్మ గియ్యడంలో నిమగ్నమై పోతారు. నేనొక ప్రాణమున్న స్త్రీమూర్తి నన్న స్పృహే ఉండదు వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో, వాళ్ళు చిత్రించబోతున్న చిత్రపటానికి నేనొక మోడల్ని మాత్రమే! శ్రద్ద, ఏకాగ్రతలతో నిండివున్న వాళ్ళ చూపులు నన్ను తాకుతాయేగాని, వాళ్ళలో ఎవరూ నన్ను చేతితో తాకరు. ఈ పనికి నేను ఒప్పుకుంటున్నాను" అనుకుని మనసు కుదుటపరచుకుంది శ్యామల.

మోడల్గా పని మొదలుపెట్టిన తొలినాళ్ళలో ఆమె కది చాలా సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించి బాధపడేది. అంతేకాదు, గంటలతరబడీ స్థిరంగా ఒకే భంగిమలో కదలకుండా ఒకేచోట ఉండవలసిరావడంతో ఒళ్ళంతా నెప్పిగా, వెన్నుపూసలు కిరకిరలాడుతున్నట్లుగా ఉండేది. ఇంటికి రాగానే వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తేగాని, ఒళ్ళు స్వాధీనంలోకి వచ్చేది కాదు. క్రమంగా అవన్నీ అలవాటైపోయి, దినచర్యలో భాగమైపోయాయి.

కష్టాలు, కన్నీళ్ళు మాత్రమే కాదు, ఒకప్పుడు సుఖ సంతోషాలు కూడా కలసే, చెట్టపట్టాలు పట్టుకునిమరీ వస్తాయి. శ్యామల, శుభోదయా ఆర్టు స్కూల్లో మోడల్గా స్థిరపడింది. ఆ సంవత్సరం ప్రశాంత్ శ్రద్ధగా చదివి టెన్తు క్లాసులో మంచిమార్కులు తెచ్చుకుని స్కాలర్ షిప్ గెలుచుకున్నాడు. ఆ తల్లీకొడుకులతోపాటుగా ప్రశాంత్ విజయానికి రత్తమ్మ కూడా సంతోషించింది. ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంత్ కాలేజిలో చేరాడు.

ఆ తరవాత కాలం, నల్లేరుమీద బండి నడకలా, సునాయాసంగా సాగిపోయింది. ప్రశాంత్ ప్రతి సంవత్సం మంచి మార్కులు తెచ్చుకుంటూ స్కాలర్షిప్ నిలబెట్టుకుంటూ, కాలక్రమంలో ఇంజనీరింగ్ పరీక్షలు కూడా రాసి, ఆనర్సుతో పాసైనాడు. ఇప్పుడు ఒక మంచి కంపనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తల్లికి ఇంకేంకావాలి!

* * * * * * * * * * * *

"పరిగ ఏరుకున్నా నా పంట పండింది. ఇంకేం కావాలిట నాకు! నా జన్మధన్యమయ్యిoది. నా భర్త కోరిక తీర్చగలిగాను. స్వర్గంలో ఉన్న నా బావకు కూడా ఈరోజు పండుగరోజే" అనుకుంది శ్యామల సంతోషంతో వచ్చిన కన్నీళ్లతో!

ఆమె కళ్ళనుండి జారిన ఆ ఆనందభాష్పాలు, ఆమె పాదాలచెంత మోకరిల్లివున్న ప్రశాంత్ తలపై అప్రయత్నంగా జలజల రాలి పడ్డాయి, అక్షతల్లా, ఆ తల్లి యెద నిండా ఉన్న అక్షయ దీవనల్లా!

"నిండునూరేళ్ళూ చల్లగా ఉండు బాబూ" అంటూ విజేత ఐన కొడుకును లేవదీసి  హృదయానికి హత్తుకుంది శ్యామల కళ్ళనిండా నిండివున్న ఆనంద భాష్పాలతో.

(కలికి కథల నుండి..)

…. సమాప్తం ....

Posted in August 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!