నిత్య విద్యార్థిగా, పరిశోధకునిగా, అధ్యాపకుడిగా, ఎన్నో పరిశోధనా వ్యాసాలను సమర్పించి, ఎంతోమంది గొప్పవారి ఆదర్శాలను పరిశీలించిన పిమ్మట, నా అనుభవాన్ని, ఆలోచనను జోడించి ఈ భాగం వ్రాస్తున్నాను.
పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మనందరికీ తెలుసు. వారిని ప్రోత్సహిస్తూ ఎల్లప్పుడూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే వారు, వారిని కన్నవారే అవుతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం వారి మానసిక స్థితి లో కలిగే మార్పు. అది వయసుతో పాటు మారుతూ చివరకు ఒక స్థిరమైన స్థానాన్ని చేరుకుంటుంది. ఆ స్థాయిని చేరేవరకూ మన పిల్లలకు ఎల్లప్పుడూ మన అవసరం ఉంటుంది. డబ్బు ఒక్కటే ప్రతి పనికి, అవసరానికి సాధనం కాకూడదు. ఇష్టాఇష్టాలు, అభిరుచులూ, సామాజిక స్థితిగతులు, సంఘంలో లభిస్తున్న హోదాలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అంశాలు పెద్దవాళ్ళమైన మనలనే ప్రభావితం చేస్తున్నప్పుడు మరి పిల్లలు అతి సులువుగా లోనౌతారు. అయితే వారి ఆలోచనా విధానం సరైన దారిలో వెళ్ళాలంటే ముందుగా మనకు సామాజిక స్పృహ ఉండాలి. మారుతున్న కాలంతో పాటు మన ఆలోచనలలోని చాదస్తాలను కొన్నింటిని ప్రక్కకు పెట్టి మనమే ఒక మంచి పద్దతిని సూత్రీకరించి వారికి చెప్పాలి. అది కూడా ‘ఇదే సరైనది, ఈ విధంగానే నడుచుకో’మని చెప్పకూడదు.
పిల్లల ఇష్టా అయిష్టాలను మీతో పంచుకునే విధంగా ఒక స్నేహితునివలె ఉండటం ఎంతో ముఖ్యం. అందుకు ముందుగా మన స్వాభిమానాన్ని (ఇగో ని) ప్రక్కన పెట్టి వారితో చనువుగా ఉండేవిధంగా మన ప్రవర్తన ఉండాలి. నేను ఇంటి యజమానిని మీ బాగోగులు నేనే చూస్తున్నాను కనుక నేను చెప్పినట్లు మాత్రమే మీరు నడుచుకోవాలి అనే ఆలోచనల ఉధృతి నుండి మనం బయటపడాలి. ఉదాహరణకు మనం మనకు నచ్చిన కార్యక్రమాన్ని టీవీ లో చూసుకుంటూ వారిని పూర్తిగా టీవీ చూడకూడదు అనేకన్నా చేయవలసిన పనులు పూర్తిచేసిన పిమ్మట వారు కూడా టీవీ చూసుకోవచ్చు అని చెబితే వారు ఖచ్ఛితంగా వింటారు. అంతేకానీ ఇది నా ఇల్లు నా ఇష్టం. మీరు నేను చెప్పినట్టు నడుచుకుంటేనే ఇక్కడ ఉండాలి లేదా వెళ్ళిపోండి అని చెబితే వారు ఆ సమయం కోసం వేచిచూస్తుంటారు. నెమ్మదిగా అబద్ధాలు కూడా చెప్పడం అలవాటు చేసుకొని తద్వారా కుటుంబంలో ఉండవలసిన సహజ అనుబంధాలకు కృత్తిమ రంగులు పూయడం జరుగుతుంది. మనం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చకుండా వాస్తవ దృక్పథంతో ఒప్పుకుంటూ, కొన్ని సార్లు పిల్లలు చెప్పే అనుకరణీయమైన ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకొంటూ వారికి కూడా కుటుంబంలో తగిన గుర్తింపు ఇచ్చామనే భావన కలిగించాలి. వారి కాలేజీ ఫీజులు కట్టే స్థాయికి ఎదిగి, వారికి మంచి చదువును చెప్పిస్తే చాలదు. ఖరీదైన కార్లు కొనిస్తే సరిపోదు. మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసినంత మాత్రానా మన బాధ్యత తీరిపోదు. అనుభవంతో పెద్దలమైన మనం సమకూర్చుకున్న జీవిత పాఠాలను వారికి వివరించాలి. సరైన జీవనాన్ని ఎలా స్వయంగా సమకూర్చుకోవాలో వారే తెలుసుకునేటట్లు చేయాలి. అదే మన నిజమైన బాధ్యత. వాళ్ళు మనం చెబితే వింటారా అనే భావన కూడా ఉంది. చెప్పే విధానం, ఓపిక, తీరిక మనకుండాలి. మన హోదాను చూపుకోవడం కోసం మనం చేస్తున్న ఈ జీవన పరుగును కొంచెం సేపు ఆపాలి. సామాజిక హోదా ఉండాలనుకోవడం, అందుకోసం శ్రమించడం తప్పు కాదు కానీ మనం పాటిస్తున్న విధివిధానం సరైనదై ఉండాలి. ఆ విధానం ద్వారా ఎవరో మూడో వ్యక్తి నిన్ను చూసి మెచ్చుకునే విధంగా ఉండి ఆ విధానాన్ని మనం కూడా ఆచరించాలానే భావన ఆ వ్యక్తిలో కలగాలి. అప్పుడు మీ పిల్లలు కూడా మీ ఆలోచనలను పూర్తిగా కాకపోయినా కొంత శాతమైనా అంగీకరిస్తారు. అదే నిజమైన విజయం అవుతుంది. వారి చదువులు, పదోన్నతులు, అవార్డులు, రివార్డులు అవన్నీ మానసిక సంతృప్తిని, శక్తిని పెంపొందించే ఉత్ప్రేకాలు మాత్రమే. అసలైన జీవన సరళిని సాటి మనుషులతో కలిసి సంచరించడమే ప్రతి ఒక్కరికీ ప్రస్తుత అవసరం.
