పరమాణువులు, అణువులు, బణువులు, బృహత్ బణువులు
గ్రీకు భాషలో “అ” అనే పూర్వప్రత్యయం ‘కానిది’ అనే అర్థాన్ని ఇస్తుంది; సంస్కృతంలో అశుభ్రం అంటే ‘శుభ్రం కానిది’ అయినట్లు.
గ్రీకు భాషలో “తోమోస్” అంటే ‘కత్తిరించు’ అనే అర్థం వస్తుంది. దీని ముందు “అ” అనే ప్రత్యయం చేర్చగా వచ్చిన మాట “అతోమోస్” - అంటే కత్తిరించడానికి వీలు కానిది లేదా అవిభాజ్యం అని అర్థం. ఇందులోంచి వచ్చిన “ఏటం” (atom) అంటే విభజించడానికి వీలు పడనంత చిన్న పదార్థం.
గ్రీకు, సంస్కృతం జ్ఞాతి భాషలు. సంస్కృతంలో ఈ రెండు మాటలని పోలిన మాట “ఆత్మ.” ఈ ఆత్మ స్వభావం ఎటువంటిదో ఋగ్వేదంలో వచ్చే నారాయణ సూక్తం ఇలా చెబుతుంది:
“నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా | తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః”
అంటే, ఆత్మ అణు ప్రమాణంలో, మన హృదయ పీఠంలో వ్యవస్థితమై ఉంటుందని చెబుతోంది. ఈ వేద మంత్రాన్ని బట్టి అణువు అనే మాట వేదంలో ఉండడమే కాకుండా ఆత్మకి అణువుకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది కదా!
భగవద్గీత ఏమంటోంది?
“నైనం ఛిన్దన్తి శస్త్రాణి, నైనం దహతి పావకా”
అనగా, (అణుప్రమాణంలో ఉన్న) ఈ ఆత్మని కత్తితో కొయ్యలేము, మంటలో వేసి కాల్చలేము.
ఆధునిక శాస్త్రంలో “ఏటం” అన్న ఇంగ్లీషు మాటకి డాల్టన్ ఇచ్చిన నిర్వచనం కూడ ఇదే కనుక అణుప్రమాణంలో ఉన్న ఆత్మకి అణువుకి మధ్య ఉన్న పోలికని బట్టి “ఏటం” కి అణువు సమానార్థకమైన తెలుగు మాట అని మనం నిర్ధారించవచ్చు.
పొతే, వాడుకలోచూద్దాం. మీరు ఎప్పుడైనా “పరమాణు బాంబు” అనే ప్రయోగం విన్నారా? Atom Bomb అంటే అణు బాంబే! మీరు ఎక్కడైనా “పరమాణు శక్తి” అనే ప్రయోగం చేసేరా? “అణు శక్తి” అంటే Atomic Energy. వాడుకలో మనం అణువుకీ, పరమాణువుకి మధ్య తేడాని గమనించడం లేదని మనవి చేసుకుంటున్నాను. ప్రాచీన కాలం నుండి మన సంప్రదాయంలో అణువు అంటే atom! పరమాణువు అంటే అణువులో అంతర్భాగం.
Atom ని అణువు అనాలనిన్నీ, molecule ని బణువు అనాలనిన్నీ 1969 లో తెలుగు భాషా పత్రికలో ఒకరు ప్రతిపాదించేరు. నేను అప్పటి నుండి అదే వాడుతున్నాను. నా వాడుకలో megamolecule = బృహత్ బణువు (ఉ. రబ్బరు, హిమోగ్లోబిన్), molecule = బణువు (ఉ. మెతేన్, ఎతేన్,), atom = అణువు (ఉ. ఉదజని, ఆమ్లజని) subatomic particle = పరమాణువు (ఉ. ఎలక్ట్రాన్, ప్రోటాన్) అవుతాయి.
చాలా విజ్ఞానదాయకంగా ఉంది