పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము, కరాచి, పాకిస్తాన్
మన సనాతన హిందూ సంస్కృతి యొక్క విశిష్టత గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. తదనంతర కాలంలో వచ్చిన ఇస్లాం మతము, క్రైస్తవ మతము, మహావీరుని జైన మతము, గౌతమ బుద్ధుని బౌద్ధమతము, గురునానక్ సిక్కు మతము ఇలా ఎన్నో మతాలూ, ఆచారాలు కానీ వాటన్నిటి సారాంశం ఒక్కటే. సాటి మనిషిని గౌరవించు, అందరూ సుఖ సంతోషాలతో పవిత్రమైన ప్రశాంత జీవనాన్ని గడపాలి.
స్వాతంత్ర్యం సిద్దించక మునుపు మన భారతదేశం, నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలను కూడా కలుపుకొని అఖండ భారతావనిగా వెలుగొందింది. నాడు, నేడు కూడా భారతదేశం మరియూ పై రెండు దేశాల ప్రజల మధ్యన సోదర అభిమానం మెండుగా ఉండి ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నారు. అయితే, ఆంగ్లేయుల రాజకీయ లబ్ది కోసం చేసిన దేశ విచ్ఛిన్నత, నేటి రాజకీయ నాయకుల, పాలకుల స్వార్థ చింతన, అసాంఘీక శక్తుల ప్రమేయం వలన అనిశ్చిత ఏర్పడి ప్రజల మధ్యన ఉన్న ఆ సోదర భావం నెమ్మదిగా సన్నగిల్లుతున్నది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించక మునుపే దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం నేటి పాకిస్తాన్ దేశంలోని కరాచీ పట్టణంలో సహజసిద్ధంగా వెలసిన పంచముఖ ఆంజనేయుని ఆలయ విశేషాలు నేటి మన ఆలయసిరి.
దేశ విభజన సమయంలో ‘రెండు దేశాలలోని మత సంప్రదాయాలను గౌరవిస్తూ, ఏ మతానికి సంబంధించిన ప్రార్ధనాలయాలైనా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఆ దేశ ప్రభుత్వానిదే’ అనే ఒప్పదం మీద నేటికీ పాకిస్తాన్ లో మన హిందూ దేవాలయాలు స్థిరంగా విలసిల్లుతున్నాయి.
కరాచీలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్న ఈ ఆలయ చరిత్ర ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఇక్కడ లభించిన ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయంలో కొలువై ఉన్న పంచ ముఖ హనుమాన్ స్వయంభువు అని ఇక్కడి భక్తుల నమ్మకం. తెలుపు నీలం రంగులో 8 అడుగుల ఎత్తువున్న ఈ మూల విగ్రహం, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, హనుమాన్ మరియు గరుడ అనే ఐదు అంశాలతో పంచముఖ ఆంజనేయునిగా అవతరించింది. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ రాతి విగ్రహం అన్ని వందల ఏళ్ళు చెక్కుచెదరక, అనేక మహిమలతో నేటికీ భక్తులకు వరాలను కురిపిస్తూ ఉన్నది. శిధిలావస్థలో ఉన్న ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు ఈ మధ్యకాలంలోనే చేపట్టారు. కానీ ప్రాచీన ఆకృతిని, రూపురేఖలను, నాడు వాడిన రాయితోనే పునర్ నిర్మించారు. ఈ ఆలయం ఉత్తర భారత శైలిలో నిర్మించబడింది.
జాతి, మత విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారు ఈ ఆలయానికి వచ్చి ఆ పంచముఖ ఆంజనేయుని ఆశీస్సులను నిత్యం అందుకుంటూ ఉంటారు. మన భారతదేశం నుండి కూడా యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. శ్రీరామ నవమి, హనుమజ్జయంతి, దసరా తదితర పర్వదినాలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.