ఈ దైనందిన జీవన పోరాటం లో (మనం సృష్టించుకున్నదే) సమయం గడిచిపోతున్నది. ‘జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది’ అని అన్నట్లు, చేతిలో ఉన్న చిన్న దీర్ఘచతురస్రాకారపు పరికరం ద్వారా అందరితో టచ్ లో ఉంటూ గంటలకొద్దీ మాట్లాడుతూ, చాటింగ్ లు చేస్తూ ఉన్నాము కానీ ఏదో, ఎక్కడో, మనకు కావలిసిన సూత్రాలను మిస్ అవుతున్నామనే భావన వెంటాడుతూనే ఉన్నది. సమయం తన పని తాను చేసుకుంటూ గతాన్ని మరిచి, భవిష్యత్తు కోసం బంగారు ప్రణాళికలు వేసుకుంటూ వర్తమానాన్ని అనవసరమైన విధానాలతో నింపేస్తున్నాము. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ కొన్ని తీపి మధుర జ్ఞాపకాలు, శక్తినిచ్చే క్షణాలు మన జీవన ఖాతాలో ఉండాలి. అవి మనం సృష్టించుకోవాలి తప్ప వేరే ఎక్కడా లభించవు. ముఖ్యంగా డబ్బుతో కొనదగిన వస్తువులు కావు.
సరదాగా కుటుంబంతో సమయం గడపడం అనేది మన ఆరోగ్యానికి మంచిని చేకూర్చే మరో సాధనం. గిల్లికజ్జాలు, అలకలు, కోపంగా అరుచుకోవడాలు, మనసారా నవ్వుకోవడాలు, మనోల్లాసాన్ని కలిగించే సమిష్టిపనులు ఇవన్నీ అందులో భాగాలే. సరదాగా పిక్నిక్ లు వేసుకొని స్నేహితులతో, బంధువులతో అనేక ప్రదేశాలను దర్శిస్తూ ఇలా ఎన్నో రకాలుగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సద్వినియోగం అని ఎందుకన్నానంటే నీ చుట్టూ నలుగురిని కలుపుకొని నీవు చేస్తున్న ఏ కార్యమైననూ మంచి సహృద్భావ వాతావరణంలో అందరి ఆమోదపూరితంగా ఉన్నప్పుడే అందరూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ మరింత శక్తివంతంగా ఆ కార్యాన్ని పూర్తిచేస్తారు. అది విహారయాత్ర కావచ్చు మరేదైన సామాజిక సేవా కార్యక్రమం అవచ్చు. విహారయాత్రలకు కుటుంబంతో వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొట్లాటలు అలకలు వంటిని నిరంతరం జరుగుతుంటే మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి అంతంత ఖర్చుపెట్టి వేసుకున్న టూర్లు, బూడిదలో పోసిన పన్నీరు సామెతను తలపిస్తాయి. ఎంతో హోదాతో చెప్పుకోవడానికి మాత్రమే ఈ యాత్రలు మిగిలిపోతే దానిలో అర్థం లేదు. కనుకనే మన పాతసినిమాలో పాడినట్టు ‘ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము లేలనో ప్రేమించిన సతి ఎదుట నుండగా వేరే స్వర్గము లేలనో’. దీనిని నేను కొంచెం మార్చి, మనోల్లాసాన్ని పొందుతూ, అదే ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మనతో ఉన్న అందరిలో నింపుతూ, కలిసి సమయాన్ని ఆహ్లాదంగా గడపటం ముఖ్యం. అప్పుడు ఏ ప్రదేశమైననూ ఒక బృందావనమే అవుతుంది. అది చెప్పినంత సులువు కాదు కారణం, మనం మనుషులం. కానీ మనం మనుషులం కనుక ప్రయత్నించడం మనకున్న ప్రధాన గుణం తదనుగుణంగా ఫలితం కూడా పొందగలం.
‘సర్వే జనః సుఖినోభవంతు’
Telisinaveaina telusukonetatlu vivarimchadam oka kala.mana alavaatle mana maanasika saariraka arogyaalaku muulakaaranam anna satyaanni chakkagaa vivarimchaaru dhanyavaadaalu
అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు తెలియచేశారు.ధన్యవాదాలు సర్