మనిషి యొక్క జన్యు పరిణామక్రమం ఎంతో విచిత్రమైనది. 19 వ శతాబ్దం నుండే మన శాస్త్రవేత్తలు మన జీన్స్ యొక్క ధర్మాలను విశ్లేషించడం మొదలుపెట్టారు. ఎన్నో విచిత్రమైన అంశాలను కనుగొనడం జరిగింది. ఉదాహరణకు మన శరీరంలో 20000 -25000 జన్యుకణాలు ఉంటాయి. 99 శాతం DNA మనుషులందరిలో ఒకేవిధంగా ఉంటుంది. మిగిలిన ఆ ఒక్క శాతమే మనకు ఇన్ని లక్షల మూలాలను చూపిస్తున్నది. ఇది నిజంగా విచిత్రమే మరి. మనుషుల మధ్యన ఉన్న భౌతిక పరమైన వ్యత్యాసాలకు కూడా ఈ ఒక్క శాతం కారణమౌతున్నది.
మనుషుల మధ్యన ఆలోచనా విధానం లో కూడా ఎంతో తేడా ఉంటుంది. తద్వారా వారి మానసిక స్థితి, వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. పుట్టిన వెంటనే ఎవ్వరూ దొంగలు కారు, అలాగే మహోన్నత వ్యక్తులు అని కూడా చెప్పలేము. మనిషి ఎదుగుదల తను పెరుగుతున్న సమాజ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. మానసిక పరిణితి అనేది మాత్రం మనలోని మానసిక వికాసం, ఉత్తేజాన్ని అనుసరించి ఉంటుంది. అందుకే idle brain devils den అని అంటుంటారు. వీలైనంత వరకు మన బుర్రను మంచి ఆలోచనలతో సక్రమంగా పనిచేయిస్తూ, కొంచెం బిజీ గా ఉంచితే అంతా మంచే జరుగుతుంది. అట్లని పూర్తిగా వ్యక్తిగత ఎదుగుదల కోసం స్వార్థ చింతనతో ఉన్నా కూడా అంత మంచిది కాదు. అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి అని ఎవరో చెప్పినట్టు మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్న సమాజ శ్రేయస్సు కొఱకు మన వంతు బాధ్యతను కూడా నిర్వర్తిస్తే కలిగే ఆనందం, సంతృప్తి వెల కట్టలేనిది.
వాస్తవ జీవిత సత్యాలను తెలుసుకున్న వారు ఎవరైనను ప్రశాంతమైన జీవన సరళిని కోరుకుంటారు. ఉన్నత చదువులు చదివిన వారందరూ శ్రీమంతులు అవుతారనేది ఒక మిధ్య. చదువు, సంస్కారంతో పాటు బతకడం కూడా నేర్పిస్తుంది. అంతేగాని డబ్బు సంపాదనకు చదువుకు నేటి కాలంలో అసలు పొంతనే లేదు. బూటకపు ప్రతిష్ట కోసం ఇలా జీవించాలి అలా జీవించాలి అనే అపోహలతో మనలో ఎంతోమంది అనవసరమైన చికాకులు తెచ్చుకొని జీవితంలో ప్రశాంతత ను కోల్పోతున్నారు. మనిషిగా పుట్టినందులకు మన ఉనికికి ఒక సార్థకత ఉండాలి.
నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత ఆస్తులు సంపాదించావు, ఎంత ఉన్నతస్థాయికి వెళ్లావు అనే ప్రామాణికల ఆధారంగా నిన్ను గుర్తిస్తారు అనుకుంటే, నిజమే ప్రస్తుత కృత్రిమ జీవన విధానంలో అదీ ఒక భాగమైపోయింది. కానీ అందుకోసం ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్న సామెతను మరిచిపోకూడదు. మన శక్తిని, సామార్థ్యాన్ని మించిన కసరత్తులు చేయకూడదు. మనిషి వయస్సు నలభై దాటితే stress అనేది ఖచ్చితంగా ఉండాలనే భావన కలుగుతుంది. కారణం కుటుంబ లేక ఇతర సామాజిక బాధ్యతలు ఎక్కువౌతాయి. నిజం చెప్పాలంటే మనం విస్మరించకుండా పాటించాలంటే మనం feel అయ్యే శాతాన్ని అనుసరించి బాధ్యతలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. దైనందిన అవసరాలు, సరైన ఆరోగ్య నియమాలు, కుటుంబ వ్యవస్థ యొక్క ఉన్నత విలువలు, సామాజిక స్పృహ తదితర అంశాలను సమ తుల్యంతో పాటిస్తూ అనుసరిస్తే ఎన్ని బాధ్యతలు ఉన్ననూ గురుతెరిగి నిర్వర్తిస్తాము.
వయసుతో పాటు మన శరీరంలో కలిగే మార్పుల వలన చిన్న చిన్న రుగ్మతలు రావడం అనేది అతి సహజమైన ప్రక్రియ. అందుకని ఎక్కువ ఆందోళన పడిపోయి మందులకు మన శరీరాన్ని అందిస్తే, అవి మరింతగా మన రోగ నిరోధక సాంద్రత ను ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న సహజ చిట్కాలు ఉదాహరణకు ఉప్పునీటితో పుక్కిలించడం, దాల్చిన చెక్క పొడిని తేనెలో కలుపుకొని తీసుకోవడం ఇటువంటి చిన్న జాగ్రత్తలు మనకు ఎంతో మేలును కలిగిస్తాయి.
‘సర్వే జనః సుఖినోభవంతు’